పోర్చుగల్ ఫుట్‌బాల్‌ ముఖచిత్రంగా మారిన క్రిస్టియానో రోనాల్డో రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కారణాలేంటి?

రొనాల్డో
ఫొటో క్యాప్షన్, 41 ఏళ్ల రొనాల్డో 23 ఏళ్ల అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.
    • రచయిత, గిలెమ్ బాలాగే
    • హోదా, బీబీసీ స్పోర్ట్స్ కాలమిస్ట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

దాదాపు నెల రోజుల కిందట క్రిస్టియానో రోనాల్డో చిరకాల ప్రత్యర్థి లియో మెస్సీ అర్జెంటీనా ప్రజల హర్షధ్వానాల మధ్య ఆటకు వీడ్కోలు పలికారు.

కానీ పోర్చుగల్ దిగ్గజం రొనాల్డో విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన కెరీర్ ముగింపు ఆశించినట్టుగా ముగియలేదు.

41 ఏళ్ల రొనాల్డో 23 ఏళ్ల అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. పోర్చుగల్ కోచ్ జార్జ్ జీసస్‌తో విభేదాలు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు.

జట్టు అనుమతి లేకుండా శిక్షణా శిబిరం నుంచి వెళ్లిపోయినందుకు రొనాల్డోకు 30 రోజుల నిషేధం, 255 యూరోల జరిమానా విధించారు. ఆ 30 రోజుల నిషేధం కూడా పూర్తయింది.

ఓ మ్యాచ్‌లో రొనాల్డోను కోచ్ జార్జ్ జీసస్ బెంచ్‌కే పరిమితం చేశారు. తర్వాతి మ్యాచ్‌లోనూ తుది జట్టులో ఆడించే ఆలోచన లేదని చెప్పారు. దీంతో రొనాల్డో జట్టు శిబిరం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కోపంతో తీసుకున్న నిర్ణయమా?

సెప్టెంబర్ 24న వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌ రొనాల్డో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. పోర్చుగల్ తరఫున 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్‌తో ఆయన తన కెరీర్‌ను ముగించారు.

రొనాల్డో సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ పోర్చుగల్‌లో పలువురు సందేశాలు పంపారు.

ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా, లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

అయితే, ఆయన కెరీర్ ముగిసిన తీరు కొంత అసంతృప్తిని మిగిల్చింది.

తర్వాతి జట్టులో రొనాల్డోకు చోటు దక్కేదా? అవకాశం ఉండేది. జట్టులోకి రావడానికి తలుపులు తెరిచే ఉన్నాయని, నిర్ణయం రొనాల్డోదేనని కోచ్ జీసస్ చెప్పారు.

కానీ ఒక విషయం స్పష్టంగా కనిపించింది. రొనాల్డో ఇకపై ప్రతి మ్యాచ్‌లోనూ ఆడే ఆటగాడిగా లేరు. తన స్థానంపై కోచ్ ప్రశ్నలు లేవనెత్తడాన్ని రొనాల్డో గతంలోనూ సులభంగా తీసుకోలేదు.

దీనిని ఆయన కోపంతో తీసుకున్న నిర్ణయంగా చెప్పవచ్చా? కొంతవరకు అవుననే చెప్పాలి. కోచ్ తన స్థానాన్ని ప్రశ్నించినప్పుడు గతంలోనూ ఆయన ఇలాగే స్పందించారు.

అయితే, ఈ ఒక్క విషయంతోనే రొనాల్డో కెరీర్‌ను అంచనా వేయలేం. సంవత్సరాలు గడిచేకొద్దీ ఆయన తన ఆటతీరును కూడా మార్చుకున్నారు.

పోర్చుగల్ జట్టుకు కోచ్‌లుగా పనిచేసిన పలువురితో రొనాల్డోకు ఇలాంటి విభేదాలే ఎదురయ్యాయి. అదే సమయంలో కోచ్‌లు, సహచర ఆటగాళ్లతో మంచి అనుబంధం కూడా కొనసాగింది.

ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే రొనాల్డో అంతర్జాతీయ కెరీర్ ఇలా ముగియడానికి గల కారణాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి.

