ఛప్పనియా కరువు: మహిళలు సిగ్గు, మర్యాద వదిలేశారని చరిత్రకారులు ఎందుకన్నారు? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం రాశారు?

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, 1900లో కరవు పరిస్థితుల్లో ఓ కుటుంబం.
    • రచయిత, జై శుక్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 13 నిమిషాలు

ఈ కథనంలో తీవ్రంగా కలవరపరిచే విషయాలున్నాయి

'కాళూ (వ్యక్తి పేరు) వెళ్లేదారిలో ఉన్న అడవి ఈ ఛప్పనియా కరువు దెబ్బకు తట్టుకోలేక 'ఆకలి..ఆకలి' అని అలమటిస్తున్నట్టు కనిపిస్తోంది.

పక్షులు కూడా ఆకలి, దాహంతో అల్లాడుతున్నాయి.

చైత్రమాసంలో వీచే గాలులు, వడగాలులు కూడా మాయమయ్యాయి.

ఎండిన నేల ఆయన్ను శత్రువుగా భావించినట్టుగా పాదాలను గుచ్చుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అప్పుడు కాళూ ఓ మాట అనుకున్నాడు.

'పన్నెండు నెలలుగా పడని వర్షం జ్యేష్ఠ మాసం చివరి పదిహేను రోజుల్లో అయినా పడుతుందా?

అప్పటికి ఇంకా జ్యేష్ఠ మాసం చివరి పక్షం రోజులు రానట్లు కాళూ మాటలనుబట్టి అర్థమవుతోంది.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, ఛప్పనియా కరువు 200 ఏళ్లలో సంభవించిన తీవ్రమైన కరువు అని చరిత్రకారులు చెప్పారు.

‘పశువు కళేబరం పీక్కుతింటున్న అస్థిపంజరాల్లాంటి మనుషులు’

'వర్షాకాలం మొదలైన తర్వాత వర్షం పడకపోతే పోనీ. చెట్ల చిగుర్లు, ఆకుకూరలు తింటూ అయినా రోజులు గడుపుతాం. కానీ ఒక్కసారైనా వర్షం పడితే బాగుండు కదా’ అని కాళూ అనుకున్నాడు.

అంతలో గ్రామానికి అవతలి వైపు నుంచి ఒక కేక వినిపించింది.

'పరుగెత్తండి... పశువులపై దాడి జరిగింది..త్వరగా రండి...'

ఆ మాట వినగానే కాళూ శరీరంలో చిన్న వణుకు పుట్టింది.

అక్కడకు వెళ్లి చూడగానే కనిపించిన ఆ దృశ్యాన్ని కాళూ తన జీవితంలోనే కాదు...ఏడు జన్మలెత్తినా మర్చిపోలేడు.

అస్థి పంజరాల్లా కనిపిస్తున్న ఇరవైమంది మనుషులు అప్పటికే చనిపోయిన ఒక పశువుపైపడి మాంసం తింటున్నారు. వాళ్లు పళ్ళు కత్తుల్లా పనిచేస్తున్నాయి. కాళూ ఒళ్లు గగుర్పొడిచింది. వాళ్లు మనుషులా లేక రాబందులా?' అని ఓ క్షణం అనుమానమొచ్చింది. రాబందులు మృతదేహంపై ఎలా పడతాయో వాళ్లు కూడా పశువుల కళేబరాలపై అలాగే చేస్తున్నారు.

వాటిని లాగుతున్నారు..పీకుతున్నారు.

పశువు ఒక్కోకాలును ఇద్దరిద్దరు పట్టుకుని మాంసాన్ని కొరుక్కుంటున్నారు.

కత్తులతో వచ్చిన మరో ఇద్దరు ఆ పశువు మాంసాన్ని కోసి తీసుకెళ్తున్నారు.

వాళ్ల దగ్గర కత్తులు ఉండడంతో మిగతావాళ్లు భయపడుతున్నారు. దొరికిన చిన్న మాంసం ముక్కనైనా లాక్కుంటున్నారు. వాళ్ల ఒంటిపై చిరిగిపోయిన దుస్తులు తప్ప ఇంకేమైనా ఉంటే వాటిని కూడా చింపేసేవారేమో.

కొందరు మాంసాన్ని చంకలో పెట్టుకుంటున్నారు. మరికొందరు పొట్టకు, తొడలకు మధ్య దాచుకుంటున్నారు. కత్తుల భయం ఉన్నప్పటికీ ఎవరికి దొరికిన మాంసాన్ని వాళ్లు లాక్కుంటున్నారు.

కాళూ ఒళ్లు గగుర్పొడిచింది. శరీరంలోని ప్రతి వెంట్రుక నిక్కబొడుచుకుంది.

ఆ దృశ్యం చూసి ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.

