జస్టిస్ ఫర్ జెహన్నే: 15వ శతాబ్దపు లైంగిక దాడి బాధితురాలి న్యాయపోరాటం ఏమైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లౌరీ క్లార్క్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
హెచ్చరిక: ఈ వ్యాసంలో లైంగిక దాడికి సంబంధించి కలచి వేసే అంశాలున్నాయి.
ఫ్రాన్స్‌లోని డిజోన్ నగరంలో 1472లో ఒక మహిళ తనపై జరిగిన క్రూరమైన లైంగిక దాడి మీద చేసిన చట్టపరమైన పోరాటం గురించి ఓ కొత్త పుస్తకం వివరాలు అందిస్తోంది.
ఇది మధ్యయుగంలో మహిళల జీవితాల గురించి ఆధునిక సమాజపు అంచనాలను తలకిందులు చేస్తోంది.
అది 1472 వ సంవత్సరం. శీతాకాలంలో డిజోన్ నగరానికి కొత్తగా వచ్చిన జెహన్నే అనే మహిళ ఘోరమైన హింసను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆమె నిండు గర్భిణి.
ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని చరిత్రకారిణి, న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో హిస్టరీ ప్రొఫెసర్ సారా మెక్‌డౌగల్ తన కొత్త పుస్తకం 'జస్టిస్ ఫర్ జెహన్నే'లో వివరించారు.

ఇది మధ్యయుగపు న్యాయవ్యవస్థ గురించి మనకున్న అంచనాలను మార్చేసే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను మనకు చెబుతుంది.
ఈ దాడిపై జరిగిన విచారణ రికార్డుల ఆధారంగా రాసిన ఈ పుస్తకం ఒక మధ్యయుగపు డిటెక్టివ్ కథలా సాగుతుంది.
అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ కథకు కేంద్ర బిందువైన ఆ మహిళ ఎవరు? అనే విషయాల గురించి వివరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
జెహన్నే ఎవరు?
జెహన్నే ఈశాన్య ఫ్రాన్స్‌లోని లోరైన్‌లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఫ్రాన్స్ దక్షిణ నగరమైన డిజోన్‌కు వచ్చారు. ఆ కాలంలో గుర్తింపు అనేది స్పష్టంగా ఉండేది కాదు.
1472లో ఆమె విచారణాధికారికి తన వయస్సు "సుమారు 32 సంవత్సరాలు" అని చెప్పారు.
అప్పట్లో జనన రికార్డులు ఉండేవి కావు కాబట్టి ఎవరికీ తమ ఖచ్చితమైన వయస్సు తెలిసేది కాదు.
తాను వివాహితనని "జెహాన్ ఆఫ్ రెలాంజెస్ భార్యను" అని ఆమె పేర్కొన్నారు. ఆ కాలంలో ఒక వ్యక్తి ధరించే దుస్తులను బట్టే సమాజంలో వారికి గౌరవం దక్కేది.
సాక్షులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జెహన్నే దుస్తులు చక్కగా, హుందాగా ఉండేవి. ఆమె బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు తన బంగారు వర్ణపు జుట్టుపై జాగ్రత్తగా కప్పుకునే పొడవైన ముసుగు ఆమె ఒక గౌరవప్రదమైన వివాహిత అనే హోదాను సూచించేది.
ఆ సమయంలో డిజోన్ నగరంలో పోరాటాలు, హింసతో అంతా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. బర్గుండి ప్రభువు 'చార్లెస్ ది బోల్డ్' ఫ్రాన్స్ రాజు 'పదకొండో లూయి' మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతోంది.
రాజు సైన్యం బర్గుండి గ్రామీణ ప్రాంతాల్లోకి దూసుకురావడంతో డిజోన్ నగరంపై దాడి జరిగే ముప్పు పొంచి ఉంది.
డిజోన్ను రక్షించడానికి బర్గుండి ప్రభువు నగర గోడల చుట్టూ కిరాయి సైనికులను మోహరించారు.
అయితే చట్టాన్ని ఖాతరు చేయని ఈ క్రూర సైనికులు నగర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు.
