వెరికోస్ వెయిన్స్‌: కాళ్లలో నరాలు ఉబ్బుతున్నాయా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..

వెరికోస్ వెయిన్స్, ఉబ్బి, మెలికలు తిరిగినట్లు కనిపించే నరాలు
ఫొటో క్యాప్షన్, వెరికోస్ వెయిన్స్ ప్రపంచవ్యాప్తంగా కనిపించే సాధారణ రక్తనాళాల సమస్యల్లో ఒకటి.
    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

కాళ్లపై నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉబ్బి, మెలికలు తిరిగినట్లు కనిపించే నరాలను కేవలం అందానికి సంబంధించిన సమస్యగా చాలామంది భావిస్తుంటారు.

ముఖ్యంగా మహిళలు, ఎక్కువసేపు నిలబడి పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, ఫ్యాక్టరీ కార్మికులు వంటివారు ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు.

మొదట్లో కాళ్లలో అలసట, బరువుగా అనిపించడం, స్వల్ప నొప్పితో ప్రారంభమయ్యే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా కాళ్ల వాపు, చర్మం నల్లబడటం, చర్మం గట్టిపడటం, చివరకు మానని పుండ్లు, రక్తస్రావం వంటి సమస్యలకు దారితీయవచ్చు.

వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పరిజ్ఞానంతో ఇప్పుడు ఈ సమస్యకు శస్త్రచికిత్స అవసరం తక్కువగా ఉండే లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఫోమ్ స్క్లెరోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

అయితే ప్రతి ఒక్కరికీ ఒకే చికిత్స విధానం ఉండదు. వ్యాధి తీవ్రత, రక్తప్రసరణలో లోపం, అల్ట్రాసౌండ్ పరీక్ష ఫలితాలను బట్టి చికిత్సను నిర్ణయించాలి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వెరికోస్ వెయిన్స్, ఉబ్బి, మెలికలు తిరిగినట్లు కనిపించే నరాలు
ఫొటో క్యాప్షన్, వయస్సు పెరిగేకొద్దీ వెరికోస్ వెయిన్స్ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి?

గుండె ధమనుల ద్వారా రక్తాన్ని శరీరంలోని వివిధ అవయవాలకు పంపిస్తుంది. అక్కడి నుంచి రక్తం తిరిగి గుండెకు చేరడానికి సిరలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా కాళ్ల నుంచి రక్తం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి ప్రయాణించి గుండెకు చేరాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు కాళ్ల సిరల్లో ప్రత్యేకమైన వాల్వులు ఉంటాయి. ఇవి రక్తం వెనక్కి ప్రవహించకుండా, ఒకవైపు మాత్రమే ప్రయాణించేలా సహాయపడతాయి. నడిచేటప్పుడు కాళ్ల కండరాలు సంకోచించి, రక్తాన్ని పైకి పంపే పంపులా పనిచేస్తాయి. దీనిని కాఫ్ మజిల్ పంప్ (Calf muscle pump) అంటారు.

కొన్ని కారణాల వల్ల ఈ వాల్వులు బలహీనపడటమో లేదా సరిగా పనిచేయకపోవడమో జరుగుతుంది. దాంతో రక్తం తిరిగి కిందికి ప్రవహించి సిరల్లో నిల్వ ఉంటుంది. దీనివల్ల సిరల్లో ఒత్తిడి పెరిగి అవి క్రమంగా వెడల్పుగా, ఉబ్బుగా, మెలికలు తిరిగినట్లుగా మారతాయి. ఈ పరిస్థితినే వెరికోస్ వెయిన్స్((ఉబ్బిన సిరలు) అంటారు.

సాధారణంగా కాళ్లలోని ఉపరితల సిరలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ముఖ్యంగా తొడలు, మోకాళ్ల వెనుక భాగం, పిక్కలపై ఇవి స్పష్టంగా కనిపిస్తాయి.

ఇది కేవలం అందానికి సంబంధించిన సమస్య కాదు. కొందరిలో ఎలాంటి లక్షణాలూ లేకపోవచ్చు. మరికొందరిలో దీర్ఘకాలిక సిరల రక్తప్రసరణ లోపం ఏర్పడి జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు.

