భార్య ఐపీఎస్, భర్త ఐఏఎస్.. ‘ఇద్దరూ 40 విల్లాలు, కాటేజ్‌లు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారో వారికే అద్దెకిచ్చారు’..ఏమిటీ ‘కుంభకోణం’?

ఫొటో సోర్స్, X/shikhar agarwal
- రచయిత, మోహర్ సింగ్ మీణా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
రాజస్థాన్ చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్, ఆయన భార్య ఐపీఎస్ అధికారిణి డాక్టర్ ప్రశాఖ మాథుర్ అదే రాష్ట్రంలోని ఉదయ్‌పూర్, అల్వార్లలోని 'అనంత రిసార్ట్'లో 40 విల్లాలు, కాటేజీలు కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ రిసార్ట్‌ను నడుపుతున్న 'గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ నుంచి వీరు ఈ ఆస్తులను కొనుగోలు చేశారని, ప్రభుత్వ పదవుల్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు లాభం చేకూర్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని రాజస్థాన్ ప్రభుత్వం అక్కడి అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది.
ఈ దంపతులిద్దరినీ పదవుల నుంచి తొలగించి "అవైటింగ్ పోస్టింగ్ ఆర్డర్"(ఏపీఓ) కింద ఉంచింది. ప్రస్తుతం వారు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.
గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇస్తున్న ప్రభుత్వ రాయితీలను రద్దు చేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుతవం నవంబర్ 2న మరో కీలక ఉత్తర్వు జారీ చేసింది.

మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ దీనిపై స్పందించారు.
భజన్‌లాల్ శర్మ ప్రభుత్వ హయాంలో బయటపడిన అతిపెద్ద అవినీతి కేసు ఇదేనని అన్నారు.
ఈ కేసును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA
ఇప్పటి వరకు ఏం జరిగింది?
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులను అక్టోబర్ 28న పదవుల నుంచి తొలగించారు. ప్రస్తుతానికి వారికి ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించలేదు.
అక్టోబర్ 30న ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అక్టోబర్ 31న యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
శిఖర్ అగర్వాల్ ఆయన భార్య ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. బీబీసీ ప్రతినిధి ఫోన్లో వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ మాట్లాడటం కుదరలేదు.
ఉదయ్‌పూర్‌లోని అనంత రిసార్ట్ ప్రతినిధులనూ ఫోన్లో సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

ఫొటో సోర్స్, goyalfashions.co.in
ఎన్ని విల్లాలు, కాటేజీలు కొన్నారు?
దంపతులిద్దరూ హోటళ్లు, రిసార్టులను నడుపుతున్న గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఉదయ్‌పూర్, అల్వార్లలో మొత్తం 40 విల్లాలు, కాటేజీలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గోవింద్ గుప్తా ఒక ప్రెస్ నోట్లో తెలిపారు.
వీటిలో ఉదయ్‌పూర్ జిల్లాలోని బుజ్రా రిసార్ట్‌లో 20 కాటేజీలు, అల్వార్ జిల్లాలోని అజబ్‌గఢ్ రిసార్ట్‌లో 20 విల్లాలు ఉన్నాయి.
స్థానిక మీడియ కథనాల ప్రకారం.. 2023సెప్టెంబర్‌లో ఉదయ్‌పూర్ రిసార్ట్‌లో 20 కాటేజీలు కొన్నారు. శిఖర్ అగర్వాల్, ప్రశాఖ మాథుర్ ఈ కాటేజీలను ఒక్కొక్కటి రూ.10 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
2026 మార్చిలో అల్వార్ రిసార్ట్‌లో 20 విల్లాలు కొన్నట్లు ఏసీబీ ప్రెస్ నోట్ పేర్కొంది. వీటిలో ఎనిమిది విల్లాలు ఈ దంపతుల పేరిట రెండు వారి కుమారుల పేరిట మరో రెండు ప్రశాఖ మాథుర్ తల్లిదండ్రుల పేరిట కొనుగోలు చేశారు.
అక్కడ ఒక్కో విల్లా ధర రూ.15 లక్షల నుంచి రూ.16.50 లక్షల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ 40 విల్లాలు కాటేజీలను మొత్తం రూ.6.16 కోట్లకు కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి.

