అమెరికా మధ్యంతర ఎన్నికలు: ట్రంప్ పార్టీ ఓటమి.. ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సెనేట్, ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు మెజారిటీ సాధించారు. దీంతో డోనల్డ్ ట్రంప్ మిగిలిన అధ్యక్ష పదవీకాలంలో కాంగ్రెస్‌పై డెమొక్రటిక్ పార్టీ నియంత్రణ కొనసాగనుంది.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న ఈ మార్పు ట్రంప్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఇరాన్‌తో యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు ఓడిపోయారని ట్రంప్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
తమ ఓటమికి ఇరాన్‌తో యుద్ధమే కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు ప్రపంచంలోని ఇతర దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని బీబీసీ న్యూస్ జర్నలిస్టులు విశ్లేషించారు.


ఫొటో సోర్స్, AFP via Getty Images
ట్రంప్ ఓటమిపై ఇరాన్ ఏమంది?
లండన్‌లోని బీబీసీ న్యూస్ పర్షియన్ సీనియర్ రిపోర్టర్ ఘోంచె హబీబియాజాద్ కథనం ప్రకారం.. అమెరికా రాజకీయాల్లో వచ్చిన మార్పుతో ఇరాన్ పట్ల తమ వైఖరి మారుతుందని భావించేవారు పొరబడుతున్నారని ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు.
అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేస్తే గతంలో కంటే భయంకరమైన రీతిలో ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తన తండ్రి అలీ ఖమేనీ తర్వాత మొజ్తబా ఖమేనీ ఆ పదవిని చేపట్టారు. అయితే, ఆయన కొన్ని నెలలుగా బహిరంగంగా కనిపించలేదు.
1979లో తెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనను గుర్తుచేసుకుంటూ బుధవారం విడుదల చేసిన ఆరు పేజీల సందేశంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
గల్ఫ్ అరబ్ దేశాలపై ప్రభావం
బీబీసీ భద్రతా వ్యవహారాల ప్రతినిధి ఫ్రాంక్ గార్డ్నర్ విశ్లేషణ ప్రకారం.. ఈ ఓటమి 'ప్రాజెక్ట్ ట్రంప్'కు ఎన్నికల పరంగా ఎదురుదెబ్బ. మరో సందర్భంలో ఇదే పరిణామం గల్ఫ్ అరబ్ దేశాలకూ ఇబ్బందికరంగా మారి ఉండేది.
అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబానికి ఈ ప్రాంతంలోని పలు దేశాలతో వ్యక్తిగత, వ్యాపార సంబంధాలున్నాయి. దుబయ్‌లో ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ ఉంది. ఖతార్ ఆయనకు 400 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విమానాన్ని బహుమతిగా ఇచ్చింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, సౌదీ అరేబియా కలిసి ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌కు చెందిన అఫినిటీ క్యాపిటల్ సంస్థలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.
ట్రంప్ తన తొలి అధ్యక్ష పదవీకాలంలో 2017లో విదేశీ పర్యటనకు రియాద్‌ను మొదటి గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
సౌదీ అరేబియాకు డెమొక్రటిక్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. 2022లో సౌదీ క్రౌన్ ప్రిన్స్‌తో బైడెన్ కరచాలనం చేసేందుకు ఇష్టపడనట్లు కనిపించిన ఘటన గుర్తుండే ఉంటుంది.
మరోవైపు, రసాయనిక వాయువును ఉపయోగించిన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను శిక్షించనందుకు గల్ఫ్ దేశాల నేతలు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఏడాది ఇరాన్‌తో జరిగిన యుద్ధం ట్రంప్‌పై ప్రజల అభిప్రాయాన్ని మార్చింది.
ఈ పరిణామంపై ఓ వ్యాఖ్యాత స్పందిస్తూ, ట్రంప్ గల్ఫ్ ప్రాంతంలో అగ్గి రాజేశారని అన్నారు.
"ఇదంతా ఫిబ్రవరి 28న మొదలైంది. యుద్ధాన్ని మళ్లీ తీవ్రతరం చేయవచ్చనే భయం ఇప్పటికీ ఉంది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఎదురుదాడి చేయడంతో కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల ఫలితాల్లో ఇరాన్ పాత్ర ఎంత?
వాషింగ్టన్ డీసీ నుంచి బీబీసీ రిపోర్టర్ రెబెక్కా పీడర్ కథనం ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయానికి ఇరాన్‌తో యుద్ధమే కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెబుతున్నారు.
ఈ యుద్ధం కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. పెట్రోల్ బంకుల్లో ధరలు పెరగడం ద్వారా ఆ ప్రభావం కనిపిస్తోంది.
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గ్యాలన్ పెట్రోల్ ధరను 2 డాలర్ల కంటే తక్కువకు తీసుకొస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ, 2026 అక్టోబర్‌లో గ్యాలన్ పెట్రోల్ సగటు ధర 4.31 డాలర్లుగా ఉంది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త యుద్ధం ఉండదని కూడా ఆయన హామీ ఇచ్చారు.
అయితే, మధ్యంతర ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఇరాన్‌కు చెందిన ఓ ద్వీపంపై అమెరికా దాడులు చేసింది. యుద్ధాన్ని ప్రారంభించినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ట్రంప్ విలేఖరులతో చెప్పారు.
అమెరికాతో చర్చల్లో ఇరాన్ తరఫున ప్రధానంగా వ్యవహరిస్తున్న ప్రతినిధి, అమెరికన్ ఓటర్లు యుద్ధాన్ని ఇష్టపడలేదని ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ అన్నారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అమెరికా విధానంలో మార్పు వస్తుందని ఆశించడం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఓ ప్రకటనలో తెలిపారు.