ఫుట్‌బాల్
ఫొటో క్యాప్షన్, రొనాల్డో పిన్న వయసులో పోర్చుగల్ జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు ఆయన తీరు కాస్త భిన్నంగా ఉండేది.

యువ ఆటగాడి నుంచి పోర్చుగల్ కెప్టెన్ వరకు..

రొనాల్డో పిన్న వయసులో పోర్చుగల్ జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు ఆయన తీరు కాస్త భిన్నంగా ఉండేది. తలపై వెనక్కి తిప్పి పెట్టుకున్న టోపీ , పెద్ద సన్‌గ్లాసెస్ ధరించి ,హెడ్‌ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు వింటూ శిక్షణ శిబిరానికి వచ్చేవారు.

లూయిస్ ఫిగో, రూయ్ కోస్టా వంటి సీనియర్ ఆటగాళ్లు భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆయన టోపీ తీయడానికి ఇష్టపడేవారు కాదు.

అప్పటి కోచ్ లూయిజ్ ఫెలిపే స్కోలారీకి రొనాల్డోలో అసాధారణ ప్రతిభ కనిపించింది. కానీ ఆయన ఇంకా పరిణతి చెందలేదని, తనను తాను ఎక్కువగా చూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని భావించారు.

అందుకే అందరి ముందు రొనాల్డోను మందలించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడి, తన ప్రవర్తన మార్చుకుంటే ఒకరోజు పోర్చుగల్ జట్టుకు కెప్టెన్ అవుతావని చెప్పారు.

సొంత గడ్డపైనే తొలి నిరాశ

రొనాల్డో కెరీర్‌లో 2004లో మొదటిసారి నిరాశ ఎదురైంది.

అప్పుడు ఆయన వయసు 19 ఏళ్లు. సొంత దేశంలో జరిగిన యూరో కప్ ఫైనల్‌లో పోర్చుగల్ తరఫున ఆడారు.

లిస్బన్‌లోని ఎస్టాడియో డా లూజ్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో పోర్చుగల్ కచ్చితంగా గెలుస్తుందని అభిమానులు ఆశించారు.

కానీ గ్రీకు ప్లేయర్ ఏంజెలోస్ చారిస్టియాస్ చేసిన ఒక్క హెడర్ గోల్‌తో గ్రీస్ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది.

మ్యాచ్ ముగిసిన వెంటనే రొనాల్డో కన్నీళ్లు పెట్టుకున్నారు. మైదానంలో ఒంటరిగా ఏడుస్తున్న 19 ఏళ్ల రొనాల్డో ఫొటో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

ఆ ఓటమి ఆయనకు ఫైనల్ మ్యాచ్‌లో గెలవడం ఎంత కష్టమో నేర్పింది.

అప్పటి నుంచి విజయం సాధించాలనే పట్టుదల ఆయనలో మరింత పెరిగింది.

ఏడో నంబర్ జెర్సీ

అప్పట్లో పోర్చుగల్ జట్టులో ఏడో నంబర్ జెర్సీ లూయిస్ ఫిగో దగ్గర ఉండేది. అందుకే రొనాల్డోకు 17వ నంబర్ జెర్సీ ఇచ్చారు.

ఫిగో ఆయన జట్టులో కలిసిపోయేందుకు సాయం చేసినప్పటికీ, సులభంగా అవకాశాలు మాత్రం ఇవ్వలేదు.

2006లో ఫిగో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఏడో నంబర్ జెర్సీతో పాటు జట్టులో కీలక బాధ్యతలు కూడా రొనాల్డోకు దక్కాయి.

తండ్రి మరణవార్త తెలిసినా మ్యాచ్ ఆడిన రొనాల్డో

2005 సెప్టెంబర్‌లో రష్యాతో మ్యాచ్‌కు ముందు రొనాల్డో జీవితంలో విషాదం చోటుచేసుకుంది.

ఆయన తండ్రి మరణించిన విషయాన్ని చెప్పేందుకు కోచ్ స్కోలారీ, లూయిస్ ఫిగో కలిసి రొనాల్డో గదికి వెళ్లారు.

