‘సీన్’ మూవీ రివ్యూ: మాస్ హీరో ఇమేజ్‌‌ను తగ్గించుకుని సూర్య నటించిన ఈ సినిమా ఎలా ఉంది?

సీన్ మూవీ రివ్యూ
    • రచయిత, సాహితీ
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

'పాత కథనే కొత్తగా చెప్పు' హాలీవుడ్ స్టూడియోస్ ఆఫీసు బోర్డులపై విరివిగా కనిపించే కోట్ ఇది.

నిజమే.. కొత్త కథలని సృష్టించడం కంటే ఉన్న కథనే కొత్తగా చెప్పడంలోనే క్రియేటివ్ ప్రతిభ దాగుంటుంది.

మాస్, క్లాస్.. రెండు వర్గాల్లోనూ మంచి ఇమేజ్ ఉన్న సూర్య.. ఇప్పుడు తన 'సీన్'తో అలాంటి ఓ ప్రయత్నం చేశారు.

మరి ఈ కొత్త ప్రయత్నం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది?

థియేటర్లో ఈ 'సీన్' ఎలా పేలింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరీ సీరియల్ కిల్లర్?

సీరియల్ కిల్లర్ విక్టర్ (టివినో థామస్)ను పట్టుకొని జైల్లో వేసిన తెలివైన పోలీస్ ఆఫీసర్ ప్రేమ్‌రాజ్ (సూర్య).

తన వ్యక్తిగత సమస్య కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటాడు.

ఇంతలో జైల్లో ఉన్న కిల్లర్ విక్టర్ తరహాలోనే బయట మరికొన్ని హత్యలు జరుగుతాయి.

దీంతో అసలు ప్రేమ్‌రాజ్ పట్టుకున్న విక్టర్ నిజమైన కిల్లరా? లేదా అసలు కిల్లర్ బయట తిరుగుతున్నాడా? అనే అనుమానం మొదలవుతుంది.

దీంతో ఈ కేసును మళ్లీ విచారించడానికి ప్రేమ్‌రాజ్ రంగంలోకి దిగుతాడు.

ఈ విచారణ ఎలా సాగింది? ప్రేమ్‌రాజ్ ఎందుకు రాజీనామా చేయాలనుకున్నాడు? అసలు కిల్లర్‌ను పట్టుకున్నాడా? అనేది మిగతా కథ.

సీన్ సినిమా రివ్యూ
ఫొటో క్యాప్షన్, నిజానికి ఇలాంటి కథలు ఇదివరకే వచ్చాయి. కాకపోతే దర్శకుడు జీతూ మాధవన్ పాత కథకు ట్రీట్‌మెంట్ కొత్తగా ఇచ్చాడు.

బలహీనతలే బలంగా మారాయా?

సింపుల్ క్రైమ్ స్టోరీ ఇది.

నిజానికి ఇలాంటి కథలు ఇదివరకే వచ్చాయి. కాకపోతే దర్శకుడు జీతూ మాధవన్ పాత కథకు ట్రీట్‌మెంట్ కొత్తగా ఇచ్చాడు.

హీరో మొదలుకొని ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు ఒక లోపం పెట్టాడు. ఆ లోపాలే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి.

హీరోతో పాటు ఇతర పాత్రలను కూడా విభిన్నంగా డిజైన్ చేశాడు దర్శకుడు.

నజ్రియా పాత్రతో పాటు హీరో తల్లిదండ్రుల పాత్రల్లోనూ ఆసక్తికరమైన లోపాలు ఉన్నాయి.

ఇవన్నీ కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.

హీరోకు ఉన్న లోపమే కథను నడిపిస్తుంది. ఆ మ్యాజిక్ థియేటర్ లోనే చూడాలి.

సూర్య సీన్ మూవీ
ఫొటో క్యాప్షన్, సినిమాలో కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. నేపథ్య సంగీతం ఫ్రెష్‌గా ఉంది.

సీరియల్ కిల్లర్ కథలో కామెడీ!

