మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
చంటిబిడ్డను ఎత్తుకొని హాఫ్ మారథాన్ పూర్తి చేసిన కశ్మీరీ సైనికుడి భార్య.. ‘జీవితమంటే పోరాటం’ అని ఎందుకన్నారు
- రచయిత, జహంగిర్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో ఒక మహిళ పరుగెత్తడం ప్రారంభించింది. తన బిడ్డను శరీరానికి కట్టుకోవడంతో అందరి దృష్టి ఆమెపై పడింది.
ఆమె మారథాన్‌లో పరుగెత్తుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే 34 ఏళ్ల కుల్సుమ్ బానో తన బిడ్డను పట్టుకొని పరిగెత్తాలనే నిర్ణయం వెనుక ఉన్న పరిస్థితులు ఆమె సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇలా చేయడానికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందని, ఈ పరుగు ద్వారా ఆ లక్ష్యాన్ని కొంతవరకు సాధించానని ఆమె చెబుతున్నారు.
శ్రీనగర్‌లో అక్టోబర్ 25న ఈ మారథాన్ రెండు విభాగాల్లో జరిగింది. ఒకటి 42.195 కిలోమీటర్లు కవర్ చేసే ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ రెండోది.
రెండు వేల మందికిపైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని పోలో గ్రౌండ్లో ఈ మారథాన్‌ను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ మారథాన్‌లో పాల్గొన్న కుల్సుమ్ బానో ప్రస్తుతం శ్రీనగర్‌లోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇలా పరుగు పందెంలో ఆమె పాల్గొనడంపై మిశ్రమ స్పందన వచ్చింది. వాస్తవానికి ఆమె స్వస్థలం గుజరాత్‌లోని సూరత్ జిల్లా. 2012లో ఆమె బందిపోరా జిల్లా గురేజ్ ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ లోన్‌ను వివాహం చేసుకున్నారు.
వివాహానికి ముందు కుల్సుమ్ ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసేవారు. సైన్యంలో చేరాలని కలలు కనేవారు.
ప్రస్తుతం తన భర్త సీఆర్పీఎఫ్లో ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా ఒంటరిగా తన ముగ్గురు బిడ్డల ఆలనాపాలన చూస్తూ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు కుల్సుమ్ పేర్కొన్నారు.
కుల్సుమ్ చిన్న బిడ్డ వయసు ఏడాది. కుమార్తెకు రెండేళ్లు. పెద్ద కుమారుడి వయసు 12 ఏళ్లు. బిడ్డల సంరక్షణలో పడి తన కలలకు దూరమయ్యానని ఆమె అంటున్నారు.
"ఒంటరిగా ఉన్నప్పుడే ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పుడు నా భర్త విధుల్లో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నాపైనే నాకు విసుగు వచ్చేది. నాకు సొంత కోరికలు, కలలు ఉండేవి. కానీ వాటిని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వచ్చింది" అని కుల్సుమ్ బీబీసీ హిందీతో చెప్పారు.
కుల్సుమ్ శ్రీనగర్‌లోని ఒక క్లబ్లో పార్ట్‌టైమ్ ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. అదే క్లబ్లో ఆమె పెద్ద కుమారుడు, ఎనిమిదో తరగతి విద్యార్థి అబ్దుల్లా ఇంతియాజ్ స్కేట్బోర్డింగ్ నేర్చుకుంటున్నాడు.
‘సైనికుడి భార్య జీవితం పోరాటాలు, త్యాగమే’
కుల్సుమ్ ప్రతి రోజూ ఉదయం మూడు గంటలకు నిద్ర లేస్తారు.
మొదట తన చిన్న బిడ్డకు పాలు తాగిస్తారు. తర్వాత ప్రార్థన చేస్తారు.
"ఆ తర్వాత నా కుమార్తె నిద్ర లేస్తుంది. అప్పుడు ఆమెకు ఆహారం పెడతాను. అనంతరం నా కుమారుడు నిద్ర లేచి బడికి సిద్ధమవుతాడు. ఒక పిల్లవాడు నిద్రపోతున్నప్పుడే ఇంకొకరితో ఆడుకోవాలి. మూడో బిడ్డను పాఠశాలకు పంపాల్సి ఉంటుంది. ఈ హడావిడిలో మధ్య మధ్య దొరికే కొన్ని క్షణాలే నా కోసం నేను జీవించే సమయం" అని కుల్సుమ్ చెప్పారు.
