మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపారు
రాజస్థాన్‌లోని భరత్‌పుర జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బయానా అతర్ సింగ్ భఢానాను ఆదివారం కొట్టి చంపేశారు. జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగిన అనంతరం సోమవారం ఉదయం ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
హరియాణాలోని ఫరీదాబాద్‌లోని తమ పూర్వీకుల గ్రామంలో సోమవారం అతర్ సింగ్ భడానా అంత్యక్రియలను నిర్వహించారు.
భడానా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు భరత్‌పుర్ ఎస్పీ రాజేశ్ మీనా సోమవారం రాత్రి తెలిపారు.
“వైర పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌండా గ్రామంలో క్రషర్‌కి వెళ్లే మార్గంపై భఢానా, గ్రామస్థుల మధ్య రెండేళ్లుగా వివాదం నడుస్తోంది. క్రషర్ పనులను నిలిపివేయాలనేది గ్రామస్థుల డిమాండ్” అని రాజేశ్ మీనా తెలిపారు.
ఘటన జరిగిన నాటి నుంచి గ్రామ ప్రజలు, యువత తప్పించుకొని తిరుగుతున్నారు. చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వైరా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ధీరేంద్ర తెలిపారు. శాంతి భద్రతల నేపథ్యంలో గ్రామంలో పోలీసులను మోహరించినట్లు తెలిపారు.
ఫరీదాబాద్ సోనిపాలి గ్రామానికి చెందిన అతర్ సింగ్ భఢానా.. బయానా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. భఢానాకు ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లలో ఒకరు హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి కాగా, మరో ఇద్దరు డాక్టర్లు. కుమారుడు ఫరీదాబాద్‌లో ఉంటారు. భడానా భార్య బయానాలో నివసిస్తున్నారు.
అతర్ సింగ్ భఢానా... ఆదివారం సాయంత్రం 6 గంటలకు భౌండా గ్రామంలోని క్రషర్ వద్దకు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న గ్రామస్థులు ఆయనపై కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తీవ్రంగా గాయపడిన భఢానాను తొలుత వైరలోని కమ్యానిటీ హెల్త్ సెంటర్‌కి తరలించారు. అనంతరం జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.