మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
లైవ్ కవరేజీ
సెంట్రల్ దిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తత
పవన్ కాంత్ దిగవల్లి,
బీబీసీ ప్రతినిధి
సెంట్రల్ దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి నిరసనకారులకు భద్రతా బలగాలకూ మధ్య ఘర్షణ కొనసాగుతోంది.
కన్నాట్‌ప్లేస్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, దిల్లీ పోలీసులను మోహరించారు.
మహిళా నిరసనకారులను దిల్లీ మహిళా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి బస్సుల్లో ఎక్కించి తరలిస్తున్నారు.
ఎక్కడికక్కడ వేర్వేరు గుంపుల్లో నిరసనకారులు జంతర్ మంతర్ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు తమ పట్ల విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
సెంట్రల్ దిల్లీలో ఇంటర్నెట్ పని చేస్తోంది. కొన్ని రోడ్లపై బారికేడ్లను తొలగిస్తున్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.
ప్రతీ వాహనాన్నీ పోలీసు బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
కన్నాట్‌ప్లేస్‌లో దుకాణాలను తెరిచారు. అయితే జంతర్ మంతర్‌కు వెళ్లే అన్ని మార్గాలనూ పోలీసులు మూసివేశారు.
‘పోలీసులు మా ఫోన్లు లాక్కున్నారు, న్యాయవాదితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు’
పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు నేరుగా ప్రధాని మోదీపై విమర్శల దాడి చేశారు.
అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ రత్నా సింగ్ విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.
నాయనమ్మ మృతి చెందడంతో అభిజీత్ దీప్కే స్వగ్రామానికి వెళ్లడంతో ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు.
“భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోదీ అత్యంత పిరికి ప్రధానమంత్రి” అని అశుతోష్ రాంకా అన్నారు.
“ఇదే ప్రభుత్వం నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను విమానంలో ఎక్కించి దేశం నుంచి పంపించివేసింది. మమ్మల్ని మాత్రం విమానం నుంచి దించేసింది” అని సౌరవ్ దాస్ ఆరోపించారు.
“మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు పోలీసులు మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు. మాఫియా డాన్లలా వచ్చి మమ్మల్ని తీసుకుపోయారు. మా ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను మహిళా పోలీసులు తీసుకున్నారు. కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు” అని ఆయన అన్నారు.
“నన్ను ఆర్కే పురంలో అశుతోష్‌ను బల్లభ్‌గఢ్‌కు, అభిజీత్‌ను కూడా ఎక్కడికో తీసుకువెళ్లారు. మమ్మల్ని తీసుకువెళ్తున్నప్పుడు, మా న్యాయవాదితో మాట్లాడటం మా ప్రాథమిక హక్కు అని అడిగా. కానీ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి హక్కులు ఉండవని మాకు చెప్పారు. నిరసనకారులతో దిల్లీ పోలీసులు ఇంకెంత క్రూరంగా వ్యవహరించారో” అని సౌరవ్ దాస్ అన్నారు.
“మా ఫోన్‌ను ఏం చేశారోనని మాకు ఆందోళనగా ఉంది. మా ఫోన్‌ను క్లోన్ చేశారని అనుమానంగా ఉంది. రేపు మా ఫోన్‌ను క్లోన్ చేసి సాక్ష్యంగా సమర్పిస్తారు” అని సౌరవ్‌దాస్ అన్నారు.
మరోసారి నేహా బోరా నిర్బంధం
సర్‌కు వ్యతిరేకంగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఎఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, ఆదివారం రామకృష్ణ ఆశ్రమ మార్గ్‌లో నిరసనకు దిగారు.
ఘటనా స్థలిలో ఉన్న బీబీసీ విలేఖరి రాఘవేంద్ర రావు, నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ధృవీకరించారు.
నేహా బోరా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, ఆమె పరుగులు పెడుతున్నట్టు కనిపించారు.
అక్టోబర్ 2 నుంచి దిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలలో నేహా బోరా ప్రముఖంగా నిలిచారు. దాదాపు ప్రతి నిరసన తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శనివారం,దిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్లే రహదారులపై కట్టుదిట్టమైన భద్రత నడుమ, ఆమె అకస్మాత్తుగా దిల్లీహాట్కు చేరుకుని నిరసన తెలపడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆదివారం కూడా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ నిరసనలపై ప్రత్యేక విచారణలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
దిల్లీ: ఉద్యమాన్ని ప్రభుత్వం కఠినంగా అణచివేసిందా? విశ్లేషకుల మాటేంటి?
చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..
భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?
అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల
కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేసినట్లు సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.
శనివారం ఉదయం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.
"అభిజిత్, అశుతోష్, సౌరవ్‌లను ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు" అని రత్నా సింగ్ తెలిపారు.
"దిల్లీ పోలీసు అధికారి ఒకరు ఈరోజు ఉదయం నాకు ఈ సమాచారం ఇచ్చారు. సీజేపీ లీగల్ హెడ్ హోదాలో, మా తరఫున హాజరయ్యే ఇతర వకీళ్లతో కలిసి నేను పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉంటాను" అని చెప్పారు.
