పిజ్జాపై పైనాపిల్ ముక్కలు వేయడానికి నిరాకరించిన ఇటాలియన్ చెఫ్‌ తొలగింపు

పిజ్జా
    • రచయిత, సిమోన్ అట్కిన్‌సన్
    • నుంచి, క్వీన్స్‌లాండ్
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

పిజ్జాపై పైనాపిల్ ముక్కలు వేయడానికి నిరాకరించిన ఇటలీకి చెందిన చెఫ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఓ రెస్టారెంట్‌లో జరిగింది. పిజ్జాపై పైనాపిల్ ముక్కలు వేయమనడం తన సంస్కృతిని అవమానించడమేనని, తాను ఆ పని చేయనని చెఫ్ చెప్పారు.

డేవిడ్‌ తంబురెల్లాను మే నెలలో అప్పటికే మూతపడిన 'లా కోస్టా' రెస్టారెంట్‌ ఉద్యోగం నుంచి తొలగించింది.

చెఫ్ ప్రవర్తనపై యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి.

వాటిలో ఒకటి పైనాపిల్, హామ్ వేసిన పిజ్జా తయారు చేయడానికి ఆయన నిరాకరించారని.

యాజమాన్యం చెప్పిన ప్రతిదాన్ని పాటించాల్సిన అవసరం లేదని, తన సంస్కృతిని అవమానించే ఆదేశాలను తాను పాటించనని చెప్పిన చెఫ్ తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఆస్ట్రేలియాలోని ఫెయిర్ వర్క్ కమిషన్‌ను ఆశ్రయించారాయన.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం వెలువరించిన తీర్పులో కమిషన్‌.. "ఇటాలియన్‌గా పిజ్జాపై పైనాపిల్ ముక్కలు వేయడాన్ని తన సంస్కృతికి అవమానంగా భావించడం వల్లే తంబురెల్లా ఆ పనిచేయడానికి నిరాకరించారు" అని పేర్కొంది.

గత నాలుగేళ్లలో ఇలా పిజ్జాపై పైనాపిల్ వేయడానికి ఆయన నిరాకరించడం ఇది మూడోసారి అని తెలిపింది.

గతంలో కూడా తన యజమానిని కలిసి, ఇటాలియన్లకు పిజ్జాపై పైనాపిల్ వేయకపోవడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలని కోరారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రెస్టారెంట్ ఉన్న క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం ఆస్ట్రేలియాలో పైనాపిల్ సాగుకు ప్రసిద్ధి చెందింది. దేశంలో వాణిజ్యపరంగా పండించే పైనాపిల్స్ అన్నీ దాదాపుగా ఇక్కడే ఉత్పత్తి అవుతాయి.

సన్‌షైన్ కోస్ట్‌కు వచ్చే పర్యటకులు అక్కడి భారీ పైనాపిల్ పక్కన నిలబడి ఫొటోలు దిగుతుంటారు. 16 మీటర్ల ఎత్తున్న ఈ భారీ పైనాపిల్నమూనాను ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేశారు. దీనికి చారిత్రక గుర్తింపు కూడా ఉంది. ఇది ఆ ప్రాంతంలో ప్రసిద్ధ పర్యటక ఆకర్షణగా మారింది.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న భారీ పైనాపిల్
ఫొటో క్యాప్షన్, క్వీన్స్‌లాండ్ రాష్ట్రాన్ని ఆస్ట్రేలియా పైనాపిల్ ప్రధాన కేంద్రంగా పరిగణిస్తారు.

తంబురెల్లాపై ఇతర ఆరోపణలు కూడా వచ్చాయి.. అసభ్య పదజాలం ఉపయోగించడం, ఇతరులతో మాట్లాడే తీరు, పని చేసే చోట తరచూ అసహనం వ్యక్తం చేయడంవంటి ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో విధుల్లో ఉండగా, హ్యాండ్‌రైల్‌ను చేతితో కొట్టడంతో తంబురెల్లా కుడిచేతికి ఎముకలు విరిగిన ఘటనను కూడా తీర్పులో వివరించారు.

నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా కల్పించే వీసా కోసం రెస్టారెంట్ యాజమాన్యం స్పాన్సర్ చేస్తుందని టాంబురెల్లా ఆశించారు.

కానీ ఆయన ఉద్యోగం కోల్పోయిన తర్వాత వీసా ప్రక్రియను ఆ రెస్టరెంట్ నిలిపివేసింది.

కానీ గడువు దాటిన తర్వాత ఫిర్యాదు చేయడంతో అన్యాయంగా ఉద్యోగం తొలగించారన్న పిటిషన్‌ను ట్రిబ్యునల్ తిరస్కరించింది.

రెస్టరెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలియట్ ఇంగ్రామ్ డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ.. " "పిజ్జాపై ఏ పదార్థం వేయాలన్న విషయం కంటే ఈ కథలో ఇంకా చాలా ఉంది" అని చెప్పారు.

ఈ విషయంపై స్పందన కోరుతూ బీబీసీ డేవిడ్ టాంబురెల్లాను సంప్రదించింది.

మంచి నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించడం, వ్యాపార పనితీరును మెరుగుపరచడంపై తన కెరీర్‌లో దృష్టి పెట్టినట్లు టాంబురెల్లా లింక్డ్‌ఇన్ ఖాతాలో తన గురించి పేర్కొన్నారు.

మూడు నెలల క్రితం ఆయన 'చెఫ్‌లకు ఒక లేఖ' పేరుతో ఓ పోస్టు పెట్టారు. అందులో ఆహార పదార్థాలకు గౌరవం ఇవ్వాలనే అంశాన్ని ప్రస్తావించారు.

ప్రస్తుతం ఆయన బ్రిస్బేన్‌లోని మరో రెస్టారెంట్‌లో పనిచేస్తున్నట్లు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఉంది.

ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న రెస్టారెంట్ మెనూలో పైనాపిల్ లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)