ఫొటో సోర్స్, ANI
అమ్మిన కంపెనీకే అద్దెకు
ఈ కొనుగోలులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఈ 40 ఆస్తులను ఏ కంపెనీ నుంచి కొన్నారో, ఆ తర్వాత తిరిగి అదే కంపెనీకి అద్దెకు ఇచ్చారు.
ఉదయ్‌పూర్‌లోని ప్రతి కాటేజీకి ఏడాదికి అద్దె రూ.4 లక్షలు కాగా, అల్వార్‌లోని ప్రతి విల్లాకు ఏడాది అద్దె రూ.5 లక్షలని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
20 కాటేజీల ద్వారా ఏడాదికి రూ. 80 లక్షలు, 20 విల్లాల ద్వారా ఏడాదికి రూ.1 కోటి అద్దె వస్తుందని దైనిక్ భాస్కర్ పత్రిక కథనం చెబుతోంది. అంటే ఈ ఆస్తుల ద్వారా వీరికి మొత్తం ఏడాదికి రూ.1.80 కోట్ల అద్దె లభిస్తోంది.
ఈ ఆస్తుల వార్షిక అద్దె ఆదాయం వారు ఆస్తి కొనుగోలు కోసం ఖర్చు చేసిన మొత్తంలో దాదాపు 29 శాతానికి సమానం.
ఈ కొనుగోలు, లీజు ప్రక్రియ పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ కంపెనీ తన ఆస్తులను ఈ అధికారుల కుటుంబాలకు విక్రయించి మళ్లీ వాటినే ఎందుకు అద్దెకు తీసుకుంది? ఆ లావాదేవీలు జరిగిన సమయంలో సదరు ఆస్తుల అసలు మార్కెట్ విలువ ఎంత? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, ANTI CORRUPTION BUREAU
కంపెనీకి లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు
ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, శిఖర్ అగర్వాల్ ప్రభుత్వ పదవుల్లో ఉంటూ తన ఆస్తులను ఎలా పెంచుకున్నారు? ఆ కంపెనీకి ఎలా లబ్ధి చేకూర్చారు అనే అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రాథమిక విచారణకు సంబంధించి ఏసీబీ విడుదల చేసిన ప్రెస్ నోట్లో శిఖర్ అగర్వాల్ వేర్వేరు పదవుల్లో ఉన్నప్పుడు గోయల్ ఫ్యాషన్స్ డైరెక్టర్లతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఆ కంపెనీకి అనుచిత లాభం చేకూర్చారని పేర్కొంది.
శిఖర్ అగర్వాల్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కార్యాలయంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. దీంతో ప్రతిపక్షాలు ఈ విషయంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.
రిసార్ట్ నిర్మాణానికి సంబంధించిన నిబంధనలలో సడలింపులు ఇవ్వడం అవసరమైన తనిఖీలు చేయకుండానే అనుమతులు మంజూరు చేయడం కంపెనీకి ప్రత్యేక రాయితీలతో కూడిన ఆర్థిక ప్యాకేజీని ఇప్పించడం వంటి ఆరోపణలు శిఖర్ అగర్వాల్‌పై ఉన్నాయి.
దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది.
ఏసీబీ డైరెక్టర్ జనరల్ గోవింద్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. మీడియా కథనాలు, పరిశ్రమల శాఖ నుంచి వచ్చిన నివేదికల ద్వారా అందిన సమాచారాన్ని ఆధారంగా ప్రాథమికంగా నిజాలు ఉన్నట్లు తేలడంతో ప్రిలిమనరీ రిపోర్ట్ నమోదు చేయాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, facebook.com/avadhesh.akodia
ఎలా వెలుగులోకి వచ్చింది?
'దైనిక్ భాస్కర్' ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవధేష్ అకోడియా పరిశోధనాత్మక కథనంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
"ఈ 40 విల్లాల కేసులో ప్రభుత్వ పబ్లిక్ పోర్టల్ నుంచి మొదట శిఖర్ అగర్వాల్ పేరిట ఉన్న 14 విల్లాల సమాచారం దొరికింది. దాని ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయాలు తెలిశాయి" అని ఆయన బీబీసీతో చెప్పారు.
"పోర్టల్‌లో ఆ 14 ఆస్తుల కొనుగోలు వివరాలు, వాటి ద్వారా వస్తున్న వార్షిక అద్దెను పరిశీలించినప్పుడు కేవలం శిఖర్ అగర్వాల్ మాత్రమే కాకుండా ఆయన భార్య పేరిట కూడా విల్లాలు, కాటేజీలు ఉన్నట్లు తెలిసింది. కానీ ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఐపీఆర్ ( Immovable Property Return) పోర్టల్‌లో నమోదు చేయలేదు" అని ఆయన వివరించారు.
కుమారులు, అత్తమామల పేరిట కూడా కాటేజీలు, విల్లాలు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని అకోడియా చెప్పారు.
అయితే, శిఖర్ అగర్వాల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చినట్లు కూడా అకోడియా తన నివేదికలో పేర్కొన్నారు.
అయితే, తన వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని, ఆ ఆస్తుల వివరాలను ఐపీఆర్ పోర్టల్‌లో ఉంచడమే కాకుండా తన ఐటీ రిటర్న్స్‌లో కూడా చూపించానని శిఖర్ అగర్వాల్ పేర్కొన్నారు.
భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలు పోర్టల్‌లో కనిపించకపోవడంపై స్పందిస్తూ బహుశా పొరపాటున వేరే చోట అప్లోడ్ అయ్యి ఉండవచ్చని ఆయన అన్నారు.
అయితే జర్నలిస్ట్ అకోడియా ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు.
"పోర్టల్‌లో వివరాలను నేరుగా పూరించాల్సి ఉంటుంది కాబట్టి వేరే చోట అప్లోడ్ అయ్యే అవకాశం లేదు" అని అన్నారు.
2023లో ఉదయ్‌పూర్‌లో ఐపీఎస్ డాక్టర్ ప్రశాఖ మాథుర్ పేరిట 10 కాటేజీలు కొనుగోలు చేసినప్పటికీ, ఆ సమాచారాన్ని ఆర్టీఐలో కూడా ఇవ్వలేదని అకోడియా చెప్పారు.
కుమారులు, అత్తమామల పేరిట ఉన్న ఆస్తులపై ప్రశ్నించగా వాళ్లంతా సొంతంగా కొనుగోలు చేశారని శిఖర్ అగర్వాల్ బదులిచ్చినట్లు అకోడియా వివరించారు.