వెరికోస్ వెయిన్స్ ప్రపంచవ్యాప్తంగా కనిపించే సాధారణ రక్తనాళాల సమస్యల్లో ఒకటి.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్(ఎన్ఐసీఈ) మార్గదర్శకాల ప్రకారం, కాళ్లపై కనిపించే వెరికోస్ వెయిన్స్ ప్రపంచవ్యాప్తంగా కనీసం మూడింట ఒక వంతు మందిలో ఉండవచ్చని అంచనా.

వయస్సు పెరిగేకొద్దీ ఈ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఇది కనిపిస్తుంది.

అయితే గర్భధారణ వంటి కారణాల వల్ల మహిళల్లో కొన్ని ప్రమాద కారకాలు ఎక్కువగా ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ ఉన్నవారిలో సుమారు 3–6 శాతం మందికి జీవితకాలంలో వెనస్ అల్సర్స్ ఏర్పడవచ్చని ఎన్ఐసీఈ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

వెరికోస్ వెయిన్స్, ఉబ్బి, మెలికలు తిరిగినట్లు కనిపించే నరాలు
ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు వెరికోస్ వెయిన్స్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు ఏమిటి?

ఈ సమస్యకు ఒకే ఒక్క కారణం ఉండదు. సిరల వాల్వుల పనితీరు దెబ్బతినడం, సిరల గోడలు బలహీనపడటం, కాళ్లలో రక్తం నిల్వ ఉండే పరిస్థితులు వంటివి దీనికి దోహదం చేస్తాయి.

1. ఎక్కువసేపు నిలబడి పనిచేయడం:

ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది, దుకాణాల్లో పనిచేసేవారు, ఫ్యాక్టరీ కార్మికులు ఎక్కువసేపు ఒకేచోట నిలబడటం వల్ల కాళ్ల సిరల్లో ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా కదలకుండా నిలబడే అలవాటు ఈ సమస్యను పెంచుతుంది.

2. వయస్సు పెరగడం:

వయస్సు పెరిగేకొద్దీ సిరల గోడలు, వాల్వుల పనితీరు క్రమంగా బలహీనపడవచ్చు. అందువల్ల వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే యువతలో కూడా రావచ్చు.

3. వంశపారంపర్య కారణాలు:

తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు వెరికోస్ వెయిన్స్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సిరల గోడల నిర్మాణం, వాల్వుల బలహీనతకు జన్యుపరమైన అంశాలు కూడా కారణమవుతాయి.

4. గర్భధారణ:

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది. హార్మోన్ల ప్రభావంతో సిరల గోడలు కొంత సడలుతాయి. పెరుగుతున్న గర్భాశయం.. కటి ప్రాంతంలోని రక్తనాళాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ఈ కారణాలతో కాళ్ల సిరల్లో రక్తం నిల్వ ఉండి వెరికోస్ వెయిన్స్ ఏర్పడవచ్చు. ఒకటి కంటే ఎక్కువ గర్భధారణలు జరిగిన మహిళల్లో ఈ ప్రమాదం పెరగవచ్చు.

5. అధిక బరువు, ఊబకాయం:

శరీర బరువు పెరిగినప్పుడు కాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల సిరల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

6. శారీరక వ్యాయామం లేకపోవడం:

ఎక్కువసేపు కూర్చోవడం, నడక లేకపోవడం, కాళ్ల కండరాలు చురుకుగా పనిచేయకపోవడం వల్ల రక్తం పైకి పంపే ప్రక్రియ మందగిస్తుంది.

7. గతంలో రక్తం గడ్డకట్టడం:

కాళ్లలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్(డీవీటీ) వచ్చినవారిలో సిరల వాల్వులు దెబ్బతినవచ్చు. తద్వారా భవిష్యత్తులో క్రోనిక్ వీనస్ ఇన్‌సఫిసియెన్సీ వచ్చే ప్రమాదం ఉంటుంది.