కావాలంటే ఇంటికి వెళ్లవచ్చని స్కోలారీ చెప్పారు. కానీ రొనాల్డో మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నారు.

తన సహచర ఆటగాళ్లు తనతో మామూలుగానే ఉండాలని కోరారు. డ్రెస్సింగ్ రూమ్‌లో కొంతసేపు బంతితో విన్యాసాలు చేస్తూ గడిపారు.

మద్యానికి బానిసైన తన తండ్రి మరణం రొనాల్డోకు ఎంతో బాధ కలిగించింది. ఆ తర్వాత స్కోలారీని ఆయన 'నాన్న' అని పిలిచేవారు.

జాతీయ జట్టు తనకు మానసికంగా అండగా నిలిచే కుటుంబంలా మారిందని ఈ ఘటన తెలియజేస్తుంది.

కోచ్‌తో విభేదాలు

ఆ తర్వాత కార్లోస్ క్వీరోజ్ కోచ్‌గా ఉన్న సమయంలో రొనాల్డోతో విభేదాలు మొదలయ్యాయి.

2010 ప్రపంచకప్‌లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోయిన తర్వాత, తన ఆటతీరు గురించి అడిగిన విలేకరులకు రొనాల్డో సమాధానం చెప్పలేదు.

దీనిపై కోచ్‌ను అడగాలని సూచించారు.

అప్పటికి జట్టులో రొనాల్డో ప్రభావం చాలా పెరిగిపోయింది.

జట్టు రోజువారీ పనితీరు, అలవాట్లలో కూడా ఆయన ప్రభావం కనిపించేది.

దీంతో కోచ్ తన మాటకు విలువ తగ్గుతోందని భావించారు.

పోర్చుగల్ ప్రజలకు రొనాల్డో ఎందుకు ప్రత్యేకం?

పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఆ దేశ ప్రజల గుర్తింపుకు ప్రతీకగా మారిందని సామాజిక శాస్త్రవేత్త జోవో నునో కోయెల్హో అభిప్రాయపడ్డారు.

ఆర్థిక ఇబ్బందులు, ఆత్మవిశ్వాసం తగ్గిన సమయంలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన ఫుట్‌బాల్ జట్టు దేశ ప్రజలకు ఎంతో ముఖ్యమైంది.

ఈ పరిస్థితుల్లో రొనాల్డో పోర్చుగల్‌కు ప్రధాన గుర్తింపుగా నిలిచారు.

అయితే ఆయన వ్యక్తిత్వంపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉండేవి.

కొందరు ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఇష్టపడితే, మరికొందరు ఆయన వ్యక్తిగత ప్రాధాన్యతకు ఎక్కువ విలువ ఇస్తారని విమర్శించేవారు.

కాలం గడిచేకొద్దీ రొనాల్డోను విమర్శించడం కూడా కష్టంగా మారిందని కోయెల్హో చెప్పారు.

ఆయనను చూసి గర్వపడినప్పటికీ ఆయన వ్యక్తిత్వంపై కొందరిలో అసంతృప్తి కూడా ఉండేదని వివరించారు.

కొందరు అభిమానులు రొనాల్డో కంటే లూయిస్ ఫిగో, యూసేబియో, పౌలో ఫుట్రే, రూయ్ కోస్టా వంటి ఆటగాళ్లను ఎక్కువగా ఇష్టపడేవారని మాజీ పోర్చుగల్ ఆటగాడు జార్జ్ ఆండ్రేడ్ చెప్పారు.

అయినప్పటికీ రొనాల్డో తమ దేశానికి చెందిన ఆటగాడు కావడం పట్ల పోర్చుగల్ ప్రజలు గర్వపడేవారు. ఆయన సాధించిన విజయాలతో మొదట్లో ఉన్న సందేహాలు క్రమంగా తగ్గాయి.

పోర్చుగల్
ఫొటో క్యాప్షన్, పారిస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గాయంతో రొనాల్డో కన్నీళ్లతో మైదానాన్ని వీడారు.

