క్లాస్ రూమ్‌లో రెండుగంటలపాటు గాయాలతో పడి ఉన్న ఆరేళ్ల బాలిక.. అబ్జర్వేషన్ హోమ్‌కు 8ఏళ్ల బాలుడు

హరియాణా, పోలీసులు, స్కూలు విద్యార్ధులు, జువనైల్ యాక్ట్
    • రచయిత, నవజోత్ కౌర్
    • నుంచి, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

హరియాణాలోని పంచకులలో ఒక స్కూల్ క్లాస్‌రూమ్‌లో 6 ఏళ్ల బాలికపై 8 ఏళ్ల బాలుడు దాడి చేశాడు.

ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, వాచ్‌మెన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు ఈ సంఘటన 2026 అక్టోబర్ 28న జరిగింది.

జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 లోని సెక్షన్ 75, భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 125(బి) కింద ఈ కేసు నమోదైంది.

పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం పంచకులలోని ఓ స్కూల్లో 2026 అక్టోబర్ 28న మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడు మొదటి అంతస్తులోని ఒక గదిలో బాలికను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆ చిన్నారికి బలమైన గాయాలయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బాలిక తండ్రి ఏం చెప్పారు?

పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, టీచర్లు, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా గాయపడిన బాలిక సుమారు రెండు గంటల పాటు అదే గదిలోనే పడి ఉందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.

"అక్టోబర్ 28న స్కూల్ వదిలిన తర్వాత కూడా మా అమ్మాయి కనిపించలేదు. మేము స్కూల్ అంతా వెతికాం. అక్కడున్న ఎవరికీ పాప ఎక్కడుందో తెలియదు" అని బాలిక తండ్రి బీబీసీతో చెప్పారు.

"ఆ తర్వాత ఒక అబ్బాయి వచ్చి పాప పై అంతస్తులోని క్లాస్‌రూమ్‌లో ఉందని చెప్పాడు. నేను అక్కడికి వెళ్లేసరికి ఆ గదికి తాళం వేసి ఉంది. తాళం తీసి మా అమ్మాయిని బయటకు తీసుకొచ్చాం" అని ఆయన వివరించారు.

గాయపడిన బాలికకు మొదట స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందించిన తర్వాత చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ఎడ్యుకేషన్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, ఒంటిపై చాలా గాయాలున్నాయి.

అయితే బాలిక ఆరోగ్యంపై ఆసుపత్రి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

హరియాణా, పోలీసులు, స్కూలు విద్యార్ధులు, కేసు, జువనైల్ యాక్ట్

పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?

"పాప పీజీఐలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. ఈ కేసులో 8 ఏళ్ల మైనర్ బాలుడు ఉన్నాడు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద నిపుణులు ఆ బాలుడిని పరిశీలిస్తున్నారు. వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి" అని పంచకుల డీసీపీ అదితి సింగ్ ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.

స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

భారత చట్టాల ప్రకారం 8 ఏళ్ల పిల్లాడికి శిక్ష వేయలేరని జైలుకు పంపడం కుదరదని పంచకుల డీసీపీ (క్రైమ్) అమరీందర్ సింగ్ చెప్పారు.

ఇలాంటి కేసుల్లో శిక్షల కంటే పిల్లాడికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్చడానికే ప్రాధాన్యం ఇస్తారన్నారు.

అందుకే బాలుడి మానసిక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం జువెనైల్ జస్టిస్ బోర్డు ఆ పిల్లాడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపిందని చెప్పారు.

హరియాణా, పోలీసులు, స్కూలు విద్యార్ధులు, కేసు, జువనైల్ యాక్ట్

విద్యాశాఖ మంత్రి, హరియాణా మానవ హక్కుల కమిషన్ ఏమన్నాయి?

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హరియాణా ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేసింది.

విచారణలో ఎవరి తప్పు తేలినా కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ మంత్రి మహిపాల్ దండా హెచ్చరించారు.

మరోవైపు హర్యానా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి పంచకుల జిల్లా విద్యాధికారి నుంచి పూర్తి నివేదిక కోరింది.

టీచర్ల డ్యూటీ వివరాలు, సీసీటీవీ ఫుటేజీ, అటెండెన్స్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది.

కమిషన్ చైర్‌పర్సన్ తృప్తి హరిపాల్ షియోరన్ బాలిక కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.

హరియాణా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ లలిత్ బాత్రా కూడా స్కూల్‌ను పరిశీలించారు.

సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవని అన్నారు.

విద్యాశాఖ కూడా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)