హిమానీనదాల్లో మమ్మీలు: మంచు కరగడంతో బయటపడుతున్న పురాతన రహస్యాలు

మంచు వైకింగ్స్, మమ్మీలు, జర్మన్
ఫొటో క్యాప్షన్, ఓట్జీ ఊహారూపాన్ని డచ్ కళాకారులు ఆల్ఫోన్స్, ఆడ్రీ కెన్నిస్ రూపొందించారు.
    • రచయిత, డెయ్‌సీ స్టీఫెన్స్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

1991 సెప్టెంబర్‌లో ఇటలీ, ఆస్ట్రియా సరిహద్దుకు సమీపంలోని వాల్ సెన్నాలెస్ లోయ పర్వతాల్లో ఇద్దరు జర్మన్ పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో కరుగుతున్న మంచులోంచి బయటకు కనిపిస్తున్న ఓ మనిషి మృతదేహాన్ని వారు గుర్తించారు.

ఆ మృతదేహం ఎంతో భద్రంగా ఉండటంతో, ఇటీవలే పర్వతారోహణకు వెళ్లి ప్రమాదంలో మరణించిన వ్యక్తి అయి ఉంటారని తొలుత భావించారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

అయితే, ఆ మృతదేహం వారు మొదట భావించిన దానికంటే చాలా పురాతనమైనదని గుర్తించడానికి కొన్ని రోజులు పట్టింది. చివరకు రేడియోకార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఆ మృతదేహం సుమారు 5,300 ఏళ్ల నాటిదని తేలింది.

ఆ తర్వాత ఓట్జీగా, అంటే మంచు మనిషిగా గుర్తింపు పొందిన ఈ వ్యక్తి, ఈజిప్టు పిరమిడ్లు నిర్మించక ముందటి కాలంలో జీవించారు. ఆ సమయంలో ఎక్కువ మంది ప్రజలు చిన్న చిన్న వ్యవసాయ సముదాయాల్లో నివసించేవారు. లోహపు పనిముట్ల వినియోగం కూడా అప్పుడప్పుడే విస్తరిస్తోంది.

అయినప్పటికీ, ఓట్జీ మృతదేహం అంత భద్రంగా ఉండటంతో శాస్త్రవేత్తలు అతడి చర్మంపై ఉన్న పచ్చబొట్లను పరిశీలించగలిగారు. అతడు చివరిసారిగా ఏమి తిన్నాడో గుర్తించగలిగారు. అతడి ప్రాణాలు తీసిన బాణం మొన వెనుకభాగంలో ఇంకా ఇరుక్కుని ఉండటాన్ని కూడా గుర్తించారు.

అతడు మరణించిన తర్వాత వేల ఏళ్ల పాటు మంచులోనే కూరుకుపోయి ఉన్నాడు. మంచు కరగడం ప్రారంభమైనప్పుడే అతడి మృతదేహం బయటపడింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మంచు, హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి.

2025లో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలోని మంచు పలకలను మినహాయించి, మిగతా ప్రాంతాల్లోని హిమనీనదాలు 2000 నుంచి 2023 మధ్య సగటున ఏటా సుమారు 270 బిలియన్ టన్నుల మంచును కోల్పోయాయి. ఈ మంచు కరిగే ప్రక్రియ గత దశాబ్దంలో మరింత వేగవంతమైంది.

శాశ్వత మంచు క్షేత్రాల వంటి ఇతర రకాల మంచు ప్రాంతాలు కూడా కరుగుతున్నాయి.

హిమనీనదాల మాదిరిగా కాకుండా, మంచు క్షేత్రాలు సాధారణంగా పర్వత వాలులపై నుంచి కిందికి జారిపోయేంత బరువుగా ఉండవు. కొన్ని ప్రాంతాల్లో మంచు కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఇలాంటి మంచు పొరలు పురాతన వస్తువులను నలిగిపోకుండా భద్రపరచడంలో ఎంతో ఉపయోగపడతాయి.

"గత 20 ఏళ్లలో మంచు కరగడం వల్ల వేలాది పురాతన వస్తువులు బయటపడ్డాయి" అని నార్వే కేంద్రంగా పనిచేస్తున్న 'సీక్రెట్స్ ఆఫ్ ది ఐస్' హిమనీహార పురావస్తు పరిశోధన కార్యక్రమం డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త ఎస్పెన్ ఫిన్‌స్టాడ్ చెప్పారు.

