రుచిరా రణసింఘ: ‘‘చేతులకు బేడీలు, నోటికి ప్లాస్టర్ వేసైనా.. నా దేశానికి పంపండి’’

ఫొటో సోర్స్, Supplied
- రచయిత, ఆయేషా పెరీరా, దినుక్ హివావితరణ
- నుంచి, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
రుచిరా రణసింఘ పదేళ్ల కిందట శ్రీలంకను విడిచిపెట్టినప్పుడు తాను దక్షిణ పసిఫిక్‌లోని ఒక చిన్న ద్వీపసమూహంలో చిక్కుకుపోతానని ఊహించలేదు.
50 ఏళ్ల రుచిరా మూడేళ్లుగా కుక్ ఐలాండ్స్‌లో చిక్కుకుపోయారు.
తాను తిరిగి శ్రీలంకకు వెళ్లాలనుకుంటున్నానని అవసరమైతే తన "చేతులకు బేడీలు వేసి, నోటికి ప్లాస్టర్ వేసి" అయినా తీసుకువెళ్లమని కోరుతున్నట్లు ఆమె బీబీసీతో చెప్పారు.
రణసింఘ న్యూజీలాండ్‌లో స్థిరపడాలనుకున్నారు.
అక్కడ ఆశ్రయం కోరిన తర్వాత, వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడాలని ఇమ్మిగ్రేషన్ సలహాదారొకరు ఇచ్చిన సూచనను ఆమె పాటించారు.

అయితే కుక్ ఐలాండ్స్కు చేరుకున్న తర్వాత ఆమె వర్క్ వీసా దరఖాస్తును తిరస్కరించారు.
అంతేకాకుండా న్యూజీలాండ్‌ను వీడటం ద్వారా ఆమె తన మునుపటి ఆశ్రయ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లయింది.
ఇప్పుడు ఆమె శ్రీలంకకు తిరిగి వెళ్లడానికి ట్రాన్సిట్ వీసా ఇవ్వడానికి న్యూజీలాండ్ నిరాకరిస్తోంది. ఆస్ట్రేలియా కూడా వీసా ఇవ్వడానికి అంగీకరించలేదు.

ఆశ్రయం కోరుతూ వీసా దరఖాస్తు
కుక్ దీవుల నుంచి ప్రయాణించగలిగే ఇతర అంతర్జాతీయ గమ్యస్థానాలైన తాహితీ, హవాయి వెళ్లాలన్నా ఏ వీసా కోసమైనా ముందుగా ఆమె న్యూజీలాండ్‌లో బయోమెట్రిక్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
దీనివల్ల ఆమె అక్కడి నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గం లేకుండా పోయింది.
"నా ఏకైక కుమారుడికి నవంబర్‌లో వివాహం జరగనుంది. ఆ పెళ్లికి నేను ఖచ్చితంగా వెళ్లాలనుకుంటున్నా. నా పరిస్థితి చూసి మా అమ్మ ఎంతో ఆందోళన చెందుతోంది. ఆమె తరచూ ఆసుపత్రి పాలవుతోంది. వారు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కేవలం ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను" అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
శ్రీలంకలో ఆమె నిర్వహిస్తున్న చిన్న టీ షర్ట్ ఫ్యాక్టరీ నష్టాలు వచ్చి, మూతపడటంతో రణసింఘ 2018లో దేశాన్ని విడిచిపెట్టారు.
అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడుతూ వృద్ధులు పిల్లలను చూసుకునే డొమెస్టిక్ కేర్‌గివర్‌గా పని చేయడానికి హాంకాంగ్ వెళ్లారు.
ఆమె తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు ఆమె సోదరుడు బీబీసీతో చెప్పారు.
డ్రగ్స్‌కు బానిసైన ఆమె భర్త ఏడేళ్ల క్రితమే మరణించారన్నారు.
2022 డిసెంబర్లో రణసింఘ న్యూజీలాండ్ వెళ్లారు.
