‘30 ఏళ్ల తరువాత ఇంత భీకర గాలులు చూశాం’, ‘ఆ శబ్దానికి భయమేసింది’ .. అర్నబ్ తుపాను తీవ్రతను వివరించిన 88 ఏళ్ల వృద్ధుడు, 7 నెలల గర్భిణి

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, అర్బబ్ విలయం గురించి చెబుతున్న చిన్ని
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

''గాలుల భీకర శబ్దానికి బాగా భయమేసింది. ఎప్పుడో 1996లో తుపాను వచ్చిందట. అప్పటికి నేను పుట్టలేదు. నేను పుట్టాక ఇదే అతిపెద్ద తుపాను" అని చిన్ని చెప్పారు.

''నేను 1953 తుపాను చూశా.. 1996లో వచ్చిన తుపానూ చూశాం.. కానీ, 30 ఏళ్ల తర్వాత మళ్లిప్పుడు ఇంత భయంకరమైన గాలులు వీచాయి'' అంటూ చెప్పారు 88 ఏళ్ల జీవీవీ సత్యనారాయణ.

అర్నబ్ అతి తీవ్ర తుపాను ధాటికి వీళ్లిద్దరూ భారీగానే నష్టపోయారు.

సత్యనారాయణది బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి.

మేం వెళ్లేసరికి ఆయన ఇంటి గుమ్మంలోనే భారీ చెట్టు ఒకటి నేలకొరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లోంచి బయటకు రావాలంటే, ఆ చెట్టు కొమ్మలను తప్పించుకుని రావాలి.

సత్యనారాయణది బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి.

తుపాను ప్రభావాన్ని పరిశీలించేందుకు గ్రామానికి బీబీసీ వెళ్లినప్పుడు.. ఆయన ఇంటికి వెళ్లేందుకు చెట్టు అడ్డుగా పడి ఉంది. దాని మొదలు భాగం వద్ద పైకి ఎక్కి దిగి ఆయన ఇంటికి చేరుకున్నాం.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, గత తుపానుల గురించి చెప్పిన సత్యనారాయణ

''మంగళవారం అర్ధరాత్రి తీవ్రమైన గాలి వీచింది. కిటికీలన్నీ మూసేసుకున్నాం. తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు. పెద్ద శబ్దంతో గాలులు, చెట్లు విరిగిపడ్డాయి.'' అని చెప్పారు సత్యనారాయణ.

చెట్టు విరిగి పడటంతో ఆయన ఇంటి ముందు ఉన్న కరెంటు స్తంభం కింది భాగంలో దెబ్బతింది. అది ఎప్పుడూ విరిగిపడుతుందోననే భయం కూడా నెలకొంది.

పచ్చని అరటి తోటలు.. ఎత్తయిన కొబ్బరి చెట్ల అందాలతో స్వాగతం పలికే కోనసీమ ప్రాంతంలో అర్నబ్ తుపాను ఒక్కరాత్రిలో పరిస్థితిని మార్చేసింది.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను గాలులకు విద్యుత్ తీగలపై పడ్డ చెట్టు

విరిగిపడిన చెట్లు.. తెగిపడిన తీగలు..

ఎటుచూసిన రోడ్లపై విరిగిపడిన చెట్లు, వాటి కొమ్మలు.. రోడ్లపక్కన నేలకూలిన విద్యుత్తు స్తంభాలు.. తెగిపడిన విద్యుత్తు తీగలు.. సగానికి విరిగి వాలిన కొబ్బరిచెట్లు.. ఇలాంటి ద్రశ్యాలే కనిపిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం, కోనసీమ ప్రాంతంలో సుమారు 33వేల కొబ్బరిచెట్లు విరిగిపోయాయి.

చాలాచోట్ల చెరువు గట్లమీద, కాలువల వెంట ఉన్న చెట్లు విరిగి నీళ్లలో పడి కనిపించాయి.

యానాం నుంచి అమలాపురం వెళ్లే దారిలో ఐ.పోలవరం మండలం కొమరిగిరి వద్ద రోడ్డు పక్కన పెద్దసంఖ్యలో కొబ్బరిచెట్లు విరిగిపడ్డాయి.

అవి విద్యుత్తు తీగలపై పడటంతో అవి తెగిపోవడమో లేదా స్తంభాలు విరిగిపోవడమో జరిగింది.

వాటిని తొలగించి విద్యుత్తు స్తంభాలను పునరుద్ధరించే పనిలో ఉన్నారు ఆ శాఖాధికారులు.