'దేవుడా..మనుషులుగా పుట్టినవాళ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా' అని బాధపడ్డాడు.

పెద్ద నిట్టూర్పు విడుస్తూ ఆయన ఇలా అన్నాడు. ‘‘ఈ ప్రపంచంలో అన్నింటికంటే దారుణమైనది ఏదైనా ఉందంటే అది ఈ ఆకలే’’

ఛప్పనియా కరువు నేపథ్యంలో సాగే నవల 'మానవిని భవాయ్'లో కరువు సృష్టించిన హృదయవిదారక పరిస్థితులను ప్రముఖ గుజరాతీ రచయిత పన్నాలాల్ పటేల్ ఇలా ఆ ఘటనలను వర్ణించారు. ఈ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు కూడా వచ్చింది.

ఈ నవలలో కల్పిత పాత్ర కాళూ ద్వారా ఆయన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని, మనుగడ కోసం మనిషి చేసే పోరాటాన్ని, ఆకలి, ఆత్మగౌరవం కోసం పడే తపనను వివరించారు.

ప్రేమ, ఆకలి, మానవీయ భావోద్వేగాలకు ఈ నవల ఒక సజీవ దర్పణం.

కరువు భయానక పరిస్థితుల మధ్య కూడా జీవించాలనే సంకల్పాన్ని, పట్టుదలను మనిషి ఎలా సజీవంగా నిలుపుకుంటాడో ఈ నవల తెలియజేస్తుంది.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, కరువు సృష్టించిన హృదయవిదారక పరిస్థితులను 'మానవిని భవాయ్' అనే నవలలో వర్ణించారు (ప్రతీకాత్మక చిత్రం)

‘ప్రకృతి క్రూరత్వం ముందు మనిషి నిస్సహాయత’

1899-1900 సంవత్సరాల్లో వచ్చిన ఈ భయంకరమైన కరువు కారణంగా మేత దొరక్క వేల సంఖ్యలో పశువులు చనిపోయాయి. మనుషులు కూడా నడిచే అస్థిపంజరాల్లా మారిపోయారు.

పన్నాలాల్ పటేల్ రచించిన ఈ నవలకు రాసిన ముందుమాటలో గుజరాతీ రచయిత మనుభాయ్ పంచోళి అక్కడి కరువు పరిస్థితులును వివరించారు.

ప్రకృతి క్రూరత్వం ముందు మానవులు ఎంత నిస్సహాయులో, ఆకలి కారణంగా బంధుత్వాలు, మానవత్వం కూడా ఎలా కనుమరుగైపోతాయో వివరించారు.

ఒక్కో మెతుకు కోసం మనుషులు ఎంతగా తపించారో చెప్పారు. ఈ పరిస్థితిని 'ఆకలితో అలమటిస్తున్న దెయ్యాల గుంపు'గా ఆయన అభివర్ణించారు.

కరువు భయానక పరిస్థితులను వివరిస్తూ

''ఛప్పనియా కరువు అప్పటితరం ప్రజల జ్ఞాపకాల్లో మిగిలిపోయిన ఒక మహా విపత్తు. ఆ కరువులో నానియాలాంటి వ్యక్తులు తమ భార్యలను వదిలేశారు. తల్లులు తమ ఒంటిని కప్పుకోవడానికి కూడా దుస్తులు లేని పరిస్థితి ఏర్పడింది. భలి, రూఖీ లాంటి మహిళలు సిగ్గు, లజ్జను పక్కన పెట్టాల్సి వచ్చింది.

మనిషికి మిగిలింది ఒక్కటే కోరిక. ఎలాగైనా సరే ఆహారం సంపాదించుకోవాలి. దాని కోసం భిక్ష అడగడం, దొంగతనం చేయడం, చివరికి కుక్కల నోళ్లలో ఉన్న ఆహారాన్ని లాక్కోవడం, ఇతరులు పారేసిన ఎంగిలి ఆహారాన్ని తినడం కూడా మొదలుపెట్టారు. మహిళలు తమ శరీరాలను అమ్ముకుని కడుపులో ఆకలి మంటలను చల్లార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

భార్య తన భర్త గురించి, తల్లి తన కూతురు గురించి, కూతురు తన తండ్రి గురించి కూడా సిగ్గుపడని పరిస్థితి ఏర్పడింది. రేపు బతికి ఉంటామో లేదో తెలియదు. కాబట్టి ఈ ఒక్కరోజును ఎలాగైనా గడిపేయాలి. ఎంతకాలం బతకగలిగితే అంతకాలం బతకాలి. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది అవినీతి అనే ఆలోచనలు కూడా మిగల్లేదు" అని రాశారు.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, రాజకీయపరమైన పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు రెండింటి కారణంగా గుజరాత్ తీవ్రంగా దెబ్బతింది. (ప్రతీకాత్మక చిత్రం).

