మిడ్‌టర్మ్ ఎలక్షన్స్ : ట్రంప్‌ నిర్ణయాలకు ఈ ఫలితాలు కళ్లెం వేస్తాయా?

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల ప్రభావం అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మిగిలిన పదవీకాలంలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఎందుకు చెబుతున్నారు?

అసలు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఎందుకు జరుగుతాయి?

అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) సభ్యులను, సెనేట్ సభ్యులను ప్రజలు మధ్యంతర ఎన్నికలలో ఎన్నుకుంటారు. ఈ రెండు సభలను కలిపి అమెరికా కాంగ్రెస్ అని పిలుస్తారు.

అమెరికాలో ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి.

అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీకాలం మధ్యలో జరిగే ఈ ఎన్నికలను 'మధ్యంతర ఎన్నికలు' అంటారు.

దేశవ్యాప్తంగా అమలయ్యే సమాఖ్య చట్టాలను రూపొందించడం, ఆమోదించడం కాంగ్రెస్‌ ప్రధాన విధుల్లో ఒకటి.

ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్‌పై ఏ రాజకీయ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందో నిర్ణయిస్తాయి. అంటే ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీనా, ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీనా అనేది తేలుతుంది.

అలాగే అధ్యక్షుడు తన విధానాలను, ప్రణాళికలను సులభంగా అమలు చేసుకోగలరో లేదో కూడా ఈ ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే అధ్యక్షుడి పనితీరుపై ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో కూడా చెప్పడానికి ఈ ఎన్నికలను ఒక కొలమానంగా పరిగణిస్తారు.

ఎవరిని ఎన్నుకుంటారు?

కాంగ్రెస్‌ దిగువ సభ అయిన ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

ఈ సభ సభ్యుల పదవీకాలం రెండేళ్లు. సాధారణంగా ప్రతిపాదిత కొత్త చట్టాలు మొదట ఈ సభలోనే ప్రవేశపెట్టి చర్చిస్తారు.

అదే సమయంలో కాంగ్రెస్‌ ఎగువ సభ అయిన సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సెనేటర్ల పదవీకాలం ఆరేళ్లు.

ప్రతినిధుల సభ నుంచి వచ్చిన చట్ట ప్రతిపాదనలను ఆమోదించడం లేదా తిరస్కరించడం సెనేట్‌ విధుల్లో ఒకటి.

ఇదే రోజున అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి రాజకీయ పదవులకు కూడా ఓటర్లు ఎన్నికలు నిర్వహిస్తారు.

కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, మిషిగన్‌ రాష్ట్రాల్లో జరిగే గవర్నర్‌ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది.

ఆర్థికమే కీలకం

అమెరికా ఆర్థిక పరిస్థితి ఈ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఇంధనం, నిత్యావసర సరుకులు, ఇళ్లు, వైద్య సేవల ధరలు పెరగడంతో అనేకమంది ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్దేశించిన లక్ష్య స్థాయి కంటే ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌తో ప్రారంభించిన యుద్ధం కూడా దీనికి ఒక కారణమని చెబుతున్నారు.

ట్రంప్‌ అమలు చేస్తున్న వాణిజ్య సుంకాల విధానం కూడా అమెరికన్లపై ధరల భారాన్ని పెంచిందని డెమొక్రటిక్‌ పార్టీ వాదిస్తోంది.

వలసల అంశం కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా ఉంది. 2024 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రధాన హామీని ట్రంప్‌ నెరవేర్చారని రిపబ్లికన్లు చెబుతున్నారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు, అక్రమ వలసల అడ్డుకట్టకు చర్యలు తీసుకున్నారని అంటున్నారు. అయితే ఈ నిర్ణయాలు తరచూ వివాదాస్పదమయ్యాయి.

కృత్రిమ మేధ (ఏఐ)పై ఆందోళనలు ఇటీవలి వారాల్లో మరింత పెరిగాయి. ఏఐ నియంత్రణకు చట్టాలు అవసరమని రెండు పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులు అంగీకరించారు. అయితే ఈ సాంకేతికత అభివృద్ధిని నియంత్రించే చట్టాల ఆలోచనను ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ విషయంలో ఆయనకు, ఇరు పార్టీల నాయకుల్లో కొందరికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఏం జరగొచ్చు?

