మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
ఆస్ట్రేలియా: విషపు కప్పను అడ్డుకోవడానికి వందల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?
- రచయిత, డార్బాల్ జోర్డాన్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిల్బారా ప్రాంతంలోకి విషపూరిత గోదురుకప్ప (కేన్టోడ్) రాకుండా అడ్డుకోవడానికి రియో టింటో కంపెనీ లక్షలాది డాలర్లను ఖర్చు చేస్తోంది. ఆ ప్రాంతంలో ఈ మైనింగ్ సంస్థ ఇనుప ఖనిజ గనులకు సంబంధించిన కార్యకలాపాలు చేపడుతుంది.
పెర్త్‌లోని కర్టిన్ యూనివర్సిటీ తదితర సంస్థలతో కలిసి రియో టింటో 28 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 185 కోట్లు) ఖర్చు చేయనుంది.
ఈ మొత్తంతో 'టోడ్ నియంత్రణ ప్రాంతం' ఏర్పాటు చేసి, ఈ హానికరమైన కప్ప దక్షిణ దిశగా విస్తరించకుండా అడ్డుకోవాలని రియో టింటో లక్ష్యంగా పెట్టుకుంది.
కేన్ టోడ్ వల్ల రియో టింటో వ్యాపారానికి నేరుగా ముప్పు లేకపోయినా, అది విడుదల చేసే విషపదార్థాలు స్థానిక వన్యప్రాణులకు ప్రాణాంతకంగా మారతాయి.
పిల్బారా పర్యావరణ వ్యవస్థకూ ముప్పు కలుగుతుంది.
గతంలో పిల్బారాలో ఇనుప ఖనిజ నిక్షేపాల పైన ఉన్నరెండు ఆదివాసీల రాతి ఆశ్రయాలను ధ్వంసం చేసినందుకు రియో టింటో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
ఈ నిర్ణయం కారణంగా అప్పటి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తన పదవిని కోల్పోయారు.
దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం స్థానిక ఆదివాసీ సమాజాలలో తిరిగి నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని రియో టింటో హామీ ఇచ్చింది.
ప్రతిపాదిత కేన్ టోడ్ నియంత్రణ ప్రాంతం గురించి ఆస్ట్రేలియాలోని న్యాంగుమర్తా వార్రన్ ఆదివాసీ సంరక్షిత ప్రాంతంలో రేంజర్‌గా పనిచేస్తున్న రొబెర్టా హంటర్ మాట్లాడుతూ.. "కేన్ టోడ్లు నీటిని, జంతువులను నాశనం చేస్తాయి. అవి మా ప్రాంతానికి దగ్గరగా వచ్చినప్పుడు వాటిని అడ్డుకోడానికి మేమక్కడ ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రాంతం నాశనం కావడం మాకు ఇష్టం లేదు" అని చెప్పారు.
గ్రేట్ శాండీ ఎడారి, హిందూ మహాసముద్రం మధ్య ఉన్న 7,500 చదరపు కిలోమీటర్ల భూభాగంలో అడ్డుకట్ట నిర్మించి, ఈ కప్పకు నీరు అందకుండా చేయాలన్నది ప్రణాళిక. పొడి వాతావరణం ఉండే నెలల్లో కేన్ టోడ్ బతకాలంటే ప్రతి కొన్ని రోజులకోసారి నీరు అవసరమవుతుంది.
సహజ నీటి వనరులు అందుబాటులో లేకపోతే, పశువుల పెంపకం, సాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి వనరులపై ఈ కప్ప ఆధారపడుతుంది.
ఆనకట్టలు, నీటి నిల్వ ట్యాంకులు, నేలమట్టంలో ఉండే ఇతర నీటి వనరులకు అది చేరకుండా అడ్డుకోవడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఐదేళ్ల ఈ ప్రాజెక్టు 2027లో ప్రారంభం కానుంది.
కేన్ టోడ్ పిల్బారాలోకి ప్రవేశిస్తే అక్కడి స్థానిక జీవజాతుల్లో అనేకం ప్రమాదంలో పడతాయి.
వాటిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న నార్తర్న్ క్వాల్ అనే చిన్న మాంసాహార జంతువు, గోఅన్నా బల్లి, ఘోస్ట్ బ్యాట్ ఉన్నాయి.
చెరకు పంటలోని కొన్ని పురుగుల నియంత్రణ కోసం 1935లో కేన్ టోడ్‌లను ఆస్ట్రేలియాకు తీసుకొచ్చారు.
అప్పటి నుంచి దేశంలోని ఉత్తర ప్రాంతం మీదుగా అవి క్రమంగా పశ్చిమ దిశగా విస్తరిస్తున్నాయి.
ఆస్ట్రేలియా ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఇవి ఏటా 40 నుంచి 60 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ తమ పరిధిని పెంచుకుంటున్నాయి.
ఈ కప్పల సంఖ్యను సహజంగా నియంత్రించడానికి వాటిని వేటాడే జంతువులుకానీ, వాటికి సోకే వ్యాధులు కానీ లేవు. పైగా, తమను తాము రక్షించుకోడానికి ఇవి విషాన్ని ఉపయోగిస్తాయి.
కేన్టోడ్లు ఈ ప్రాంతానికి రాకుండా అడ్డుకోకపోతే మరో రెండు దశాబ్దాలలో అవి పిల్బారాకు చేరుకుంటాయని కర్టిన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ బెన్ ఫిలిప్స్ అన్నారు.
"ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆక్రమణ జాతుల్లో ఒకటైన కేన్ టోడ్ విస్తరణను అడ్డుకుని, ఈ ప్రాంతంలోని ప్రత్యేకమైన వన్యప్రాణులను కాపాడటానికి లభించిన అరుదైన అవకాశం ఈ నియంత్రణ ప్రాంతం" అని ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)