‘బంతి ఆకారాన్ని మార్చడానికి శాండ్ పేపర్ ఉపయోగించిన విషయం టీమ్ మొత్తానికి తెలుసు’ - ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఖావాజా

ఉస్మాన్ ఖవాజా, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌, ఆసీస్ ఆటగాళ్లు, శాండ్‌పేపర్
ఫొటో క్యాప్షన్, ఖవాజా ఆత్మకథ 'సబ్ర్'లోని కొన్ని భాగాలను సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రచురించింది.
    • రచయిత, టిమోతి అబ్రహాం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

దక్షిణాఫ్రికాతో 2018లో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి టెస్టులో బంతి ఆకారాన్నిమార్చడానికి శాండ్‌పేపర్‌ను ఉపయోగించిన విషయం ఆస్ట్రేలియా జట్టు మొత్తానికి తెలుసని ఆ జట్టు మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పాడు.

మూడో టెస్టుకు ముందు జరిగిన రెండో టెస్టులోనూ ఆసీస్ ఆటగాళ్లు బంతి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని తెలిపాడు.

ఖవాజా ఆత్మకథ 'సబ్ర్'లోని కొన్ని భాగాలను సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రచురించింది. ఇందులో ఖవాజా ఈ కీలక విషయాలను బయటపెట్టాడు. ఈ ఉదంతం అప్పట్లో 'శాండ్‌పేపర్‌ గేట్‌'గా క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

ఈ వివాదం కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బ్యాటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం పడింది.

"ఈ విషయం మా అందరికీ తెలుసు. బ్యాటర్లు, బౌలర్లు, సిబ్బందే కాదు, జట్టులోని అందరికీ తెలుసు" అని 39 ఏళ్ల ఖవాజా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో చెప్పాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌, ఆసీస్ ఆటగాళ్లు, శాండ్‌పేపర్
ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బంతి ఆకారాన్ని మార్చేందుకు ఆసీస్ ఆటగాళ్లు శాండ్‌పేపర్‌ను వినియోగించిన దృశ్యం టీవీ ప్రసారంలో కనిపించింది

అయితే, ఆ మ్యాచ్‌లో ఆడిన నలుగురు ఆస్ట్రేలియా బౌలర్లు మాత్రం తమకు ముందుగా ఈ విషయం తెలియదని పలుమార్లు స్పష్టం చేశారు. ప్రస్తుత టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లయన్ 2021లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బంతి స్థితిని మార్చేందుకు బయటి పదార్థాన్ని మైదానంలోకి తీసుకొచ్చిన విషయం తమకు తెలియదని అందులో పేర్కొన్నారు.

ఈ వివాదంలో ఎలాంటి తప్పు చేయలేదని తేలినప్పటికీ, అప్పటి ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ రాజీనామా చేశాడు. తాజాగా ఖవాజా చేసిన ఆరోపణలను ఆయన ఖండించాడు. ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడం పాత చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తోందని అన్నాడు.

"జట్టులోని ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసనిఅనుకోవడం లేదు. క్రికెట్‌లో బంతి ట్యాంపరింగ్ 150 ఏళ్లుగా జరుగుతోంది. అయితే, అదెలా చేస్తున్నారు? ఆ విషయం ఎంతమందికి తెలుస్తుంది? అన్నదే ముఖ్యం. నాకు తెలిసిన విషయాల గురించే నేను మాట్లాడగలను. క్రికెట్‌లో బంతి ట్యాంపరింగ్ అనేది చాలాకాలంగా జరుగుతున్న విషయం. ఇప్పుడది పూర్తిగా కనుమరుగైంది. అంతమాత్రాన అది సరైన పని అని కాదు. ఈ ఘటనకు మేం భారీ మూల్యం చెల్లించుకున్నాం" అని లీమన్ ఏబీసీ స్పోర్ట్‌తో పేర్కొన్నాడు.

స్మిత్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌, ఆసీస్ ఆటగాళ్లు, శాండ్‌పేపర్
ఫొటో క్యాప్షన్, శాండ్ పేపర్ వివాద సమయంలో ఆస్ట్రేలియాకు తిరిగొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైన స్టీవ్ స్మిత్.

'స్మిత్ చేతులెత్తేశాడు'

దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండో టెస్టు సందర్భంగా బంతి ట్యాంపరింగ్‌పై చర్చ మొదలైందని ఖవాజా తెలిపాడు. పోర్ట్ ఎలిజబెత్ (ప్రస్తుత గ్కెబెర్హా) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోనే శాండ్‌పేపర్‌ను ఉపయోగించాలనే ఆలోచన వచ్చిందని తెలిపాడు.

