గడువు ముగిసిపోతుండగా 272 కోట్ల రూపాయల బహుమతి తనదేనంటూ వచ్చిన లాటరీ టికెట్ విజేత

లొట్టో స్పాట్
ఫొటో క్యాప్షన్, అక్టోబరు 28, 2025న ఒంటారియోలోని గ్రే కౌంటీలోని ఓ చిల్లర దుకాణంలో ఈ 'లోట్టో మాక్స్' జాక్‌పాట్ టికెట్ అమ్ముడుపోయింది.
    • రచయిత, మాడలిన్ హాల్పర్ట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

కెనడాలో 4 కోట్ల కెనడియన్‌ డాలర్ల (272 కోట్ల రూపాయల) లాటరీ బహుమతిని గెలుచుకున్న వ్యక్తి, కొన్ని గంటల్లో ఆ టికెట్ గడువు ముగిసిపోతుందనగా, ఆ బహుమతిని తీసుకోవడానికి ముందుకు వచ్చారని అంటారియో లాటరీ అండ్‌ గేమింగ్‌ కార్పొరేషన్‌ (ఓఎల్‌జీ) తెలిపింది.

ఓఎల్‌జీ మీడియా రిలేషన్స్ డైరెక్టర్ టోనీ బిటోంటి బీబీసీతో మాట్లాడుతూ.. లాటరీ టెర్మినల్ ద్వారా ఈ టికెట్‌ను ధృవీకరించినట్లు తెలిపారు.

బుధవారం అర్ధరాత్రితో ఈ లాటరీ టికెట్ గడువు ముగిసింది.

లొట్టో మాక్స్ జాక్‌పాట్ టిక్కెట్ కొన్న వ్యక్తి ఎవరా అని లాటరీ కార్పొరేషన్ ఏడాదిగా వెదుకుతోంది.

అక్టోబరు 28, 2025న ఒంటారియోలోని గ్రే కౌంటీలోని ఓ చిల్లర దుకాణంలో ఈ 'లోట్టో మాక్స్' జాక్‌పాట్ టికెట్ అమ్ముడుపోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విజేత పేరును ఓఎల్‌జీ వెల్లడించలేదు. బహుమతిని కోరుతున్న వ్యక్తే ఆ టికెట్‌కు అసలైన యజమానా కాదా అని నిర్థరించేందుకు వారిని సంప్రదించినట్లు తెలిపింది.

"టికెట్‌ నిజమైన యజమాని ఎవరో నిర్థరణ అయితే, విజేతను సత్కరించే కార్యక్రమాన్ని ఓఎల్‌జీ నిర్వహిస్తుంది. విజేతల వివరాలను వెల్లడించే మా ప్రక్రియలో భాగంగా వారి కథను మీడియాతో, ప్రజలతో పంచుకుంటాం" అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

బ్లూ మౌంటెన్స్‌, ఓవెన్‌ సౌండ్‌ ప్రాంతాలు ఉన్న గ్రే కౌంటీ ప్రముఖ పర్యాటక ప్రాంతమని ఓఎల్‌జీ గతంలో పేర్కొంది.అందువల్ల ఎవరైనా పర్యాటకులు అక్కడ లాటరీ టికెట్‌ కొనుగోలు చేసి, ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత దాన్ని తనిఖీ చేయడం మర్చిపోయి ఉండవచ్చని తెలిపింది.

అయితే ఇంతకాలం ఆ టికెట్‌ను ఓఎల్‌జీ యాప్‌లో గానీ, స్టోర్‌లో గానీ ఎవరూ చెక్ చేసుకోకపోవడమే "బాధాకరం" అని బిటోంటి బుధవారం ఉదయం మీడియాతో అన్నారు.

ఈ జాక్‌పాట్ గెలుచుకున్న నంబర్లు: 06, 14, 17, 19, 26, 43, 45, బోనస్ నంబర్ 27.

టికెట్‌ను ఎక్కడ పెట్టామో తెలుసుకోవడానికి ప్రజలు తమ దుస్తుల జేబులు, హ్యాండ్‌బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు, పర్సులు, వాహనాల్లోని గ్లోవ్‌ కంపార్ట్‌మెంట్లు వంటి ప్రదేశాల్లో వెతకాలని లాటరీ సంస్థ ప్రజలను కోరింది.

ఒకవేళ టికెట్‌ గడువు ముగిసిపోయి ఉంటే, 4 కోట్ల డాలర్ల బహుమతి మొత్తాన్ని లాటరీ సంస్థ భవిష్యత్తులో నిర్వహించే ఆటల కోసం తన వద్దే అట్టిపెట్టుకునేది.

లాటరీ గెలిచినా, బహుమతి తీసుకోని జనం

గతంలో కూడా భారీ లాటరీ బహుమతులను గెలుచుకున్నా, వాటిని తీసుకోవడానికి ముందుకు రాని సందర్భాలు ఉన్నాయి.

జూన్ 28, 2022న ఒంటారియోలోని స్కార్‌బరోలో ఒకరు $70 మిలియన్ల (దాదాపు రూ.477 కోట్లు) లోట్టో మాక్స్ డ్రా గెలుచుకున్నారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు.

ఆ సమయంలో ఈ టికెట్ గురించి 2,700 మంది కాల్స్, ఈమెయిల్స్ చేశారని, కానీ వారిలో ఒక్కరు కూడా అసలు విజేత కారని ఓఎల్‌జీ అప్పట్లో తెలిపింది.

ప్రతి ఏడాది లాటరీ బహుమతుల్లో దాదాపు ఒక శాతం ఎవరూ తీసుకోకుండా మిగిలిపోతాయని బిటోంటి చెప్పారు. అయితే సాధారణంగా అవి చాలా తక్కువ మొత్తాల బహుమతులేనని తెలిపారు.

గత వారం అల్బెర్టా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కెనడా చరిత్రలోనే అతిపెద్ద లాటరీ జాక్‌పాట్‌ అయిన 9 కోట్ల డాలర్లు గెలుచుకున్నారు.

ఆ విజేత ఎవరన్నది ఇంకా బహిరంగంగా వెల్లడించలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)