పాకిస్తాన్: మానవ హక్కుల న్యాయవాద దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష.. వీళ్లు చేసిన తప్పేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జూలియానా ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ 2024లో పాకిస్తాన్‌లో పర్యటించిన సమయంలో భద్రతా నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై మానవ హక్కుల న్యాయవాద దంపతులు ఇమామ్ మజారీ, హదీ అలీ ఛత్తాకు ఓ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింపది.
ఇస్లామాబాద్‌లోని రహదారిపై బారికేడ్లను తొలగించడం, పోలీసుల విధులను అడ్డుకోవడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఆ దంపతులు ఖండించారు.
సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను మజారీతోపాటు ఆమె భర్త ఛత్తాకు గతంలో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఆగస్టులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆ శిక్షలను నిలిపివేసినప్పటికీ, వారు జైలు నుంచి విడుదల కాకముందే పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.
గత కొన్ని నెలలుగా వారు రావల్పిండిలోని అడియాలా జైలులోనే ఉన్నారు.

తాజా కేసు ఏమిటి?
తాజా కేసు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అక్టోబర్ 25, 2024న పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు జరిగిన ఘటనకు సంబంధించినది. ఆ జట్టు భద్రతా కాన్వాయ్ కోసం కేటాయించిన రహదారి నుంచి మజారీ, ఛత్తా ఇద్దరూ బారికేడ్లను తొలగించారని, ఇస్లామాబాద్‌లోని ప్రధాన కూడలి అయిన 'జీరో పాయింట్' వద్ద పోలీసులను అడ్డుకున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఇద్దరికీ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ అధికారులను అడ్డుకున్నందుకు ఏడాది, వారిపై బలప్రయోగం చేసినందుకు అదనంగా రెండేళ్ల పాటు శిక్ష విధించారు. అన్ని శిక్షలూ ఏకకాలంలో అమలవుతాయని న్యాయస్థానం పేర్కొంది.
అలాగే, ఇద్దరికీ రెండు లక్షల పాకిస్తాన్ రూపాయల చొప్పున జరిమానా విధించింది.
ఈ విచారణ సందర్భంగా రాజ్యహింసను ఎదుర్కొన్న తాము 'మనస్సాక్షికి బందీలమని' ఆ దంపతులు చెప్పారు.
"నా భార్య పనులకు, ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకే కాకుండా, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని మేం తీసుకున్న నిర్ణయానికే నాకు ఈ శిక్ష" అని 'డాన్ న్యూస్'కు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో హాదీ అలీ పేర్కొన్నారు.
"నిరంకుశత్వానికి, అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడేవారిని, భవిష్యత్తులో నిలబడాలనుకునే వారిని భయపెట్టేందుకే మమ్మల్ని ఇలా చేస్తున్నారు" అని ఆ దంపతులు గతంలో వ్యాఖ్యానించారు.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన
ఈ తీర్పుపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దంపతులకు బహిరంగ, న్యాయబద్ధమైన విచారణకు అవకాశం కల్పించలేదని విమర్శించింది.
"ఇమాన్, హాదీలు మానవ హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్నందుకే, భావ ప్రకటనా స్వేచ్ఛను, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును ఉపయోగించుకున్నందుకే వారిని లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్ న్యాయవ్యవస్థపై ఇదొక మాయని మచ్చ" అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రాంతీయ మానవ హక్కుల సీనియర్ డైరెక్టర్ యాస్మిన్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
విచారణను జైలు లోపల నిర్వహించడం, అక్కడ వారిని బోను లాంటి నిర్మాణంలో ఉంచడం పట్ల కూడా అమ్నెస్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇటీవలి నెలల్లో ఈ దంపతులు పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు.
ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఒక కేసులో జనవరి 23న అరెస్ట్ అయినప్పటి నుంచి వీరు కస్టడీలోనే ఉన్నారు. ఆ తర్వాత రోజు సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను పాకిస్తాన్ సైబర్ క్రైమ్ చట్టం కింద వారికి 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.
సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు ఈ శిక్షలను నిలిపివేసి బెయిల్ మంజూరు చేసింది. కానీ, అదే రోజు మార్చి 2025లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం, రోడ్లను దిగ్బంధించడం వంటి ఆరోపణలపై వారిని మళ్లీ అరెస్టు చేశారు.
ఎవరీ ఇమాన్ మజారీ, హాదీ అలీ ఛత్తా?
ఇమాన్ మజారీ, హాదీ అలీ ఛత్తా ఇద్దరూ సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, బలవంతపు అదృశ్యాలకు గురైన అణగారిన వర్గాల పక్షాన పోరాడుతున్న ప్రముఖ మానవ హక్కుల న్యాయవాదులు.
ఇమాన్ మజారీ తల్లి షిరీన్ మజారీ, గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మానవ హక్కుల శాఖ మంత్రిగా పనిచేశారు.
ఈ దంపతులకు విధించిన శిక్షల పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల నుంచి దీర్ఘకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్‌లో న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల లక్ష్యంగా జరుగుతున్న దాడులపై అవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