8. ఇతర కారణాలు:

హార్మోన్ల మార్పులు, దీర్ఘకాలిక మలబద్ధకం, కొన్ని సందర్భాల్లో పెల్విక్ సిరల సమస్యలు కూడా వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణం కావచ్చు.

వెరికోస్ వెయిన్స్, ఉబ్బి, మెలికలు తిరిగినట్లు కనిపించే నరాలు
ఫొటో క్యాప్షన్, సిరల్లో రక్తం నిల్వ ఉండటం వల్ల ద్రవం కణజాలంలోకి చేరి చీలమండలు, పాదాల దగ్గర వాపు వస్తుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి?

  • కాళ్లపై నీలం, ఆకుపచ్చ రంగులో ఉబ్బిన నరాలు కనిపించడం
  • ఎక్కువసేపు నిలబడినప్పుడు కాళ్లలో నొప్పి, బరువుగా అనిపించడం
  • పిక్కలలో అలసట, లాగుతున్నట్లు లేదా మంటగా అనిపించడం
  • చీలమండల దగ్గర వాపు రావడం, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇది ఎక్కువగా ఉండటం
  • కాళ్లలో దురద, మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించడం
  • రాత్రిపూట కాళ్ల కండరాలు పట్టేయడం
  • కాళ్లను పైకి పెట్టుకున్నప్పుడు లేదా నడిచినప్పుడు కొంత ఉపశమనం కలగడం

వ్యాధి ముదిరినప్పుడు చీలమండల చుట్టూ చర్మం నల్లబడటం, గోధుమ రంగులోకి మారడం, చర్మం గట్టిపడటం, పొడిబారడం వంటి మార్పులు కనిపిస్తాయి.

దీర్ఘకాలం చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన వారిలో వీటి వలన కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు.

1. కాళ్ల వాపు:

సిరల్లో రక్తం నిల్వ ఉండటం వల్ల ద్రవం కణజాలంలోకి చేరి చీలమండలు, పాదాల దగ్గర వాపు వస్తుంది. ఎక్కువసేపు నిలబడినప్పుడు వాపు పెరుగుతుంది.

2. చర్మం రంగు మారడం:

సిరల్లో ఒత్తిడి పెరగడం వల్ల రక్తంలోని కొన్ని పదార్థాలు చర్మ కణజాలంలో పేరుకుపోతాయి. ముఖ్యంగా హీమోసిడెరిన్ పేరుకుపోవడం వల్ల చీలమండల చుట్టూ చర్మం గోధుమ లేదా నల్ల రంగులోకి మారుతుంది.

3. చర్మం గట్టిపడటం:

దీర్ఘకాలిక వాపు, వాపుతో కూడిన కణజాల మార్పుల వల్ల చర్మం, దాని కింద ఉన్న కణజాలం గట్టిపడవచ్చు. దీనిని లైపోడెర్మటోస్క్లెరోసిస్ అంటారు. ఈ దశలో చర్మం ఎర్రగా, నొప్పిగా కూడా ఉండవచ్చు.

4. వెనస్ అల్సర్స్:

దీర్ఘకాలిక సిరల ఒత్తిడి కారణంగా చర్మానికి రక్తం, ఆక్సిజన్ సరఫరా దెబ్బతిని ముఖ్యంగా చీలమండ లోపలి వైపు మానని పుండ్లు ఏర్పడవచ్చు. వీటిని వెనస్ అల్సర్స్ అంటారు. ఈ పుండ్లు వారాలు, నెలల తరబడి మానకుండా ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

5. రక్తస్రావం:

చర్మానికి దగ్గరగా ఉన్న ఉబ్బిన సిరలు చిన్న గాయం తగిలినా పగిలి రక్తస్రావం కావచ్చు. కొన్నిసార్లు రక్తస్రావం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా వృద్ధుల్లో చర్మం పలుచబడినప్పుడు ఈ ప్రమాదం ఎక్కువ.

