విద్యార్థుల బర్త్ డే పార్టీ : 'పోలీసు సైరన్ విని భయంతో పరుగులు, ఇద్దరు విద్యార్థుల మృతి’ - అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, MoinabadPolice
పొలంలోకి అడవి పందులు రాకుండా వేసిన విద్యుత్ కంచె తగిలి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోయారు.
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
''కరెంటు షాక్‌తో విద్యార్థులిద్దరూ చనిపోయారు. విద్యుత్తు కంచె వేసిన రైతుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం'' అని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున రెడ్డి చెప్పారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధి ఉప్పర్‌పల్లికి చెందిన మోక్ష చరణ్, బల్కంపేటకు చెందిన యశ్వంత్ ఇంజినీరింగ్ విద్యార్థులు.
వీరిద్దరూ మొయినాబాద్ సమీపంలోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు.

శుక్రవారం రాత్రి తోటి విద్యార్థి అరుణ్ పుట్టినరోజు సందర్భంగా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం సమీపంలోని ఖాళీ స్థలంలో విద్యార్థులు పార్టీ చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
''రాత్రివేళ పోలీసులు గస్తీ కాస్తుంటారు. పెట్రోలింగ్ వాహనం రోడ్డుపై సైరన్ మోగించుకుంటూ అటుగా వెళుతోంది. అది విని పార్టీ చేసుకుంటున్న విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు'' అని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
అలా పరిగెత్తుతుండగా సమీపంలోని పొలానికి వేసిన విద్యుత్తు కంచె వారి కాళ్లకు తగలడంతో యశ్వంత్, చరణ్ విద్యుదాఘాతానికి గురై చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
''పార్టీ సమయంలో దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నట్లు విచారణలో తేలింది. పార్టీ చేసుకుంటున్న ప్రదేశంలో మద్యం సీసాలను గుర్తించాం. పోలీసులు వస్తున్నారనే భయంతో పారిపోయే క్రమంలో ఈ ఘటన జరిగింది'' అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బీబీసీ ఫోన్ ద్వారా సంప్రదించగా.. వారు అందుబాటులోకి రాలేదు.
విద్యార్థుల మృతితో పొలం సాగు చేస్తున్న రైతు బొలిచెర్వు రాజిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు మొయినాబాద్ పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, MoinabadPolice
ఫెన్సింగ్ వేసిన రైతుపై కేసు
విద్యుత్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కంచెకు కరెంటు సరఫరా చేసినందుకు సంబంధిత రైతుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కంచెకు కరెంటు సరఫరా చేయడం తప్పేనని, ఇలా జరుగుతుందనుకోలేదని రాజిరెడ్డి బీబీసీతో చెప్పారు.
''ఆ పొలం నాది కాదు. కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. అడవి పందులు బాగా వస్తుంటాయి.పొలాన్ని కాపాడుకోడానికి విద్యుత్ కంచె వేశాను. అది తప్పని తెలుసు.. కానీ అడవి పందుల నుంచి పంటను రక్షించుకోడానికి తప్పలేదు'' అని రాజిరెడ్డి అన్నారు.
'అక్రమంగా విద్యుత్తు సరఫరా'
ఘటన జరిగిన ప్రాంతాన్ని విద్యుత్ శాఖాధికారులు పరిశీలించారు. రైతు రాజిరెడ్డి నేరుగా స్టార్టర్ నుంచి ఫెన్సింగ్‌కు కరెంటు కనెక్షన్ ఇచ్చినట్లు గుర్తించారు. ఫెన్సింగ్‌లో 440 వోల్టుల విద్యుత్తు సరఫరా అయిందని, ఫెన్సింగ్ తగలడంతో విద్యార్థులు చనిపోయినట్లు భావిస్తున్నారు.
''ఘటన తర్వాత కంచెకు ఇచ్చిన విద్యుత్తు సరఫరా తొలగించాం. మోటారుకు తీసుకున్న విద్యుత్తు కనెక్షన్‌ను ఫెన్సింగ్‌కు అక్రమంగా వినియోగించినందుకు సదరు రైతుపై భారత విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 135 కింద పోలీసులకు ఫిర్యాదు చేశాం'' అని విద్యుత్ శాఖ ఇబ్రహీంబాగ్ డీఈ రమేశ్ చంద్ర బీబీసీతో చెప్పారు.
ఫెన్సింగ్‌లకు విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడం నేరమని స్థానిక సర్పంచులు, ఎమ్మెల్యే, ఎంపీ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అధికారి వివరించారు.
పదుల సంఖ్యలో మరణాలు
తెలంగాణలో విద్యుత్తు ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు) 181 మంది చనిపోయినట్లు విద్యుత్తు శాఖ ప్రకటించింది. వీరిలో 151 మంది కంచెలకు ఇచ్చిన విద్యుత్తు సరఫరా కారణంగానే మృతిచెందినట్లు అధికారులు చెప్పారు.
పొలాల్లోకి అడవి పందులు, ఇతర వన్యప్రాణులు వస్తున్నాయనే ఉద్దేశంతో రైతులు పొలాల చుట్టూ కంచెలు వేస్తుంటారు. కొందరు రైతులు సోలార్ విద్యుత్తు కనెక్షన్ ఇస్తుంటారు. మరికొందరు నేరుగా విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంతో ఆ విషయం తెలియని అటుగా వెళ్లేవారు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నారు.
సోలార్ ఫెన్సింగ్‌తో ఎక్కువ ప్రమాదం ఉండదని, నేరుగా విద్యుత్తు సరఫరా జరిగితేనే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. విద్యుత్తు కనెక్షన్‌ను ఫెన్సింగ్‌కు వినియోగించకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వివరిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