"ఇది చరిత్రను భద్రపరిచిన ఒక పెద్ద ఫ్రీజర్‌. కానీ ఇప్పుడది పనిచేయడం లేదు. అందుకే ఈ వస్తువులు మళ్లీ బయటపడుతున్నాయి. వాటిలో చాలా వరకు వేల ఏళ్ల క్రితం అక్కడ వదిలిపెట్టినప్పటి స్థితిలోనే ఉన్నాయి" అన్నారు.

మంచు వైకింగ్స్, మమ్మీలు, జర్మన్
ఫొటో క్యాప్షన్, 5,000 ఏళ్లకు పైగా గడిచినప్పటికీ, ఓట్జీ చర్మంపై ఉన్న పచ్చబొట్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

సాధారణ ప్రజల దైనందిన జీవితానికి అద్దం

పురాతన సమాధుల్లో అనేక పురావస్తువులు బయటపడుతుంటాయి. అయితే, ఓట్జీ వంటి ఆవిష్కరణలు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే అవి సాధారణ వ్యక్తుల నిత్యజీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.

"మంచు మనిషి సాధారణ జనజీవనానికి దూరంగా, మంచులో ఒంటరిగా ఉన్నారు" అని ఇటలీలోని బోల్జానోలో ఉన్న దక్షిణ టైరోల్ పురావస్తు మ్యూజియం శాస్త్రవేత్త ఆండ్రియాస్ పుట్జర్ చెప్పారు. ప్రస్తుతం ఓట్జీ మృతదేహం ఈ మ్యూజియంలోనే ఉంది.

అతడి దుస్తులు, ఆయుధాలు, ఇతర పనిముట్లతో సహా అతడితో పాటు లభించిన వస్తువులన్నీ గడ్డకట్టే చలి కారణంగా భద్రంగా ఉన్నాయి.

"ఆ కాలంలో ప్రజలు ఎలాంటి దుస్తులు ధరించేవారో తొలిసారిగా అర్థం చేసుకునే అవకాశం మాకు లభించింది" అని పుట్జర్ తెలిపారు.

ఓట్జీ వద్ద లభించిన గొడ్డలి ఇటలీ మధ్య ప్రాంతంలోని టస్కనీ నుంచి వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రాంతం ఆస్ట్రియా సరిహద్దుకు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అప్పటి సమాజాల్లో వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మంచు మనిషి శరీరం అసాధారణ రీతిలో భద్రపడటం వల్ల జీవశాస్త్రానికి సంబంధించిన కీలక విషయాలనూ శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు.

కడుపులో పుండ్లకు కారణమయ్యే హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చరిత్రపూర్వ కాలానికి చెందిన ఓ వ్యక్తిలో ఉన్నట్లు తొలిసారిగా జన్యుపరమైన ఆధారాలు లభించాయి.

2012లో ఓట్జీ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు అతడికి గోధుమ రంగు కళ్లు ఉండేవని, లాక్టోస్‌ను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉండేదని, అతడి రక్త వర్గం ఓ అని గుర్తించారు. వయసు పెరగడం వల్ల వచ్చే కీళ్లవాతం సమస్యతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా అతడికి ఎక్కువగా ఉండేదని తేల్చారు.

2023లో నిర్వహించిన మరో విశ్లేషణ అతడి రూపురేఖలపై కొత్త వివరాలను వెల్లడించింది. గతంలో భావించిన దానికంటే అతడి చర్మం ముదురు రంగులో ఉండేదని, పురుషుల్లో కనిపించే బట్టతల వచ్చే జన్యుపరమైన అవకాశాలు కూడా అతడికి ఉన్నాయని ఆ అధ్యయనం సూచించింది.

మంచు మనిషిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని పుట్జర్ తెలిపారు.

మంచు వైకింగ్స్, మమ్మీలు, జర్మన్
ఫొటో క్యాప్షన్, ఓట్జీ దగ్గర దుస్తులు, ఆయుధాలు పనిముట్లు కూడా ఉన్నాయి వీటి ద్వారా రాగి యుగంలో ప్రజలు ఎలా జీవించేవారో తెలుసుకోవడం మనకు సాధ్యమవుతుంది.