సెయింట్ జార్జ్ పార్క్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో బంతి ట్యాంపరింగ్‌పై బహిరంగంగా చర్చించారని, శాండ్ పేపర్‌‌తో బంతికి రివర్స్ స్వింగ్ తెప్పించవచ్చని ఆ చర్చల్లోనే గుర్తించారని ఖావాజా తెలిపాడు.

"ఆ సమయంలో స్టీవ్ స్మిత్ చేతులెత్తేశాడు. ఈ వ్యవహారం గురించి తనకు ఏమీ తెలియకూడదని చెప్పాడు" అని ఖవాజా తెలిపాడు.

మూడో టెస్టులో బంతి రివర్స్ స్వింగ్ అయ్యేలా చేయడానికి,బాన్‌క్రాఫ్ట్ బంతిపై శాండ్‌పేపర్ ఉపయోగిస్తున్న దృశ్యాలను టీవీ కెమెరాలు ప్రసారం చేయడంతో ఆస్ట్రేలియా జట్టుపై దుమారం రేగింది.

ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ జరిపినప్పుడు తన నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకపోవడం కూడా ఆశ్చర్యం కలిగించిందని ఖవాజా చెప్పాడు.

‘‘అంతా సవ్యంగా ఉండే ప్రపంచంలో అయితే నేనీ పని చేయాల్సి వచ్చేదే కాదు. బయటకు వచ్చి నిజాలు మాట్లాడే ఆ మొదటి వ్యక్తి నేనే కావాలని నాకు ఎంతమాత్రం లేదు, కానీ ఎనిమిదేళ్లు గడిచాక కనీసం ఇప్పుడైనా అసలు నిజం బయటకు వచ్చిందనుకుంటున్నా" అన్నాడు.

బ్యాటర్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకున్నారు కానీ, బంతి రూపంలో మార్పు వచ్చిందనే విషయం బౌలర్లైన కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, లయన్‌ ఎలా తెలియలేదనే దానిపై మాత్రం ఎలాంటి వివరణా లేదు.

బాన్‌క్రాఫ్ట్‌ను గార్డియన్‌కు 2021లో బాన్‌క్రాఫ్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బాల్ టాంపరింగ్ జరుగుతున్న విషయం బౌలర్లకు కూడా తెలుసా? అని ప్రశ్నించినప్పుడు.. 'అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరికీ అర్థమయ్యే విషయమే కదా' అన్నాడు.

ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైన కొన్నిరోజులకే నలుగురు బౌలర్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

"ముఖ్యమైన వాస్తవాలను మరోసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. బంతి స్థితిని మార్చేందుకు బయటి పదార్థాన్ని మైదానంలోకి తీసుకొచ్చి న దృశ్యాలను న్యూలాండ్స్‌లోని పెద్ద తెరపై చూసే వరకు మాకు ఆ విషయమే తెలియదు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, మేం బౌలర్లం కాబట్టి ఆ పదార్థం వాడకం గురించి కచ్చితంగా తెలిసే ఉంటుందని కొందరు భావిస్తున్నారు. వారికి మేం చెప్పేది ఒక్కటే. ఆ టెస్టులో అంపైర్లు నిగెల్ లాంగ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఎంతో అనుభవం ఉన్నవారు. టీవీలో ఆ దృశ్యాలు ప్రసారమైన తర్వాత వారు బంతిని పరిశీలించారు. ఎలాంటి నష్టం కనిపించకపోవడంతో బంతిని మార్చలేదు. అసత్య ప్రచారాలు, ఆధారాలు లేని ఆరోపణలకు ఇకనైనా ముగింపు పలకాలని కోరుతున్నాం. ఈ వ్యవహారం చాలాకాలంగా కొనసాగుతోంది. ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది" అని పేర్కొన్నారు.

డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌, ఆసీస్ ఆటగాళ్లు, శాండ్‌పేపర్
ఫొటో క్యాప్షన్, డేవిడ్ వార్నర్ (ఫైల్ ఫోటో)

క్రికెట్ ఆస్ట్రేలియా ఏమంది?

ఖవాజా తన పుస్తకం ప్రచురణ గురించి తనతో మాట్లాడినట్లు ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడానికి ముందు కమిన్స్ వెల్లడించాడు. ఆ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో గెలుచుకుంది.

