మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
ధన త్రయోదశి: బంగారం, వెండి భవిష్యత్ ఏంటి?
విలువైన లోహాలు గత నెలలో తమ వన్నెను కోల్పోయాయి. బంగారం ధరలు అక్టోబర్ 30న ఏడాది కనిష్ఠానికి పడిపోయాయి. అలాగే, వెండి, ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా విపరీతంగా తగ్గాయి.
సాంకేతికంగా ఇవి ఓవర్‌సోల్డ్ జోన్లోకి దిగజారాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పెడుతున్న ఖర్చులకు తగినంత రాబడులు తిరిగి వస్తాయో రావో అనే ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. టెక్ కంపెనీల షేర్లు పడిపోతున్న తరుణంలో ఈ విలువైన లోహాలు కూడా నష్టాల బాట పట్టాయి.
వరుసగా రెండో నెలలో బంగారం, వెండి రెండూ కూడా ప్రతికూల రాబడులను ఇచ్చాయి. ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు విపరీతంగా ఉండటం, అమెరికా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే ఆందోళనలు.. విలువైన లోహాల మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి.
"పెరుగుతున్న చమురు ధరలు దీర్ఘకాలికంగా అధిక ద్రవ్యోల్బణం ఉంటుందనే ఆందోళనలను పెంచుతున్నాయి. ఇది ఒత్తిళ్లను మరింత తీవ్రతరం చేస్తోంది" అని ఆయన అన్నారు.
చమురు ధరలు తగ్గితే బంగారంపై ఒత్తిడి కాస్త తగ్గగలదు. అయితే, సప్లయి చెయిన్‌లో అంతరాయాలు, అక్టోబర్ నెలలో అంచనాలకు మించిన అమెరికా ఉపాధి డేటా, ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశాలను పెంచుతుంది. ఇది బంగారం ధరలపై ఒత్తిడిని కొనసాగించవచ్చు.
అక్టోబర్ చివరి కల్లా.. కామెక్స్‌లో (COMEX) బంగారం ధరలు 7.26 శాతం తగ్గి ఒక్కో ఔన్స్ 3,884.9 డాలర్లకు చేరుకున్నాయి.
గత నెలలో కామెక్స్‌లో వెండి ధరలు కూడా 19.1 శాతం తగ్గి ఒక్కో ఔన్స్ 49.13 డాలర్లకు దిగొచ్చాయి.
కామెక్స్ అనేది అమెరికాలోని ఒక ప్రధాన మార్కెట్. ఇక్కడ బంగారం, వెండి కాంట్రాక్టుల కొనుగోళ్లు, అమ్మకం జరుగుతాయి.
ప్రపంచ మార్కెట్ పోకడలకు అనుగుణంగా, దేశీయ మార్కెట్లలో కూడా విలువైన లోహాల ధరలు తగ్గాయి.
ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు 7.16 శాతం తగ్గి 10 గ్రాముల ధర రూ.1,38,419కి చేరింది. మరోవైపు, వెండి ధరలు భారీగా 20 శాతం తగ్గి కిలో రూ.1,78,900 వద్ద ముగిశాయి.
కామెక్స్ (కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఇంక్.) లాగానే, ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్) కూడా భారత్‌లో బంగారం, వెండి ఫ్యూచర్లను ట్రేడ్ చేసే ఒక ఎక్స్ఛేంజ్.
ఏడాది కనిష్ఠానికి బంగారం
అక్టోబర్ 30న, కామెక్స్‌లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఔన్సు కీలక స్థాయి అయిన 4,000 డాలర్ల కంటే చాలా దిగువన ముగిశాయి.
బంగారం ధర మునపటి మద్దతు స్థాయి అయిన 3,900 డాలర్ల కంటే కిందకి పడటం బలహీనతకు అతిపెద్ద సంకేతం.
ఒకవేళ ఈ బలహీనమైన ట్రెండ్‌ను అధిగమించాలంటే.. బంగారం ధరలు ఒక్కో ఔన్స్ 4,550 డాలర్ల స్థాయిని మించాల్సి ఉంది.
గత నెలలో కామెక్స్‌లో వెండి ధరలు కూడా బలహీనపడి, 54 డాలర్ల మద్దతు స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.
ఈ కీలక మద్దతు స్థాయి నుంచి పడిన తర్వాత, ధరలు మరింత క్షీణించి గత శుక్రవారం(అక్టోబర్ 30) 48.9 డాలర్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
స్వల్పకాలంలో వెండి ధోరణి ప్రతికూలంగానే కొనసాగుతుందని, దాని ధర 42 డాలర్ల నుంచి 43 డాలర్ల శ్రేణికి పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పడిపోతున్న ఈ ట్రెండ్‌కు ముగింపు పలకాలంటే, వెండి ధరలు 55 డాలర్ల నిరోధక స్థాయిని అధిగమించాల్సి ఉంది.