అంతకుముందు, సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ముందస్తు నిర్బంధంలో ఉంచామని, వారిని నేడు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ముగ్గురు నాయకుల నిర్బంధంపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
"మోదీ, షా ఎంతలా భయపడ్డారంటే నేడు వారు పిల్లలను అపహరిస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని ఎక్స్‌లో పేర్కొన్నారు
‘‘నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడం మీ దేశానికే మచ్చ’’ అంటూ నార్వేపై ట్రంప్ విమర్శలు
దిల్లీలో నేడూ నిరసనలు కొనసాగుతాయి: నేహా బోరా
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దిల్లీలో జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగుతాయని అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ప్రకటించారు.
సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన నేహా బోరా, శనివారం దిల్లీ హాట్ 'జంతర్-మంతర్'గా మారిందని, ఆదివారం వేరే ప్రదేశంలో నిరసన తెలుపుతామని చెప్పారు.
"సామాన్యులను జైళ్లలో పెడతారా లేక జ్ఞానేశ్ కుమార్నా అనేది మీరే తేల్చుకోండి. మేం ఆదివారం కూడా వీధుల్లోకి వస్తాం, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్ఐఆర్ రద్దు డిమాండ్‌తో నిరసన ప్రదర్శన చేస్తాం" అని అన్నారు.
మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత అజింక్య శిందే ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి ఆదివారం జరగనున్న నిరసన వివరాలు వెల్లడించారు.
"జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లం" అని ఆయన పేర్కొన్నారు.
తాము రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ జంతర్-మంతర్ వైపు కవాతు చేస్తామని అజింక్య చెప్పారు. అలాగే భారీ సంఖ్యలో జంతర్-మంతర్‌కు చేరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయమొచ్చింది: డోనల్డ్ ట్రంప్
యుక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో అమెరికా కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందంపై జెలియెన్ స్కీ చేసిన విమర్శలకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా నుంచి లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేసేందుకు కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల.. యుక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు మాస్కోకు డబ్బు అందించినట్లవుతుందని జెలియెన్ స్కీ హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇచ్చే బహుమతిగా జెలియెన్ స్కీ అభివర్ణించారు.
శనివారం వైట్‌హౌస్ వెలుపల విలేఖరులతో ట్రంప్ మాట్లాడారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులకు జెలియెన్ స్కీ అనుమతులు ఇస్తూ.. ప్రపంచానికి సమస్యలు సృష్టిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.
‘‘ఆయన ఈ పని కచ్చితంగా ఆపేయాలి’’ అన్నారు. ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని సూచించారు.
‘నా కోచ్‌లో మగవాళ్లు మద్యం తాగుతున్నారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన అస్సాం యువతి తర్వాతి రోజు శవంగా కనిపించారు..
శాంతించిన దిల్లీ వీధులు
పవన్ కాంత్ దిగవల్లి
బీబీసీ ప్రతినిధి
శనివారం ఉదయం నుంచి నిర్బంధాలు, నినాదాలతో మారుమోగిన దిల్లీ వీధులు శాంతించాయి.
దిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా నిరసనలకు పిలుపునిచ్చిన అక్టోబర్ 10 రాత్రికి సెంట్రల్ దిల్లీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా, ఖాళీగా మారిపోయాయి.
అయితే బారికేడ్లు, భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. కానీ రాత్రి 8:30 గంటల నుంచీ అన్ని చోట్లా ప్రరిస్థతి ప్రశాంతంగా కనిపించింది.
దిల్లీ వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి జంతర్ మంతర్‌కు చేరుకోవడానికి ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకోవడంలో దిల్లీ పోలీసుల ప్రయత్నాలు విజయవంతమయ్యాయని చెప్పుకోవచ్చు.
జన్‌పథ్ జంక్షన్, కన్నాట్‌ప్లేస్, లే మెరీడియన్ సర్కిల్, పార్లమెంటు జంక్షన్, కర్తవ్యపథ్, మండీ హౌస్, ఆకాశవాణి భవన్ ప్రాంతం అన్నీ కూడా రాత్రి 9:00 గంటల సమయంలో ప్రశాంతంగా కనిపించాయి.
అనేక జంక్షన్లలో రోజంతా వందలాది మంది నిరసనకారులను భద్రతా బలగాలు అడ్డుకుంటూ బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కిస్తూ అదుపులోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు తరలించేశారు.
ఉదయం నుంచీ మొత్తంగా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడెక్కడికి వాళ్లను తరలిస్తున్నారనే సమాచారాన్ని పోలీసు అధికారులెవరూ అధికారికంగా ధృవీకరించడంలేదు.
పోలీసుల అదుపులోంచి బయటకు వచ్చాక ఆందోళనకారులు తమ నిరసనలను కొనసాగిస్తారా లేక పరిస్థితి చల్లారుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
సీజేపీ ఉద్యమం ఇకపై ఏ మలుపు తీసుకుంటుంది?