కాగా, శాండ్‌పేపర్‌గేట్‌కు సంబంధించి పుస్తకంలో ఎలాంటి విషయాలు వెల్లడైనా తనకు ఆందోళన లేదని కమిన్స్ చెప్పాడు. అప్పట్లోనే ఈ వ్యవహారంపై విచారణ పూర్తయిందని, జట్టు దాని నుంచి బయటపడిందని ఈ 33ఏళ్ల ఆటగాడు చెప్పాడు.

అక్టోబర్ 8న కమిన్స్ మాట్లాడుతూ.. "ఖవాజా పుస్తకం రాస్తున్నాడని, అందులో ఈ విషయాలు ఉండొచ్చని ముందుగా నాకు చెప్పాడు. పెద్దగా వివరాల్లోకి వెళ్లలేదు. ఎప్పటిలాగే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీ కథ నువ్వు చెప్పుకో, అందులో తప్పేమీ లేదన్నాను. ఇది జరిగి చాలా కాలమైంది. అప్పట్లోనే అన్ని విచారణలు పూర్తయ్యాయి. మేం అన్ని ప్రశ్నలకు లెక్కలేనన్ని సార్లు సమాధానాలు ఇచ్చాం" అన్నాడు.

ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన జారీచేసింది.

"2018 కేప్‌టౌన్ టెస్టు జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా దీనిపై ఎన్నో ఊహాగానాలువస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ పొడవునా మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి’’

‘‘ఈ ఎనిమిదేళ్ల కాలంలో, ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి కొత్త సమాచారం ఉన్నా మాకు అందించే అవకాశం ఎప్పుడూ తెరిచే ఉంది, ఇప్పటికీ ఉంది. మా దృష్టికి వచ్చిన ప్రతి సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించాం. మా విచారణాధికారులు అప్పట్లో తేల్చిన ఫలితాలపై మేమిప్పటికీ పూర్తి సంతృప్తిగా ఉన్నాం’’ అని పేర్కొంది.

బాన్‌క్రాఫ్ట్, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌, ఆసీస్ ఆటగాళ్లు, శాండ్‌పేపర్
ఫొటో క్యాప్షన్, బంతిపై బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్ ఉపయోగిస్తున్న దృశ్యాలను టీవీ కెమెరాలు ప్రసారం చేశాయి.

'ఆ ముగ్గురికి న్యాయం జరగాలి'

ఈ వివాదం విషయంలో జట్టంతా సమష్ఠి బాధ్యత తీసుకోవాలని తాను గట్టిగా వాదించానని ఖవాజా వెల్లడించాడు.

"జట్టుగా ఈ బాధ్యత తీసుకోండి. మనమంతా కలిసి ఈ పని చేశాం. ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. కాబట్టి, జట్టుగా బాధ్యత స్వీకరించాలి’’ అని చెప్పాను. కానీ అలా జరగలేదు. చివరకు ఆ ముగ్గురు ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది" అని తన పుస్తకంలో రాశాడు.

అరబిక్ భాషలో సహనం, కష్టాలను తట్టుకునే శక్తి అనే అర్థం వచ్చే సబ్ర్ పేరుతో ఖవాజా తన ఆత్మకథను ప్రచురించాడు. అందులో కేప్‌టౌన్ ఘటనకు సంబంధించిన అధ్యాయాన్ని స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లకు అంకితం చేశాడు. జట్టు మొత్తం బాధ్యత తీసుకోవడం ద్వారా ఆ ముగ్గురికి న్యాయం జరగాలని తాను భావిస్తున్నట్లు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ పేర్కొన్నాడు.

"ఆ ముగ్గురిలో ఎవరూ ముందుకొచ్చి ఏమీ చెప్పాలని అనుకోరు. అది సహజమే. ఎందుకంటే వారు ఏదైనా చెబితే అది కేవలం వారి మాటగా మిగిలిపోతుంది. ఇతరుల నుంచి ధ్రువీకరణ లేని ఆరోపణగా మారుతుంది. అందుకే ఈ విషయం గురించి మరొకరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే, నేను ఈ విషయాన్ని బయటపెడుతున్నది మరే ఇతర కారణంతో కాదు. ఇది సరైన పని అని నేను నమ్ముతున్నాను" అని ఖవాజా తెలిపాడు.

ఖావాజా ఆస్ట్రేలియా తరపున 88 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 6,229 పరుగులు చేశాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)