జనవరిలో రికార్డు అయిన ఒక్కో ఔన్స్ 5,595 డాలర్ల గరిష్ఠ స్థాయిల నుంచి బంగారం ధరలు 30 శాతం పడిపోయాయి.
''వడ్డీ రేట్లు చాలా కాలం పాటు అధికంగానే ఉంటాయనే భయాలే దీనికి కారణం. ప్రస్తుతం ఆసియాలో నమోదవుతున్న బలహీనమైన డిమాండ్ బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే, బంగారం ధరలు ఔన్స్ 4 వేల డాలర్ల కంటే దిగువకు పడితే, సెంట్రల్ బ్యాంకులు సాధారణంగా బంగారం కొనుగోళ్లను పెంచుతాయి'' అని వార్తా సంస్థ రాయిటర్స్ తన రిపోర్టులో పేర్కొంది.
మరోవైపు, వెండి ధర ఇండస్ట్రియల్ గ్రోత్‌పై ఆధారపడే కమోడిటీగా ఎక్కువగా పరిగణిస్తారు. పరిశ్రమ, ఆభరణాల రంగం నుంచి వెండికి డిమాండ్ తగ్గుతోందని హెచ్ఎస్బిసి పేర్కొందని రాయిటర్స్ నివేదించింది.
ఈ సంవత్సరం ఔన్సు సగటున 71 డాలర్లుగా ఉంటుందని అంచనా వేయగా.. 2027లో వెండి సగటు ధర ఔన్సు 64 డాలర్లుగా నమోదవుతుందని ఆ బ్యాంకు అంచనా వేస్తోంది.
ప్రస్తుతం, ఒక ఔన్సు బంగారం కొనడానికి 79 ఔన్సుల వెండి అవసరం. గత 11 నెలల్లో ఇదే అత్యధిక నిష్పత్తి.
జనవరిలో వెండి ధర ఒక్కో ఔన్సు 122 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నప్పుడు, ఒక ఔన్సు బంగారం కొనడానికి 46 ఔన్సుల వెండి అవసరమయ్యేది.
"బంగారంతో పోలిస్తే వెండి ధర ఇంకా తగ్గేందుకు అవకాశం ఉంది. 2020-2025 మధ్య బంగారం-వెండి నిష్పత్తి సగటున 82గా ఉందని కన్సల్టెన్సీ సంస్థ మెటల్స్ ఫోకస్ తెలిపింది" అని రాయిటర్స్ నివేదించింది.
దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టొచ్చా?
అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనలు బంగారం ధరలపై ఒత్తిడిని పెంచాయని ఫైనాన్సియల్ అఫైర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాహి రీసెర్చ్ హెడ్ గౌరవ్ అరోరా 'ది లైవ్ మింట్'కు తెలిపారు.
అక్టోబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను స్థిరంగా 3.75 శాతం నుంచి 4 శాతం మధ్యలో స్థిరంగా ఉంచిందని అరోరా చెప్పారు. కానీ, ఇద్దరు సభ్యులున్న కమిటీ వడ్డీ రేట్ల పెంపుకు ఓటేసింది. ఫలితంగా, డిసెంబర్లో మరో రేటు పెంపు ఉంటుందని మార్కెట్ అంచనా వేయడం ప్రారంభించింది.
"ఇటీవలి బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో పాటు, ఈ లోహాల విస్తృతమైన ధోరణి కూడా బలహీనంగానే ఉంది. ధన్‌తేరాస్ సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి బదులుగా.. రెండు లేదా మూడు వాయిదాలలో బంగారం కొనడం మంచి వ్యూహం కావచ్చు. వెండి ధరలు ఎక్కువగా ఒడిదుడుకులకు లోను కానున్నాయి. అందుకే, వెండిలో పెట్టుబడి మొత్తాన్ని బంగారం కంటే తక్కువగా ఉంచాలని సిఫార్సు చేస్తున్నా" అని అరోరా సూచించారు.
విలువైన లోహాల ధరలు భారీగా పడటం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కొనుగోళ్లకు ఒక అవకాశాన్ని అందిస్తుందని భావిస్తున్నట్లు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందన భారతీ చెప్పారు.
1970లో ఒక్కో ఔన్స్ 40 డాలర్లుగా ఉన్న బంగారం ధరలు, 1980 జనవరి నాటికి సుమారు ఔన్స్ 850 డాలర్లకు చేరుకున్నాయి.
అదేవిధంగా.. 2008లోని ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో.. నగదు కోసం పెట్టుబడిదారులు తమ ఆస్తులను బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుడు, బంగారం ధరలు ఒక్కో ఔన్స్ 700 డాలర్లకు పడిపోయాయి. అయితే, ఆ తర్వాత కోలుకుని, 2011 ఆగస్టు నాటికి ఒక్కో ఔన్స్ 1,917 డాలర్లకు చేరుకున్నాయి.