ఛప్పనియా కరువు అనే పేరు ఎందుకు వచ్చింది?

1899లో దేశవ్యాప్తంగా రుతుపవనాలు రాలేదు. దీంతో 1900 సంవత్సరంలో అంతకు ముందు 200 ఏళ్లలో చూడనంత భయంకరమైన స్థాయిలో తీవ్రమైన కరువు ఏర్పడింది.

దీంతో ఆహారం, పశువుల మేతకు తీవ్ర కొరత ఏర్పడింది.

చిన్న రైతులు, చేతివృత్తులవారు, భూమిలేని వ్యవసాయ కూలీలపై ఈ కరువు తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.

తినడానికి ఏమీ లేక పేదలు చెట్ల ఆకులు, థోర్ మొక్క కాయలు తింటూ బతికేవారు.

'గుజరాత్ నో రాజకీయ్ అనే సాంస్కృతిక్ ఇతిహాస్: బ్రిటిష్ కాల్' (గుజరాత్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర: బ్రిటిష్ పాలనాకాలం) అనే పుస్తకంలో చరిత్రకారులు హరిప్రసాద్ శాస్త్రి, ప్రవీణ్ చంద్ర పరీఖ్ ఈ కరువు గురించి ప్రస్తావించారు.

గుజరాతీ విక్రమ సంవత్ క్యాలెండర్‌లో 1956వ సంవత్సరంలో ఈ కరువు రావడంతో దీనిని ఛప్పనియా కరువు అని అన్నారని వారు పేర్కొన్నారు.

"1900లో ఛప్పనియా కరువు వచ్చింది. రాజకీయపరమైన పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు రెండింటి కారణంగా గుజరాత్ తీవ్రంగా దెబ్బతింది.

కరువు సమయంలో రైతులను భూమి పన్ను చెల్లించమని ప్రభుత్వం బలవంతం చేయకూడదని కరువు కమిషన్లు పదేపదే సూచించాయి. అయినా బొంబాయి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన విధానాన్ని అనుసరించింది. దీంతో గుజరాత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు" అని చరిత్రకారులు హరిప్రసాద్ శాస్త్రి, ప్రవీణ్ చంద్ర పరీఖ్ రాశారు.

గుజరాత్ చరిత్రలోని ఈ చీకటి అధ్యాయానికి సంబంధించి గుజరాతీ భాషలో లభించే సమాచారం చాలా పరిమితంగా ఉంది.

ఈ కరువు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పశువులు కూడా భారీ సంఖ్యలో చనిపోయాయి. దీంతో ప్రజల మనోధైర్యం పూర్తిగా దెబ్బతింది.

భరించలేని ఆకలి, మరణాల వల్ల కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత భయంకరంగా కనిపించింది.

"దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ చేయించకుండా వ్యక్తిగత విచారణలు జరిపించారు. దీంతో పక్షపాతం, పలుకుబడి ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌లో భూమి పన్ను వసూలు చేసే సమయంలో జరిగిన అక్రమాలు, ప్రజలపై జరిగిన దౌర్జన్యాల వివరాలను సేకరించి ప్రజల ముందు ఉంచే సాహసం గోకుల్‌దాస్ కహాన్‌దాస్ పారేఖ్ చేశారు.

అదే సమయంలో భూమి శిస్తు చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నప్పుడు ఫిరోజ్‌షా మెహతా దానిని వ్యతిరేకించారు.

ప్రజాప్రతినిధులు, సర్ ఫిరోజ్‌షా మెహతా చేసిన డిమాండ్ ఒక్కటే. ఈ బిల్లును బహిరంగ చర్చకు పెట్టాలని, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని.

కానీ ప్రభుత్వం వారి డిమాండ్‌ను అంగీకరించలేదు. దీంతో సభ్యులు సభను బహిష్కరించారు.

శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం అదే మొదటిసారి. ఈ పరిణామం గుజరాత్‌లో రాజకీయ చైతన్యం పెరగడానికి కారణమైంది.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, ఆకలితో మనుషులు అస్థిపంజరాల్లా మారారని ఓ బ్రిటిష్ అధికారి రాశారు.(ప్రతీకాత్మక చిత్రం).

‘మహిళలకు నడుము చుట్టూ చిన్న వస్త్రం తప్ప ఏం లేదు’

కరువు ప్రభావిత ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారి ఎఫ్.హెచ్.ఎస్. మేరి వెదర్ పర్యటించారు.

అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, అప్పటి బ్రిటిష్ పరిపాలనా విధానాలు, ప్రభుత్వ సహాయక శిబిరాల్లోని పరిస్థితులను ఆయన తన 'ఎ టూర్ త్రూ ది ఫెమిన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో వివరంగా రాశారు.

