ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?

ఏపి బిహార్ పోలిక
ఫొటో క్యాప్షన్, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల అంశం ఏపీలో పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది.

''ఏపీని దక్షిణాది బిహార్‌గా మార్చేశారు'' అంటూ ట్రోలింగ్, విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.‌

హింసాత్మక ఘటనల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఏపీ, బిహార్ మధ్య పోలికలు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే, అసలు ఆంధ్రప్రదేశ్, బిహార్ మధ్య వ్యత్యాసాలు ఏం ఉన్నాయనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది.

దీంతో బీబీసీ కొన్ని అంశాలను పరిశీలించింది. ఇందులో కొన్ని విషయాల్లో బిహార్ మెరుగ్గా ఉందని నివేదికలు చెబుతుండగా.. మరికొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా కనిపించింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ, బిహార్, ఆర్ధిక రంగం, పోలికలు
ఫొటో క్యాప్షన్, అధికారిక గణాంకాల మేరకు ఏపీ కంటే బిహార్‌లోనే నేరాలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి.

క్రైం రేటు

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల అంశం ఏపీలో పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది. హింసాత్మక ఘటనల తర్వాత ఏపీలోని అనేక జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

మొత్తంగా బిహార్, ఏపీ మధ్య క్రైం రేటు ఎలా ఉందన్నది బీబీసీ పరిశీలించింది.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం, 2024లో ఏపీలో 1,16,076 కేసులు నమోదయ్యాయి.

ఇదే ఏడాది బిహార్‌లో 2,38,753 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 2023లో 1,53,867 కేసులు, 2022లో 1,58547 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ చెబుతోంది.

బిహార్లో 2023లో 2,31,627 కేసులు, 2022లో 2,11,079 కేసులు నమోదయ్యాయని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

అధికారిక గణాంకాల మేరకు ఏపీ కంటే బిహార్‌లోనే నేరాలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి.

2024 నాటికి బిహార్ జనాభా 12.92కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ జనాభా 5.34కోట్లు అని ఎన్సీఆర్బీ నివేదికలో ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.

అలాగే కాగ్నిజబుల్ అఫెన్సెస్ (పోలీసు అధికారులు వారెంట్ అవసరం లేకుండా నేరుగా అరెస్టు చేయదగ్గ తీవ్రమైన నేరం) రేటు పరంగా చూస్తే, ఇది ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదికలో ప్రస్తావించింది.

2024 సంవత్సరానికి ఈ తరహా నేరాల రేటు ఏపీలో 217.4శాతం ఉండగా, బిహార్‌లో 184.8గా ఉందని ఎన్సీఆర్బీ డాటా చెబుతోంది.

ఏపీ, బిహార్, ఆర్ధిక రంగం, పోలికలు
ఫొటో క్యాప్షన్, ఏపీలో అక్షరాస్యత శాతం 'అక్షరాంధ్ర' కార్యక్రమం ద్వారా బాగా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.

అక్షరాస్యత శాతం

అక్షరాస్యత శాతం విషయంలో బిహార్, ఏపీ మధ్య కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. అక్షరాస్యతలో బిహార్ కంటే ఏపీ వెనుకబడి ఉందంటూ నివేదికలు వచ్చాయి.

2025 జులై 21న కేంద్ర విద్యా శాఖ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో బిహార్ కంటే అక్షరాస్యత విషయంలో ఏపీ వెనుకబడి ఉందని ప్రకటించింది.

ఏడేళ్ల కంటే పైబడిన వయసుగల వారిలో అక్షరాస్యత విషయంలో పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) 2023-24 వార్షిక నివేదిక మేరకు గణాంకాలను కేంద్రం ప్రకటించింది.

దీని ప్రకారం, ఏపీలో 72.60 శాతం అక్షరాస్యతశాతం నమోదు కాగా, బిహార్ లో 74.3శాతంగా ఉంది.

పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) 2025 (జనవరి నుంచి డిసెంబరు) నివేదికను బీబీసీ పరిశీలించింది. ఇది ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

దీని ప్రకారం, అక్షరాస్యత ఏపీలో 71.4శాతం ఉండగా, బిహార్‌లో 73.1 శాతం నమోదు అయ్యింది.

అయితే, ఏపీలో అక్షరాస్యత శాతం 'అక్షరాంధ్ర' కార్యక్రమం ద్వారా బాగా పెరిగిందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.

ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఏడాది సెప్టెంబరు 2న 'ఎక్స్'లో వెల్లడించిన వివరాల మేరకు, 2024లో 72.6శాతంగా ఉన్న అక్షరాస్యత శాతం 2026నాటికి 82.1శాతానికి పెరిగిందని చెప్పారు.

''నేను విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన 2024నాటికి భారత్‌లో అక్షరాస్యత శాతం విషయంలో అట్టడుగున ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండేది. ఇప్పుడు మార్పు తీసుకువచ్చి చరిత్ర సృష్టించాం. అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా 25లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాం. 2027 సెప్టెంబరు నాటికి వందశాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం'' అని నారా లోకేశ్ 'ఎక్స్'లో పేర్కొన్నారు.

ఏపీ, బిహార్, ఆర్ధిక రంగం, పోలికలు
ఫొటో క్యాప్షన్, తలసరి ఆదాయం విషయంలో బిహార్ కంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుంది.

తలసరి ఆదాయం

తలసరి ఆదాయం విషయంలో బిహార్ కంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుంది.