అక్కడ రెండు నెలల విజిట్ వీసాపై తన కజిన్‌తో కలిసి నివసించారు.
వీసా గడువు ముగిసే సమయానికి శ్రీలంకలో అప్పులు ఇచ్చిన వారి నుంచి తనకు ప్రాణభయం ఉందని చెబుతూ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇమ్మిగ్రేషన్ అనువాదకుడొకరు ఆమెకు సాయం చేశారు.
ఆమెకు అసైలమ్ సీకర్ 'ఓపెన్ వర్క్ వీసా' లభించింది.
దీనితో ఆమె ఏడాది పాటు ఏ యజమాని వద్దనైనా పని చేసే అవకాశం దొరికింది.
ఒక రెస్టారెంట్లో ఆమెకు ఉద్యోగం లభించింది.
ఆ రెస్టారెంట్ ఆమెకు ఎంప్లాయ్మెంట్ వీసా స్పాన్సర్ చేయడానికి అంగీకరించింది.
దీనివల్ల తనకు దీర్ఘకాలిక స్థిరత్వం లభిస్తుందని ఆమె భావించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
దరఖాస్తుల తిరస్కరణ
న్యూజీలాండ్‌లో అసైలమ్ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నప్పుడు సాధారణంగా ఇతర వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు. దీంతో ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.
ఆ సమయంలో ఆమె 'ఇమ్మిగ్రేషన్ అండ్ సెక్రటేరియల్ సర్వీసెస్' అనే సంస్థను సంప్రదించారు. విదేశాల నుంచి కొత్త ఎంప్లాయ్మెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆ సంస్థ తనకు చెప్పిందని ఆమె పేర్కొన్నారు.
రణసింఘ దేశం విడిచి వెళ్లిన వెంటనే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆ సంస్థ మేనేజర్ సిల్వియాన్ గల్లాంట్ చెప్పినట్లు బీబీసీ చూసిన ఈమెయిల్ సంభాషణలు స్పష్టం చేస్తున్నాయి.
ఆ దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆమె కుక్ ఐలాండ్స్‌లో కొద్దిరోజులు గడపడానికి టికెట్ బుక్ చేసుకున్నారు.
కానీ ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది.
అక్కడ కూడా ఆమెకు ఎంప్లాయ్మెంట్ వీసా నిరాకరించారు.
న్యూజీలాండ్ వీడటంతో ఆమె తన మునుపటి వీసా నిబంధనలను ఉల్లంఘించి నట్లయింది. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి వీసాలు మంజూరు చేయమని న్యూజీలాండ్ అధికారులు స్పష్టం చేశారు.
ఆమె కోసం న్యూజీలాండ్ అప్పటి ఇమ్మిగ్రేషన్ మంత్రి క్రిస్ పెంక్ సహా పలువురు రాజకీయ నాయకులకు లేఖలు రాయడం లాంటి అనేక ప్రయత్నాలు చేసినట్లు గల్లాంట్ పేర్కొన్నారు.
ఇదంతా తన తప్పేనని గల్లాంట్ ఒప్పుకున్నారని "తాను ఇక చేయగలిగింది ఏమీ లేదు" అని చేతులెత్తేసినట్లు రణసింఘ చెప్పారు.
"నువ్వు ఇంటికి తిరిగి వెళ్లడమే మంచిదని ఆమె నాకు చెప్పారు. అక్కడ నన్ను ఆపేదేం లేకపోవడంతో నేను వెళ్లడానికి అంగీకరించాను" అని రణసింఘ వాపోయారు.
అయితే శ్రీలంక వెళ్లేందుకు ఆమె టికెట్ తీసుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు న్యూజీలాండ్ ట్రాన్సిట్ వీసా లేకుండా విమానం ఎక్కడానికి కుదరదని అధికారులు ఆమెకు చెప్పారు.
