ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ అరబ్ పార్టీల మద్దతు ఎందుకు తీసుకోవడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌లోని యూదుల నేతృత్వంలోని చాలా రాజకీయ పార్టీలు, అరబ్ పార్టీల మద్దతుపై ఆధారపడకుండా ఉంటానికి ప్రయత్నిస్తాయి.
ఈ భావన వెనుక ఎన్నికలలో ఓటమి భయం, ఇజ్రాయెల్ జాతీయ గుర్తింపు, భద్రతా విధానాలపై భేదాభి ప్రాయాలు కారణంగా ఉన్నాయి.అరబ్ పౌర ప్రతినిధులను రాజకీయంగా దూరం పెట్టే ధోరణి కూడా ముఖ్యమైన కారణంగా ఉంది.
అయితే, అన్ని పార్టీలూ ఒకే అభిప్రాయంతో లేవు. కొంతమంది యూదు ప్రతిపక్ష నాయకులు అరబ్ పార్టీలతో సహకారం తప్పు కాదంటున్నారు. 2021లో ఒక అరబ్ పార్టీ ప్రభుత్వంలో కూడా చేరింది.
ఈ మొత్తం వివాదంలో అత్యంత కీలకమైన అంశం రాజకీయ చట్టబద్ధత. అంటే.. యూదులు నేతృత్వంలోని పార్టీలు అరబ్ పార్టీలను కేవలం పార్లమెంట్‌కు ఎంపికైన సభ్యులుగానే కాకుండా.. ఇజ్రాయెల్ పాలనలో చట్టబద్ధమైన రాజకీయ భాగస్వాములుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.
ఇజ్రాయెల్‌లో వివాదం కేవలం అరబ్ పార్టీలు ఒక సంకీర్ణానికి మెజారిటీ సాధించడంలో సహాయపడగలవా లేదా అనేదానిపై మాత్రమే లేదు, పరిపాలనకు వారి మద్దతును చట్టబద్ధమైన ప్రాతిపదికగా పరిగణిస్తారా లేదా అనే దాని గురించి కూడా ఉంది.

కారణాలేంటి?
అరబ్ పార్టీలతో చేతులు కలిపితే రాజకీయ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారని ఇజ్రాయెలీ పొలిటికల్ కన్సల్టెంట్, పోల్స్టర్ దాలియా షెయిండ్లిన్ పేర్కొన్నారు. అయితే, నెతన్యాహును అధికారంలో నుంచి తొలగించాలనుకునే అనేక మంది ఓటర్లు ఈ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
"నెతన్యాహును గద్దె దించడానికి ప్రతిపక్ష ఓటర్లు ఎంతగా పరితపిస్తున్నారంటే, వారు చివరికి అరబ్ పార్టీలతో చేతులు కలపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు" అని షెయిండ్లిన్ 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
'ది న్యూయార్క్ టైమ్స్‌లో' జరిగిన ఒక చర్చలో, అరబ్ ఓట్లను చట్టవిరుద్ధం చేసే లేదా సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణ ప్రక్రియ నుంచి అరబ్ పార్టీలను మినహాయించే ప్రయత్నాలను ప్రస్తావిస్తూ.. రాజకీయ వ్యూహకర్త, హారెట్జ్ సీనియర్ విశ్లేషకురాలు షెయిండ్లిన్ పలు వ్యాఖ్యలు చేశారు.
"కేవలం ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకుంటే సరిపోదు. ఈ ప్రక్రియ అర్థాన్ని నిలబెట్టుకోవడం కూడా ముఖ్యం" అని పేర్కొన్నారు.
పౌరులు తమ ఎంపీలను ఎన్నుకోగలరు, కానీ, ఇతర రాజకీయ పార్టీలు వారిని ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములుగా పరిగణించేందుకు నిరాకరిస్తే, ఎన్నికైన ప్రతినిధులుగా వారి రాజకీయ ప్రభావం చాలా పరిమితంగా ఉంటుందని ఆమె వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్టోబర్ 29న ఫైనాన్షియల్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక చర్చ , ఈ కూటమికి ఇరుపక్షాల నుంచి వ్యతిరేకత ఉందని నొక్కి చెప్పింది.
కొన్ని అరబ్ పార్టీలు 'జియోనిస్ట్ నేతృత్వంలోని' ప్రభుత్వంలో చేరడానికి ఇష్టపడటం లేదు, అదే సమయంలో యూదుల నాయకత్వంలోని పార్టీలు వారిని సంకీర్ణంలో చేర్చుకోవడానికి సంకోచిస్తున్నాయి.