2011-12 ప్రామాణిక సంవత్సరంగా 2025-26 భారత ఎకనమిక్ సర్వే ప్రకారం, ఏపీ తలసరి ఆదాయం రూ.2,66,240గా ఉంది.

అదే బిహార్ విషయానికి వస్తే రూ.69321గా మాత్రమే ఉంది. ఈ విషయంలో బిహార్ కంటే ఏపీ దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది ఆగస్టులో విడుదల చేసిన గణాంకాలూ ఇవే సూచిస్తున్నాయి.

జీఎస్డీపీ

ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 2026-27 (ప్రస్తుత ధరల ప్రకారం) రూ.19.75 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించింది.

రాష్ట్ర పన్నుల ద్వారా 2025-26 సవరించిన అంచనాల మేరకు రూ.98,025 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది. పన్నేతర ఆదాయం ఇదే కాలానికి రూ.14,324 కోట్లు సమకూరింది.

ఇక బిహార్ విషయానికి వస్తే, 2026-27 (ప్రస్తుత ధరల ప్రకారం) జీఎస్డీపీ రూ.13.1లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నట్లు బిహార్ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రస్తావించింది.

బిహార్ లో రాష్ట్ర పన్నుల ద్వారా 2025-26 సంవత్సరానికి రూ.59,520 కోట్ల ఆదాయం రాగా, పన్నేతర ఆదాయం కేవలం రూ.8221కోట్లుగా ఉంది.

లింగ నిష్పత్తి

2011 జనాభా లెక్కల ప్రకారం, భారత్‌లో లింగ నిష్పత్తి 943గా ఉంది. ఈ విషయంలో జాతీయ సగటు కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండగా, బిహార్‌లో జాతీయ సగటు కంటే ఇది తక్కువగా నమోదైంది. ఉమ్మడి ఏపీలో లింగ నిష్పత్తి 993గా ఉండగా, బిహార్‌లో 918గా ఉంది.

అలాగే, రిజర్వ్ బ్యాంక్ 2025-26 గణాంకాలను పరిశీలిస్తే, ఈ రెండు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో పదేళ్ల కాలంలో తగ్గుదల కనిపించింది.

2011-13 కాలానికి ఉమ్మడి ఏపీలో టీఎఫ్ఆర్ 1.8 గా ఉండగా బిహార్‌లో 3.3 గా ఉంది.

2021-13 కాలానికి ప్రస్తుత ఏపీలో టీఎఫ్ఆర్ 1.5 గా ఉంటే, బిహార్‌లో 2.9 గా నమోదైంది.

2016-20 మధ్య నమోదైన కాలానికి బిహార్‌లో సగటు జీవితకాలం 69.5 సంవత్సరాలుండగా, ప్రస్తుత ఏపీలో 70.6 సంవత్సరాలుగా ఉంది.

ఏపీ, బిహార్, ఆర్ధిక రంగం, పోలికలు
ఫొటో క్యాప్షన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీకి వచ్చాయని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది.

పెట్టుబడులు

పెట్టుబడుల పరంగా భారత్‌లో ఐదు రాష్ట్రాలు (గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు) 'టాప్ పెర్ఫార్మర్స్' జాబితాలో ఉన్నట్లు నీతి ఆయోగ్ చెబుతోంది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 'ఫ్రంట్ రన్నర్స్' జాబితాలో ఉండగా, బిహార్ 'ఎమర్జింగ్ పెర్ఫార్మర్స్' కేటగిరీలో ఉంది.

మౌలిక వసతులు, ఆర్థిక అంశాలు, నిబంధనలు, వ్యాపార వాతావరణం, వనరులు తదితర అంశాలను బట్టి 50 మార్కులకు పైగా సాధిస్తే టాప్ పర్ఫార్మెర్స్, 45-5౦ మధ్య ఉంటే ఫ్రంట్ రన్నర్స్, 40-45 మధ్య ఉంటే ఎమర్జింగ్ పర్ఫార్మెర్స్, 40 కంటే తక్కువగా ఉంటే అస్పైరింగ్ స్టేట్స్‌గా నీతి ఆయోగ్ పరిగణిస్తోంది.

ఆ ప్రకారం, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ 48.7 స్కోర్‌తో ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలో నిలిచింది. 41.2 స్కోర్‌తో బిహార్ 'ఎమర్జింగ్ పెర్ఫార్మర్'గా ఉంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీకి వచ్చాయని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది.

ఇదే కాలంలో బిహార్‌కు 0.16 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో బిహార్‌తో పోల్చితే ఏపీ చాలా ముందు వరుసలో ఉంది.

ఇక, మౌలిక వసతుల పరంగా 25 మార్కులకు గాను ఆంధ్రప్రదేశ్‌కు 12.1, బిహార్‌కు 10.9 స్కోర్ దక్కినట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తోంది.

''ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భిన్నమని గుర్తించాలి''

భారత్‌లో పోటీ పరంగా చూసినప్పుడు రెండు రాష్ట్రాలను పోల్చి చూసే సంప్రదాయం చాలా సందర్భాల్లో కనిపిస్తుంటుందని విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఆర్థిక శాస్త్ర అధ్యాక్షుడు అనంత్ బీబీసీతో చెప్పారు.

''రెండు రాష్ట్రాల మధ్య పోలిక రావడం సహజం. కానీ పోల్చుతున్న విధానాన్ని చూడాలి. భారత్‌లో ప్రతి రాష్ట్రానికీ అనుకూలతలున్నాయి, ప్రతికూలతలున్నాయి. ఆ నేపథ్యంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే భిన్నమైనదిగా గుర్తించాలి'' అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)