అమెరికా ప్రభుత్వంలోని మూడు ప్రధాన విభాగాల్లో కాంగ్రెస్‌ ఒకటి. మిగతా రెండు అధ్యక్ష కార్యాలయం, న్యాయవ్యవస్థ. దేశ చట్టాల రూపకల్పనలో కాంగ్రెస్‌ నియంత్రణ కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింటిలోనూ రిపబ్లికన్‌ పార్టీ ఆధిపత్యం ఉంది. అయితే ఆ పార్టీకున్న మెజారిటీ చాలా స్వల్పం.

ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 218 స్థానాలు ఉన్నాయి. సభపై నియంత్రణ కొనసాగించడానికి అవసరమైన కనీస సంఖ్య కంటే ఇది ఒక్క స్థానం మాత్రమే ఎక్కువ. వీరితో పాటు రిపబ్లికన్లకు మద్దతుగా ఓటు వేసే ఒక స్వతంత్ర సభ్యుడు కూడా ఉన్నారు.

సెనేట్‌కు ఉన్న మొత్తం 100 స్థానాలలో 53 స్థానాలు రిపబ్లికన్ పార్టీ, 45 స్థానాలు డెమొక్రటిక్ పార్టీకి ఉన్నాయి. అదనంగా, డెమొక్రటిక్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఇద్దరు స్వతంత్ర సెనేటర్లు కూడా ఉన్నారు.అందువల్ల మొత్తంగా డెమొక్రటిక్ పార్టీకి 47మంది ఉన్నట్టుగా భావిస్తారు. ఈ సభలో అధికార మార్పు జరగాలంటే డెమొక్రాట్లు 51 స్థానాలు గెలుచుకోవాలి. ఎందుకంటే ఇరు పార్టీలకు చెరో 50 స్థానాలు వచ్చి, ఓట్లు సమమైన సందర్భంలో ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు నిర్ణయాత్మక ఓటు వేయగలరు.

ప్రతిపక్ష డెమొక్రాట్లు కనీసం ఒక సభపై తిరిగి నియంత్రణ సాధిస్తే, తమ చట్ట ప్రతిపాదనలను సభలో చర్చకు తీసుకువచ్చే అధికారం వారికి లభిస్తుంది.

గెలుపెవరిది?

గతంలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు సాధారణంగా అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇటీవలి సర్వేలు ట్రంప్‌ పట్ల ప్రజల్లో ఆమోదం తక్కువగా ఉందని సూచిస్తున్నాయి. సర్వే వివరాలను ప్రచురించే 'సిల్వర్‌ బులెటిన్‌' వెబ్‌సైట్‌ , ట్రంప్‌ తన రెండో అధ్యక్ష పదవీకాలాన్ని ప్రారంభించినప్పుడు ఆయనకు 50 శాతం కంటే కొద్దిగా ఎక్కువ ఆమోదం ఉండేది. అయితే అక్టోబరు ప్రారంభం నాటికి అది సుమారు 37 శాతానికి పడిపోయింది. అదే సమయంలో 61 శాతం మంది ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది.

అయితే ప్రతినిధుల సభ, సెనేట్‌లోని అన్ని స్థానాల్లోనూ గట్టి పోటీ ఉండదు. కొన్ని స్థానాల్లో రిపబ్లికన్లు లేదా డెమొక్రాట్లు గెలిచే అవకాశాలు ముందుగానే స్పష్టంగా ఉంటాయి. ఎన్నికలు, ప్రచారాలను విశ్లేషించే 'కుక్‌ పొలిటికల్‌ రిపోర్ట్‌' తాజా అంచనా మేరకు ప్రతినిధుల సభకు సంబంధించి ఫ్లోరిడా, మిషిగన్‌ సహా 18 స్థానాలు, సెనేట్‌కు సంబంధించి అలాస్కా, టెక్సాస్‌ సహా ఆరు స్థానాల్లో గట్టి పోటీ ఉండవచ్చని పేర్కొంది. ఇలా నువ్వా నేనా అన్నట్టుగా ఉండే స్థానాలను 'టాస్‌-అప్స్‌' అంటారు.