వివిధ శాఖలకు చెందిన వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు 32 మంది సిబ్బంది, అధికారులను కోస్తా తీరం ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం మోహరించింది.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో కుప్పకూలిన చెట్టు

నెల్లూరు జిల్లాకు చెందిన విద్యుత్తు శాఖ ఏఈ మనోహర్ మాతో మాట్లాడారు.

ఆయన కొమరగిరి వద్ద విద్యుత్తు స్తంభాలు పునరుద్ధరించే పనిలో ఉన్నారు.

ఓ మోస్తరు వర్షం కురస్తున్నప్పటికీ, విద్యుత్తు స్తంభాలు, తీగలు పునరుద్ధరించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఆ పనులను మనోహర్ పర్యవేక్షిస్తున్నారు.

''ఎస్పీడీసీఎల్ నుంచి 1000 మంది వరకు అధికారులు, సిబ్బంది వివిధ జిల్లాల నుంచి వచ్చాం,

26వ తేదీనే, అంటే తుపాను ప్రభావానికి ముందే ఇక్కడికి చేరుకున్నాం. తుపాను ప్రభావం తర్వాత పడిపోయిన విద్యుత్తు స్తంభాలు, తీగలు తిరిగి సరిచేసే పనిలో ఉన్నాం'' అని చెప్పారు.

మొత్తం 857 ప్రభావిత గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది.

''1995 మంది సిబ్బందితో 399ప్రత్యేక బ్రందాలు ఏర్పాటు చేయించాం. 707 గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాం. ప్రాథమిక అంచనా ప్రకారం, రూ.1.57 కోట్ల నష్టం వాటిల్లింది.'' అని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు.

తుపాను ప్రభావంతో మొత్తం 15వేల విద్యుత్తు స్తంభాలు కూలిపోయినట్లుగా అంచనా వేస్తోంది ఏపీ ప్రభుత్వం.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, అర్నబ్ ధాటికి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు

ఇళ్లపైకప్పు ఎగిరిపోయాయ్..

మామిడికుదురు మండలం పాశర్లపూడి ప్రాంతంలో మరో భయానక దృశ్యం కనిపించింది.

ఒక ఇంటిపైన ఉన్న రేకులకప్పు పూర్తిగా ఎగిరి వేరొకచోట పడింది.

ఆ ఇంటి యజమాని వీరవెంకట సత్యనారాయణ(చిన్నా)ను మేం కలిశాం.

ఆయన ఇంటి పక్కనే ఉండే హోటల్‌లో తలదాచుకుంటున్నారు.

పాశర్లపూడి గ్రామంలో ఆయన ఇంటికి వెళ్లే సరికి జోరు వాన కురుస్తోంది.

మంగళవారం రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని మాతో ఆయన పంచుకున్నారు.

''రాత్రి ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద గాలులు వచ్చాయి. అంతే, ఒక్కసారిగా ఇంటికి ఉన్న రేకులపైకప్పు ఎగిరి పక్కన పడింది.'' అని చెప్పారు.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ధాటికి ఇంటిపై పడ్డ చెట్టు

ఆ సమయంలో ఇంట్లో తాను, తన కుమారుడు, వేరొక వ్యక్తి మాత్రమే ఉన్నామని చిన్నా చెప్పారు.

గతంలో పెంకుటిల్లు ఉండేది. అది పాడవ్వడంతో రేకులతో ఇల్లు వేసుకున్నామని చిన్నా చెప్పారు.

ఇంటికి ఉన్న విద్యుత్తు మీటరు, సర్వీసు వైరు కూడా గాలుల ధాటికి గోడ నుంచి ఊడి కింద పడింది. ఇంటికి ఉన్న దూలం కూడా గాలులకు ఊడి కింద పడింది.

కొన్నిచోట్ల రహదారుల పక్కన హోర్డింగులు విరిగిపడ్డాయి.

తుపాను తీరం దాటే క్రమంలో 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, కొన్నిచోట్ల 150 కిలోమీటర్ల మేర కూడా రికార్డు అయ్యాయని ఏపీ రాష్ర్ట విపత్తుల యాజమాన్య సంస్థ ప్రకటించింది.

ఈ ప్రభావం చెట్లు, విద్యుత్తు స్తంభాలు, ఇళ్లు, తోటలు, పంటలు.. ఇలా కోనసీమ ప్రాంతంపై ప్రతి వ్యవస్థపై పడింది.

పాశర్లపూడి ప్రాంతంలో చాలాచోట్ల షాపుల పైకప్పులు ఎగిరిపోయి కనిపించాయి.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, గాలివానకు నేలకొరిగిన వరి పంట

ఎవరికి ఎంత సాయం అంటే..