న్యూజీలాండ్ ట్రాన్సిట్ వీసా కోసం ఆమె చేసుకున్న మూడు దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు.
ఆమె న్యూజీలాండ్ నుండి తిరిగి వెళ్తుందనే నమ్మకం తమకు లేదని అధికారులు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ట్రాన్సిట్ వీసా కోసం చేసుకున్న 4 దరఖాస్తుల్ని కూడా ఆస్ట్రేలియన్ అధికారులు తిరస్కరించారు.
ట్రాన్సిట్ వీసా తిరస్కరిస్తూ న్యూజీలాండ్ ప్రభుత్వం పంపిన లేఖలో ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించింది.
అయితే అమెరికాకు చెందిన హవాయి రాష్ట్రం ఫ్రెంచ్ పాలినేషియన్ ద్వీపమైన తాహితీ ఆమె బయోమెట్రిక్ సమాచారం ఇస్తేనే వీసా ప్రక్రియ సాధ్యమని చెప్పాయి.
బయోమెట్రిక్ సమాచారం కావాలంటే ఆమె స్వయంగా న్యూజీలాండ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ప్రత్యామ్నాయ మార్గాల కోసం చేస్తున్న ప్రయత్నాలు, కుమారుడి వివాహం, తల్లి అనారోగ్యం వంటి అన్ని వివరాలను పొందుపరుస్తూ రణసింఘ న్యూజీలాండ్ ప్రభుత్వానికి పెట్టుకున్న తాజా దరఖాస్తును కూడా తిరస్కరించారు.
"టికెట్ల కోసం చాలా డబ్బు నష్టపోయాను. దాదాపు నాలుగేళ్లుగా వీసాల కోసం దరఖాస్తులు చేస్తూనే ఉన్నాను. ఏదీ ఫలించలేదు" అని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

ఫొటో సోర్స్, Supplied
దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుని..
అందమైన ఇసుక తీరాలు, అగ్నిపర్వత శిఖరాలకు పేరుగాంచిన ఆక్లాండ్ నుంచి కుక్ ఐలాండ్స్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రణసింఘ అక్కడ ఇష్టం లేకున్నా ఉండాల్సిన అతిథిగా మిగిలిపోయారు.
తన పరిస్థితిలో ఉన్న ఇతరులకన్నా తను కొంత అదృష్టవంతురాలినని ఆమె అన్నారు.
ఒక హోటల్ వారు తమ స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉచితంగా వసతి కల్పించారని, స్థానికులు ఆహారం, దుస్తులు అందిస్తూ సాయం చేస్తున్నారని ఆమె చెప్పారు.
ఆ హోటల్ డైరెక్టర్లలో ఒకరు ఆమెకు కుట్టు మిషన్ కూడా ఇచ్చారు.
దీనితో ఆమె చిన్నపాటి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
"ఇంత మంచి మనసున్న వ్యక్తులు ఉన్న చోట నేను ఉన్నానంటే నేను ఏదో మంచి పని చేసే ఉంటానని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది" అని ఆమె బీబీసీతో అన్నారు.
కానీ, అక్కడ బందీగా చిక్కుకుపోయాననే బాధను అది ఏమాత్రం తగ్గించలేకపోతోంది.
ఈ ఒత్తిడి ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
"నాకు ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"నిజం చెప్పాలంటే ఆమె సమస్యకు పరిష్కారం ఏమిటో నాకు తెలియడం లేదు" అని ఆక్లాండ్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ చట్టాల నిపుణుడు అలస్టెయిర్ మెక్క్లైమాంట్ అన్నారు.
ఆమెకు "దారుణమైన సలహా" ఇచ్చారని అది ఖచ్చితంగా నిజమైన ఇమ్మిగ్రేషన్ లాయర్ నుంచి వచ్చి ఉండదని, నష్టాలను అర్థం చేసుకోకుండా కేవలం ఫీజుల కోసం దరఖాస్తులు చేసే "ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ల" వల్లే ఇలా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
రణసింఘ 'ఇమ్మిగ్రేషన్ అండ్ సెక్రటేరియల్ సర్వీసెస్' సంస్థకు ఫీజుల రూపంలో వేలాది న్యూజీలాండ్ డాలర్లు చెల్లించినట్లు చెప్పారు.