ఈసారి ఎన్నికల ఫలితాలను ముందుగా అంచనా వేయడం మరింత కష్టంగా మారింది. దీనికి కారణం ప్రతినిధుల సభ ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దుల నిర్ణయంపై రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరు.

కొన్ని రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉండేలా ఎన్నికల నియోజకవర్గాల మ్యాప్‌లను రూపొందించి రిపబ్లికన్లు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించారు. దీనికి ప్రతిగా డెమొక్రాట్లు కూడా అదే విధంగా వ్యవహరించారు.

ట్రంప్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

డెమొక్రాట్లు ప్రతినిధుల సభ లేదా సెనేట్‌లో ఏదో ఒక సభపై ఆధిపత్యం సాధిస్తే, కాంగ్రెస్‌ ద్వారా తన చట్ట ప్రతిపాదనలను ఆమోదింపజేసుకోవడం ట్రంప్‌కు కష్టమవుతుంది.

దీంతో దేశీయంగా ఆయన అమలు చేయాలనుకుంటున్న ప్రణాళికలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. అయితే తన పార్టీ నుంచి విస్తృత మద్దతు లేకపోయినా అధికారాన్ని వినియోగించుకునేందుకు ట్రంప్‌ ఇప్పటికే కొన్ని మార్గాలను అనుసరించారు.

కాంగ్రెస్‌లోని ఏదో ఒక సభపై డెమొక్రాట్లు నియంత్రణ సాధిస్తే, వివిధ కమిటీల ద్వారా ట్రంప్‌ అధ్యక్ష పాలనలోని అంశాలపై విచారణ జరిపించే అధికారం వారికి లభిస్తుంది.

అవినీతి ఆరోపణలు, వైట్‌హౌస్‌లో కొత్తగా నిర్మిస్తున్న బాల్‌రూమ్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) విభాగం అనుసరిస్తున్న విధానాలు ఈ విచారణ పరిధిలోకి రావచ్చు.

ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలా వద్దా అనే అంశంపై డెమొక్రటిక్‌ పార్టీలో చర్చ కూడా జరుగుతోంది. అభిశంసన అంటే కాంగ్రెస్‌లో ఆరోపణలను అధికారికంగా నమోదు చేసి, వాటి ఆధారంగా రాజకీయ విచారణ జరపడం. ఇది క్రిమినల్‌ విచారణకు భిన్నమైన ప్రక్రియ.

ఒకవేళ కాంగ్రెస్‌పై రిపబ్లికన్‌ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తే, ట్రంప్‌ తన పదవీకాలం మిగిలిన సమయంలోనూ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లగలుగుతారు.

2028 అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం ఉంటుందా?

మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడి పేరు బ్యాలెట్‌పై ఉండదు. అయినా ఇప్పటివరకు తన పనితీరుకు మద్దతుగా ఓటు వేయాలని చెబుతూ, తన పేరు బ్యాలెట్‌పై ఉన్నట్లుగానే భావించి రిపబ్లికన్లు ఓటు వేయాలని ట్రంప్‌ కోరారు.

ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా, ట్రంప్‌ నాయకత్వంలో దేశం ఏ దిశగా పయనిస్తోందనే విషయంలో ఓటర్ల అభిప్రాయాలను విశ్లేషించేందుకు రాజకీయ వ్యాఖ్యాతలు వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ట్రంప్‌ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు. మధ్యంతర ఎన్నికల తర్వాత 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఆయన వారసుడిగా ఎవరు బరిలోకి దిగవచ్చనే చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే డెమొక్రటిక్‌ పార్టీ తరఫున ఆ అభ్యర్థికి ఎవరు పోటీ ఇవ్వవచ్చనే అంశంపైనా ఊహాగానాలు మొదలవుతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)