2016లో మారిన రొనాల్డో.. పోర్చుగల్‌కు తొలి యూరో కప్ అందించిన కెప్టెన్

2016లో ఫెర్నాండో శాంటోస్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రొనాల్డోలో మార్పు కనిపించింది.

నాని పక్కన సెంటర్ ఫార్వర్డ్‌గా ఆడేందుకు ఆయన అంగీకరించారు. గతంలో కోచ్ చెప్పిన సూచనలను ఇలా పాటించిన సందర్భాలు చాలా తక్కువ.

ఐస్‌లాండ్‌తో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత, శాంటోస్‌పై తనకు నమ్మకం ఉందని రొనాల్డో నానితో వ్యక్తిగతంగా చెప్పారు. అప్పటి నుంచి జట్టు సహచరులు ఆయనలో నిజమైన నాయకుడిని చూడటం మొదలుపెట్టారు.

ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీని మిస్ చేసిన తర్వాత రొనాల్డో రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. కోచ్ శాంటోస్ ఉదయం నిద్రలేచి చూసేసరికి రొనాల్డో అప్పటికే మేల్కొని ఉన్నారు.

మార్కుసిస్‌లోని శిక్షణ శిబిరంలో ఓ అభిమాని ఇచ్చిన మైక్ తీసుకుని అభిమానులతో మాట్లాడారు. పోర్చుగల్ ఇంకా ఏ టైటిల్ గెలవలేదని, విజయం సాధించాల్సి ఉందని చెప్పారు. జట్టును ముందుండి నడిపించే బాధ్యతను ఆయన ఆస్వాదించడం మొదలుపెట్టారు.

కన్నీళ్లతో మైదానం వీడినా.. జట్టుకు ధైర్యం

పారిస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గాయంతో రొనాల్డో కన్నీళ్లతో మైదానాన్ని వీడారు.

ఆ టోర్నీలో ఆయన ఆట ఆశించిన స్థాయిలో లేదు. కండరాల సమస్య కారణంగా తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించలేకపోయారు.

ఆయన మైదానం వీడిన తర్వాత నాని కెప్టెన్ బాధ్యతలు చేపట్టారు.

అయితే హాఫ్ టైమ్‌లో రొనాల్డో తనను తాను సముదాయించుకుని సహచర ఆటగాళ్లకు ధైర్యం చెప్పారు. అదనపు సమయానికి ముందు కుంటుతూనే వెళ్లి ఎడర్‌తో మాట్లాడారు.

ఎడర్ గోల్ చేస్తాడని ఆయన చెప్పారు.

అనుకున్నట్లుగానే ఎడర్ గోల్ చేసి పోర్చుగల్‌కు విజయాన్ని అందించారు.

అయితే రొనాల్డోలోని పాత స్వభావం పూర్తిగా పోలేదు. అదనపు సమయంలో మైదానం పక్కన నిలబడి ఆటగాళ్లకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. చివరకు నాలుగో అధికారి ఆయనను వెనక్కి పంపించారు.

ఇతర కోచ్‌లు కూడా ఆయన అలా వ్యవహరించడాన్ని కొంత అతిగా భావించారు.

ప్రతి మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపాలనే తపన రొనాల్డో బలం. అదే సమయంలో కొన్ని పరిమితులను అంగీకరించడం ఆయనకు కష్టంగా మారేది.

పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రను మార్చిన ఆటగాడు

రొనాల్డో 2003లో అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టినప్పుడు పోర్చుగల్ ఒక్క పెద్ద టైటిల్ కూడా గెలవలేదు.

కొందరు ఆటగాళ్లు ఒక కాలానికి ప్రతీకలుగా నిలుస్తారు. మరికొందరు దేశ ఫుట్‌బాల్ చరిత్రనే మార్చేస్తారు. రొనాల్డో రెండో కోవకు చెందిన ఆటగాడు.

2016 జులైలో జరిగిన ఆ ఫైనల్‌లో గెలవడంతో పోర్చుగల్ తొలిసారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

మూడేళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌పై హ్యాట్రిక్ గోల్స్ చేసి పోర్చుగల్‌ను తొలి నేషన్స్ లీగ్ ఫైనల్‌కు చేర్చారు. ఆ టోర్నీలోనూ పోర్చుగల్ విజేతగా నిలిచింది.

