పేడ నుంచి సీఎన్‌జీ.. ఆ జిల్లాలో కార్లు, ట్రాక్టర్లు, లారీలకు అది ఇంధనం

సీఎన్‌జీ వాహనాలు
ఫొటో క్యాప్షన్, ఖులాలోని బనాస్ డెయిరీ బయో-సీఎన్‌జీ స్టేషన్‌లో ఒక కారులో సీఎన్‌జీ నింపుతున్నారు.
    • రచయిత, గోపాల్ కటేశియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

గుజరాత్‌ రాష్ట్రం బనాస్కాంఠా జిల్లాలోని రాధన్‌పూర్, థరాద్ వద్ద బనాస్ డెయిరీకి చెందిన రెండు కొత్త బయో-సీఎన్‌జీ ప్లాంట్లకు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

ఇప్పటికే బయో సీఎన్‌జీ తయారీలో ఉన్న ఈ డెయిరీ ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని కొత్త యూనిట్లు భారీగా పెంచనున్నాయి.

ఆవులు, గేదెల పేడ నుంచి తయారయ్యే ఇంధనంతో (బయో-సీఎన్‌జీ) ట్రక్కులు, కార్లు వంటి భారీ వాహనాలు నడిచేందుకు సహాయపడుతూ.. బనాస్ డెయిరీ కేవలం పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలను కూడా అందుకుంటోంది.

రాధన్‌పూర్‌లోని ప్రతిపాదిత ప్లాంట్ ద్వారా రోజుకు 1,350 కేజీల బయో-సీఎన్‌జీ ఉత్పత్తి చేయనున్నారు. థరాద్ ప్లాంట్ రోజుకు 1,800 కేజీల బయో-సీఎన్‌జీని ఉత్పత్తి చేయనుంది.

ఈ రెండు ప్లాంట్లు ఏడాది లోపల నిర్వహణలోకి రానున్నట్లు అంచనా.

ఈ రెండు ప్లాంట్లు ప్రారంభమైన తర్వాత.. బనాస్ డెయిరీ రోజువారీ బయో-సీఎన్‌జీ ఉత్పత్తి సామర్థ్యం 9.30 టన్నులకు పెరగనుంది.

ఈ బయో-సీఎన్‌జీని ఆవు, గేద పేడ నుంచి తయారు చేస్తారు. కార్లు, ట్రక్కులు వంటి భారీ వాహనాలకు ఇది ఇంధనంగా పనిచేస్తుంది.

వాస్తవానికి, 2020 ఫిబ్రవరి నుంచి బనాస్ డెయిరీ ఆవు, గేదె పేడ నుంచి బయో-సీఎన్‌జీ తయారు చేయడం మొదలుపెట్టింది.

వీటిని కారు డ్రైవర్లకు, పికప్ ట్రక్కులకు, భారీ వాహనాలకు విక్రయిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. ప్రపంచంలో వ్యవసాయ యోగ్యమైన భూమి అత్యధికంగా భారత్‌ వద్దనుంది. భారత ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక పశుసంపద కూడా భారత్‌లోనే ఉంది.

అందువల్ల.. దీన్నుంచి బయోగ్యాస్‌ను, సీఎన్‌జీని ఉత్పత్తి చేయడానికి భారత్‌కు అపారమైన సామర్థ్యం ఉంది.

రవాణా, విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించే పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, బొగ్గు వంటి సంప్రదాయ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

బదులుగా పునరుత్పాదక వనరుల నుంచి ఎక్కువ ఎనర్జీని పొందే ప్రయత్నాలను భారత్ మొదలుపెట్టింది. అయినప్పటికీ, ఈ విధానంలో అనేక సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బనాస్ డెయిరీని సందర్శించి, బయో-సీఎన్‌జీ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు.

బయోగ్యాస్ నుంచి సీఎన్‌జీ ఎలా తయారు చేస్తారు?

పేడ నుంచి వచ్చే వాయుఇంధనాన్ని గోబర్ గ్యాస్ అని పిలుస్తారు.

ఆవు, గేదెల పేడ.. పంట వ్యర్థాలు కుళ్లినప్పుడు మీథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలవుతాయి.

ఆక్సిజన్ లేనప్పుడు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఈ ప్రక్రియను అనేరోబిక్ డైజషన్ అంటారు.