ఓట్జీ బయటపడిన ప్రాంతానికి వేల కిలోమీటర్ల దూరంలో మంచు కరగడం వల్ల మరో విభిన్నమైన చారిత్రక ఆనవాలు వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని రాకీ పర్వతాల్లో వైట్‌బార్క్ పైన్ చెట్లతో కూడిన ఓ పురాతన అడవిని పరిశోధకుల బృందం గుర్తించింది. రేడియోకార్బన్ డేటింగ్ ప్రకారం, ఆ చెట్లు 5,000 ఏళ్లకు పైగా పురాతనమైనవి.

ఆ చెట్లు వాటి మొదళ్ల నుంచి విడిపోయి, సమీపంలో నేలపై అడ్డంగా పడి ఉన్నాయి. అయినప్పటికీ, అవి ఎంతో భద్రంగా ఉన్నాయి. వాటిని కనుగొన్నప్పుడు కలప పసుపు రంగులో ఉండటమే కాకుండా, "పైన్ చెట్ల వాసన కూడా బలంగా వస్తోంది" అని ఈ పరిశోధనకు సహ రచయిత, మోంటానా స్టేట్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ క్రెయిగ్ లీ తెలిపారు.

"అవి మంచులో గడ్డకట్టిపోయి, నిద్రాణ స్థితిలో ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ కలప చాలా తాజాగా ఉన్నట్లే అనిపించింది" అని ఆయన చెప్పారు.

ఈ ఆవిష్కరణను మరింత ఆసక్తికరంగా మార్చిన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇలాంటి చెట్లు లేవని లీ తెలిపారు. అప్పట్లో అంత ఎత్తులోనూ ఆ చెట్లు పెరిగాయంటే, గతంలో అక్కడి వాతావరణం ఇప్పటికంటే చాలా వెచ్చగా ఉండేదని సూచిస్తోంది.

2,000 ఏళ్ల నాటి వస్తువులు

మంచు కరగడంతో బయటపడిన మరో విశేషమైన ఆవిష్కరణ నార్వేలోని పురాతన వైకింగ్ మార్గం.

"దీనిని వైకింగ్‌ల మార్గం అని చెప్పవచ్చు. పర్వతాలను త్వరగా, సులభంగా దాటేందుకు వారు ఈ పర్వత మార్గాన్ని ఉపయోగించేవారు" అని ఓస్లో విశ్వవిద్యాలయ సాంస్కృతిక చరిత్ర మ్యూజియానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త జూలియన్ పోస్ట్-మెల్‌బై చెప్పారు.

ఈ మార్గంలో కనీసం 2,000 ఏళ్ల నాటి అనేక వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ఫిన్‌స్టాడ్ తెలిపారు.

ఈ వస్తువులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది రవాణాకు సంబంధించిన పరికరాలు.

"గుర్రాలకు ఉపయోగించే సామగ్రి కనిపిస్తుంది. స్కీ పరికరాల ముక్కలను కూడా మేం కనుగొన్నాం" అని పోస్ట్-మెల్‌బై చెప్పారు.

"చనిపోయిన గుర్రాలు, వాటితో పాటు సహజంగానే గుర్రపు పేడ కూడా కనిపిస్తాయి" అని ఆయన వివరించారు.

ఓట్జీ మాదిరిగానే మంచులో గడ్డకట్టి కాలగర్భంలో భద్రపడిన సాధారణ ప్రజల జీవితాలకు సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ బయటపడ్డాయి.

మంచు వైకింగ్స్, మమ్మీలు, జర్మన్
ఫొటో క్యాప్షన్, విశ్లేషణ కోసం ఒక భాగాన్ని సంగ్రహించడానికి పరిశోధకులు భద్రపరిచిన పైన్ చెట్టును స్థిరీకరిస్తున్నారు.

వాటిలో చేతి తొడుగులు, బూట్లు వంటి దుస్తులు, పిల్లల ఆటవస్తువులు, కొవ్వొత్తుల కోసం ఉపయోగించిన తేనెటీగల మైనపు పాత్రలు, ఆయుధాలు ఉన్నాయి.

"ఇవి చరిత్రపూర్వ కాలానికి చెందిన నాణ్యమైన చెత్త" అని పోస్ట్-మెల్‌బై సరదాగా వ్యాఖ్యానించారు.

"20 ఏళ్ల క్రితం వరకు నార్వేలోని ఎత్తైన పర్వతాల చరిత్ర అంటే పర్వతారోహణ యాత్రల కథ మాత్రమే అన్నట్లుగా ఉండేది" అని ఆయన చెప్పారు.