బిలాస్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ సహాయక శిబిరంలోని పరిస్థితులను వివరించారు.

"అక్కడ ఉన్నవారిలో చాలామంది తాము అనేక నెలలుగా ఆ శిబిరంలో ఉంటున్నామని చెప్పారు. అయినప్పటికీ తగిన ఆహారం అందడం లేదన్నారు. అక్కడున్న వారందరిదీ ఒకటే విన్నపం. 'మేము ఆకలితో ఉన్నాం' అని చెబుతూ తమ శరీరాల వైపు చూపించేవారు.

వారి చేతులు, కాళ్లలోని ఎముకలు స్పష్టంగా కనిపించేవి. కీళ్లు భయంకరంగా బయటకు పొడుచుకొచ్చి ఉండేవి. చర్మంతో గట్టిగా కప్పి ఉంచిన అస్థిపంజరాల్లా వారి శరీరాలు కనిపించేవి"

ఒక పాపను చూడటం చాలా భయంకరంగా అనిపించింది. ఆమెకు ఐదేళ్లని ఆమె తల్లి చెప్పింది.

ఆమె ఒక సాధారణ మనిషి బిడ్డలా కాకుండా శరీర నిర్మాణానికి సంబంధించిన ఏదో వికృతమైన నమూనాలా కనిపించింది. పాప ముఖంపై చర్మం వెనక్కి పోయినట్టు ఉండటంతో పళ్లన్నీ బయటకు కనిపిస్తున్నాయి. తలపై ఎముకల ఆకృతులు, కీళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె చేతులు నా చిటికెన వేలంత సన్నగా ఉన్నాయి. తొడలు నా బొటన వేలంత మందంతో మాత్రమే ఉన్నాయి.

ఇదంతా కేవలం ఆకలితో ఏర్పడిన పరిస్థితే.

మరో మనిషి పూర్తి అస్థిపంజరంలా మారిపోయాడు.

రెండున్నర నెలలుగా ప్రభుత్వ సహాయం పొందుతున్నాడు. అయినప్పటికీ ఆయన బరువు 31 కిలోలు కూడా లేదు. నేను ఆయన్ను చాలా సులభంగా ఎత్తగలిగాను.

చాలామంది మహిళలు దాదాపు నగ్నంగా ఉన్నారు. నడుము చుట్టూ ఒక చిరిగిన గుడ్డ ముక్క మాత్రమే కట్టుకుని ఉన్నారు.

భారతీయ మహిళలకు సహజంగా ఉంటుందని భావించే సిగ్గు, మర్యాద వంటి భావాలను కూడా వారు కోల్పోయేంత దయనీయమైన పరిస్థితికి చేరుకున్నారు" అని మేరి వెదర్ తన పుస్తకంలో రాశారు.

బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను ఈ పుస్తకంలో తీవ్రంగా విమర్శించారు మేరీ వెదర్.

"నేను బాగా ఆలోచించి, తగిన కారణాలతో, స్వయంగా చూసిన పరిస్థితుల ఆధారంగా ఒక విషయం చెబుతున్నాను. దాతృత్వ కార్యక్రమంగా చెప్పుకుంటున్న ఈ సహాయక శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలను భయంకరమైన, నెమ్మదిగా సంభవించే మరణం వైపు నెట్టివేస్తున్నారు" అని రాశారు.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, కరువు, కలరా కలిసి గుజరాత్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.(ప్రతీకాత్మక చిత్రం)

‘అంతిమ సంస్కారాలు నిర్వహించలేక’

బ్రిటిష్ జర్నలిస్టు, ఆర్థికవేత్త వాన్ నాష్ కూడా ఆ సమయంలో భారతదేశంలో నెలకొన్న కరువు పరిస్థితులను తన 'ది గ్రేట్ ఫెమిన్ అండ్ ఇట్స్ కాజెస్' అనే పుస్తకంలో వివరించారు.

"దీనికి తోడు దేశంలో కలరా వ్యాధి కూడా వ్యాపించింది. రాబందులు, నక్కలు చనిపోయిన మనుషుల మృతదేహాలను తిని కడుపు నింపుకుంటున్నాయి. గాలిలో మృతదేహాల నుంచి వస్తున్న భయంకరమైన దుర్వాసన వ్యాపించింది. ప్రజలు ఎంత వేగంగా చనిపోతున్నారంటే వారి మృతదేహాలను దహనం చేయడం లేదా ఖననం చేయడం కూడా సాధ్యం కావడం లేదు. అహ్మదాబాద్, భరూచ్, ఖేడా, పంచమహల్ జిల్లాల్లోని సహాయక శిబిరాలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డాయి. కాఠియావాడ్‌లోనూ పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది. అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరాల నుంచి సగం మంది ప్రజలు పారిపోయారు. మరణించిన వారి సంఖ్య ఎంతన్నది తెలియదు. గోధ్రాలో కలెక్టర్, ఇతర అధికారులు కలిసి దాదాపు వెయ్యి మృతదేహాలను స్వయంగా దహనం చేయాల్సి వచ్చింది. వడోదరలో పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉంది'' అని వాన్ నాష్ రాశారు.