ఫొటో సోర్స్, ANI
అశోక్ గహ్లోత్ ఏమన్నారు?
ఈ వ్యవహారం బయటకు రాగానే మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
భజన్‌లాల్ శర్మ ప్రభుత్వ హయాంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని అన్నారు. కేవలం సదరు అధికారిని ఏపీఓ చేయడం సరిపోదని ఈ కేసును సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పాత్రను కూడా ప్రశ్నిస్తూ సదరు కంపెనీకి లబ్ధి చేకూర్చేలా జరిగిన నిర్ణయాల వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం పాత్రపై విచారణ జరగాలని ఆరోపించారు.
"ముఖ్యమంత్రి గారూ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అనంత రిసార్ట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో మీ పాత్ర ఏంటి? ఈ కేసు దర్యాప్తును ఏసీబీకి కాకుండా సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదు?" అని ‘ఎక్స్’లో అశోక్ గహ్లోత్ ప్రశ్నించారు.
ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని, ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. కేసు తీవ్రతను బట్టి కేవలం ఏసీబీ దర్యాప్తు సరిపోదని, అన్ని ఆర్థిక లావాదేవీలపై స్వతంత్ర విచారణ జరగాలని ఆయన వాదించారు.
ఈ వ్యవహారం గురించి బీజేపీ ఎమ్మెల్యే బాలముకుందాచార్య మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు.
తమ ప్రభుత్వం అవినీతిని అసలు సహించదని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