"కానీ ఈ పరిశోధనల వల్ల ఇప్పుడు మనం మరో కొత్త చరిత్రను చెప్పగలుగుతున్నాం. గత సమాజాల్లోని మరింత విస్తృతమైన వర్గాల గురించి, చేతివృత్తులవారు, రైతులు, పిల్లలు, కుటుంబాలు, మొత్తం సమాజం గురించి తెలుసుకోగలుగుతున్నాం" అని పోస్ట్-మెల్‌బై వివరించారు.

మంచు వైకింగ్స్, మమ్మీలు, జర్మన్
ఫొటో క్యాప్షన్, 1,700 ఏళ్ల నాటి ఈ అంగీ (ట్యూనిక్), వైకింగ్ కనుమ అయిన లెండ్‌బ్రీన్‌లో లభించింది.

అయితే, మంచు నుంచి బయటపడిన ఇలాంటి ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది.

"మంచు కరిగినప్పుడు బయటపడిన వస్తువులు, కరిగిన నీటితో కలిసి ఒక్క రోజులోనే కనుమరుగైపోవచ్చు" అని ఫిన్‌స్టాడ్ వివరించారు.

"లేదా దుస్తులకు సంబంధించిన ఏదైనా వస్తువు ఎండిపోయి గాలికి కొట్టుకుపోవచ్చు. అందువల్ల వాటిని కాపాడేందుకు మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది" అని చెప్పారు.

మంచు కరగడం పురావస్తు పరిశోధనలకు కొత్త అవకాశాలను అందిస్తున్నప్పటికీ, వాతావరణ మార్పుల తీవ్రతను కూడా పరిశోధకుల ముందుకు తీసుకొస్తోంది.

"10,000 ఏళ్లకు పైగా మంచులో భద్రంగా ఉన్న సేంద్రియ పదార్థంతో తయారైన ఓ పురాతన వస్తువు బయటపడితే.. అప్పటివరకు దాన్ని భద్రపరిచిన 10,000 ఏళ్ల నాటి మంచు కోల్పోయినట్లే" అని లీ చెప్పారు.

మంచు వైకింగ్స్, మమ్మీలు, జర్మన్
ఫొటో క్యాప్షన్, గుర్రపు నాడలు, ఎముకలు, పేడ వంటివి, గతంలో ఈ కనుమ మార్గంలో సరుకులను మోసుకెళ్లే గుర్రాలను ఉపయోగించారనడానికి సంకేతాలుగా ఉన్నాయి.

"నేను గానీ, నా పిల్లలు గానీ జీవిత చరమాంకానికి చేరుకునే సమయానికి, ఇదే పర్వతాల్లో నిలబడి చూసినా చుట్టుపక్కల హిమనీనదాలు, మంచు క్షేత్రాలు కనిపించకపోవచ్చు" అని పోస్ట్-మెల్‌బై అన్నారు.

"ఏడాది పొడవునా, ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు, మంచు కనుమరుగవడం వల్ల కలిగే నష్టాన్ని మనం లోతుగా అర్థం చేసుకోగలుగుతాం" అని ఆయన వివరించారు.

హిమనీనదాల పురావస్తు పరిశోధనల్లో లభించే ఆధారాలు పరిమితంగా ఉన్నందున, మంచు నుంచి బయటపడే ప్రతి వస్తువునూ వీలైనంత త్వరగా సేకరించాలని లీ అభిప్రాయపడ్డారు.

"ఈ ప్రాంతాలను పరిశీలించి, వాటి గురించి తెలుసుకునే బాధ్యత మనకు ఉంది" అని ఆయన చెప్పారు.

మంచు వైకింగ్స్, మమ్మీలు, జర్మన్
ఫొటో క్యాప్షన్, మంచులోంచి బయటపడే పురాతన వస్తువులను కనుగొని, వాటిని భద్రపరచడానికి పురావస్తు శాస్త్రవేత్తలకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.

ఫిన్‌స్టాడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"బహుశా మరో 20 ఏళ్లకు ఈ అవకాశం లేకపోవచ్చు" అన్నారు.

"ఈ పని చేయడం మన విధి వంటిది. మనం దీన్ని చేయకపోతే, ఈ వస్తువులు శాశ్వతంగా కనుమరుగైపోతాయి" అని ఫిన్‌స్టాడ్ పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)