గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఎంతసేపు సీపీఆర్ చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద.వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఎవరి గుండైనా అకస్మాత్తుగా ఆగిపోతే, వారి ప్రాణాలను కాపాడటానికి ఎన్ని నిమిషాలు ప్రయత్నించాలి? 5 నిమిషాలా? 10 నిమిషాలా? అరగంటా? సీపీఆర్ చేయడానికి కాలపరిమితి ఏమైనా ఉందా?
2012లో 23 ఏళ్ల బోల్టన్ ఫుట్‌బాల్ ఆటగాడు ఫాబ్రిస్ మువాంబా ఒక మ్యాచ్ సమయంలో మైదానంలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.
78 నిమిషాల పాటు నిరంతర సీపీఆర్, మెడికల్ రెస్యూసిటేషన్తో (ఒక వ్యక్తిలో శ్వాస ఆగిపోయినప్పుడు లేదా గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు, వారి ప్రాణాలను కాపాడటానికి చేసే అత్యవసర వైద్య ప్రక్రియతో) ఆయన ప్రాణాలతో బయటపడేలా చేశారు వైద్యులు.
సీపీఆర్ చేయడానికి నిర్దిష్ట "కాలపరిమితి" అంటూ ఏదీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, యూరోపియన్ రెస్యూసిటేషన్ కౌన్సిల్, భారతీయ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.
వ్యక్తి మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) ఉపయోగించే వరకు, లేదా వైద్య బృందం తమ చికిత్సను ప్రారంభించే వరకు సీపీఆర్ కొనసాగించాల్సి ఉంటుంది.


సీపీఆర్ అంటే కార్డియోపల్మనరీ రెస్యూసిటేషన్. గుండె కొట్టుకోవడం లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు, ఛాతీ మధ్య భాగానికి నిరంతరం ఒత్తిడి ఇవ్వడంతో మెదడుకు, కీలక అవయవాలకు కనీస రక్త ప్రసరణను, ఆక్సిజన్‌ను అందించే ఒక అత్యవసర ప్రాణరక్షక (లైఫ్ సేవింగ్) విధానమే సీపీఆర్.
గుండెపోటు వచ్చిన కొద్ది నిమిషాలకే మెదడుకు ఆక్సిజన్ అందకపోతే, మెదడు కణాలు దెబ్బతినడం మొదలవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images

భారత కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం.. రోగి ప్రాణాలతో బయటపడుతున్న లక్షణాలు కనిపించే వరకు లేదా వైద్య సహాయం అందే వరకు సీపీఆర్ కొనసాగించాలి.
యూరోపియన్ రెస్యూసిటేషన్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. ఒక నిర్దిష్ట నిమిషం తర్వాత సీపీఆర్ ఆపివేయాలనే నిబంధన అంతర్జాతీయంగా లేదని పేర్కొంది. ఈ నిర్ణయం రోగి ఆరోగ్య స్థితి, ఆ క్షణాన ఉన్న పరిస్థితులను బట్టి తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకే కొన్ని అరుదైన సందర్భాల్లో రెస్యూసిటేషన్ ప్రయత్నాలు 60 నిమిషాలు, 70 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు కొనసాగాయి. 78 నిమిషాల తర్వాత ఒక ఆటగాడు కోలుకోవడం అరుదే. కానీ, వైద్యపరంగా అది అసాధ్యం కాదు.
"78 నిమిషాలు అనేది చాలా ఎక్కువ సమయం. కానీ, వైద్య చరిత్రలో ఇది పూర్తిగా కొత్తదేమీ కాదు" అని పేర్కొన్నారు.

