ఫైనాన్స్ విత్ హరీశ్: ఆన్‌లైన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య... 'అర్హత' ఏంటని ప్రశ్నించినందుకేనా?

    • రచయిత, గీతా పాండే, మోహన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఆన్‌లైన్ వేధింపుల (సైబర్‌బుల్లీయింగ్) కారణంగానే హరీశ్ అనే 27 ఏళ్ల ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, పెట్టుబడిదారులకు ఆర్థిక సలహాలు ఎవరు ఇవ్వాలనే దానిపై చర్చ మొదలైంది.

"ఫైనాన్స్ విత్ హరీశ్" పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజాదరణ పొందిన వి. హరీశ్, చెన్నైకి సమీపంలోని తన ఇంట్లో మంగళవారం ఉదయం శవమై కనిపించారు.

నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదులతో 'మెటా' సంస్థ ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించిన కొద్ది వారాలకే ఈ ఘటన జరిగింది.

ప్రముఖ యూట్యూబర్, టెక్ సంస్థ 'జెమూరియా' సీఈఓ జేసన్ శామ్యూల్ చేసిన ఆన్‌లైన్ వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని హరీశ్ తండ్రి జె. వినాయగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హరీశ్‌ను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని చూడటంతో పాటు, సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పరువు తీసేలా వీడియోలు పోస్ట్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు గురువారం శామ్యూల్‌ను అరెస్ట్ చేశారు.

ఈ ఉదంతం దేశంలో పెరుగుతున్న 'ఫైనాన్షియల్ కంటెంట్ క్రియేటర్ల' ప్రభావాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

లక్షలమంది కొత్త పెట్టుబడిదారులు మార్కెట్ సలహాల కోసం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు.

ఎవరీ హరీశ్? ఖాతా ఎందుకు తొలగించారు?

హరీశ్ సుమారు ఐదేళ్ల క్రితం ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించారు.

ఈ ఐదేళ్లలో 1,500కు పైగా వీడియోలు చేశారు. 1.3 మిలియన్ల (13 లక్షల) మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

మిలియనీర్లకు, అత్యంత సంపన్నులకు తాను ఆర్థిక సలహాదారునని హరీశ్ చెప్పుకునేవారు.

షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులు, బంగారం, వెండి ధరల గురించి వివరిస్తూ.. ఆసక్తికరమైన నేపథ్య సంగీతం, సినిమా క్లిప్‌లు, గ్లోబల్ లీడర్ల ఫోటోలతో ఆకట్టుకునేలా వీడియోలు చేసేవారు హరీశ్.

ముఖ్యంగా 2020 కోవిడ్ మహమ్మారి తర్వాత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరగడం, సంక్లిష్టమైన ఆర్థిక విషయాలను హరీశ్ సులభంగా అర్థమయ్యేలా చెప్పడంతో ఆయన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.

అయితే, చట్ట ప్రకారం పెట్టుబడి సలహాలు ఇవ్వాలన్నా, క్లయింట్ల పోర్ట్‌ఫోలియోలను నిర్వహించాలన్నా 'సెబీ' గుర్తింపు తప్పనిసరి.

కానీ హరీశ్‌కు సెబీ రిజిస్ట్రేషన్ లేదని ఫిర్యాదులు రావడంతో, సెప్టెంబర్‌లో మెటా ఆయన ఇన్‌స్టాగ్రామ్ పేజీని తొలగించింది. ఆ తర్వాత ఆయన తెరిచిన మరో బ్యాకప్ అకౌంట్‌ను కూడా ఫిర్యాదుల నేపథ్యంలో కొద్దిరోజులకే తీసేశారు.

"నా ఐదేళ్ల కష్టాన్ని దొంగిలించారు"

చనిపోవడానికి ముందు హరీశ్ రికార్డ్ చేసిన ఒక వీడియోలో, "నా ఐదేళ్ల కష్టాన్ని దొంగిలించారు" అని ఆవేదన వ్యక్తం చేసినట్లు ఎన్డీటీవీ పేర్కొంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో హరీశ్ తమిళంలో మాట్లాడుతూ, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో తన తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు, ఫాలోవర్లకు "ఐ యామ్ వెరీ సారీ" అని చెప్పారు.

ఆన్‌లైన్ వేధింపులు, పరువు తీసే పోస్ట్‌లు, చానెళ్లను పదేపదే బ్లాక్ చేయించడం వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నారని తండ్రి వినాయగం చెన్నై సమీపంలోని కానాత్తూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

యూట్యూబర్ జేసన్ శామ్యూల్ అక్టోబర్ 18న తన చానెల్‌లో హరీశ్ అర్హతలను ప్రశ్నిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు.

హరీశ్‌కు సెబీ లేదా అసోషియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా రిజిస్ట్రేషన్ లేదని, ఫిర్యాదుల వల్లే అతని ఖాతా బ్లాక్ అయిందని అందులో పేర్కొన్నారు.

దీని వల్ల తీవ్రమైన ఆన్‌లైన్ ట్రోలింగ్ జరిగి, ఆ మానసిక ఒత్తిడితోనే తన కుమారుడు ప్రాణాలు తీసుకున్నారని హరీశ్ తండ్రి ఆరోపించారు.

జేసన్ శామ్యూల్ తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగంపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రాథమిక విచారణలో శామ్యూల్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.

జేసన్ శామ్యూల్ వివరణ

హరీశ్ మృతి పట్ల శామ్యూల్ 'ఎక్స్' వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.

అయితే సైబర్‌బుల్లీయింగ్ ఆరోపణలను ఖండించారు.

వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆ వీడియో చేశానని సమర్థించుకున్నారు.

"నేను ఆయన (హరీశ్)ను ఆన్‌లైన్‌లో వేధించలేదు. ఆయనకు లైసెన్స్ లేదన్న విషయాన్ని, లైసెన్స్ ఉన్నట్లుగా ఆయన చేస్తున్న మోసాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపాన్ని మాత్రమే ఎత్తిచూపాను. సరైన సెబీ లైసెన్స్‌తో తిరిగి రావాలని కూడా ఆ వీడియోలో నేను కోరాను. ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంటాడని నేను ఊహించలేదు. ఆయన మృతి పట్ల చింతిస్తున్నా" అని శామ్యూల్ వివరణ ఇచ్చారు.

  • ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
  • సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)