ఇమ్మోర్టల్ జెల్లీఫిష్: చంపినా మళ్లీ పుట్టే ఈ జీవిలాగా మనుషులు కూడా మారొచ్చా? పరిశోధకులు ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కాటరీనా జిమ్మర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
మరణం లేని జీవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? 'టురిటోప్సిస్ డోర్‌ని' (Turritopsis dohrnii) అనే జెల్లీఫిష్లో అలాంటి అద్భుతమైన లక్షణం దాగుంది.
ఇవి తమ జీవితచక్రాన్ని వెనక్కి తిప్పి మళ్లీ యవ్వనంలోకి అడుగుపెట్టగలవు. అందుకే వీటిని ‘ఇమ్మోర్టల్ జెల్లీఫిష్’ అని పిలుస్తారు.
శాస్త్రవేత్తలు ఇప్పుడు వీటి కణ రహస్యాలను ఛేదించే పనిలో పడ్డారు. దీనిద్వారా మానవ కణాలకు కూడా ఇలాంటి పునరుజ్జీవనం ఎలా కల్పించడానికి వీలవుతుందేమోనని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గాల్వెస్టన్లోని టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీకి చెందిన సముద్ర జీవశాస్త్రవేత్త మారియా మిగ్లియెట్టా, ఈ పారదర్శకమైన చిన్న జెల్లీఫిష్‌లను చంపడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నించారు. కత్తితో కోశారు, వేడి నీటిలో ఉడకబెట్టారు, ఆకలితో మాడ్చారు, వాటి ట్యాంకుల్లో ఉప్పు ఎక్కువ వేశారు. కొన్నిసార్లు మంచి నీటిలో పడేశారు.
కానీ ఈ అద్భుత ప్రాణులు ప్రతిసారీ చావును జయించాయి.

ఎప్పటికీ యవ్వనంలో ఉండే సామర్థ్యం...
కష్టకాలం వచ్చినప్పుడు అవి ముందుకెళ్లడం ఆపేసి, తమ ట్యాంక్ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఆ తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది. ఆ జెల్లీఫిష్ ఒక కణాల ముద్దలా మారిపోతుంది. అప్పుడు దానికి పెద్ద జెల్లీఫిష్‌లకు (వీటిని మెడూసా అంటారు) ఉండే గొడుగులాంటి ఆకారం, టెంటకిల్స్ (చేతుల వంటి నిర్మాణాలు) ఏవీ ఉండవు. ఒకటి నుంచి మూడు రోజుల్లోపు, ఈ కణాల ముద్ద నుంచి 'పాలిప్' అనే జెల్లీఫిష్ తొలిదశ బయటకు వస్తుంది. ఆ పాలిప్ పెరిగి ఒక కాలనీగా ఏర్పడి, చివరికి దాని నుంచి కొత్త మెడూసాలు పుట్టుకొస్తాయి.
"చావులేని ఒక జెల్లీఫిష్ నుంచి వందల కొద్దీ కొత్త జెల్లీఫిష్‌లను సృష్టించే కాలనీ ఏర్పడుతుంది" అని మిగ్లియెట్టా వివరిస్తున్నారు.
సిద్ధాంతపరంగా చూస్తే ఈ కొత్త జెల్లీఫిష్లలో ప్రతీదీ ఇలాగే పునరుజ్జీవనం పొందగలదు. అంటే తమ వయసును వెనక్కి మళ్లించి ఎప్పటికీ యవ్వనంలో ఉండే సామర్థ్యం వాటికి ఉందని అర్థం.
టురిటోప్సిస్ డోర్‌ని జెల్లీఫిష్ ఈ విధంగా చావును ఎలా జయించగలుగుతోందో తెలుసుకోవడానికి మిగ్లియెట్టా, ఇతర శాస్త్రవేత్తలు వాటి జన్యు, పరమాణు ప్రక్రియలపై అధ్యయనం చేస్తున్నారు.