బ్రిటిష్ ప్రభుత్వం, గుజరాత్ సంస్థానాల రాజులు సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించారని చాలామంది చరిత్రకారులు, రచయితలు రాశారు.

అయితే కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే ఈ సహాయక చర్యలు ఏ మాత్రం సరిపోలేదు.

"బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అదనపు అధికారులను నియమించి గుజరాత్‌కు పంపించింది.

కమిషనర్ లేలీ (అధికారి పేరు) ని ప్రజలు తమ తండ్రిగా, రక్షకుడిగా భావిస్తున్నారు. ఆయనకు పూర్తి అధికారాలు ఇచ్చారు.

గ్రామాలకు దగ్గరగా సహాయక కేంద్రాలను ప్రారంభించడం ఆయన అనుసరించిన కొత్త విధానం. దీనివల్ల కరువు బాధితులకు వారి గ్రామాలకు దగ్గరలోనే సహాయం అందేది.

అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే భారత ప్రజలు పశువుల్లా చనిపోవాల్సిన దుస్థితిలో ఉన్నారు" అని వాన్ నాష్ రాశారు.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, గుజరాత్ గ్రామాలపై కరువు తీవ్ర ప్రభావం చూపింది.(ప్రతీకాత్మక చిత్రం)

ఎంతమంది ధనవంతులున్నప్పటికీ...

గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత అచ్యుత్ యాజ్ఞిక్ తన 'అహ్మదాబాద్ - రాయల్ సిటీ టు మెగా సిటీ' అనే పుస్తకంలో ఇలా రాశారు.

"ఈ పరిస్థితులు బ్రిటిష్ ప్రభుత్వంలోని క్రూరమైన కోణాన్ని బయటపెట్టాయి. కరువు సహాయక శిబిరాలను చాలా ఆలస్యంగా ప్రారంభించారు. అదే సమయంలో పన్నుల వసూలు మాత్రం కొనసాగింది. పైగా పన్నుల వసూలు మరింత కఠినంగా మారింది. ఎందుకంటే బర్మా, అఫ్గానిస్తాన్‌లో సామ్రాజ్య విస్తరణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. నగరాలపై కరువు ప్రభావం కొంత తక్కువగా ఉంది. అయినప్పటికీ అహ్మదాబాద్‌లోని ఒక సహాయక శిబిరానికి సంబంధించిన ఒక్క ఫొటో పేద ప్రజలపై విరుచుకుపడిన విపత్తు తీవ్రతను తెలియజేస్తుంది. అయినప్పటికీ తమ సామాజిక చైతన్యం గురించి గొప్పగా చెప్పుకునే అహ్మదాబాద్ ప్రజలు కూడా ఈ పరిస్థితుల్లో స్పందించకుండా మౌనంగా ఉండిపోయినట్టు కనిపిస్తోంది. వారు దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. హిందూ, జైన దేవాలయాల ట్రస్టుల నిధులపై కూడా వారికి నియంత్రణ ఉండేది. కానీ విపత్తు సమయంలో వాళ్లు సరైన విధంగా స్పందించలేదు'' అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

వల్లభ విద్యానగర్ విశ్వవిద్యాలయ స్థాపకుడు, ఒకప్పుడు గుజరాత్‌లో స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన భాయిలాల్ పటేల్ తన జ్ఞాపకాల్లో ఇలా రాశారు.

"ఛప్పనియా కరువు సమయంలో గుజరాత్ నగరాల్లో డబ్బుకు కొరత లేదు. అప్పటికే దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే వస్త్ర పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. నగరాల్లో చాలామంది ధనవంతులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆకలితో చనిపోతున్న ప్రజలను కాపాడటానికి ముందుకు రావాలనే ఆలోచన వాళ్లల్లో ఒక్కరికి కూడా రాలేదు" అని రాశారు.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, చెట్లు కూడా ఎండిపోయిన తీవ్ర కరువు గుజరాత్‌లో ఏర్పడింది. (ప్రతీకాత్మక చిత్రం).

చెట్లు కూడా ఎండిపోయిన కరువు

భాయిలాల్ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన 'విద్యానగర్‌ నా విశ్వకర్మా' అనే పుస్తకంలో గుజరాతీ రచయిత, జర్నలిస్టు ఈశ్వర్ పేట్లికర్ కరువు పరిస్థితులను వివరించారు.