బీబీసీ గల్లాంట్ను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
స్వదేశంలో తనకు ముప్పు ఉందని పేర్కొంటూ గతంలో ఆమె అసైలమ్ కోసం దరఖాస్తు చేసుకున్నందున రణసింఘ తిరిగి శ్రీలంకకు వెళ్తుందనే నమ్మకం లేకపోవడం వల్లే న్యూజీలాండ్ అధికారులు ట్రాన్సిట్ వీసా ఇవ్వడం లేదని మెక్క్లైమాంట్ అభిప్రాయపడ్డారు.
న్యూజీలాండ్ తన పొరుగు దేశమైన ఆస్ట్రేలియాతో సమన్వయం చేసుకుంటుంది కాబట్టి ఆస్ట్రేలియా కూడా ఆమెకు ట్రాన్సిట్ వీసా ఇవ్వడానికి ఇష్టపడదని, ఫ్రాన్స్, అమెరికా కూడా ఇదే ముగింపుకు వస్తాయని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Thilina Kaluthotage
శ్రీలంక ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఆమె వెళ్లాలంటే ఎక్కడో ఒకచోటకు ట్రాన్సిట్ అవ్వాల్సిందే కానీ ఆ రిస్క్ తీసుకోవడానికి ఏ దేశమూ సిద్ధంగా లేదు.
రణసింఘ నుంచి అనేక ట్రాన్సిట్ వీసా దరఖాస్తులు వచ్చాయని అయితే ఆమెకు న్యూజీలాండ్ ద్వారా స్వదేశానికి వెళ్లాలనే ఉద్దేశం పట్ల తమకు సందేహాలుండ వల్లే వాటన్నింటినీ తిరస్కరించినట్లు ఇమ్మిగ్రేషన్ న్యూజీలాండ్ బీబీసీతో చెప్పింది.
చేతులకు బేడీలు వేసి ఎస్కార్ట్‌తో పంపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించగా ఇమ్మిగ్రేషన్ మంత్రి కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ అటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ సదరు వ్యక్తి మళ్లీ అసైలమ్ క్లెయిమ్ చేయకుండా నిరోధించలేవని చెప్పారు.
ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రణసింఘ వ్యవహారంలో వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.
ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీయులెవరైనా "వలస చట్టం 1958 (ది యాక్ట్), వలస నిబంధనలు 1994" నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పేర్కొంది.
ఆమె విషయంలో శ్రీలంక ప్రభుత్వం ఏమైనా సాయం కోసం రణసింఘ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
తాము "సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషించామని కానీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు" అని ఆమె సోదరుడు చెప్పారు.
కుక్ ఐలాండ్స్ నుంచి ఆమెను శ్రీలంకకు తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ బీబీసీకి తెలిపింది.
న్యూజీలాండ్‌లోని వెల్లింగ్టన్లోని శ్రీలంక హైకమిషన్ అధికారులు సంబంధిత న్యూజీలాండ్ అధికారులు ఈ విషయమై విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
కానీ రణసింఘ సోదరుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"ఆమె మానసిక స్థితి అస్సలు బాగాలేదు" అని ఆయన బీబీసీతో అన్నారు.
"ఒకసారి మేము మాట్లాడినప్పుడు నన్ను బతికుండగా ఇంటికి పంపడం వారికి ఇష్టం లేకపోతే, కనీసం నా మృతదేహాన్నైనా దేశానికి పంపించమని చెప్పింది" అని ఆయన వాపోయారు.
కేతకి మాసిలామణి, జూలియానా ఖాన్ అదనపు సమాచారంతో
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