ఈ చర్చలు ప్రధాన అరబ్ పార్టీలైన రామ్, జాయింట్ లిస్టు మధ్య ఉన్న విభేదాలను కూడా వెలుగులోకి తెచ్చాయి. ప్రభుత్వంలో చేరేందుకు రామ్ సుముఖంగా ఉండగా, జాయింట్ లిస్టు అంత ఆసక్తి చూపించడం లేదు.
కేబినెట్లో చేరడానికి నిరాకరించడం అంటే, ప్రత్యామ్నాయ ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి ఒక పార్టీ సాయం చేయడానికి నిరాకరిస్తోందని అర్థం కాదు.
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభన, ఎన్నికైన ప్రాతినిధ్యానికి, అధికారంలో భాగస్వామ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తోంది.
అరబ్ పార్టీల సహకారంపై తమ ఓటర్లకు ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్ష నాయకులు అతిగా ఊహించి ఉండొచ్చని దాలియా షెయిండ్లిన్ అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యూదు ఓటర్లకు కోపం వస్తుందనే భయం
అరబ్ పార్టీల మద్దతుపై ఆధారపడే ఏ ప్రభుత్వాన్నైనా బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా చేసుకోవచ్చని విపక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు. భద్రత విషయంలో బలహీనంగా ఉందని లేదా ఇజ్రాయెల్‌ను యూదు రాజ్యంగా ఉంచడానికి తక్కువ నిబద్ధతతో ఉందని ఆరోపించవచ్చని భావిస్తున్నారు.
ఈ సమస్యను నెతన్యాహు వర్గం ప్రతిపక్షాలపై ప్రధాన రాజకీయ దాడిగా వాడుకుంటోంది.
అక్టోబర్ 7, 2023న హమాస్ దాడుల తర్వాత.. ఈ ఒత్తిడి మరింత పెరిగింది.
అరబ్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏర్పడే ఏ కొత్త ప్రభుత్వాన్నైనా ఓటర్లకు ఆమోదయోగ్యంగా మార్చడం కష్టమని చాలా మంది యూదు ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇది ఒక ఎన్నికల వ్యూహానికి సంబంధించిన ఆందోళన. అంతేకానీ అరబ్ పార్టీలు లేదా అరబ్ పౌరులు సమష్టిగా హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పడానికి ఆధారం కాదు.
జాతీయ గుర్తింపు, భద్రత విషయంలోనే అసలైన విభేదాలు ఉన్నాయి..
చాలా యూదు పార్టీలు తమను తాము జియోనిస్ట్గా పరిగణిస్తున్నాయి. వారు యూదు ప్రజలకు ఇజ్రాయెల్‌ను ''జాతీయ మాతృభూమి''గా చూస్తున్నాయి.
అదే సమయంలో, అరబ్ పార్టీల ప్రతినిధులలో తమను తాము పాలస్తీనియన్లుగా భావించుకునే పౌరులు కూడా ఉన్నారు. వీరు ఇజ్రాయెల్ యూదు జాతి గుర్తింపుకు సంబంధించి కొన్ని నిబంధనలను ప్రశ్నిస్తున్నారు.
ఈ విభేధాల పరిధి పాలస్తీనా వివాదం, సైనిక చర్యలు, ఇజ్రాయెల్‌లో సమానత్వం వంటి అంశాల వరకు విస్తరించి ఉంది.
ఏ సంకీర్ణనానికైనా ఐజెన్ కోట్ షరతులు
- ఇజ్రాయెల్‌ను యూదు, ప్రజాస్వామ్య, ఉదారవాద, సమానత్వ రాజ్యంగా గుర్తించడం
- ఇజ్రాయెల్ స్వాతంత్య్ర ప్రకటనకు కట్టుబడి ఉండటం
- పౌరులందరికీ సైనిక లేదా పౌర సేవలకు మద్దతు ఇవ్వడం
- హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడం, ఈ సంస్థ గాజాలో సైనిక, పరిపాలన శక్తిగా పనిచేయడం మానుకోవాలని ఐడీఎఫ్ మాజీ చీఫ్ ఐజెన్ కోట్ షరతులు ప్రకటించారు.
ఇలాంటి షరతులు ఎంపిక చేసిన రీతిలో విశ్వసనీయతను నిరూపించుకోవడానికి పెట్టే పరీక్షలు వంటివని కొందరు అరబ్ నాయకులు భావిస్తున్నారు.
అక్టోబర్ 7వ తేదీ దారుణాలను తమ పార్టీ ఖండిస్తుందని రామ్ పార్టీ నాయకుడు మన్సూర్ అబ్బాస్ పేర్కొన్నారు. ఐజెన్కోట్ షరతులు చర్చలకు అడ్డంకి కాకూడదని కూడా ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ బహిష్కరణ, పక్షపాతం
ఈ సమస్యను కేవలం విధానపరమైన విభేదాల కోణం నుంచే చూడటం అసంపూర్ణం అవుతుంది.