"విక్రమ సంవత్ 1955 జ్యేష్ఠ మాసంలో భారీ తుపానులు, సుడిగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ వర్షాల వల్ల పొలాల్లో విత్తనాలు వేశారు. కానీ ఆ తర్వాత వర్షం ముఖం చాటేసింది. తల్లి దగ్గర పాలు తాగాలని తపించే ఆకలితో ఉన్న దూడలా, పొలాల్లో వేసిన పంటలు కూడా నీటి కోసం తపించి చివరకు ఎండిపోయాయి. ధాన్యం కొరత మొదలుకాక ముందే విక్రమ సంవత్ 1956లో పశువులకు మేత కొరత ఏర్పడింది.

ప్రజలకే బతకడం బతకడం కష్టంగా ఉన్నప్పుడు ఏడాది పొడవునా పశువులను ఎలా పోషించగలరు?

చెట్ల ఆకులు, కంచెలపై పెరిగే తీగలు, కంథార్ మొక్కలను కలిపి పశువులకు మేతగా వేయడం ప్రారంభించారు.

కంజా చెట్ల ఆకుల వాసన రాగానే గేదెలు భయపడేవి. కానీ చివరకు దుర్వాసన వచ్చే ఆ ఆకులను కూడా అవి తినడం ప్రారంభించాయి. దీంతో చెట్లపై కొద్దిగా ఆకులు కనిపించినా వాటిని ప్రజలు చేతులతో కోసి తీసుకెళ్లేవారు.

చివరకు చెట్లకు శ్వాస తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా లక్షలాది చెట్లు ఎండిపోయాయి.

"చెరువులు, సరస్సుల గట్లు పక్షులు లేక వెలవెలబోయాయి. పశువులు ఆకలితో చనిపోవడం మొదలయింది. రోడ్లపై తిరిగే పశువులు నేలపై బలహీనంగా పడిపోతే కాకులు వాటి శరీరాలను పొడిచి తినేవి. పశువుల శరీరాలపై కాకులు గాయాలు చేయగానే రాబందులు వచ్చి వాటిపై వాలేవి. ఇలా పక్షులు ఆ మృతదేహాలను తింటూ ఉండేవి.

పశువులు మాత్రం వాటిని తరిమికొట్టే శక్తి కూడా లేక చనిపోయేవి.

వేసవి కాలం రాగానే మనుషులు కూడా చనిపోవడం మొదలైంది.

భాయిలాల్‌కు మొదట్లో పశువుల మృతదేహాలే కనిపించేవి. ఆ తర్వాత మనుషుల మృతదేహాలు కూడా కనిపించసాగాయి.

దళితులు ఆ మృతదేహాలను ఈడ్చుకెళ్లి బావుల్లో పడేసేవారు. వాటిపై మట్టిని కూడా కప్పేవారు కాదు.

కొంతకాలానికి ఆ బావులు మృతదేహాలతో నిండిపోయేవి.

కొన్ని మృతదేహాలను పొలాల్లోనే వదిలేసేవారు. వాటిని తినడానికి నక్కలు, కుక్కలు ఒకదానితో ఒకటి పోటీపడేవి'' అని ఈశ్వర్ పేట్లికర్ రాశారు.

'ఛప్పనియా కరువు జ్ఞాపకంగా ఒక పద్యాన్ని పాడేవారు. కంఠహారం అమ్మేశాం. తులసి మాల అమ్మేశాం. చేతికి ఉన్న గాజులనూ అమ్మేశాం. భర్త బతికే ఉన్నప్పటికీ సౌభాగ్యాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. భిక్షగాళ్ల వస్త్రం ధరించాల్సివచ్చింది. ముంబై నుంచి ఒక ధనవంతుడు వచ్చి ధాన్యం పంచాడు.

చిన్న పిల్లలు ఏడుస్తూనే ఉండిపోయారు. పెద్దవాళ్లు మాత్రం వాటిని తీసుకెళ్లిపోయారు' అని పాడుకునేవారని ఈశ్వర్ ప్లేటికర్ వివరించారు.

భాయిలాల్ పటేల్ తన బాల్యంలో ఈ దృశ్యాలను స్వయంగా చూశారని ఈశ్వర్ ప్లేటికర్ తెలిపారు.

"ఆరు రూపాయలకే ఎద్దులను కళేబరాలకు అమ్మేశారు. సమీపంలోని సోజిత్రా మార్కెట్‌లో మాంసం అమ్మే ఒకటి రెండు కుటుంబాలు ఉండేవి. వారు పశువులను ముంబైకి పంపించేవారు. మధ్యతరగతి ప్రజలు తమ నగలు, ఇతర విలువైన వస్తువులను అమ్మేసినా బతకలేకపోయారు. బోర్సద్, ఆనంద్ ప్రాంతాల్లోని పేద రైతులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను క్రైస్తవ మిషనరీ సంస్థలకు అప్పగించారు.