దిల్లీ పోలీసుల చర్య, రోజంతా కొనసాగిన నిర్బంధాల అనంతరం, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఎస్ఎఫ్ఐ సహా పలు విద్యార్థి సంఘాలు హెచ్‌కేఎస్ సుర్జీత్ భవన్లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు ప్రతిరోజూ జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని సీజేపీ నాయకుడు అజింక్య శిందే ప్రకటించారు.
అభిజీత్ దీప్కే, ఇతరులతో దిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరును కూడా ఆయన విమర్శించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ఐక్యంగా ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య పిలుపునిచ్చారు.
ఆదివారం(అక్టోబర్ 11) నుంచి విద్యార్థి ఉద్యమం దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తారని, పోలీసులు బారికేడ్లతో వారిని ఎక్కడ అడ్డుకుంటారో, ఆ ప్రదేశమే జంతర్ మంతర్ అవుతుందని ఆయన చెప్పారు.
పోలీసుల చర్యలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన
కాక్రోచ్ జనతాపార్టీ నిరసన సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం ఆందోళన వ్యక్తంచేసింది. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నవారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఈ నిరసన సమయంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు జరిగినట్టు వార్తలొచ్చాయి.
మరోవైపు దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పలువురు సీజేపీ కార్యకర్తలను పోలీసులు అకస్మాత్తుగా చుట్టుముట్టారు. వారిని అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించారు.
నిరసనకారులను తీసుకువెళ్తున్న బస్సును ఓ లాయర్ ఆపడంతో, వారిలో చాలామంది బస్సు దిగి పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నారు.
బీబీసీ రిపోర్టర్ రాఘవేంద్రరావు పలువురు సీజేపీ నిరసనకారులతో మాట్లాడారు.
'జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుంది' అని వారిలో ఒకరు అన్నారు.
అటు దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ భద్రతపై కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళన వ్యక్తంచేసింది.
‘ఇకపై సీజేపీ ఉద్యమ బాధ్యత అజింక్య శిందే నే చూస్తారు’ అని దీప్కే చెప్పిన శిందే ఎవరు?
ఎవరెక్కువ నిరసనలు చేస్తారనే విషయంలో తీవ్రపోటీ ఉంది- రవిశంకర్ ప్రసాద్
దిల్లీ నిరసనలపై ప్రతిపక్షనేతలను, కాక్రోచ్ జనతా పార్టీని (సీజేపీ) లక్ష్యంగా చేసుకుని బీబీసీ విమర్శలు చేసింది.
"మేం నిరసనలకు వ్యతిరేకం కాదు. కానీ తమ ఓటమి కారణంగా వారు వీధుల్లో జరిగే నిరసనలను ఒక ఆయుధంగా మార్చుకున్నారు. ఇందులో కూడా ఎవరు ఎక్కువ నిరసనలు చేస్తారనే పోటీ ఆసక్తికరంగా సాగుతోంది’’ అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో అన్నారు.
‘‘ మొదట మూడురోజుల పాటు రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీపై 'షాడో బాక్సింగ్' చేసే సీజేపీ వచ్చింది. "ఉదయం నుంచి వారి (సీజేపీ) నాటకం కొనసాగుతోంది. తర్వాత అరవింద్ కేజ్రీవాల్, ఇతరులు కూడా వచ్చారు. అప్పుడు మనం ఎందుకు వెనుకబడి ఉండాలి అని భావించి మమతాబెనర్జీ కూడా వచ్చారు. ఆ తర్వాత సీపీఐ, సీపీఎం కూడా వచ్చాయి" అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
నేహా బోరా విడుదల
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను ఈ మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్న దిల్లీ పోలీసులు సాయంత్రం తర్వాత విడిచిపెట్టారు.
‘‘పోలీసులు నా ఫోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫోన్ తిరిగి నా చేతికొచ్చింది. మైదాన్ గడీ పోలీస్ స్టేషన్ నుంచి మహిళలను విడుదల చేశారు’’ అని నేహా బోరా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
అంతకుముందు అదుపులోకి తీసుకున్నతర్వాత నేహా బోరాతో పాటు పలువురు నిరసనకారులను పోలీసులు ప్రత్యేక బస్సులో తరలించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్నతర్వాత నేహా బోరా ‘ఎక్స్’లో స్పందించారు.
‘‘నేను డిటెన్షన్‌లో ఉన్నా. ఉద్యమం కొనసాగించాలి. ప్రజలిప్పుడు సఫ్దర్ జంగ్ ఫ్లై ఓవర్ దగ్గర ఉన్నారు. అక్కడకి వెళ్లండి. మిమ్మల్ని ఆపితే ఎక్కడ ఆపారే అక్కడే కూర్చుని నిరసన కొనసాగించండి’’ అని నేహా బోరా పోస్ట్ చేశారు.
కాంగ్రెస్, సీజేపీ: ఎంత దూరం, ఎంత దగ్గర - నిరసనల వేళ రాహుల్ దిల్లీలో ఎందుకు లేరు?