2025లో మరోసారి నేషన్స్ లీగ్ టైటిల్‌ను అందుకున్నారు. సాధారణంగా ఆటగాళ్లు రిటైర్ అయ్యే వయసులోనూ రొనాల్డో ఈ విజయం సాధించారు.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున రొనాల్డో కంటే ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడు లేడు. పోర్చుగల్ జెర్సీని ఆయన కంటే ఎక్కువసార్లు ధరించిన ఆటగాడూ లేడు.

రొనాల్డో ప్రభావంతో పోర్చుగల్ జట్టు కేవలం ప్రతిభ ఉన్న జట్టుగా కాకుండా, ప్రతి టోర్నీలో టైటిల్ కోసం పోటీ పడే జట్టుగా మారింది.

ఆయన నాయకత్వంలో పెరిగిన కొత్త తరం ఆటగాళ్లు కూడా జట్టులో ఒక ప్రత్యేక ప్రమాణాన్ని అలవాటు చేసుకున్నారు.

సామాజిక శాస్త్రవేత్త కోయెల్హో చెప్పినట్లు, ప్రపంచానికి తన ఉనికిని చాటుకోవాలనుకున్న ఓ చిన్న దేశానికి రొనాల్డో రెండు దశాబ్దాల పాటు ముఖచిత్రంగా నిలిచారు.

2016 తర్వాత రొనాల్డోపై చర్చ కూడా మారిపోయింది. ఆయన స్వార్థపరుడా అనే ప్రశ్న కంటే, పోర్చుగల్ జట్టు ఆయనపైనే అతిగా ఆధారపడుతోందా అనే ప్రశ్న ఎక్కువగా వినిపించడం మొదలైంది.

గోల్స్
ఫొటో క్యాప్షన్, పోర్చుగల్ అభిమానులు రొనాల్డోతో కలిసి పెరిగారు. ఆయన తమ దేశాన్ని గతంలో ఎన్నడూ చేరుకోని విజయాల స్థాయికి తీసుకెళ్లారు.

2018 ప్రపంచకప్‌లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో మూడు గోల్స్ చేశారు. అందులో ఒక ఫ్రీకిక్ గోల్ కూడా ఉంది. పెద్ద టోర్నీల్లో 45 ప్రయత్నాల తర్వాత ఆయన సాధించిన ఫ్రీకిక్ గోల్ ఇది. అయినప్పటికీ పోర్చుగల్ జట్టు ఉరుగ్వే చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2026 ప్రపంచకప్‌లో రొనాల్డోను ఇంకా ప్రధాన ఆటగాడిగా కొనసాగించడంపై విమర్శలు వచ్చాయి. అయితే గణాంకాల ప్రకారం అదే ఆయనకు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన కాలంగా నిలిచింది.

రాబర్టో మార్టినెజ్ కోచ్‌గా ఉన్న సమయంలో రొనాల్డో 37 మ్యాచ్‌ల్లో 28 గోల్స్ చేశారు. అంటే ప్రతి మ్యాచ్‌కు సగటున 0.756 గోల్స్ సాధించారు. ఫెర్నాండో శాంటోస్ కోచ్‌గా ఉన్నప్పుడు ఈ సగటు 0.624గా ఉంది.

పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య రొనాల్డో సేవలను గుర్తిస్తూ ప్రత్యేక సన్మానం చేయనున్నట్లు ప్రకటించింది.

ఎందుకంటే ఆయన అంతర్జాతీయ కెరీర్ ముగిసిన తీరు అభిమానులకు ఆశించిన రీతిలో వీడ్కోలు వేడుక జరుపుకునే అవకాశం ఇవ్వలేదు.

పోర్చుగల్ అభిమానులు రొనాల్డోతో కలిసి పెరిగారు. ఆయన తమ దేశాన్ని గతంలో ఎన్నడూ చేరుకోని విజయాల స్థాయికి తీసుకెళ్లారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)