ఈ రహస్యాలను ఛేదించడం ద్వారా భవిష్యత్తులో మనుషుల్లో కూడా ఇలాంటి ప్రక్రియలను ప్రేరేపించవచ్చో లేదో తెలుసుకోవాలని వారు ఆశిస్తున్నారు. అయితే మనుషులను మళ్లీ పసిపిల్లలుగా మార్చడం వారి ఉద్దేశం కాదు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కథల్లోనే సాధ్యం. కానీ వయసు పెరగడం వల్ల వచ్చే వ్యాధులను నయం చేయడానికి, గాయాలను మాన్పడానికి మన కణాలు, కణజాలాలను మరింత యవ్వన దశకు చేర్చడం వారి లక్ష్యం.
"మానవులకు ఎదురయ్యే ప్రధాన సమస్యలైన వయసు పెరగడం, మరణం వంటి వాటికి ప్రకృతి ఒక పరిష్కారాన్ని కనుగొందన్న ఆలోచనే ఎంతో ఊరటనిస్తుంది" అని మారియా మిగ్లియెట్టా అంటున్నారు.
వయసుతో పాటు వచ్చే క్షీణతను వెనక్కి మళ్లించడమే ఈ పరిశోధన ప్రధాన లక్ష్యమని, ఇది మనుషులకు ఉపయోగపడే స్థాయికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని జాన్స్ హాప్కిన్స్కు చెందిన పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్, ఫిజీషియన్-సైంటిస్ట్ మైఖేల్ కోల్డోబ్స్కీ చెప్పారు.
1992లో ఒక ఇటాలియన్ శాస్త్రవేత్త ఈ జెల్లీఫిష్‌లను ప్రయోగశాలలో పెంచుతూ, ఒక వారాంతంలో వాటికి ఆహారం వేయడం మర్చిపోయారు. తాను తిరిగి వచ్చేసరికి అవి చనిపోయి ఉంటాయని ఆయన అనుకున్నారు. కానీ వాటికి బదులు కొత్త పాలిప్‌లు దర్శనమిచ్చాయని మిగ్లియెట్టా తెలిపారు. ఆ తర్వాత ఇటలీలోని సాలెంటో యూనివర్సిటీకి చెందిన జీవశాస్త్రవేత్త స్టెఫానో పిరైనో, వాటి పునరుజ్జీవనానికి కారణమేమిటో తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు.
సాధారణంగా పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు మూలకణాలు (స్టెమ్ సెల్స్) వృద్ధి చెంది, నాడీ కణాలు, కండర కణాలు తదితర రకాలుగా మారుతాయి. ఆ తర్వాత అవి వయసు పెరిగి చనిపోయే వరకు ఆయా కణాలుగానే ఉండిపోతాయి.
కానీ పిరైనో తన పరిశోధనలో ఒక అద్భుతమైన విషయాన్ని కనుక్కున్నారు. ఈ అమర జెల్లీఫిష్ పునరుజ్జీవనం చెందుతున్న సమయంలో వాటి కణజాలాలు 'ట్రాన్స్డిఫరెన్షియేషన్' అనే ప్రక్రియ ద్వారా మళ్లీ మూలకణాల దశకు చేరుకుంటాయి. ఆ తర్వాత అవసరమైన ఇతర రకాల కణాలుగా మారుతాయి.
ఈ జెల్లీఫిష్ సామర్థ్యం జంతు సామ్రాజ్యంలోనే ప్రత్యేకమైనది. బల్లులు, పురుగులు వంటి కొన్ని జీవులు కోల్పోయిన లేదా గాయపడిన శరీర భాగాలను తిరిగి పెంచుకోగలవు కానీ, పూర్తిగా శరీరాన్ని పసి వయస్సుకు మార్చుకోవడం వేరే ఏ జీవిలోనూ కనిపించదు.