6. సూపర్‌ఫిషియల్ థ్రాంబోఫ్లెబైటిస్:

వెరికోస్ వెయిన్‌లో రక్తం గడ్డకట్టి వాపు, ఎర్రదనం, నొప్పి, సిర గట్టిపడటం వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. దీనిని సూపర్‌ఫిసియల్ వీనస్ త్రోంబోసిస్ అంటారు.

7. డీప్ వెయిన్ థ్రాంబోసిస్:

వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రతి ఒక్కరికీ డీవీటీ వస్తుందని చెప్పలేం. అయితే ఒక కాలులో అకస్మాత్తుగా తీవ్రమైన వాపు, నొప్పి, వేడి, ఎర్రదనం కనిపిస్తే డీవీటీ కావచ్చేమో అనుమానించి వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి. రక్తపు గడ్డ ఊపిరితిత్తులకు చేరితే పల్మనరీ ఎంబోలిజం అనే ప్రాణాపాయకర పరిస్థితి ఏర్పడవచ్చు.

వెరికోస్ వెయిన్స్‌ను గుర్తించడానికి వైద్యులు శారీరక పరీక్షతో పాటు అవసరమైతే డ్యూప్లెక్స్ అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.

వెరికోస్ వెయిన్స్, ఉబ్బి, మెలికలు తిరిగినట్లు కనిపించే నరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్
ఫొటో క్యాప్షన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సలో కాథెటర్‌ను సిరలోకి ప్రవేశపెడతారు.

ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?

1. జీవనశైలిలో మార్పులు

ప్రారంభ దశలో లక్షణాలు తక్కువగా ఉన్నవారికి జీవనశైలిలో మార్పులు సూచిస్తారు.

రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, ఎక్కువసేపు ఒకేచోట నిలబడకుండా మధ్యమధ్యలో నడవడం, ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసేవారు ప్రతి 30–60 నిమిషాలకు లేచి కొద్దిసేపు నడవడం, విశ్రాంతి తీసుకునేటప్పుడు కాళ్లను గుండె స్థాయి కంటే కొద్దిగా పైకి ఉంచడం, అధిక బరువు ఉంటే తగ్గించుకోవడం, పాదాలు, పిక్కల కండరాలను చురుకుగా ఉంచే వ్యాయామాలు చేయడం, చర్మాన్ని శుభ్రంగా ఉంచి తేమను కాపాడుకోవడం వంటి చర్యలు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ చర్యలు ఇప్పటికే దెబ్బతిన్న వాల్వులను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాలేవు.

2. కంప్రెషన్ స్టాకింగ్స్

ఇవి కాళ్లపై నియంత్రిత ఒత్తిడిని కలిగించి సిరల్లో రక్తం నిల్వ ఉండటాన్ని తగ్గిస్తాయి.

కాళ్ల వాపును తగ్గించడం, నొప్పి, బరువుగా అనిపించడం వంటి లక్షణాలను తగ్గించడం,

వీనస్ అల్సర్స్ ఉన్నవారిలో గాయం మానడానికి సహాయపడటం, ఎక్కువసేపు నిలబడే సమయంలో లక్షణాల తీవ్రతను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి.

అయితే వీటిని వైద్యుల సలహా మేరకు సరైన పరిమాణం, ఒత్తిడి (Compression level) ఆధారంగా ఎంచుకోవాలి.

కంప్రెషన్ స్టాకింగ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేయవు. లక్షణాలను నియంత్రించడంలో మాత్రమే సహాయపడతాయి.

3. ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్

ఇది ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న ఆధునిక చికిత్సా విధానాల్లో ఒకటి.

ఈ ప్రక్రియలో అల్ట్రాసౌండ్ సహాయంతో సమస్య ఉన్న సిరలోకి చిన్న కాథెటర్‌ను ప్రవేశపెడతారు. దాని ద్వారా లేజర్ శక్తిని పంపించి సిర లోపలి గోడను వేడెక్కిస్తారు. ఫలితంగా ఆ సిర మూసుకుపోతుంది. రక్తం ఇతర ఆరోగ్యకరమైన సిరల ద్వారా గుండెకు చేరుతుంది.