కరోనా మహమ్మారి సమయంలో 2020 మార్చిలో మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా ఇదే రకమైన ధోరణి కనిపించింది. నగదు సమీకరించే సమయంలో, బంగారం ధరలు ఔన్సు సుమారు 1,472 డాలర్లకు పడిపోయాయి. అయితే, ఆ తర్వాత పెట్టుబడిదారులు ఫిజికల్ గోల్డ్, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్‌లో (ఈటీఎఫ్‌లలో) తమ పెట్టుబడులను పెంచడంతో, ధరలు వేగంగా కోలుకున్నాయి.
లిక్విడిటీ ఒత్తిడితో విలువైన లోహాలు పడిపోయినప్పుడు దీర్ఘకాలిక కొనుగోలుదారులు వీటిని కొనేందుకు చురుకుగా మారతారని ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయని భారతీ చెప్పారు.
బంగారం ధరలలో ఇటీవలి తగ్గుదలను, పెట్టుబడిదారులు క్రమంగా కొనుగోలు చేయడానికి ఒక అవకాశంగా చూస్తున్నారని భారతీ తెలిపారు.
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹1.38 లక్షలుగా ఉంది.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, మారకపు రేటు హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారం పోషించే సురక్షిత ఆస్తి పాత్ర కారణంగా.. 2027 నాటికి దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,000 నుంచి రూ.1,80,000 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.
కామెక్స్, ఎంసీఎక్స్, ఫ్యూచర్ రేట్లు అంటే ఏమిటి?
కామెక్స్ అనేది అమెరికాలోని ఒక ప్రధాన మార్కెట్. ఇక్కడ బంగారం, వెండి కాంట్రాక్టుల కొనుగోళ్లు, అమ్మకం జరుగుతాయి. ఫ్యూచర్స్ రేట్లు అంటే భవిష్యత్తులోని ఒక నెలలో డెలివరీ కోసం నేడు ఒక కాంట్రాక్టును సెటిల్ చేసే ధరలు.
దీని అర్థం ఆ సమయంలో బంగారం లేదా వెండి ధర తప్పనిసరిగా అంత ఉంటుందని కాదు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌ను ఒక కీలకమైన ప్రైస్ బెంచ్‌మార్క్‌గా ఉపయోగిస్తారు.
కామెక్స్ను ఒక జ్యూవెలరీ స్టోర్‌గా కాకుండా వ్యవస్థీకృత హోల్‌సేల్ మార్కెట్‌గా భావించవచ్చు. ఇది సీఎంఈ గ్రూప్ ఎక్స్ఛేంజ్ బిజినెస్‌లో భాగం.
'గోల్డ్ ఫ్యూచర్స్ రేటు' అంటే ఏంటి?
ఒక ఊహాత్మక ఉదాహరణను తీసుకుంటే.. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఒక్కో ఔన్స్ 4 వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంటే.. ట్రేడర్లు ప్రస్తుతం ఈ ధర వద్ద డిసెంబర్ స్టాండర్డ్ గోల్డ్ కాంట్రాక్టులను కొనవచ్చు, అమ్మవచ్చు.
దీనర్థం.. డిసెంబర్లో కచ్చితంగా బంగారం ధర 4 వేల డాలర్లు పలుకుతుందని కాదు. ఒక ఉదాహరణ చూస్తే.. ఒక కొనుగోలుదారుల, సరఫరాదారు భవిష్యత్‌లో సరఫరా అయ్యే వస్తువుల కోసం తామెంత ధర చెల్లిస్తామో నేడే నిర్ణయించడం. వారు ఒక లావాదేవీ ధరని నిర్ణయించుకుంటారు తప్ప, మార్కెట్లో ఇదే మున్ముందు ప్రధాన ధరగా ఉంటుందని అంచనా వేయరు.
భారత్‌లో బంగారం వార్తల్లో తరచూ కామెక్స్ ఎందుకు కనిపిస్తుంటుంది? అంతర్జాతీయ మార్కెట్‌కు కామెక్స్ ఒక కీలకమైన బెంచ్‌మార్క్. అలాగే, ఎంసీఎక్స్ అనేది భారత ఎక్స్ఛేంజ్. ఇక్కడ బంగారం, వెండి ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంటాయి.
కామెక్స్‌లో డాలర్లలో చూపించే ధర, భారత్‌లో జ్యూవెల్లరీ మార్కెట్లో ఉండే రిటైల్ ధర, అలాగే, ఎంసీఎక్స్‌లో రూపాయిల్లో చూపించే ధర ఒకటే కాదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)