"రాత్రి వేళల్లో ఇతరులను దోచుకోవడం, వేధించడం, డబ్బు కోసం కిడ్నాప్ చేయడానికి నిరంతరం వెదికేవారు. నగర అధికారులు దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. ఇది నగర అధికారులకు, బర్గుండి ప్రభువుకు మధ్య పెద్ద వివాదానికి కారణమైంది" అని మెక్‌డౌగల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Blaise Dubrocq/ Princeton University Press
ఆ రోజు ఏం జరిగింది?
1472 జనవరి 3 సాయంత్రం, జెహన్నే, ఆమె ఆశ్రయం పొందుతున్న ఇంటి యజమానురాలు... తమ ఇంటి తలుపును ఎవరో గట్టిగా బాదడం విన్నారు. అక్కడ ఇద్దరు స్థానిక పురుషులు నిలబడి ఆ మహిళలను తమతో రావాలని డిమాండ్ చేశారు.
వారు నిరాకరించడంతో, ఆ పురుషులలో ఒకరు సమీపంలోని ఒక హోటల్‌కు పరుగెత్తి బర్గుండి ప్రభువుకు చెందిన కొందరు కిరాయి సైనికులను పిలుచుకొచ్చారు.
ఆ పురుషులు తనను సమీపంలోని పొలానికి ఈడ్చుకెళ్లి దాడి చేశారని జెహన్నే చెప్పారు. ఆమె గర్భిణి అనే విషయాన్ని కూడా వారు లెక్కచేయలేదు. పైగా ఆమె గర్భంలో ఉన్న బిడ్డ క్రిస్టియన్ ఫాదర్‌కు పుట్టబోయే వివాహేతర సంతానమని తమకు తెలిసిందని వారు అరిచారు.
ఆ పురుషులు తనతో "శారీరక కలయిక" కోసం ప్రయత్నించారని తాను మంచులో పడి కొట్టుకుంటూ వారిని తీవ్రంగా ప్రతిఘటించానని జెహన్నే వివరించారు.
నిండు గర్భిణి కావడం, గట్టిగా ఎదురుతిరగడం వల్ల వారు తమ ప్రయత్నంలో పూర్తిగా విజయం సాధించలేకపోయారు.
వారు తనను కొట్టి వెల్లకిలా పడేశారని తన కడుపులో బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి తాను తీవ్రంగా భయపడ్డానని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు మధ్యయుగ కాలం గురించి ఆధునిక సమాజానికి ఉన్న అంచనాలకు భిన్నంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
సాధారణంగా అత్యాచారం లేదా లైంగిక దాడికి గురైన మహిళలు సమాజం నుండి బహిష్కరణకు గురవుతారని అవమాన భారంతో చివరికి వ్యభిచార కూపంలోకి వెళతారని ఫ్రాన్స్ సమాజం భావిస్తుంది.
జాక్వెస్ రోసియాడ్ రాసిన 'మెడీవల్ ప్రాస్టిట్యూషన్' (1988లో ప్రచురితమైంది) అనే ప్రసిద్ధ పుస్తకం ఆధారంగా ఈ అభిప్రాయం ఏర్పడింది.
రోసియాడ్ పుస్తకంలోని అంశాల్లో నిజానిజాల గురించి తెలుసుకోవడానికి మెక్‌డౌగల్ డిజోన్లో కిరాయి సైనికుల చేతిలో లైంగిక దాడికి గురైన పేరు తెలియని గర్భిణి గురించి ఆ పుస్తకంలో ఉన్న ఒక చిన్న ప్రస్తావనను ఆధారం చేసుకున్నారు.
ఆ మహిళ మొదట్లో అవమానంతో తన బాధను అధికారులతో పంచుకోవడానికి భయపడ్డారని, ఆమెలాంటి చాలా మంది బాధితులు చివరికి వేశ్యలుగా మారారని రోసియాడ్ రాశారు.
ఆ వివరాలు జెహన్నే కథకు సరిగ్గా సరిపోతాయి.
అయితే మెక్‌డౌగల్ ఈ కేసుపై పరిశోధన ప్రారంభించి డిజోన్ మునిసిపల్ ఆర్కైవ్స్‌లో భద్రపరిచిన 70 పేజీల పురాతన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు దానికి భిన్నమైన కథ వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
లోతైన విచారణ
జెహన్నే ఇచ్చిన సాక్ష్యంలోని వివరాలను నగర అధికారుల తరఫున పనిచేసే విచారణాధికారి 'జాక్వెస్ బొరెస్టెల్' రికార్డు చేశారు.
