‘అతి తీవ్ర తుపానుగా మారొచ్చు’.. విశాఖపట్నానికి 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంపై అధికారుల హెచ్చరిక

ఫొటో సోర్స్, @Indiametdept
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ఇవాళ తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారబోతోంది.
ఇది యానాం- బాపట్ల, విశాఖ పట్నానికి మధ్య అక్టోబర్ 28వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయగుండం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం(అక్టోబర్ 25) రాత్రి ప్రకటించిన సమాచారం ప్రకారం.. ప్రకారం తీవ్ర వాయుగుండం విశాఖకు 820 కి.మీ., కాకినాడకు 910 కి.మీ., మచిలీపట్నానికి 1010 కి.మీ.,బాపట్లకు 1080 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ తీవ్రవాయుగుండం సోమవారం(అక్టోబర్ 26) ఉదయానికి తుపానుగా, మంగళవారం(అక్టోబర్ 27) ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా,బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇది తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.








