ముగిసిన ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్: పులివెందులలో ఉద్రిక్తత, వైసీపీ,టీడీపీ పరస్పర విమర్శలు

మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్, ఎన్నికల సంఘం, వైఎస్ జగన్, వైసీపీ
ఫొటో క్యాప్షన్, తమ ఏజంట్లను పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించలేదని జగన్ ఆర్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రానికి ముగిసింది.

సాయంత్రం 5 గంటల తర్వాత క్యూ లైనులో ఉన్న వారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్రపునేఠా మీడియాకు చెప్పారు.

''శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కడప, అనంతపురం, పల్నాడు జిల్లాలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వాటి విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.'' అని చెప్పారు

ఆధారాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేమని అన్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మంగళవారం కౌంటింగ్ జరగనుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్, ఎన్నికల సంఘం, వైఎస్ జగన్, వైసీపీ
ఫొటో క్యాప్షన్, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి

పోలింగ్ శాతంపై సోమవారానికి స్పష్టత

మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 48.03 శాతం పోలింగ్ నమోదైనట్లు అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.

పోలింగ్ కు సంబంధించి తుది వివరాలు సోమవారం ఉదయానికి వస్తాయని చెప్పారు. 2021లో 63.6శాతం పోలింగ్ నమోదైందని వివరించారు.

ఆదివారం జరిగిన పోలింగ్ సందర్భంగా సుమారు 40 ఘటనలు నమోదైనట్లు ఐజీ రాజకుమారి వివరించారు.

''275 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాం. వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నేరపూరిత అంశాలు ఉన్నట్లు గుర్తించిన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నాం'' అని వివరించారు.

మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్, ఎన్నికల సంఘం, వైఎస్ జగన్, వైసీపీ
ఫొటో క్యాప్షన్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని జగన్ అన్నారు.

పులివెందులలో ఉద్రిక్తత

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పులివెందుల వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

70 పోలింగ్‌ బూత్‌ల నుంచి వైఎస్సార్సీపీ ఏజెంట్లను గెంటివేశారని ఆరోపించారు.

పోలింగ్ ఏజెంట్లు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి జగన్ నిరసన తెలిపారు.

''పులివెందులలో రీపోలింగ్‌ జరపాలి. అప్పటి వరకు ఓటు వేసేది లేదు" అని వైఎస్ జగన్ చెప్పారు.ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదని ఆరోపించారు.

రీపోలింగ్ నిర్వహిస్తేనే ఓటు వేస్తానని, మున్సిపల్ ఎన్నికలలో ఆయన ఓటు వేయలేదు.

పులివెందులలో కొందరు మీడియా ప్రతినిధులపైనా దాడులు జరిగాయని వైసీపీ తన ఎక్స్ అకౌంట్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది.

దాడిలో గాయపడ్డారని చెబుతున్న ఇండియా టుడే ప్రతినిధులను వైఎస్ జగన్ పరామర్శించారు.

ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్, ఎన్నికల సంఘం, వైఎస్ జగన్, వైసీపీ
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పోలీసుల మీద జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది.

‘పులివెందులలో ప్రజలు పండగలా తరలి వచ్చారు’

అనంతపురం 30వ డివిజన్లో రిగ్గింగ్ జరిగిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది.

చిత్తూరులో ఇదే తరహాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

అయితే, ఈ విషయాలపై ఎన్నికల సంఘం ఇంకా స్పందించాల్సి ఉంది.

పల్నాడు జిల్లా వినుకొండలో తమపై దాడి జరిగిందని వైఎస్సార్సీపీ అభ్యర్థి అర్చనమూర్తి ఆరోపించారు.

అయితే, వైఎస్ జగన్ చేసిన ఆరోపణలను టీడీపీ ఖండించింది.

''పులివెందులలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా.. పోలీసులు చొరవతో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. పండుగలా తరలి వచ్చి పులివెందులలో ప్రజలు ఓటింగులో పాల్గొన్నారు'' అని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

''పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేయడం చూసి ఓర్వలేక పోలింగ్‌ను అడ్డుకునేందుకు జగన్ డ్రామాలు ఆడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.'' అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చెప్పారు.

మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్, ఎన్నికల సంఘం, వైఎస్ జగన్, వైసీపీ
ఫొటో క్యాప్షన్, మంగళవారం కౌంటింగ్ జరగనుంది.

మంగళవారం కౌంటింగ్

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు స్వీకరించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక అళ్లగడ్డ, దాచేపల్లి, దర్శి, గురజాల, కమలాపురం, పిడుగురాళ్ల, ప్రొద్దుటూరు, రాయచోటిలో అన్ని స్థానాలకు ఏకగ్రీవం కావడంతో పోలింగ్ జరగలేదు.

మిగిలిన 92చోట్ల ఆదివారం పోలింగ్ జరిగింది.

వాస్తవానికి పోలింగ్ అక్టోబరు 28న జరగాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్ ను నవంబరు 1నాటికి షెడ్యూల్ చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)