‘స్నానానికి బదులు పెర్ఫ్యూమ్‌తో సరిపెట్టుకుంటున్న ఉద్యోగులు, కాలేజీలకు సెలవులు’ - హైదరాబాద్‌లో నీటి కొరతకు కారణమేంటి?

'నీటి సరఫరా ఆగిపోయి రెండు రోజులైంది. హాస్టల్లో ఉంటున్న వారు పెర్ఫ్యూమ్ కొట్టుకుని ఆఫీసులకు వెళుతున్నారు. కొందరైతే ఆఫీసులకు వెళ్లడంలేదు'' అంటూ నీటి ఎద్దడి సమస్య గురించి వివరించారు కనకదుర్గ.
గచ్చిబౌలిలో సత్యసాయి మెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారామె. నాలుగైదు రోజులుగా హైదరాబాదులో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది.
అయితే ఈ ఎద్దడి తాగునీటికి సంబంధించినది కాదు. తాగునీటేతర అవసరాల కోసం ఉపయోగించే నీటి సరఫరా నిలిచిపోవడంతో సైబరాబాద్ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఒకవైపు తాగునీటి అవసరాల కోసం జరుగుతున్న నీటిసరఫరా రోజురోజుకూ తగ్గిపోతుంటే, మరోవైపు వాడుక నీటి అవసరాలు ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.
ప్రత్యేకించి హైటెక్ సిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి సమస్య ఏర్పడటానికి కారణమేంటన్న విషయంపై బీబీసీ ఆయా ప్రాంతాలను సందర్శించింది.


ట్యాంకర్ల యజమానుల సమ్మెతో తీవ్రం
గత నాలుగు రోజులుగా గచ్చిబౌలి, మాదాపూర్ కొండాపూర్, తెల్లాపూర్, నానక్ రాం గూడ ప్రాంతాల్లో నీటి ట్యాంకర్ల యజమానులు సమ్మెలోకి దిగారు.
సమ్మెలో ఉన్నప్పటికీ కొందరు ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు నీటి సరఫరా చేస్తుండటంతో వాటిని అడ్డుకుని నిరసన తెలిపారు. ఆయా ట్యాంకర్లలోని నీటిని రోడ్లపైకి వదిలేశారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీటిని వృథాగా వదిలేయడంపై నెటిజన్లు విమర్శించారు.
నీటి ట్యాంకర్ల యజమానులు సమ్మె చేయడంతో సైబరాబాద్ ప్రాంతంలో నీటి సరఫరా.. వాడుక అవసరాల కోసం సరఫరా చేసే నీరు లేక ఇబ్బందులు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో జలమండలి పరిధిలో నిత్యం 7500 ట్యాంకర్లు వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తుంటుంది.
సైబరాబాద్ ప్రాంతంలో హాస్టల్స్, కమర్షియల్ కాంప్లెక్సులు, ఐటీ కాంపెనీలు ఎక్కువగా ఉండటంతో ప్రైవేటు ట్యాంకర్లపైనే అక్కడివారు ఆధారపడుతుంటారు. సైబరాబాద్ పరిధిలో సుమారు 1200 ప్రైవేటు ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తుంటాయని సైబరాబాద్ ప్రైవేట్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ బీబీసీకి చెప్పారు.
తమ బోర్లను తవ్వి, తొలగించడంతో నీటి సరఫరా నిలిపివేసి సమ్మెకు దిగాల్సి వచ్చిందని వివరించారు.
''మేం ఒక రోజు సమ్మె చేస్తే ఎంతో మంది రోడ్లపైకి వచ్చారు.'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బోర్లను తొలగించిన హైడ్రా
అక్టోబరు చివరి వారంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో హైడ్రా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. జనావాసాల్లో అక్రమంగా బోర్లు వేసి నీటిని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలపై దాదాపు 36 బోర్లను కూల్చివేసింది.
మాదాపూర్ సున్నంచెరువు, జీడిమెట్ల, తెల్లాపూర్ ప్రాంతాల్లో బోర్లను తొలగించింది.
''జనావాసాల్లో అక్రమంగా బోర్లు వేసినట్లుగా మాకు ఫిర్యాదులు వచ్చాయి. కొందరు ప్రైవేటు నీటి ట్యాంకర్ల యజమానులు నీటిని విచ్ఛలవిడిగా తోడేసి అమ్ముకుంటున్నట్లుగా తెలిసింది. దీనివల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేయడంతో బోర్లను తొలగించాం.'' అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.
బోర్లను తొలగించడంతో వ్యాపారులకు నీటి వనరులు లేక, ప్రైవేటు నీటి ట్యాంకర్లు నిలిచిపోయాయి.
బోర్లను తొలగించడంతో ఉపాధి పోయిందని, అందుకే సమ్మెకు దిగామని, ఒకవేళ ప్రభుత్వం నిర్దేశిత రుసుములు చెల్లించమంటే సిద్ధంగా ఉన్నామని ప్రైవేటు నీటి ట్యాంకర్ల అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.
'హాస్టళ్లు, కాలేజీలు, ఐటీ కంపెనీల.. అన్నింటిపైనా ప్రభావం'
ప్రైవేటు నీటి ట్యాంకర్ల సరఫరా నిలిచిపోవడంతో హాస్టళ్లు, కాలేజీలు, ఐటీ కంపెనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రత్యేకించి హాస్టళ్లకు నీటి సరఫరా.. అదీనూ వాడుక అవసరాల కోసం నీటి సరఫరా నిలిచిపోవడంతో నీరు లేక నిర్వాహకులు ఇబ్బందులు పడ్డారు.
''హాస్టళ్లకు మంజీరా నీటి సరఫరా లేదు. ప్రభుత్వం నుంచి నీటి సరఫరా లేదు. నీటి కనెక్షన్ లేకపోవడంతో జలమండలి నుంచి ట్యాంకర్ల నీరు సరఫరా ఉండటం లేదు. అది కూడా బుక్ చేసుుకుంటే రెండు, మూడు రోజులు పడుతోంది. అందుకే ప్రైవేటు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.'' అని తెల్లాపూర్ లో హాస్టల్ నిర్వహించే రాజారెడ్డి చెప్పారు.
హాస్టళ్లకు ఉపయోగించే భవనాలు చాలావరకు అద్దెకు తీసుకుని నడిపిస్తున్నట్లుగా నిర్వాహకులు చెప్పారు. ఒక నీటి ట్యాంకర్ 5 కిలోలీటర్ల వరకు రూ.1800-2000 వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు.
సగటున హాస్టల్ కు 20కిలో లీటర్ల నీరు అవసరం ఉంటుందని రాజారెడ్డి చెప్పారు.
''జలమండలి నీటి సరఫరా కోసం కనెక్షన్ తీసుకుంటే, వందల మందికి సరఫరా చేసే పరిస్థితి ఉండదు. పైగా, రోజూ విడిచి రోజూ సరఫరా కారణంగా సరిపడే పరిస్థితి లేదు.'' అన్నారాయన.
''హాస్టల్ కోసం 2వేల అడుగులకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేస్తే ఆ రెండు బోర్లు ఎండిపోయాయి. ప్రైవేటు ట్యాంకర్లు తప్ప మరో ఆప్షన్ లేదు.'' అని కనకదుర్గ చెబుతున్నారు.