బయోగ్యాస్ ప్లాంట్లలో 'అనేరోబిక్ డైజషన్' ట్యాంకులను నిర్మిస్తారు.

ఈ ట్యాంకులలో ఉత్పత్తయ్యే గ్యాస్‌లో మండే స్వభావం గల మీథేన్ ఉంటుంది.

దిగుమతి చేసుకున్న నేచురల్ గ్యాస్ నుంచి తయారు చేసే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)లో 90 శాతానికి పైగా మీథేన్ ఉంటుంది.

దీనితో పోలిస్తే, సాధారణ బయోగ్యాస్‌లో కేవలం 55 నుంచి 60 శాతం మీథేన్ మాత్రమే ఉంటుంది. దీని మండించడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఫలితంగా వాహనాల ఇంజిన్‌లకు అవసరమయ్యే పవర్ లభించదు.

బయోగ్యాస్‌ను మరింత మండే స్వభావం గలదిగా, అధిక శక్తి సాంద్రంగా మార్చడానికి, దాన్నుంచి కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, తేమ, ఇతర మలినాలను తొలగిస్తారు.

ఈ వాయువులోని మీథేన్ శాతాన్ని 90 శాతం లేదా అంతకంటే ఎక్కువకు పెంచడానికి శుద్ధి చేస్తారు.

ఈ విధంగా శుద్ధి చేసిన బయోగ్యాస్, శుద్ధి చేసిన నేచురల్ గ్యాస్ మాదిరిగా శక్తిమంతంగా మారుతుంది.

బయో-సీఎన్‌జీ ప్లాంట్
ఫొటో క్యాప్షన్, వించివాడిలోని బనాస్ డెయిరీ బయో-సీఎన్‌జీ ప్లాంట్

బయో-సీఎన్‌జీతో వాహనాలు ఎలా నడుస్తాయి?

డీజిల్, పెట్రోల్ వంటి సంప్రదాయ ఇంధనాల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. అవి సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ద్రవ రూపంలో ఉంటాయి. గ్యాస్‌తో పోలిస్తే వాటిని నిల్వ చేయడానికి తక్కువ స్థలం అవసరం.

మైనస్ 162 డిగ్రీల సెల్సియస్ వద్ద కూల్ చేస్తే మీథేన్ ద్రవరూపంలోకి మారుతుంది. కానీ, అంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉత్పత్తి చేసేందుకు క్లిష్టమైన క్రయోజెనిక్ టెక్నాలజీ కావాల్సి ఉంటుంది.

ఈ టెక్నాలజీని ప్రధానంగా స్పేస్ రాకెట్లలో వాడతారు. సంప్రదాయ వాహనాల్లో వీటి వాడటం అంత సాధారణం కాదు. దీనికి ప్రత్యామ్నాయంగా, మీథేన్‌ను అత్యధిక పీడనం వద్ద సిలిండర్లలో కంప్రెస్ చేస్తారు. ఎక్కువ గ్యాస్ లేకుండా దాన్ని ఒక చిన్న ప్రదేశంలో నింపవచ్చు.

ఒక బార్ అంటే ప్రతి చదరపు అంగుళానికి సుమారు ఏడున్నర కిలోల పీడనం అని అర్థం. పైపుల ద్వారా ఇళ్లల్లోని కిచెన్‌లోకి చేరుకునే పైప్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) 0.021 బార్ ప్రెజర్‌‌తో ఉంటుంది. వంటగ్యాస్‌లో ఉపయోగించే బ్యూటేన్, ప్రొపేన్ గ్యాస్ మిశ్రమమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (సంక్షిప్తంగా ఎల్‌పీజీని) 20 బార్ ప్రెజర్‌తో సిలిండర్లలో నింపుతారు. భారత్‌లో నేచురల్ గ్యాస్ సాధారణంగా 200 నుంచి 250 బార్ ప్రెజర్ వద్ద కంప్రెస్ చేస్తారు.

సీఎన్‌జీ రూపంలో వాహనాల్లోని సిలిండర్లలో నింపుతారు.

పెట్రోల్ ఆధారిత వాహనాల ఇంజిన్‌కు సీఎన్‌జీని ఇంధనంగా ఇస్తే, దాని సామర్థ్యం, జీవితకాలంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నిపుణులు చెప్పారు.