వెంటనే సీపీఆర్ చేయడం ప్రారంభించాలి.
కార్డియాక్ అరెస్ట్ తర్వాత.. ఆలస్యమయ్యే ప్రతి నిమిషం కూడా బతికే అవకాశాలను తగ్గిస్తుంది.
ఆలస్యమయ్యే ప్రతి నిమిషం బతికే అవకాశాన్ని సుమారు 10 శాతం వరకు తగ్గిస్తుందని భారత ప్రభుత్వం పేర్కొంది.
వెంటనే సీపీఆర్ చేయడం ఎందుకు ముఖ్యమో కార్డియాలజిస్ట్ రెఫాయ్ షౌకత్ అలీ వివరించారు.
"గుండె ఆగిపోయినప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. కొన్నిసార్లు సీపీఆర్ ద్వారా గుండెను కొట్టుకునేలా చేసినప్పటికీ, మెదడు తిరిగి పని చేయకపోవచ్చు. అప్పుడు రోగి శాశ్వతంగా కోమాలోకి వెళ్లవచ్చు. మనం సీపీఆర్‌ను ఎంత బాగా అందిస్తామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో ప్రజలు సీపీఆర్ అందించే విధానం ఆసుపత్రిలో అందించే విధానంలా ఉండదు. ఛాతీని అవసరమైనంత బలంగా నొక్కకపోతే, మెదడుకు రక్త ప్రసరణ సాధారణ స్థితికి రాదు. ఆసుపత్రిలో రక్తపోటుతో సహా అనేక కీలక సంకేతాలను పర్యవేక్షిస్తూ సీపీఆర్ అందిస్తారు" అని డాక్టర్ రెఫాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఛాతీపై ఒత్తిడిని తరచూ ఆపకూడదు.
ఛాతీపై ఒత్తిడిని నిరంతరాయంగా, సరైన వేగంతో (నిమిషానికి 100-120 సార్లు) అందించాలి. అనవసరమైన విరామాలు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి.
ఎవరికి సీపీఆర్ చేయకూడదో డాక్టర్ రెఫాయ్ వివరించారు.
"రోడ్డు ప్రమాదానికి గురై, ఛాతీ భాగంలో గాయాలైన వారికి సీపీఆర్ చేయకూడదు. అప్పటికే ఛాతీ ఎముకలు దెబ్బతిని ఉండవచ్చు. ఆ సమయంలో అటువంటి వారికి సీపీఆర్ చేయడం వారి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు" అని ఆయన హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images

పక్కన ఉన్నవారు వెంటనే చేసే సీపీఆర్ వల్ల ప్రాణాలతో బయటపడే అవకాశాలు 2 నుంచి 3 రెట్లు పెరుగుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రాణాలను కాపాడటంలో త్వరితగతిన చేసే సీపీఆర్, వేగవంతమైన డీఫిబ్రిలేషన్ కీలక అంశాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మద్దతుతో రూపొందించిన ఇంటర్నేషనల్ రెస్యూసిటేషన్ గైడ్‌లైన్స్ పేర్కొంటున్నాయి.
గుండె కొట్టుకోవడం ప్రమాదకరంగా ఆగిపోయినా లేదా అసాధారణంగా ఉన్నా.. డీఫిబ్రిలేటర్ పరికరాన్ని ఉపయోగించి గుండెకు విద్యుత్ షాక్ ఇచ్చి, దాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రక్రియనే ర్యాపిడ్ డీఫిబ్రిలేషన్ అంటారు.
గుండెపోటు వచ్చిన మొదటి కొన్ని నిమిషాల్లో ఇలా చేస్తే, ప్రాణాలతో బయటపడే అవకాశం గణనీయంగా పెరుగుతుందని యూరోపియన్ రెస్యూసిటేషన్ కౌన్సిల్ పేర్కొంది.


వెంటనే చికిత్స అందించకపోవడం వల్ల నిమిషాల వ్యవధిలోనే కార్డియాక్ అరెస్ట్‌కు గురవుతారు.
గుండె ఆగిపోయినప్పుడు.. మెదడుకు, ఇతర కీలక అవయవాలకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఆ రక్త ప్రవాహాన్ని తాత్కాలికంగా కొనసాగించడానికి సీపీఆర్ (సీపీఆర్) సాయపడుతుంది.
అంటే, సీపీఆర్ అనేది రోగులందరినీ కాపాడే 'అద్భుత చికిత్స' కాదు. కానీ, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశాన్ని కల్పించే మొదటి, అత్యంత ముఖ్యమైన అడుగు ఇదేనని మెడికల్ రికార్డులు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