'ట్యాంకర్లపై ఎందుకు ఆధారపడుతున్నామంటే..'
సైబరాబాద్ పరిధిలో దాదాపు 5వేల హాస్టళ్లు వరకు ఉన్నట్లు ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. వీటితోపాటు హైదరాబాద్ పరిధిలో మరో 5వేల వరకు ఉంటాయని వివరించారు. వీటిల్లో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన వారు కలిపి సుమారు 5లక్షల మంది వరకు ఉంటున్నారని చెప్పారు.
హాస్టళ్లు, ఐటీ కంపెనీలు కూడా ప్రైవేటు ట్యాంకర్ల పై ఆధారపడటంతో వారు నీటి సరఫరా నిలిచిపోయిన కారణంగా వాడుక నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని హాస్టళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
నీటి సరఫరా లేకపోతే హాస్టల్ ఎలా నిర్వహించాలని, వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారని ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధి మహీధర్ బీబీసీతో చెప్పారు. మంజీరా నీటి సరఫరా సరిపోవడం లేదన్నారు.
''తాగునీటిని ఏదో విధంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉంటుంది. కానీ, వాడుక అవసరాల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి. కూరగాయలు కడుక్కోవడం నుంచి బాత్రూం అవసరాల వరకు అన్నింటికీ నీరు కావాలి'' అని చెప్పారు.
నీటి సరఫరా లేకపోతే అందరూ ఖాళీ చేసి వెళ్లే అవకాశం ఉంటుందని మహీధర్ చెప్పారు.
''నీటి సమస్య ఉందని పొదుపుగా వాడుకోవాలని చెప్పాం. ప్రత్యేక సమయాల్లో నీటి సరఫరా ఉంటుందని చెప్పాం. హాస్టళ్లలో ఉండేవారు కూడా అందుకు సహకరిస్తున్నారు.'' అని చెప్పారు.
మినరల్ వాటర్ కొనుక్కొచ్చి మరీ, వాడుక అవసరాల కోసం తలో అర బకెట్ ఇవ్వాల్సి వచ్చిందని కనకదుర్గ వివరించారు.

కాలేజీలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు
హైటెక్ సిటీ ప్రాంతంలో నీటి కొరత నేపథ్యంలో హాస్టల్ సౌకర్యంతో నడిపిస్తున్న కాలేజీలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి.
హైటెక్ సిటీ ప్రాంతానికి బీబీసీ వెళ్లినప్పుడు విద్యార్థులు తమ వస్తువులు, బ్యాగులు తీసుకుని కళాశాలల నుంచి వెళ్లిపోవడం కనిపించింది.
''తీవ్రమైన నీటి కొరత వల్ల తాత్కాలికంగా కొన్ని రోజులు సెలవులు ప్రకటిస్తున్నాం. ఈ సమయంలో ఆన్ లైన్ తరగతులు కొనసాగుతాయి. కళాశాలలు తిరిగి తెరిచే విషయాన్ని తర్వాత తెలియజేస్తాం.'' అని నారాయణ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సెలవుల నోటీసు పంపించింది.
''నీటి ఇబ్బందుల నేపథ్యంలో మాదాపూర్ క్యాంపస్ విద్యార్థులకు కొన్ని రోజులు తాత్కాలికంగా సెలవులు ఇచ్చాం.'' అని శ్రీచైతన్య కళాశాలల అకడమిక్ డీన్ శంకరరావు బీబీసీతో చెప్పారు.
విద్యార్థులను ఇళ్లకు తీసుకెళుతున్న తల్లిదండ్రులతో బీబీసీ మాట్లాడింది.
''నీళ్లు లేని కారణంగా వారం రోజులపాటు దీపావళి సెలవులు అని చెప్పారు. అందుకే వచ్చి పిల్లలను తీసుకుపోతున్నాం.'' అని సిద్ధిపేటకు చెందిన అశోక్ బీబీసీతో చెప్పారు.

''నగరానికి దూరంగా వెళ్లి నీటిని తీసుకువస్తాం''
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయి కొరత తీవ్రం కావడంతో ప్రైవేటు ట్యాంకర్ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరిని కలిశారు.
పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి సమస్యపై చర్చించినట్లుగా సైబరాబాద్ ప్రైవేటు నీటి ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ వివరించారు.
''మా సమస్యను హైడ్రా కమిషనర్‌కు వివరించారు. జనావాసాల్లో కాకుండా నగరానికి దూరంగా వెళ్లి బోర్ల నుంచి నీటిని తీసుకువచ్చి సరఫరా చేయవచ్చని సూచించారు. అందుకు మేం అంగీకరించాం'' అని చంద్రశేఖర్ వివరించారు.
తాము ట్యాంకర్ నీటిని రూ.5-10వేల వరకు విక్రయిస్తున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని చెప్పారు.
హైడ్రా కమిషనర్ తో భేటీ తర్వాత సమ్మె విరమిస్తున్నామని, నీటి సరఫరా ప్రారంభిస్తామని సైబరాబాద్ ప్రైవేటు నీటి ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
ఇదే విషయంపై ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశారు.
''నగరంలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాణిజ్య అవసరాల కోసం పెద్ద ఎత్తున భూగర్భ జలాలను తోడటం వల్ల స్థానికులకు గృహ అవసరాలకు వినియోగించే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, అశోక్‌నగర్ వంటి ప్రాంతాల్లో నీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.
సాధారణంగా గృహ అవసరాల కోసం వేసే బోర్లు 100 నుంచి 300 అడుగుల లోతు వరకు ఉంటుండగా, వాణిజ్య అవసరాల కోసం కొందరు 1,000 నుంచి 1,500 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ లోతులో బోర్లు వేసి, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లతో నీటిని తోడుతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలపై మరింత ప్రభావం పడుతోంది.'' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు చెప్పారు.
ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన అనంతరం పెరీ అర్బన్ రీజియన్(ప్యూర్) నుంచి బోరు నీటిని సేకరించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు నీటి ట్యాంకర్ల సంఘం సభ్యులు అంగీకరించారని, నీటి సరఫరా కూడా పునరుద్ధరణ జరిగినట్లుగా ఆయన చెప్పారు.

ఏడెనిమిది నియోజకవర్గాలకు తాగునీటి కొరత
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో నిత్యం 560 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతున్నట్లుగా జలమండలి చెబుతోంది.
సింగూరు జలాశయం, మంజీరా నీటి సరఫరా తగ్గిపోవడంతో 20శాతం తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు.
దీని ప్రభావం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ సహా ఏడెనిమిది నియోజకవర్గాలపై పడనుందని చెప్పారు.
''తాగునీటి పరంగా 40 ఎంజీడీల లోటు ఏర్పడనుంది. అయితే భూగర్భ జలాలు పడిపోయాయి.దాని ప్రభావం తాగునీటిపైనా పడుతోంది. దానివల్ల నీటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.'' జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు.
సాధారణంగా వేసవిలో బోర్లు ఎండిపోయి నీటి ఇబ్బందులు ఎదుర్కొంటామని, ఈసారి నవంబరు నాటికే సమస్య మొదలైందని హైటెక్ సిటీ ప్రాంతవాసులు చెబుతున్నారు.
ఎల్ నినో కారణంగా వర్షభావం లోటు ఉన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఏడాది అక్టోబరు మూడో వారం నాటికి 21శాతం లోటు వర్షపాతం ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
మొత్తం 812 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 618 మిల్లీమీటర్ల వర్షపాతమే పడిందని చెబుతోంది. లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు తరిగిపోయాయి.
''మేం ఏటా వేసవిలో నీటి ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చేది. అదనపు ఖర్చు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు నవంబరుకే బోర్లలో నీరు అయిపోయాయి. ఇప్పుడు నుంచే ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది.'' అని కొండాపూర్ కు చెందిన ప్రవీణ్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