ఆ మిషనరీ సంస్థలు ఇంగ్లండ్, ఐర్లండ్ నుంచి నిధులు సేకరించాయి.

ఈ పరిస్థితుల్లో మత ప్రచారానికి వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకున్నాయి.

ఆకలితో చనిపోకుండా ఉండటానికి ప్రజలు క్రైస్తవ మతంలోకి మారేందుకు కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే అక్కడ వారికి ఆహారం ఇవ్వడంతో పాటు పని కూడా కల్పించేవారు" అని ఆయన రాశారు.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, మహా విపత్తు తీవ్రతకు తగినంత స్థాయిలో సహాయక చర్యలు లేవని చరిత్రకారులు రాశారు.(ప్రతీకాత్మక చిత్రం).

మరోపక్క దేవుని పేరుతో వైభవోపేతమైన విందులు

భాయిలాల్ పటేల్ జ్ఞాపకాలను ఉటంకిస్తూ అచ్యుత్ యాజ్ఞిక్ ఇలా రాశారు.

"గుజరాత్‌లో మతపరమైన గురువులు చాలామంది ఉన్నారు. రైతులు, పేద ప్రజలు ఇచ్చిన విరాళాలతో వాళ్లు ధనవంతులయ్యారు.

అయినప్పటికీ వైష్ణవ దేవాలయాల్లో 'ఛప్పన్ భోగ్' పేరుతో వైభవ విందులు కొనసాగుతూనేఉన్నాయి. దేవుడికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఆచార్యులు తమ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.

స్వామినారాయణ దేవాలయాల్లో కూడా అపారమైన డబ్బు ఉండేది. డాకోర్‌లోని రణ్‌ఛోడ్‌రాయ్ దేవాలయంలోనూ పెద్ద మొత్తంలో నిధులు ఉండేవి. జైన దేవాలయాల్లో కూడా విస్తారమైన సంపద ఉండేది.

కానీ ఆకలితో అలమటిస్తున్న ప్రజల కడుపులో ఆకలి మంటలను చల్లార్చడానికి ఒక్క మతగురువు కూడా ముందుకు రావడానికి సిద్ధపడలేదు.

కొంతమంది పారిశ్రామికవేత్తలు సహాయక చర్యలు చేపట్టారు. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న గుజరాతీలు కూడా నిధులు సేకరించి కరువు బాధితులకు సహాయం చేశారు. వారిలో మహాత్మా గాంధీ కూడా ఉన్నారు.

అయితే ఈ మహా విపత్తు తీవ్రతతో పోలిస్తే ఆ సహాయం చాలా తక్కువ'' అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

దాదాభాయ్ నౌరోజీ ఈ కరువు సమస్యపై గట్టిగా తన గళం వినిపించారు.

బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే విషయంలో ఇకపై భిన్నమైన వైఖరి అవసరమని ఆయన భావించడం ప్రారంభించారు.

రాజకీయ జాతీయవాదం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

అహ్మదాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 18వ మహాసభలో ఈ ఆలోచనల ప్రతిధ్వని వినిపించింది.

అంబాలాల్ శంకర్‌లాల్‌ను ఈ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ అచ్యుత్ యాజ్ఞిక్ ఇలా రాశారు.

"గుజరాత్ ఒక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రం. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న గుజరాత్‌లో గత రెండు కరువుల కారణంగా 25 లక్షల మంది మరణించారు. దీనికి కారణం దేశం నుంచి సంపద బయటకు తరలించుకుపోవడమే'' అని అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్

అహ్మదాబాద్‌లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రాజకీయ పరిస్థితులు తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారుతున్నాయని వాళ్లు భావించారు.

రాజకీయ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని వాళ్లు నిర్ణయించుకున్నారు.

వాళ్లల్లో చాలామందికి సొంతంగా బట్టల మిల్లులు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం తమపై అన్యాయంగా ఎక్సైజ్ పన్నులు విధిస్తోందని వారు భావించారు.

అదే సమయంలో భూమి పన్నుల విధానం వల్ల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు.

 కరువు, ఆహారం, పేదలు, బ్రిటిష్ పాలన, పేదరికం, ప్రకృతి విపత్తు
ఫొటో క్యాప్షన్, 1899-1900సంవత్సరం నాటి కరువులో మరణాలపై వేర్వేరు లెక్కలున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం).

'మనమందరం ఇంత పేదవాళ్లుగా ఎందుకు ఉన్నాం?'

బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ నాయకులు బ్రిటిష్ పాలనను పూర్తిగా తిరస్కరించలేదు.

అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు.

"భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగాలని మేము కోరుతున్నాం.

భారతదేశానికి చట్టబద్ధమైన పాలన, శాంతి, స్థిరత్వాన్ని అందించిన ఆ పురాతన, గౌరవనీయమైన వ్యవస్థను పునరుద్ధరించాలని మేం కోరుతున్నాం.

న్యాయం, స్వేచ్ఛ, సమాన హక్కులు, బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశానికి తగిన భాగస్వామ్యం కల్పించాలని మేము కోరుతున్నాం" అని సమావేశంలో నిర్ణయించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

దాదాపు 20 లక్షల మరణాలు

బ్రిటిష్ ప్రభుత్వంలో రాజ్‌పుతానా ప్రాంతంలో కరువు సహాయక చర్యల కోసం ఏర్పాటైన కమిటీకి అధ్యక్షునిగా ఉన్న జె.ఈ.స్కాట్ తన పుస్తకం 'ఇన్ ఫెమిన్ ల్యాండ్'లో ఇలా రాశారు.

బ్రిటిష్ వైస్రాయ్ కలకత్తాలో ఒక సమావేశం నిర్వహించి కరువు పరిస్థితులను సమీక్షించారు.

ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో మొత్తం రెండు కోట్ల 20 లక్షల మంది కరువు ప్రభావానికి గురయ్యారు.

ఇతర రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో మరో రెండు కోట్ల 27 లక్షల మంది ప్రభావితమయ్యారు.

మొత్తంగా నాలుగు కోట్ల 90 లక్షల మంది కరువు బారిన పడ్డారు.

అయితే 30 లక్షల మందికి మాత్రమే సహాయం అందుతోందని వైస్రాయ్ చెప్పారు.

అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బొంబాయి ప్రావిన్స్‌లోని కాఠియావాడ్, గుజరాత్, రాజ్‌పుతానా ఉన్నాయి.

60 లక్షల మంది ప్రభుత్వ సహాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

సాధారణంగా భారతదేశ జనాభా వృద్ధిరేటు 1.5 శాతంగా ఉండేది. ఈ లెక్కన పదేళ్లలో జనాభా పది లక్షలు పెరగాలి.

కానీ దానికి బదులుగా ఆ పదేళ్ల కాలంలో జనాభా 80 లక్షలు తగ్గిపోయింది. మరణాల రేటు విపరీతంగా పెరిగింది.

కరువు సంవత్సరాల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.

భరూచ్‌లో ప్రతి వెయ్యి మందికి సాధారణంగా 2.96 మరణాలు నమోదవుతుండగా అది 24.83కు పెరిగింది.

పంచమహల్‌ జిల్లాలో ప్రతి వెయ్యి మందికి మరణాల రేటు 46.60కి చేరింది.

ఖేడాలో ఈ సంఖ్య 21.07గా ఉంది.

అహ్మదాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 24 మరణాలు నమోదయ్యాయి.

ఆ సమయంలో కలరా వ్యాధి కూడా తీవ్రంగా వ్యాపించింది. దీంతో ఆ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది'' అని . జే, ఈ. స్కాట్ రాశారు.

1901లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన కరువు నివేదికలో ఇలా పేర్కొన్నారు.

"బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో దాదాపు పది లక్షల మంది మరణించారు. వారిలో ఐదో వంతు మంది కలరా వ్యాధి కారణంగా చనిపోయారు. అలాగే రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా దాదాపు పది లక్షల మంది మరణించారు"

ఈ కరువు కారణంగా ఒక్క బొంబాయి ప్రావిన్స్‌లోనే (అప్పట్లో గుజరాత్ ప్రాంతం కూడా ఇందులో భాగంగా ఉండేది) ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,40,376 మంది మరణించారని 'గుజరాత్ విశ్వకోశం'లో ఉంది.

అయితే ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు. అవి కూడా బ్రిటిష్ ప్రభుత్వం నమోదు చేసిన లెక్కలే.

అప్పట్లో ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి పూర్తి వివరాలు సేకరించడానికి అవసరమైన వనరులు, సమాచార వ్యవస్థలు కూడా అందుబాటులో లేవు.

అందుకే ఈ కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని చరిత్రపై అవగాహన ఉన్నవారు భావిస్తున్నారు.

ఈ కరువు కారణంగా 25 లక్షల మంది మరణించారని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షుడు అంబాలాల్ శంకర్‌లాల్ పేర్కొన్నారు.

ఇతర చరిత్రకారులు కూడా తమ రచనల్లో మరణాల సంఖ్యను వేర్వేరు విధాలుగా పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)