"నేను ముగిసిందని చెప్పినప్పుడే ఈ యుద్ధం ముగుస్తుంది" అని బీబీసీ అమెరికా భాగస్వామ్య సంస్థ సీబీఎస్ న్యూస్ ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
చైనాకు పైచేయి దక్కుతుందా?
బీబీసీ న్యూస్ చైనా ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ ప్రకారం, ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ చైనాకు ఇందులో ఓ అవకాశం కనిపించవచ్చు.
ఈ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా నిలిచేందుకు చైనా, అమెరికా పోటీపడుతున్నాయి. ఈ పోటీలో తమదే పైచేయి అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భావిస్తుండవచ్చు.
అమెరికా పరిశ్రమలను చౌకైన చైనా వస్తువుల నుంచి కాపాడేందుకు ట్రంప్.. అమెరికాకు దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించారు.
అయితే, దీనికి ప్రతిగా షీ జిన్‌పింగ్ మరింత భారీ సుంకాలు విధించడంతో ట్రంప్ ప్రణాళిక విఫలమైంది. ఫలితంగా అమెరికన్లకు అనేక వస్తువుల ధరలు పెరిగాయి. బొమ్మలు, దుస్తుల వంటి చిన్నచిన్న వస్తువుల ధరలు కూడా పెరిగాయి.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను కూడా చైనా నిలిపివేసింది. దీంతో ట్రంప్‌కు మద్దతుగా ఉండే రాష్ట్రాల్లోని రైతులు నష్టపోయారు.
జనవరి చివరి వారంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న 'సుంకాల యుద్ధానికి' తెరపడే అవకాశం ఉంది. మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ రాజీకి ప్రయత్నిస్తారని చైనా భావించవచ్చు. ఈ పర్యటన ద్వారా చైనాకు అనుకూలమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని షీ జిన్‌పింగ్ ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
రష్యాకు ఇంకా ఆశలు
బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోసెన్‌బర్గ్ కథనం ప్రకారం.. డోనల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలను కొనసాగిస్తారని తాము పూర్తిగా ఆశిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ రష్యా మీడియాతో చెప్పారు.
"త్వరలో త్రైపాక్షిక చర్చల మరో విడత జరగనుంది" అని పెస్కోవ్ తెలిపారు. వచ్చే వారం అబుదాబిలో రష్యా, యుక్రెయిన్, అమెరికా మధ్య జరగనున్న త్రైపాక్షిక చర్చలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"మెలానియా ట్రంప్ చేపట్టిన విజయవంతమైన మానవతా శాంతి ప్రయత్నాలను చూశాం" అని కూడా పెస్కోవ్ అన్నారు. రష్యా ఆక్రమణలో ఉన్న ఒలెష్కీలో ఇటీవల చేపట్టిన మానవతా కార్యక్రమాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. శాంతి ప్రయత్నాలు ఫలించకపోతే రష్యా గతంలో మాదిరిగానే యుక్రెయిన్, యూరప్‌లనే నిందించే అవకాశం ఉందని స్టీవ్ పేర్కొన్నారు.
"ఇప్పుడు ఈ విషయంలో డెమొక్రాట్లు, మధ్యంతర ఎన్నికలను కూడా రష్యా తప్పుపట్టవచ్చు. అయితే, డోనల్డ్ ట్రంప్‌ను మాత్రం నిందించకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్‌తో సంబంధాల కోసం రష్యా ఎంతో పెట్టుబడి పెట్టింది. ట్రంప్ ప్రభుత్వంతో ఆర్థిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని రష్యా ఇంకా ఆశిస్తున్నట్లు స్పష్టమవుతోంది" అన్నారు.

ఫొటో సోర్స్, Tehran Times
అమెరికా మధ్యంతర ఎన్నికలు యుక్రెయిన్, ఇరాన్, మొత్తం మధ్యప్రాచ్య ప్రజలకు దేశీయ రాజకీయాల కంటే.. ఈ ఫలితాలు కొనసాగుతున్న యుద్ధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంతోనే ఎక్కువగా ముడిపడి ఉన్నాయని బీబీసీ మానిటరింగ్ పేర్కొంది.
యుక్రెయిన్‌లో వ్యాఖ్యాతలు ట్రంప్ యుద్ధ నిర్వహణపై దృష్టి పెట్టారు.
"అధ్యక్షుడు ప్రతి యుద్ధాన్నీ పరిష్కరించారు. కానీ, తన యుద్ధంలో మాత్రం ఓడిపోయారు" అంటూ జర్నలిస్ట్ రోమన్ త్సింబాల్యుక్ వ్యాఖ్యానించారు.
యుక్రెయిన్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ విజయం కారణంగా రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలనే డిమాండ్ మరింత పెరుగుతుందని రష్యాలో కొందరు ఆశిస్తున్నారు.
అయితే, అమెరికాలో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడితే యుక్రెయిన్ విషయంలో అమెరికా విధానంపై కొత్త అనిశ్చితి నెలకొనవచ్చని మరికొందరు ఆందోళన చెందుతున్నారు.
అయితే, రష్యాతో భవిష్యత్తులో కుదిరే ఏ ఒప్పందాన్నైనా డెమొక్రటిక్ పార్టీ నియంత్రణలోకి వెళ్లిన కాంగ్రెస్ అడ్డుకోవచ్చని యుద్ధానికి మద్దతు ఇస్తున్న రష్యన్లు హెచ్చరిస్తున్నారు. అలాగే, రష్యాపై విధించిన ఆంక్షలను సడలించేందుకు కూడా అంగీకరించకపోవచ్చని భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