ఫొటో సోర్స్, Alamy
"ఆ 'స్విచ్'ను కనుగొనడమే మా లక్ష్యం"
ఈ ప్రక్రియను నియంత్రించే మాలిక్యులర్ ‘స్విచ్’ను కనుగొనడమే తమ అంతిమ లక్ష్యమని కోల్డోబ్స్కీ చెప్పారు. మనుషుల్లో కూడా అలాంటి స్విచ్ ఉంటే, దాని ద్వారా మన కణాలను యవ్వన దశకు మార్చవచ్చని భావిస్తున్నారు. ఇది స్ట్రోక్, గుండెపోటు లాంటి వాటి వల్ల దెబ్బతిన్న కణజాలం వేగంగా కోలుకోవడానికి, వయసుతో పాటు వచ్చే కంటి చూపు సమస్యలు, అల్జీమర్స్ లాంటి వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
2022లో జరిగిన ఒక అధ్యయనంలో, ఈ అమర జెల్లీఫిష్ జన్యువులను వేరొక జెల్లీఫిష్ జాతితో పోల్చి చూశారు. వయసుతో పాటు వచ్చే డీఎన్ఏ నష్టాన్ని సరిచేసే ప్రోటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఈ టురిటోప్సిస్ డోర్నిలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అలాగే డీఎన్ఏను రక్షించే 'టెలోమియర్స్' అనే నిర్మాణాలను నిర్వహించే జన్యువులు కూడా ఇందులో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ టెలోమియర్స్ కుచించుకుపోతాయి. దీని వల్ల డీఎన్ఏ దెబ్బతింటుంది. కానీ వాటిని రిపేర్ చేసుకునే సామర్థ్యం ఈ జెల్లీఫిష్‌కు ఎక్కువని స్పెయిన్‌లోని ఒవిడో యూనివర్సిటీకి చెందిన విక్టర్ క్యూసాడా తెలిపారు.
మిగ్లియెట్టా తన ప్రాథమిక పరిశోధనలో, మనుషుల్లో దీర్ఘాయువుకు కారణమయ్యే కొన్ని జన్యువులు ఈ జెల్లీఫిష్లో కూడా చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ఇరు జాతుల్లోనూ కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉండవచ్చనే వాదనకు ఇది బలం చేకూరుస్తోంది. మిగ్లియెట్టా ఇప్పుడు కోల్డోబ్స్కీతో కలిసి, ఈ ప్రక్రియలను మనుషుల కణాల్లో ఎలా ప్రేరేపించవచ్చో అధ్యయనం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Davide Maggioni/Miglietta lab at Texas A&M Galveston
"ఎంతటి అమర జీవి అయినా చావును ఎదుర్కోవాల్సిందే"
మిగ్లియెట్టా ల్యాబ్‌లో ఉన్న జెల్లీఫిష్లలో కొన్ని పునరుజ్జీవనం పొందలేకపోతున్నాయి. వాటికి కూడా ఈ సామర్థ్యానికి ఒక పరిమితి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రయోగశాలలో వీటిని ఎక్కువ కాలం బతికించడం కష్టం. ఇక సముద్రంలో అయితే ఆహారం దొరకకపోవడం, ఇతర జలచరాలు వేటాడటం వంటి ఎన్నో ముప్పులు వీటికి ఉంటాయి.
"పునరుజ్జీవనం పొందగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇది చాలా సున్నితమైన జీవి. జీవితం, మరణం ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు లాంటివని ఈ జెల్లీఫిష్ మనకు గుర్తుచేస్తోంది" అని స్పెయిన్‌కు చెందిన శాస్త్రవేత్త మారియా పాస్క్యువల్-టోర్నర్ వ్యాఖ్యానించారు.
అంటే ప్రకృతిలో ఎంతటి అమర జీవి అయినా చావును ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవాల్సిందేనని ఆమె మాటల అర్థం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