సైనికుడి భార్య జీవితం అంటే పోరాటం, త్యాగాలతో నిండి ఉంటుంది. బయటకు కనిపించే జీవితాన్ని మాత్రమే చూసే ప్రజలు, ఒక వ్యక్తి లోపల ఎంతటి కష్టాలను ఎదుర్కొంటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో అర్థం చేసుకోలేరు అని కుల్సుమ్ అంటున్నారు.
"బయట నుంచి చూసేవారికి మా జీవితం ఎలా ఉంటుందో అర్థం కాదు. నా భర్త ఒక యోధుడైతే, నేను కూడా యోధురాలనే. నేను ప్రపంచంతో, సమాజంతో, అలాగే నాతో నేనే ప్రతిరోజూ పోరాడుతుంటా. భార్యగా, తల్లిగా, ఒక మహిళగా అన్ని బాధ్యతలను ఒంటరిగానే నిర్వర్తిస్తున్నా. అది చాలా కష్టమైన విషయం. ఈ పరిస్థితుల్లో మారథాన్‌లో పాల్గొనడం కూడా ఎంతో ధైర్యం కావాలి" అని కుల్సుమ్ తెలిపారు.
కుల్సుమ్ మొదటి మారథాన్
మారథాన్ కోసం కుల్సుమ్ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఇందులో పాల్గొనాలనే ఆలోచన కూడా మొదట్లో లేదు. అయినప్పటికీ ఆమె రోజూ వ్యాయామం చేసేవారు.
ఆలోచనలో లేకపోయినా మారథాన్‌లో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందో కుల్సుమ్ వివరించారు. "మారథాన్‌కు ఒక రోజు ముందే నా స్నేహితుడు అబ్దుల్లా, కోచ్ సజ్జాద్ ఖాన్ సూచనతో రిజిస్ట్రేషన్ చేసుకున్నా. దీని గురించి భర్తకు చెప్పలేదు. ఆయనకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నా. నేను పరుగెత్తే ఫోటోలు, వీడియోలు ఆయనకు చేరుతాయని అనుకున్నాను" అని వివరించారు.
కుమారుడి స్కేట్ బోర్డింగ్ తరగతులకు వచ్చే సమయంలో కుల్‌సుమ్‌తో పరిచయం ఏర్పడిందని ఒక క్లబ్ నిర్వహిస్తున్న కోచ్ సజ్జాద్ ఖాన్ చెప్పారు.
"చిన్న పిల్లలను చూసుకునే వారు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ఎప్పుడు ఏ కార్యక్రమానికి వచ్చినా తన చంటి బిడ్డతో వచ్చేవారు. ఆమె సామర్థ్యం నాకు తెలుసు. అందుకే మారథాన్‌లో పాల్గొంటే మంచిదని భావించాను" అని వివరించారు.
అయితే, తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదని, పోటీలో పాల్గొనడం కష్టమవుతుందని మారథాన్ జరిగే రోజు కుల్సుమ్ చెప్పారు.
"నేను మారథాన్‌ను పూర్తి చేయలేనేమో అనుకున్నాను. కానీ చెల్లెల్ని తాను చూసుకుంటానని అబ్దుల్లా చెప్పాడు. అమ్మా మారథాన్ కంటే నీవే నాకు ముఖ్యమని అన్నాడు" అని కుల్సుమ్గుర్తు చేసుకున్నారు.
మారథాన్ కంటే చంటి బిడ్డ ముఖ్యం
అబ్దుల్లా అలా చెప్పిన తర్వాత చిన్న కుమారుడికి వెచ్చని దుస్తులు తొడిగి, బేబీ క్యారియర్ సహాయంతో తన శరీరానికి కట్టుకుని మారథాన్ వేదిక వద్దకు చేరుకున్నానని కుల్సుమ్ చెప్పారు.
మారథాన్ ప్రారంభమైనప్పటి నుంచి తన బిడ్డ ప్రశాంతంగా ఉండటంతో పరుగు పూర్తి చేయడంలో సమస్యలు ఎదురుకాలేదని కుల్సుమ్ చెప్పారు. మారథాన్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కూడా ఆమెను ప్రోత్సహించారు.