కిరాయి సైనికులు ఒక గర్భిణిని అపహరించి ఆమెపై దాడి చేశారనే సమాచారం అందిన వెంటనే బాధితురాలి వివరాలు, నిందితుల సమాచారాన్ని సేకరించడానికి బొరెస్టెల్ వెంటనే రంగంలోకి దిగారు.
దాడి జరిగిన మరుసటి రోజే ఆయన జెహన్నేను మొదటిసారి ఇంటర్వ్యూ చేశారు.
ఆ ఘోరమైన ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురై తన కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ ఆమె మంచంలో ఉన్నారు.
అయినప్పటికీ తనపై జరిగిన దాడి వివరాలు తనకు గుర్తున్నంత వరకు నిందితుల ఆనవాళ్లను బొరెస్టెల్కు ఆమె వివరించారు.
ఆ మరుసటి రోజే జెహన్నే ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
జెహన్నే తన కథను పంచుకోవాలని నిర్ణయించుకోవడం కాస్త అసాధారణమైన విషయం.
ఎందుకంటే నిజాయితీగా మాట్లాడటానికి అప్పట్లో ఎన్నో అడ్డంకులు, భయాలు ఉండేవి.
నేర న్యాయవ్యవస్థలో ఆ నగరానికి మంచి రికార్డు లేదు.
కిడ్నాప్, లైంగిక దాడికి అప్పట్లో మరణ శిక్ష విధించే వారు.
కానీ చాలా నేరాలపై అసలు విచారణే జరిగేది కాదు.
క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఫిర్యాదు వల్ల జెహన్నేకు వ్యక్తిగతంగా లాభమేమీ లేదు.
జెహన్నే ఇచ్చిన సమాచారంతో బొరెస్టెల్ నిందితులలోని మెజారిటీ వ్యక్తులను త్వరగానే అదుపులోకి తీసుకోగలిగారు.
విచారణలో ఆ పురుషులు జెహన్నేపై దాడి చేసినట్లు నిరాకరించారు.
దీనితో బొరెస్టెల్ ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుల ముందే జెహన్నే తనపై జరిగిన దాడిని మళ్లీ వివరించేలా చేశారు.
వారు అప్పటికీ తప్పు ఒప్పుకోకపోవడంతో నిందితుల నుంచి నిజం రాబట్టడానికి "అసాధారణ" చర్యలు తీసుకోవచ్చని మునిసిపల్ అధికారులు అంగీకరించారు.
అందులో ఒక వ్యక్తిని ప్రస్తుత 'వాటర్‌బోర్డింగ్' (ఊపిరి ఆడకుండా చేయడం) లాంటి పద్ధతిని ఉపయోగించి హింసించారు.
చివరికి, నిందితులందరూ తమ నేరాన్ని ఒప్పుకున్నారు.
వారు నేరాన్ని అంగీకరించిన ఆధారాలతో నగర అధికారులు వారికి 'మరణశిక్ష' ఖరారు చేశారు.
అయితే ఇక్కడే ఒక సమస్య ఎదురైంది.
వారు కిరాయి సైనికులు కావడం వల్ల, సాంకేతికంగా బర్గుండి ప్రభువు (డ్యూక్) పరిధిలోకి వస్తారు.
కిరాయి సైనికుల ప్రవర్తనను ఖండిస్తూ డిజోన్ నివాసితులు సురక్షితంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు డ్యూక్ అప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇప్పుడు తప్పు చేసిన వారిని బహిరంగంగా శిక్షించడానికి ఆయనకు ఒక మంచి అవకాశం దక్కింది.
మరి ఆ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటారా?

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫిర్యాదుదారురాలిపైనే విచారణ
కొద్దిసేపటి తర్వాత మునిసిపల్ అధికారులకు డ్యూక్ అధికారుల నుంచి ఒక సందేశం వచ్చింది.
నిందితులను వదిలేయాలని వారు సిఫార్సు చేశారు.
కానీ మునిసిపల్ అధికారులు దీనిని వ్యతిరేకిస్తూ కొంత సమయం గడిపేందుకు ప్రయత్నించారు.
ఈ మధ్యకాలంలో వారు జెహన్నేపై కొత్త విచారణకు ఆదేశించారు.
ఆమెను నిందితురాలిగా నిలబెట్టడం వారి ఉద్దేశం కాదు.