ఈ చికిత్సా విధానంలో పెద్ద కోత అవసరం ఉండదు. సాధారణంగా లోకల్ ట్యూమెసెంట్ అనస్థీషియా ఉపయోగిస్తారు. ఎక్కువమంది రోగులు అదే రోజు ఇంటికి వెళ్లవచ్చు. సాధారణ కార్యకలాపాలకు త్వరగా తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది.

4. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్

లేజర్ చికిత్స మాదిరిగానే ఇందులో కూడా కాథెటర్‌ను సిరలోకి ప్రవేశపెడతారు. అయితే లేజర్‌కు బదులుగా రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని ఉపయోగించి సిర లోపలి గోడను వేడెక్కించి మూసివేస్తారు. ఇది కూడా తక్కువ కోతతో చేసే చికిత్స.

లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ - రెండూ తగిన రోగుల్లో సమర్థమైన చికిత్సా విధానాలు. ఏది ఎంచుకోవాలనేది సిరల నిర్మాణం, అందుబాటులో ఉన్న సాంకేతికత, వైద్యుని అనుభవం ఆధారంగా నిర్ణయిస్తారు.

5. ఫోమ్ స్క్లెరోథెరపీ

ఈ విధానంలో ప్రత్యేకమైన ఔషధాన్ని నురుగులా తయారుచేసి సమస్య ఉన్న సిరలోకి ఇంజెక్షన్ ద్వారా పంపిస్తారు. ఆ ఔషధం సిర లోపలి గోడలకు ప్రతిచర్య కలిగించి సిర మూసుకుపోయేలా చేస్తుంది.

చిన్న, మధ్యస్థ పరిమాణంలోని వెరికోస్ వెయిన్స్‌కు, కొన్ని సందర్భాల్లో పెద్ద సిరలకూ ఈ విధానం ఉపయోగపడుతుంది.

6. మినిఫ్లెబెక్టమీ

చర్మానికి దగ్గరగా ఉబ్బి కనిపించే పెద్ద ఉపరితల సిరలను చిన్న చిన్న రంధ్రాల ద్వారా తొలగించే ప్రక్రియను మినిఫ్లెబెక్టమీ అంటారు.

దీన్ని సాధారణంగా లోకల్ అనస్థీషియాతో నిర్వహిస్తారు.

7. సంప్రదాయ శస్త్రచికిత్స (Vein Stripping and Ligation)

గతంలో వెరికోస్ వెయిన్స్‌కు ప్రధానంగా ఈ శస్త్రచికిత్స చేసేవారు. ఇందులో సమస్య ఉన్న సిరను కట్టివేసి, కొంత భాగాన్ని తొలగిస్తారు.

చికిత్స తర్వాత వెరికోస్ వెయిన్స్ మళ్లీ వస్తాయా?

ఇది చాలామందిలో ఉండే సందేహం. చికిత్స ద్వారా సమస్య ఉన్న సిరను మూసివేసినా, భవిష్యత్తులో ఇతర సిరల్లో కొత్తగా వెరికోస్ వెయిన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

కొన్నిసార్లు చికిత్స చేసిన ప్రాంతంలో కూడా రిఫ్లక్స్ తిరిగి రావచ్చు లేదా కొత్త రక్తనాళాలు అభివృద్ధి చెందవచ్చు.

అందువల్ల చికిత్స తర్వాత కూడా బరువు నియంత్రణ, నడక, వ్యాయామం, అవసరమైనప్పుడు కంప్రెషన్ స్టాకింగ్స్ ఉపయోగించడం, వైద్యుల సూచనల మేరకు ఫాలో-అప్ చేయడం ముఖ్యం.

అపోహలు – వాస్తవాలు

అపోహ: వెరికోస్ వెయిన్స్ కేవలం మహిళలకు మాత్రమే వస్తాయి.

వాస్తవం: పురుషులు, మహిళలు - ఇద్దరికీ ఈ సమస్య వస్తుంది. గర్భధారణ వంటి అదనపు ప్రమాద కారకాల వల్ల మహిళల్లో కొన్ని సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

అపోహ: ఇది కేవలం అందానికి సంబంధించిన సమస్య.

