పాకిస్తాన్ ప్రధానిపై ట్రోలింగ్- 'టాస్ గెలిచినా అభినందనలు చెబుతారేమో' అంటూ వ్యాఖ్యలు చేస్తున్న యూజర్లు

పాకిస్తాన్, షాబాజ్ షరీఫ్
ఫొటో క్యాప్షన్, హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాకిస్తాన్ విజయం పట్ల ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ పోరు అంటేనే ఉత్కంఠ, తీవ్ర పోటీ గుర్తుకొస్తాయి. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ మాత్రం భిన్నమైన వాతావరణంలో సాగింది.

2026 హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో ఈ మ్యాచ్ జరిగింది. ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నీలకు భిన్నంగా, ఆరుగురు ఆటగాళ్లతో కూడిన జట్లు పాల్గొనే ప్రత్యేక క్రికెట్ పోటీ ఇది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రస్థాయి జట్ల మధ్య జరిగే సాధారణ పోటీలకు ఈ మ్యాచ్ పూర్తిగా భిన్నమైనది.

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాకిస్తాన్ విజయం పట్ల ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో జట్టుకు అభినందనలు తెలిపారు.

"హాంకాంగ్ సిక్సెస్ 2026లో తొలి మ్యాచ్‌లో భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన మా ఆటగాళ్లకు అభినందనలు. ఇది మంచి క్రికెట్ పోరు" అని షరీఫ్ తన పోస్టులో పేర్కొన్నారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీతో పాటు ఆయన బృందాన్ని కూడా ప్రధాని ప్రశంసించారు. ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇవ్వడం, వారికి అవసరమైన మద్దతు అందించడంలో చేసిన కృషిని కొనియాడారు. అయితే, ఈ విజయాన్ని ప్రధాని బహిరంగంగా ఒక సంబరంగా ప్రకటించడం పలువురికి నచ్చలేదు. ఇది కేవలం హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మాత్రమేనని, ప్రపంచ కప్ కాదని గుర్తుచేస్తూ క్రికెట్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"హాంకాంగ్ సిక్సెస్ ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించినందుకు అభినందనలు. ఇక విజయోత్సవ ర్యాలీకి సిద్ధంకండి" అంటూ మాజీ భారత క్రికెటర్ అజయ్ జడేజా పేరుతో ఉన్న ఓ పేరడీ ఖాతా నుంచి పోస్టు వైరల్ అవుతోంది.

సీనియర్ క్రీడా పాత్రికేయుడు విక్రాంత్ గుప్తా కూడా షరీఫ్ పోస్టును చూసి.. "నిజంగానా?" అంటూ స్పందించారు.

అఫ్గానిస్తాన్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకున్న అజ్మల్ జద్రాన్ అనే ఎక్స్ యూజర్.. "ఒకరోజు టాస్ గెలిచినా వీళ్లు పోస్టులు పెడతారేమో! అసలు పనులన్నీ ఇతరులు చూసుకుంటున్నప్పుడు ప్రధానమంత్రికి టాస్‌లు, చిన్న చిన్న మ్యాచ్‌ల గురించి పోస్టులు పెట్టడమే మిగులుతుంది" అని రాశారు.

పాకిస్తాన్ , హాంకాంగ్ సిక్సెస్
ఫొటో క్యాప్షన్, 'హాంకాంగ్ సిక్సెస్' టోర్నమెంట్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.

షాబాజ్ షరీఫ్ పోస్టుపై క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందించారు. "భారత్‌ను ఓడించామంటూ ప్రకటించాలనే తొందరలో కనీసం వాస్తవాలను తనిఖీ చేయడం కూడా మర్చిపోయారు. పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో యూఏఈ చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్ ఏ స్థాయి క్రికెట్ ఆడుతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ దేశ ప్రధాని హాంకాంగ్ సిక్సెస్ గురించి పోస్టులు పెడుతున్నారు" అని రాశారు.

"దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఆపండి. గత ఐదేళ్లలో ఐసీసీ నిర్వహించిన ప్రతి టోర్నీలోనూ భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. అలాంటిది పెద్దగా ప్రాధాన్యం లేని హాంకాంగ్ సిక్సెస్ విజయాన్ని ఇలా సంబరంగా ప్రకటించడం ఏమిటి?" అని 'లాహోరీ గై' అనే యూజర్ ప్రశ్నించారు.

పురుషుల రెండు ప్రధాన ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ 8-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌కు 2021లో మాత్రమే విజయం దక్కింది.

క్రీడా పాత్రికేయుడు గౌరవ్ కల్రా కూడా షరీఫ్ పోస్టుపై స్పందిస్తూ, "ఇది చాలా పెద్ద విజయం. నీరజ్‌ను ఓడించి అర్షద్ ఒలింపిక్ స్వర్ణం గెలిచినంత పెద్దది. బహుశా అంతకంటే పెద్దదేమో. కొన్నిసార్లు మనమంతా ఏదో సిమ్యులేషన్‌లో జీవిస్తున్నామేమో అనిపిస్తుంది" అని రాశారు.

"ఓ దేశ ప్రధాని హాంకాంగ్ సిక్సర్స్ గురించి మాట్లాడుతున్నారు" అని మరో పాత్రికేయుడు భరత్ రామరాజ్ తెలిపారు.

"హాంకాంగ్ సూపర్ సిక్సెస్ పెద్దగా ప్రాధాన్యం ఉన్న టోర్నీ కాదని ఎవరైనా ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు చెప్పాలి. దయచేసి జట్టును అభినందించడం ఆపండి" అని పాత్రికేయుడు అజీమ్ సిద్ధిఖీ రాశారు.

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమాని శ్రీని మామా అనే యూజర్ "ఇదేం అభినందన?" అంటూ స్పందించారు.

చివరగా ఓ అభిమాని.. ప్రధాని షరీఫ్ పెట్టిన పోస్టు పేరడీ ఖాతా నుంచి వచ్చింది కాదని సరదాగా వ్యాఖ్యానించారు. "లేదు.. ఇది పేరడీ ఖాతా కాదు" అని రాశారు.

పాకిస్తాన్ , హాంకాంగ్ సిక్సెస్
ఫొటో క్యాప్షన్, హాంకాంగ్ సిక్సెస్ మ్యాచ్ సందర్భంగా కృణాల్ పాండ్యా, రాహుల్ త్రిపాఠీ

భారత్‌కు మరో ఓటమి

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాలంటే భారత్ తన గ్రూపులో అగ్రస్థానంలో నిలవాల్సి ఉంది.

శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు యూఏఈ చేతిలో ఓటమి పాలైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)