కానీ ఫిర్యాదుదారుగా ఆమెకు ఎంతవరకు అర్హత ఉందో తెలుసుకోవడమే వారి లక్ష్యం. బొరెస్టెల్ తన రికార్డులలో స్పష్టంగా రాసినట్లు ఆమె ఒక "ప్రూడెఫెమ్" (గౌరవప్రదమైన వివాహిత) నా లేక ఒక "చౌకబారు మహిళా" అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
జెహన్నే ఇంటి ఇరుగు పొరుగు వారితో పాటు ఆమె సమాచారం తెలిసిన ఇతరులను బొరెస్టెల్ ఇంటర్వ్యూ చేశారు.
ఆమె గౌరవప్రదమైన మహిళ అని చాలా మంది చెప్పారు .
లైంగిక దాడి జరిగిన తర్వాత ఎవరూ ఆమెను అవమానించలేదు లేదా నిందించలేదు. కానీ ఆమె మొదట బొరెస్టెల్కు చెప్పిన కథకు విరుద్ధంగా ఉన్న కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రెండేళ్ల క్రితం సమీపంలోని ఒక మఠంలో జెహన్నే మరో బిడ్డకు జన్మనిచ్చిందని ఒక పొరుగు వ్యక్తి చెప్పారు.
ఆ బిడ్డ తండ్రి పాస్టర్అని ఆ సమయంలో జెహన్నే అతను కలిసి ఒకే గదిలో ఉండేవారని తెలిసింది.
జెహన్నే తన భర్తను చూసి చాలా ఏళ్లు గడిచినట్లు కూడా వాళ్లకు అర్థమైంది.
ఈ కొత్త ఆధారాలతో జెహన్నేను నిలదీయడానికి బొరెస్టెల్ ఆమెను మళ్లీ కలుసుకున్నారు.
ఆమె చివరిసారిగా మాట్లాడినప్పటి నుంచి ఆ కిరాయి సైనికుల మద్దతుదారుల నుండి ఆమెకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.
ప్రతీకార దాడుల ముప్పు పొంచి ఉన్నప్పటికీ పొరుగువారు తెలిసిన వారు ఆమె దాక్కోవడానికి సురక్షితమైన స్థలాలను వెతకడంలో సహాయం చేశారు.
చివరికి ఆమె ఒక ఆసుపత్రికి చేరుకుని అక్కడ పని చేయడం ప్రారంభించారు.
తాను గతంలో కొన్ని అబద్ధాలు చెప్పినట్లు జెహన్నే బొరెస్టెల్ ఎదుట అంగీకరించారు.
తన భర్త కొన్నేళ్ల కిందట యుద్ధంలో పోరాడటానికి తనను వదిలి వెళ్ళిపోయారని ఆమె ఒప్పుకున్నారు.
ఆ తర్వాత తానొక పాస్టర్‌తో సంబంధం పెట్టుకున్నానని అతని ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చానని తెలిపారు.
అయితే ఈ కారణాల వల్ల జెహన్నే ఒక "చౌకబారు మహిళ" అయిపోతుందా?
బొరెస్టెల్ రికార్డు చేసిన జెహన్నే మాటల ప్రకారం "దొంగతనాలు చేయడం కంటే, జీవనోపాధి కోసం తన శరీరాన్ని అప్పగించడం ఎంతో మేలు" అని ఆమె బదులిచ్చారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఒక కొత్త కోణం
ఇది ఆ కాలంలోని సంక్లిష్టమైన లైంగిక నైతికతకు సరిగ్గా సరిపోతుంది.
వివాహానికి ముందు శృంగారం నిషేధించినట్టు కనిపించినా ఆచరణలో విస్తృతంగా సాగింది.
పాస్టర్లు బ్రహ్మచారులుగా ఉండాల్సినప్పటికీ వారు కొంతమంది మహిళలతో రహస్యంగా లైంగిక చర్యలు కొనసాగించేవారు. వాళ్లతో పిల్లల్ని కనేవారు. వ్యభిచారాన్ని తీవ్రమైన నైతిక పాపంగా పరిగణించినా నాటి సమాజం దానిని ఆమోదించింది.
జెహన్నే మొదట పద్ధతిగల ఇల్లాలుగా చెప్పుకున్నప్పటికీ, ఆమె మరొకరితో "పాపపు జీవితాన్ని" గడిపినట్లు తేలింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ విషయాలేవీ పెద్దగా ప్రభావం చూపలేదు.