"ఒక చోట ఆకలితో చంటి బిడ్డ ఏడవడం కాస్త బాధ కలిగించింది. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఉన్న క్లాక్ టవర్ వద్ద ఆగి పాలు ఇచ్చాను. దీంతో నేను కొంత వెనుకబడ్డాను. రేసును పూర్తి చేయలేనేమో అనిపించింది. కానీ నా మొదటి ప్రాధాన్యం నా బిడ్డే. తర్వాతే మిగతావన్నీ. అతను ప్రశాంతంగా లేకపోయి ఉంటే బహుశా నేను రేసు మధ్యలోనే విరమించుకునేదాన్ని. నేను రేసు పూర్తి చేశానంటే అందులో 99 శాతం క్రెడిట్ నా బిడ్డదే" అని అన్నారు.
హాఫ్ మారథాన్‌లో పరుగెత్తిన కుల్సుమ్పై విమర్శలు
సుమారు మూడు గంటల్లో హాఫ్ మారథాన్ పూర్తి చేసిన కుల్సుమ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.
కొందరు కుల్సుమ్ ప్రతిభను ప్రశంసిస్తుంటే, మరికొందరు తన చంటి బిడ్డ వెంట తీసుకొని పరుగెత్తడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
"విమర్శలు చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నా. ఇదంతా బలవంతంగా చేయలేదు. ఏదైనా సాధించాలనే తపనతో చేశా. మొదట నేను తల్లిని. అందుకే నేనేం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే హక్కు ఎవరికూ లేదు" అని కుల్సుమ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
"కుల్సుమ్ను చాలా మంది విమర్శిస్తున్నారు. ప్రచారం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. తన బిడ్డను వెంట తీసుకెళ్లడం ఆమెకు తప్పనిసరి. విమర్శలు చేయడం చాలా సులభం. ఆమె ఎలా ఉందో అని తెలుసుకునేందుకు ఆమెతోపాటు నేను కూడా నడిచా. ప్రతి కథకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒక నిర్ణయానికి వచ్చే ముందు వాటిని అర్థం చేసుకోవాలి" అని కోచ్ చెప్పారు.
"ఈ మారథాన్‌ను నా పిల్లలు జీవితాంతం గుర్తుంచుకుంటారని నమ్ముతున్నాను. నా పిల్లలు బలహీనంగా ఎదగకూడదనేది నా కోరిక. కష్టమైన పరిస్థితులు వచ్చినా వాటికి తట్టుకొని నిలబడటం నేర్చుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నా. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేను, కానీ నా పిల్లలు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటున్నాను" అని కుల్సుమ్ అన్నారు.
‘మహిళలకు సందేశం ఇవ్వడానికే’
మహిళలకు మంచి సందేశం ఇవ్వాలనే మరో లక్ష్యంతో మారథాన్‌లో పాల్గొన్నానని కుల్సుమ్ అంటున్నారు. ముగ్గురు పిల్లల తల్లినే ఇలాంటివి చేయగలిగినప్పుడు, ఇతర మహిళలు కూడా ఏదైనా సాధించగలరని ఆమె పేర్కొన్నారు.
"పిల్లలు పుట్టిన తర్వాత జీవితం ముగిసిపోయిందని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. ఏం చేయలేమని అనుకుంటారు. కానీ పిల్లలతో ఆడటం, ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అది కుటుంబానికి, సమాజానికి మంచిది" అని అన్నారు.
ఈ మారథాన్‌లో జమ్ముకశ్మీర్ నుంచి 1221 మంది అథ్లెట్లు, ఇతర రాష్ట్రాల నుంచి 513 మంది, ఇతర దేశాలకు చెందిన వారు 73 మంది పాల్గొన్నారు. పురుషుల విభాగంలో ఫుల్ మారథాన్‌లో ఇమ్మాన్యుయెల్ సికుకు ఎండీవా, మహిళల విభాగంలో షీలా జెప్కోస్గెయి చెసాంగ్ విజేతలుగా నిలిచారు. వీరిద్దరు కూడా కెన్యాకు చెందిన అథ్లెట్లు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)