ఆదర్శ కుటుంబం- ఏకే 47 మూవీ రివ్యూ: వెంకటేశ్,త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్ చేసిందా?

ఆదర్శ కుటుంబం, త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనిధి, హారిక హాసిని మూవీస్
ఫొటో క్యాప్షన్, ట్రైలర్‌తో ప్రేక్షకులకు ఆసక్తిని పెంచిన ఆదర్శ కుటుంబం సినిమాహాల్లో ప్రేక్షకుల ఆసక్తిని నిలిపిందా?
    • రచయిత, జీఆర్ మ‌హర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

విక్ట‌రీ వెంక‌టేశ్, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో 22 ఏళ్ల త‌ర్వాత వ‌చ్చిన సినిమా ఆద‌ర్శ కుటుంబం, ఏకే 47.

నువ్వునాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రి సినిమాల‌కు త్రివిక్ర‌మ్ మాట‌ల ర‌చ‌యిత మాత్ర‌మే. అలా చూస్తే డైరెక్ట‌ర్‌గా వెంక‌టేశ్‌తో ఇదే మొదటి సినిమా.

ప‌దేప‌దే వాయిదా ప‌డ‌డంతో ఏకే 47పై పెద్ద‌గా బ‌జ్ లేదు.

అయితే త్రివిక్ర‌మ్ మాట‌ల‌తో ఏదో మ్యాజిక్ చేసి ఉంటాడ‌ని అంద‌రూ ఊహించారు.

దీనికి తోడు ట్రైల‌ర్ కాస్త కాన్ఫిడెన్స్ పెంచింది. మ‌రి మ్యాజిక్ జ‌రిగిందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆదర్శ కుటుంబం, త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనిధి, హారిక హాసిని మూవీస్
ఫొటో క్యాప్షన్, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్లకుండే స‌మ‌స్య‌లన్నీ ఈ సినిమాలో హీరోకీ ఉంటాయి.

క‌థ ఏమంటే చిట్టిబాబు ప్రైవేట్ ఉద్యోగి. భార్య స్వ‌ర్ణ (శ్రీ‌నిధి శెట్టి) , కూతురు సంపూర్ణ (యువినా), కొడుకు శ‌ర్వ (రాజాప్ర‌జ్వ‌ల్‌)తో ఒక చిన్న ఇంట్లో ఉంటాడు.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్లకుండే స‌మ‌స్య‌లన్నీ చిట్టిబాబుకి ఉంటాయి.

కొడుక్కి గుండె జ‌బ్బు, కూతురు ఒక మెకానిక్‌ని ప్రేమిస్తూ ఉంటుంది.

భార్య చీటీలుపాడి అప్పులు చేస్తుంటుంది.

ఈ స‌మ‌యంలో చిట్టిబాబుకు రూ.100 కోట్ల లాట‌రీ త‌గులుతుంది.

అందరిలో సెల‌బ్రిటీ అయిపోతాడు. రూ.20 కోట్ల విల్లాకి మారిపోతాడు.

ధ‌నవంతుల ఇళ్ల‌ని టార్గెట్ చేసి, వాళ్ల‌ని చంపి దోపిడీ చేసే బిహార్ ముఠా తెలంగాణ‌కు వ‌స్తుంది.

ఆ ముఠా క‌న్ను చిట్టిబాబుపై ప‌డుతుంది.

ఈ ముఠా సభ్యులు చిట్టిబాబు ఇంట్లో డ్రైవర్, వంట మనుషులగా చేరతారు.

వంద కోట్ల నోట్ల క‌ట్టలు ఇంటికి వ‌చ్చిన రాత్రి ఏం జ‌రిగింది?

క‌రుడుగ‌ట్టిన బిహార్ ముఠా నుంచి చిట్టిబాబు త‌న కుటుంబాన్ని ఎలా ర‌క్షించుకున్నాడు? ఇది మిగ‌తా క‌థ‌.

ఆదర్శ కుటుంబం, త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనిధి, హారిక హాసిని మూవీస్
ఫొటో క్యాప్షన్, ఫ‌స్టాఫ్ కామెడీతో స‌ర‌దాగా సాగుతుంది. స‌త్య బాగా ప్ల‌స్ అయ్యాడు.

త్రివిక్ర‌మ్ సినిమా అంటే జ‌న‌ర‌ల్‌గా కామెడీని కోరుకుంటాం. అదీ డైలాగ్ కామెడీ.

పంచ్‌లు, ప్రాస‌లు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కామెడీ కూడా ఉంది.

అయితే ఆయ‌న సినిమాల్లో క‌నిపించే మ్యాజిక్ మిస్ అయ్యింది.

క్యారెక్ట‌రైజేష‌న్ లేదు. స‌గం సినిమా ప్రేక్ష‌కుని మిస్‌లీడ్ చేయ‌డానికే ఉంటుంది.

క్రైమ్‌కి , హింసను క‌ల‌ప‌డం ఈ మ‌ధ్య చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అదే. అయితే కామెడీ అద‌నం.

ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో హింస అతిగా ఉన్నా, మిగ‌తా చోట్ల లేదు. అదో ఊర‌ట‌.

వెంక‌టేశ్‌కు ఇలాంటి రోల్స్ టైల‌ర్ మేడ్‌.

అయితే దృశ్యం సినిమాకి బిహార్ గ్యాంగ్‌ని క‌లిపి చూసిన‌ట్టుగా ఉంటుంది.

దృశ్యంలో హీరో తెలివి, పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ మ‌న‌ల్ని థ్రిల్‌కి గురి చేస్తాయి.