బొరెస్టెల్ సేకరించిన ఈ కొత్త ఆధారాలను విన్న తర్వాత కూడా ప్రాసిక్యూటర్లు ఆమె కేసును ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించుకున్నారు.
ఆమె ఒక పాస్టర్‌తో అక్రమంగా సంతానాన్ని కలిగి ఉన్నారనే విషయం చట్టపరంగా అప్రస్తుతంగా మారింది.
ఎందుకంటే ఎలాగైనా ఆ కిరాయి సైనికులకు మరణశిక్ష పడాలని నగర అధికారులు భావించారు.
అయితే అక్కడ మరో సమస్య వచ్చి పడింది.
ఆ నిందితులు క్రైస్తవ మత గురువుల వర్గానికి చెందినవారు కాబట్టి వారు కేవలం మతపరమైన చట్టాలకు మాత్రమే లోబడి ఉంటారని డ్యూక్ అధికారులు వాదించారు. మత గురువులు ఆయుధాలు ధరించడం పూర్తిగా నిషేధించినందున ఈ వాదన సరిపోనప్పటికీ మునిసిపల్ అధికారులు ఏమీ చేయలేకపోయారు.
రెండు నెలలు జైలులో ఉన్నాక ఆ కిరాయి సైనికులు విడుదలయ్యారు.
ఆ తర్వాత జెహన్నేకు ఏం జరిగిందో తెలుసుకోవడం అసాధ్యంగా మారింది.
ఆమె వ్యభిచారిణిగా మారిందా? కావచ్చు ఆ సమయంలో డిజోన్ నగరంలో జీవించిన కొందరు 'జెహన్నే' అనే పేరున్న మహిళలు అలా మారినట్లు రికార్డులు ఉన్నాయి.
కానీ ఖచ్చితంగా చెప్పడానికి ఆనాటి రికార్డులు చాలా అసంపూర్ణంగా ఉన్నాయి.
ఆమె కథ ఎక్కడ ముగిసినప్పటికీ 600 ఏళ్ల నాటి కోర్టు పత్రాల కట్టలో భద్రపరిచిన జెహన్నే జీవితంలోని ఈ చిన్న భాగం తెలుసుకునే అవకాశం రావడంపై మెక్‌డౌగల్ సంతోషం వ్యక్తం చేశారు.
"ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆమె తన కోసం తాను నిరంతరం ఎలా పోరాడిందో చూసి నేను ఆశ్చర్యపోయాను" అని పుస్తక రచయిత్రి అన్నారు.
కఠినమైన పరిస్థితుల మధ్య కూడా "సొంత ఆలోచనలు ఎంపికలు ఉన్నాయని ఆమె నమ్మారు" అని మెక్ డౌగల్ అన్నారు.
జెహన్నే కథ మధ్యయుగ కాలం గురించి మనకున్న అంచనాలను సవాలు చేస్తుందని ఆమె చెప్పారు.
"మధ్యయుగ సమాజం బాధితులను నిందించడం లేదా అవమానించడం వంటి పనులకు పాల్పడినట్లు నాకు ఎక్కడా ఆధారాలు లభించలేదు" అని మెక్‌డౌగల్ అన్నారు.
జెహన్నే ఫిర్యాదు చేసిన తర్వాత పొరుగువారు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
మధ్యయుగ మహిళల జీవితం నిరంతరం కష్టాలతో కూడుకున్నదనేది వాస్తవం. కొంతమంది బాధితులు దారుణమైన ప్రవర్తనను ఎదుర్కొని ఉండవచ్చు.
కానీ ఈ జెహన్నే ఒక నేరం మీద పోరాడారు.
ఆమె మాటలను అధికారులు తీవ్రంగా పరిగణించారు.
కష్టకాలంలో ఆమెకు స్నేహితుల మద్దతు లభించింది.
ఆమె ఒక చిన్నపాటి న్యాయాన్ని సాధించగలిగారు.
ఆ తర్వాత జీవితంలో ఏం చేసినప్పటికీ కనీసం ఆ ధైర్యాన్ని ఆమె తనతో పాటు తీసుకెళ్లగలిగారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