ఏపీలో తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

''షెల్టర్ క్యాంపుల్లో తలదాచుకున్న వారికి రూ.1000 ఆర్థిక సాయం, ఇల్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.10వేలు, దుకాణాలకు రూ.25వేలు, ద్విచక్రవాహనానికి రూ.3వేలు, త్రిచక్ర వాహనాలకు 10 వేలు, పుష్ కార్ట్‌లకు 20 వేలు, వీవర్ కమ్యూనిటీకి రూ.25 వేలు, ఫిషింగ్ బోట్, వలలు ధ్వంసమైతే రూ.25 వేలు సాయం, పత్తి పంట నష్టపోతే హెక్టారుకు రూ.25 వేలు, చెరకుకు రూ.25 వేల చొప్పున, ఇతర పంటలకు ఆయా కేటగిరీల వారీగా ఆర్ధిక సాయంతోపాటు అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున, టమోటాకు రూ.25 వేలు చొప్పున సాయం చేస్తాం'' అని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను గాలుల ధాటికి ఎగిరిపడ్డ రేకులు

ఏడు నెలల గర్భంతో పునరావాస కేంద్రానికి..

తుపాను కారణంగా తీర ప్రాంతాల్లోని సుమారు 28వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

అలాంటి వారిలో చెక్క చిన్ని ఒకరు. ఆమె ఏడు నెలల గర్భిణి.

కోనసీమ జిల్లా కాట్రేనికోవ మండలం మాగసాని తిప్ప గ్రామానికి చెందిన చెక్క సతీష్, ఆయన భార్య చిన్నికి ఇద్దరు పిల్లలు. చిన్ని ఇప్పుడు మూడోసారి గర్భంతో ఉన్నారు.

మంగళవారం పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. సముద్రజలాలు వెనక్కి పోటెత్తడంతో మాగసానితిప్ప గ్రామంలోకి నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది. బలుసుతిప్ప గ్రామంలో తలదాచుకున్న చిన్ని బీబీసీతో మాట్లాడారు.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, శిబిరాల్లో తలదాచుకుంటున్న తుపాను బాధితులు

''మా ఊరు మునిగిపోయిందని చెప్పారు. అక్కడికి వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. బలుసుతిప్ప గ్రామంలో పునరావాస శిబిరం ఏర్పాటు చేశారు.

ఏడు నెలల గర్భంతో కింద పడుకోలేక బలుసుతిప్పలోని మా బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నా'' అని చెప్పారు.

''గాలుల భీకర శబ్దానికి బాగా భయమేసింది. ఎప్పుడో 1996లో తుపాను వచ్చిందట. అప్పటికి నేను పుట్టలేదు. నేను పుట్టాక ఇదే అతిపెద్ద తుపాను.

మొదటి బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా తుపాను వచ్చింది. మళ్లీ మూడోసారి గర్భంతో ఉన్నప్పుడు తుపాను వచ్చింది.'' అని చెప్పారు చిన్ని.

మాగసానితిప్ప గ్రామానికి రాకపోకలు సాగించేందుకు రహదారి లేదా వంతెన సౌకర్యం లేదని చెప్పారు చిన్ని. గోదావరి నది పాయ ఉండటంతో పడవపైనే ప్రయాణించి బలుసుతిప్ప గ్రామానికి చేరుకున్నామని చెప్పారామె.

అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, శిబిరాల్లో తలదాచుకుంటున్న తుపాను బాధితులు

బలుసుతిప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని బీబీసీ సందర్శించింది.

అక్కడ సుమారు వంద మంది వరకు పునరావాసం పొందుతున్నారు.

''మేం మంగళవారం మధ్యాహ్నం పునరావాస శిబిరానికి రాలేదు. మాగసానితిప్పలోనే ఉండిపోయాం. రాత్రికి సముద్రపునీరు పోటుకు మా గ్రామం పూర్తిగా మునిగిపోయింది. రాత్రికి వాటర్ ట్యాంకుపైకి ఎక్కడి ప్రాణాలు కాపాడుకున్నాం. తెల్లారక వచ్చి పునరావాస కేంద్రంలో తలదాచుకున్నాం'' అని అక్కడ తలదాచుకుంటున్న సత్తిబాబు చెప్పారు.

పునరావాస శిబిరంలో ఆహారపరంగా ఇబ్బంది లేకుండా అధికారులు చూసుకుంటున్నారని అక్కడివారు చెప్పారు.

మరోవైపు, ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరితే బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)