కానీ ఏకే 47లో హీరో ఇంటెలిజెన్సీ ఉండ‌దు.

ఎస్పీ నారా రోహిత్ సీసీ కెమెరాలు చూడ‌డం త‌ప్ప చేసిందేమీ ఉండ‌దు.

ఆదర్శ కుటుంబం, త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనిధి, హారిక హాసిని మూవీస్
ఫొటో క్యాప్షన్, ఈ సినిమాలో నటీనటుల న‌ట‌న‌లో ఎవ‌రికీ పేరు పెట్టాల్సిన పని లేదు

ఫ‌స్టాఫ్ కామెడీతో స‌ర‌దాగా సాగుతుంది. స‌త్య బాగా ప్ల‌స్ అయ్యాడు.

ఇంట‌ర్వెల్ సీన్ గూస్‌బంప్స్‌. అయితే సెకండాఫ్ పూర్తిగా నెమ్మ‌దించి, క‌థ ఇష్టానుసారం వెళ్లి గంద‌ర‌గోళ పెడుతుంది.

హీరో ప్లాష్‌బ్యాక్ కూడా థ్రిల్లింగ్ అనిపించ‌దు. త్రివిక్ర‌మ్ పెన్ మ‌రీ పూర్‌గా ఉంది.

క్లైమాక్స్ కూడా రైల్లో ఫైటింగ్ కిల్ సినిమాని గుర్తు తెస్తుంది.

దీనికి తోడు ఈ మ‌ధ్య వ‌చ్చిన అర్జున్ సినిమా బ్లాస్ట్ కొంచెం నీడ‌లా కనిపిస్తూ ఉంటుంది.

త్రివిక్ర‌మ్ గ‌త సినిమాల బ‌లం ఎమోష‌న్‌. గుంటూరు కారంలో తల్లీకొడుకులు, అల‌వైకుంఠ‌పురంలో హీరోకి, కుటుంబానికి ఉన్న బంధం, అత్తారింటికి దారేదిలో అత్త‌తో అనుబంధం.

అయితే ఆయ‌న త‌న జాన‌ర్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి టోట‌ల్‌గా క్రైమ్ కామెడీ ప్ర‌య‌త్నించాడు.

అయితే అది అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే వ‌ర్కౌట్ అయ్యింది.

ఫ‌స్టాఫ్‌లో వెంక‌టేశ్, శ్రీ‌నిధి శెట్టి మ‌ధ్య వ‌చ్చే కొన్ని సీన్స్‌లో హాస్యం పండినా, కొన్ని చోట్ల బ‌ల‌వంతంగా న‌వ్వించిన‌ట్టు ఉంది.

లాజిక్‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టి, ప్రేక్ష‌కుడు చూడాలి. వంద కోట్ల లాట‌రీ , బండిల్స్ కొద్ది డ‌బ్బు ఇంటికి రావ‌డం.

వెర్రి వెంగ‌ళప్ప త‌ర‌హా డీఎస్పీ రావు ర‌మేష్‌, బందిపోట్ల ముఠా, ఏదీ కామన్‌సెన్స్‌కి అంద‌దు.

మిగ‌తా ఎవ‌రైనా తీస్తే, స‌రే కానీ , త్రివిక్ర‌మ్ లాంటి తెలివైన ద‌ర్శ‌కుడు తీయ‌డ‌మే కొంచెం ఆశ్చ‌ర్యం.

న‌ట‌న‌లో ఎవ‌రికీ పేరు పెట్టాల్సింది లేదు కానీ, క‌థలోనే బ‌లం లేదు.

ఇలాంటివి అన్ని భాష‌ల్లో చాలా వ‌చ్చాయి.

కాసిని పంచ్‌, ప్రాస డైలాగ్‌లు లేక‌పోతే త్రివిక్ర‌మ్‌లో విష‌యం అయిపోయిందా? అనే సందేహం కూడా వ‌స్తుంది.

త‌మ‌న్ బీజీఎం పాట‌లు ఎక్క‌డా మెప్పించ‌లేదు. ఫొటోగ్ర‌ఫీ చాలా బావుంది. సెకండాఫ్ నిడివి త‌గ్గించి ఉండాల్సింది.

నివేదాపేతురాజ్ మ‌రీ అంత ప్రాధాన్యం లేని పాత్ర ఎందుకు ఒప్పుకుందో.

డింపుల్ హాయ‌తి ఐటం సాంగ్ ఒక స్పీడ్ బ్రేక‌ర్‌.

డెకాయిట్ గ్యాంగ్‌గా న‌టించిన వాళ్లు చంప‌డానికి లేదా చ‌చ్చిపోవ‌డానికో వ‌స్తారు కాబ‌ట్టి వాళ్ల గురించి చెప్పాల్సింది లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఆదర్శ కుటుంబం, త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనిధి, హారిక హాసిని మూవీస్
ఫొటో క్యాప్షన్, త్రివిక్రమ్, వెంకటేశ్ కాంబో అంటే ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది

ప్ల‌స్ పాయింట్స్ః

1.వెంక‌టేష్‌, శ్రీ‌నిధి న‌ట‌న‌

2.స‌త్య కామెడీ

3.ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌

మైన‌స్ పాయింట్స్ః

1.సెకండాఫ్

2.బ‌ల‌హీన‌మైన స్క్రీన్ ప్లే

3.సంగీతం

ఫైన‌ల్‌గా అంచ‌నాలు లేకుండా కాసేపు న‌వ్వుకోడానికి చూడొచ్చు. గురూజీ బాగా త‌గ్గాడు.

(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)