బనాస్ డెయిరీ బయో-సీఎన్‌జీ ప్లాంట్
ఫొటో క్యాప్షన్, ఖులాలోని బనాస్ డెయిరీ బయో-సీఎన్‌జీ ప్లాంట్‌కు ట్రాక్టర్లలో పేడ తరలిస్తారు

బయో-సెంట్రిసిటీ నుంచి బనాస్ డెయిరీ ఎంత లాభం సంపాదిస్తుంది?

బనాస్ డెయిరీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 4.63 లక్షలకు పైగా రైతులు, పశు పోషకులు దీనితో సంబంధం కలిగి ఉన్నారు.

ఈ పశు పోషకుల దగ్గర సుమారు 30 లక్షల ఆవులు, గేదెలు ఉన్నాయని.. సగటున ఒక్కో ఆవు/గేదె రోజుకు 15 కిలోల పేడ వేస్తుంటాయని డెయిరీ అధికారులు చెబుతున్నారు.

పశువుల పెంపకందారులకు పాలతో పాటు పేడ నుంచి కూడా ఆదాయం అందించడం, అలాగే మంచి నాణ్యమైన ఎరువులను సరఫరా చేయడం అనే లక్ష్యంతో.. బనాస్ డెయిరీ 2019 జూన్‌లో డీసా సమీపంలోని దామా గ్రామంలో తన మొదటి బయో-సీఎన్‌జీ ప్లాంట్‌ను స్థాపించింది.

రోజుకు ఈ ప్లాంట్ 40 టన్నుల పేడను శుద్ధి చేసి, దాన్నుంచి 800 కేజీల బయో-సీఎన్‌జీని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఆగస్టు 2020 నుంచి ఈ ప్లాంట్ నుంచి బయో-సీఎన్‌జీని విక్రయించడం మొదలుపెట్టినట్లు డెయిరీ అధికారులు బీబీసీకి తెలిపారు.

‘‘ప్రస్తుతం కేజీ రూ.90కు బయో-సీఎన్‌జీని విక్రయిస్తున్నాం. మార్కెట్ ధర కంటే ఇది రూ.5 తక్కువ. మాకు ప్రభుత్వ రాయితీ వస్తుంది. అందుకే మేం ఈ ధరకు విక్రయిస్తున్నాం'' అని బనాస్ డెయిరీ ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్ డిపార్ట్‌మెంట్స్ టీమ్ లీడర్ విక్రమ్ ఛౌదరీ బీబీసీతో చెప్పారు.

ఈ ప్లాంట్ నుంచి ప్రస్తుతం బనాస్ డెయిరీ లాభాలను సంపాదిస్తుందని విక్రమ్ ఛౌదరీ చెప్పారు.

''మేం పాడి రైతుల నుంచి కిలో ఆవు పేడను ఒక రూపాయికి కొనుగోలు చేస్తాం. రైతుల పశువుల కొట్టాల నుంచి మా ప్లాంట్‌కు ఆవు పేడను రవాణా చేయడానికి 35 పైసల నుంచి 50 పైసల వరకు రవాణా చార్జీలు చెల్లిస్తాం. ఒక టన్ను ఆవు పేడ నుంచి 18 కిలోల బయో-సీఎన్‌జీ, సుమారు 200 కిలోల ఘన ఎరువు, సుమారు 800 కిలోల ద్రవ ఎరువు ఉత్పత్తి అవుతాయి. మేం ఆ ఎరువుకు అవసరమైన పోషకాలను కలిపి, దాన్ని రైతులకు కిలోకు సగటున మూడు రూపాయలకు అమ్ముతాం. గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ప్లాంట్ నిర్వహణ ఖర్చులను భరిస్తుంది. ఎరువు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం లాభంగా మారుతుంది" అని తెలిపారు.

"2025-26 సంవత్సరంలో, దామా ప్లాంట్‌ను నడపడం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం సుమారు రూ. 5.25 కోట్లు. మరోవైపు, ప్లాంట్‌ను నడపడానికి అయిన మొత్తం ఖర్చు సుమారు రూ. 4.75 కోట్లు. ఈ విధంగా, ఈ ప్లాంట్ నుంచి బనాస్ డెయిరీ సుమారు రూ. 50 లక్షల లాభం ఆర్జించింది. మరో కీలక విషయం ఏంటంటే.. ఈ ప్లాంట్ నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 75 శాతం ఎరువుల వ్యాపారం నుంచే వచ్చింది" అని విక్రమ్ ఛౌదరీ తెలిపారు.