ప్రభుత్వంలో అరబ్ పార్టీలను చేర్చుకోవడానికి ప్రతిపక్షం పూర్తిగా నిరాకరించడాన్ని వారు తమపై తాము విధించుకున్న ఒక జాత్యహంకార రాజకీయ పరిమితిగా అభివర్ణించారు రాజకీయ విశ్లేషకురాలు డాలియా షెయిండ్లిన్.
యూదుల దేశ పరిపాలనలో అరబ్ ప్రతినిధులను సమాన భాగస్వాములుగా అంగీకరించడాన్ని రాజకీయ వ్యవస్థలోని ఒక వర్గం వ్యతిరేకిస్తోందని ఇతర విశ్లేషణలు కూడా సూచిస్తున్నాయి.
అరబ్ పార్టీలన్నింటి వైఖరి ఒకేలా లేదు
అరబ్ కమ్యూనిటీల్లో నేర నివారణ, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలు, పురపాలక నిధులు వంటి అంశాలపై ఆచరణాత్మక సంస్కరణలను చేపట్టేందుకు సంకీర్ణ ప్రభుత్వంలో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు మన్సూర్ అబ్బాస్ నాయకత్వం వహిస్తున్న రామ్ పార్టీ తెలిపింది.
జియోనిస్ట్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో చేరేందుకు జాయింట్ లిస్టు పార్టీ నిరాకరిస్తోంది. కానీ, షరతులకు లోబడి బయటి నుంచి ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం మాత్రం ఉంది.
2021-22లో, నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ల సంకీర్ణ ప్రభుత్వంలో రామ్ పార్టీ చేరింది. అలా చేసిన మొట్టమొదటి స్వతంత్ర అరబ్ పార్టీ ఇదే. ఈ ఉదాహరణ, అరబ్ పార్టీలతో రాజకీయ సహకారం వివాదాస్పదంగా ఉన్నప్పటికీ సాధ్యమేనని నిరూపించింది.
బయట నుంచి మద్దతు ఇవ్వడం అంటే.. కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీ అధికారికంగా భాగం కాకుండా, మంత్రుల స్థానాలను తీసుకోకుండా.. పార్లమెంట్లో విశ్వాస ఓట్లు, ఇతర ముఖ్యమైన ఓట్ల సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం.

ఫొటో సోర్స్, Getty Images
అరబ్ పార్టీలపై ఆధారపడితే..
నవంబర్ 3 నాటి నివేదికల ప్రకారం, నెతన్యాహు కూటమికి 53 సీట్లు, యూదు ప్రతిపక్ష పార్టీలకు 48 సీట్లు, రెండు అరబ్ పార్టీలకు కలిపి 19 సీట్లు వచ్చాయి.
ఇజ్రాయెల్ 120 మంది సభ్యులు గల పార్లమెంటులో (క్నెస్సెట్) మెజారిటీకి 61 సీట్లు అవసరం. దీని అర్థం, ప్రస్తుత యూదుల నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సొంతంగా మెజారిటీని సాధించలేదు.
అరబ్ పార్టీలపై ఆధారపడటాన్ని నఫ్తాలి బెన్నెట్, అవిగ్డోర్ లిబర్‌మాన్ వ్యతిరేకిస్తున్నారు.
రామ్‌తో కూడిన ప్రభుత్వానికి యైర్ గోలన్ మద్దతు ఇస్తున్నారు. జాయింట్ లిస్ట్ బయటి నుంచి మద్దతు అందించగలదు.
అరబ్ పార్టీల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం కూలిపోవచ్చని, దీంతో నెతన్యాహు మునుపటి కంటే మరింత బలంగా తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం లభిస్తుందని బెన్నెట్ వాదిస్తున్నారు.
ప్రతిపక్ష నాయకులు నెతన్యాహును అధికారం నుంచి తొలగించాలని కోరుకుంటున్నారు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మద్దతు అత్యవసరం అయినప్పటికీ, అరబ్ పార్టీల మద్దతును స్వీకరించడం వల్ల తమకు ఓటర్ల నుంచి, సైద్ధాంతికపరంగా నష్టాలు వాటిల్లవచ్చని వారు భయపడుతున్నారు.
ప్రభుత్వంలో అరబ్ పార్టీలు పాల్గొనకుండా నిరోధించే చట్టపరమైన ఆంక్ష ఏదీ లేదు. వారిని మినహాయించాలనే నిర్ణయం రాజకీయమైనది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