వాస్తవం: ప్రారంభంలో సిరలు ఉబ్బినట్లు కనిపించడం మాత్రమే ఉండవచ్చు. కానీ కొందరిలో చర్మం దెబ్బతినడం, పుండ్లు, రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

అపోహ: కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

వాస్తవం: ఇవి నొప్పి, వాపు వంటి లక్షణాలను తగ్గిస్తాయి. కానీ దెబ్బతిన్న వాల్వులను సరిచేయలేవు.

అపోహ: లేజర్ చికిత్స అంటే పెద్ద శస్త్రచికిత్స.

వాస్తవం: ఎండోవీనస్ లేజర్ చికిత్సలో సాధారణంగా పెద్ద కోత అవసరం ఉండదు. చాలా సందర్భాల్లో అదే రోజు ఇంటికి వెళ్లవచ్చు.

అపోహ: వెరికోస్ వెయిన్స్‌కు ఆపరేషన్ చేయించుకుంటే జీవితాంతం మళ్లీ రావు.

వాస్తవం: చికిత్స చేసిన సిర మూసుకుపోయినా ఇతర సిరల్లో కొత్తగా సమస్య రావచ్చు. అందుకే జీవనశైలి మార్పులు, ఫాలో-అప్ అవసరం.

అపోహ: నడక వల్ల వెరికోస్ వెయిన్స్ పెరుగుతాయి.

వాస్తవం: నడక వల్ల పిక్కల కండరాలు చురుకుగా పనిచేసి రక్తం గుండెకు తిరిగి చేరడానికి సహాయపడతాయి. సాధారణంగా నడక ప్రయోజనకరమే.

అపోహ: నూనెలతో మసాజ్ చేస్తే ఉబ్బిన నరాలు తగ్గిపోతాయి.

వాస్తవం: నూనెలు, మసాజ్‌లు దెబ్బతిన్న సిరల వాల్వులను సరిచేయలేవు. ముఖ్యంగా నొప్పిగా, ఎర్రగా, గట్టిగా ఉన్న సిరలపై బలంగా మసాజ్ చేయకూడదు.

వెరికోస్ వెయిన్స్, ఉబ్బి, మెలికలు తిరిగినట్లు కనిపించే నరాలు
ఫొటో క్యాప్షన్, చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

వెరికోస్ వెయిన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వంశపారంపర్యం, వయస్సు వంటి కొన్ని కారణాలను నివారించలేకపోయినా జీవనశైలిలో మార్పుల ద్వారా లక్షణాలను తగ్గించుకోవచ్చు.

  • ఎక్కువసేపు నిలబడే లేదా కూర్చునే ఉద్యోగాలు చేసేవారు తరచూ కదులుతూ ఉండాలి.
  • శరీర బరువును ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుకోవాలి.
  • పిక్కల కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి.
  • విశ్రాంతి సమయంలో కాళ్లను కొద్దిగా ఎత్తుగా ఉంచుకోవాలి.
  • చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
  • మలబద్ధకం ఉంటే పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  • ధూమపానానికి దూరంగా ఉండాలి.
  • కాళ్లపై చర్మం నల్లబడటం, వాపు, దురద, పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.

కాళ్లలో ఉబ్బిన సిర నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం, ఒక కాలులో అకస్మాత్తుగా వాపు, నొప్పి, ఎర్రదనం రావడం, సిర వెంట తీవ్రమైన నొప్పి, గట్టిపడటం, చీలమండ దగ్గర పుండు ఏర్పడి మానకపోవడం, చర్మం రంగు మారడం, గట్టిపడటం, అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి, రక్తంతో దగ్గు రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి.

కాళ్లపై ఉబ్బిన నరాలు కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.

అదే సమయంలో నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో వాస్క్యులర్ సర్జన్‌ను సంప్రదించి సమస్య తీవ్రతను తెలుసుకొని తగిన చికిత్స పొందవచ్చు.

(గమనిక: రచయిత వైద్యురాలు. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)