ఈ కథను దర్శకుడు తేలికపాటి ఎమోషన్స్, యాక్షన్‌తో నడిపాడు.

కామెడీకి పెద్దపీట వేశాడు.

నిజానికి ఒక సీరియల్ కిల్లర్ కథలో ఈ ట్రీట్మెంట్ కొత్తగా ఉన్నప్పటికీ అదే సమయంలో సీరియస్ నెస్ విషయంలో కొన్ని లోపాలు కనిపిస్తాయి.

ఇలాంటి కథలో విచారణ పక్కాగా వుండాలి. అలాగే మైండ్ గేమ్ లాజిక్స్ కూడా ప్రేక్షలులు రియల్ అన్నట్టుగా ఫీల్ అవ్వాలి.

ఈ విషయంలో సీన్ కాస్త నిరాశ పరుస్తుంది.

సినిమాకి 'సీన్' అని పేరు పెట్టారు కానీ ఇందులో జరిగే విచారణ చాలా వరకూ మాటలకే పరిమితం అవుతుంది. దీంతో విజువల్ పరంగా ప్రభావం తగ్గుతుంది.

సూర్య మూవీ రివ్యూ
ఫొటో క్యాప్షన్, ఎలాంటి ఎలివేషన్స్ అవసరం లేదని, కేవలం క్యారెక్టర్‌ను నమ్మి సూర్య ఈ సినిమాలో నటించాడు

సూర్య ఇమేజ్‌కు భిన్నంగా!

హీరో సినిమా అంతా టీషర్ట్, షార్ట్‌లోనే ఉండాలి.

ఈ పాయింట్ చెప్పిన వెంటనే చాలా మంది హీరోలు వెనక్కి తగ్గొచ్చు. కానీ సూర్య ముందుకొచ్చాడు.

ఎలాంటి ఎలివేషన్స్ అవసరం లేదని, కేవలం క్యారెక్టర్‌ను నమ్మి నటించాడు. అదే ఆ పాత్రకు మంచి నమ్మకాన్ని తీసుకొచ్చింది.

తన బాడీ లాంగ్వేజ్, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తోనే క్యారెక్టర్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మాస్ హీరోగా తనకు ఉన్న ఇమేజ్‌ను పక్కన పెట్టి ఇలాంటి పాత్ర చేయడానికి ముందుకు రావడం అభినందించాల్సిన విషయం.

నజ్రియా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

ఇందులో తను చేసే ఫైట్ మరో ఆకర్షణ. నస్లెన్ స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఉంది. ఇప్పటివరకు తను చేసిన పాత్రలకు భిన్నమైన క్యారెక్టర్ ఇది.

టొవినో క్యారెక్టర్‌ను సెకండ్ పార్ట్ కోసం దాచారు. కాకపోతే తను కనిపించిన జైలు సీన్ ఈ కథకు పెద్ద మలుపు.

జ్యోతికను ఒక షాట్‌లో రివీల్ చేసిన విధానం బాగుంది.

లాల్, ఆనంద్ రాజ్‌తో పాటు మిగతా పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

ప్రత్యేకంగా ఈ సినిమాలో పాటలు వినిపించవు. ఉన్న ఒక్క పాట కూడా మాంటేజ్‌గా వినిపిస్తుంది. అది సినిమాకు కలిసొచ్చింది.

కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. నేపథ్య సంగీతం ఫ్రెష్‌గా ఉంది. న్యూ ఏజ్ ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా కొత్తదనాన్ని జోడించింది.

పెద్ద హీరో సినిమా అంటే భారీ వరల్డ్ బిల్డింగ్‌లు, ఎలివేషన్స్‌తో సినిమాలు తయారుచేస్తున్న కాలమిది. అలాంటి హడావిడి లేకుండా ఒక మామూలు కథకు కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చిన సినిమా ఇది.

ఇందులో పాత్రలకు లోపాలు ఉన్నట్లే సినిమాలోనూ కొన్ని లోపాలు కనిపిస్తాయి. కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు కాలక్షేపానికైతే కొరత ఉండదు.

(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)