బనాస్ డెయిరీ బయో-సీఎన్‌జీ ప్లాంట్
ఫొటో క్యాప్షన్, దామా గ్రామంలో బనాస్ డెయిరీకి చెందిన బయో-సీఎన్‌జీ ప్లాంట్

భారత్‌లో బయో-సీఎన్‌జీ ఎంత ఉత్పత్తి చేస్తున్నారు?

భారత్‌లో వినియోగించే క్రూడాయిల్‌లో 90 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే, నేచురల్ గ్యాస్ కోసం కూడా భారత్ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం.. భారత్ 46.3 మిలియన్ టన్నుల నేచురల్ గ్యాస్‌ను వినియోగిస్తుంది. దానిలో 52 శాతం దిగుమతి చేసుకుంటుంది.

భారత్‌కు సంవత్సరానికి 40 కోట్ల నుంచి 62 కోట్ల టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఉందని వరల్డ్ బయోగ్యాస్ అసోసియేషన్ నివేదిక పేర్కొంది. ఈ సామర్థ్యంలో సుమారు 30 శాతం పశువుల పేడ రూపంలో ఉంది.

ఈ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి, దేశ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది.

గత ఏడాది సోషల్ మీడియాలో చేసిన పోస్టులో.. భారత్‌లో 113 బయో-సీఎన్‌జీ ప్లాంట్లు నిర్వహణలో ఉన్నాయని, రోజుకు 775 టన్నుల బయో-సీఎన్‌జీని ఉత్పత్తి చేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రూ. 23,731 కోట్ల 'గోవర్ధన్' పథకాన్ని ప్రకటించి, రాబోయే పదేళ్లలో బయోగ్యాస్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, 2030 నాటికి సీఎన్‌జీ, పీఎన్‌జీలలో 5 శాతం బయో-సీఎన్‌జీని కలపాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

బయో-సీఎన్‌జీ ప్లాంట్
ఫొటో క్యాప్షన్, ఖులాలో బనాస్ డెయిరీ బయో సీఎన్‌జీ ప్లాంట్ వద్ద బయోగ్యాస్ ప్యూరిఫికేషన్ యూనిట్

బయో-సీఎన్‌జీ ఉత్పత్తిలో సవాళ్లేంటి?

శిలాజ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్‌లో బయోగ్యాస్ ఒక ఆకర్షణీయమైన ఎంపికగా కనిపిస్తోందని నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 'ఇండియా క్లైమేట్ అండ్ ఎనర్జీ మోడలింగ్ ఫోరమ్' చైర్మన్ డాక్టర్ కిరిత్ పారిఖ్ చెప్పారు.

"భారత్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. సమస్య ఏమిటంటే.. మనం మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేస్తే, ఆహార భద్రతపై ఆందోళనలు తలెత్తవచ్చు, చెరకు నుంచి ఇథనాల్ తయారు చేస్తే, పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే చెరకు పంటకు చాలా నీరు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో బయోగ్యాస్ ఒక మంచి ఎంపికగా కనిపిస్తోంది" అని డాక్టర్ పారిఖ్ బీబీసీతో చెప్పారు.

''దేశం వద్ద బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు అత్యధిక సామర్థ్యం ఉంది. కానీ, సమస్యేంటంటే.. దానికి కావలసిన ముడి పదార్థాలు దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్నాయి. భారత్‌లో ఆవు పేడ గ్యాస్ వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యయంపై నేను 1963లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎంఐటీలో) మాస్టర్స్ థీసిస్ రాశాను. ఆ పరిశోధనలో, బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి ఒక కుటుంబానికి ఐదు పశువులు ఉండాలనే నిర్ధరణకు వచ్చాను. ఈ రోజుల్లో, ప్రతిఒక్కరికీ అన్ని పశువులు ఉండటం కష్టం. అందరూ కలిసి కొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తే, అప్పుడు బహుశా విజయం సాధించవచ్చు" అని పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)