వైద్య అధ్యయనాల ఆధారంగా...
- యువతకు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- ముందు తీవ్రమైన గుండె జబ్బులు లేని వారికి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- వెంటనే సీపీఆర్ ప్రారంభిస్తే.. ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
- సమీపంలో ఏఈడీ అందుబాటులో ఉండి, దాన్ని త్వరగా ఉపయోగించినట్లయితే, ప్రాణాలతో బయటపడే అవకాశం మరింత పెరుగుతుంది.
- గుండెపోటు వచ్చిన సమయానికి, సీపీఆర్ ప్రారంభించే సమయానికి మధ్య వ్యవధి ఎంత తక్కువగా ఉంటే, మెదడుకు అంత తక్కువ నష్టం జరుగుతుంది.
''సాధారణంగా సీపీఆర్ చేసిన 30 నుంచి 45 నిమిషాల తర్వాత.. ఎలాంటి ప్రభావం ఉండకపోతే.. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. అప్పుడు, రోగి వయసును, అంతకుముందు వారికి ఏమైనా గుండె సమస్యలు ఉన్నాయా? హార్ట్ రేటులో ఏమైనా తేడాలున్నాయా? ఏం చేయాలి? అనే వంటి అనేక అంశాలను పరిశీలించి, తదుపరి చర్యను నిర్ణయిస్తాం. యువతకు బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, వారికి ఎక్కువ సేపు సీపీఆర్ ఇవ్వవచ్చు" అని డాక్టర్ రెఫాయ్ అన్నారు.
నీటిలో మునిగిపోయిన బాధితులకు ఎక్కువ సేపు సీపీఆర్ అందించవచ్చని కూడా రెఫాయ్ పేర్కొన్నారు.
"స్విమ్మింగ్ పూల్స్, చెరువులు లేదా బావులలో మునిగిపోయిన వారికి చాలా సేపు సీపీఆర్ చేసి నీటిని బయటకు తీయవచ్చు" అని ఆయన అన్నారు.
భారత్‌లో ప్రజలు చేసే సీపీఆర్ రేటు ఇప్పటికీ 1.3 శాతం నుంచి 9.8 శాతం మధ్య చాలా తక్కువగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. చుట్టుపక్కల వారు వెంటనే చేసే సీపీఆర్ వల్ల ప్రాణాలతో బయటపడే అవకాశాన్ని 2 నుండి 3 రెట్లు పెంచవచ్చని సూచించాయి.
గుండెపోటు తర్వాత జీవితంలోని మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలక సమయం అని వైద్యులు చెప్పారు.

డాక్టర్లు చెబుతున్న ప్రకారం.. పాటించాల్సిన అంశాలు..
- వారి భుజంపై మెల్లగా తట్టి, "మీరు బాగానే ఉన్నారా?" అని గట్టిగా అడిగి, ఆ వ్యక్తి స్పందిస్తున్నారో లేదో గమనించాలి.
- స్పందన లేకపోతే, వెంటనే 911కు కాల్ చేసి, ఛాతీపై ఒత్తిడిని ప్రారంభించాలి.
- బాధితుడు గట్టి, సమతలమైన ఉపరితలంపై పడుకుని ఉండేలా చూసుకోవాలి.
- ఛాతీని నొక్కుతున్నప్పుడు మోచేతులను నిటారుగా ఉంచాలి.
- నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఛాతీపై ఒత్తిడి కలిగించాలి.
- ప్రతి కంప్రెషన్ తర్వాత ఛాతీని దాని సాధారణ స్థితికి తిరిగి రావడానికి అనుమతించాలి.
- వ్యక్తి మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు లేదా వైద్య సహాయం అందే వరకు సీపీఆర్ కొనసాగించాలి.
- అందుబాటులో ఉంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ని (ఏఈడీ) ఉపయోగించాలి.
డాక్టర్లు చెబుతున్న ప్రకారం చేయకూడనవి
- భయపడవద్దు.
- ఛాతీపై ఒత్తిడి ప్రారంభించేందుకు ఆలస్యం చేయొద్దు.
- బాధితుడు స్పృహలో ఉన్నప్పుడు ఛాతీపై ఒత్తిడి కలిగించవద్దు.
- ఛాతీపై ఒత్తిడి కలిగించేటప్పుడు మధ్యలో అనవసరమైన విరామం తీసుకోవద్దు.
- ఛాతీపై ఒత్తిడి కలిగించేటప్పుడు మీ మోచేతులు వంచవద్దు.
- ఛాతీపై ఒత్తిడి చేసేటప్పుడు ఆ వేగాన్ని తగ్గించవద్దు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























