‘ఇది ఎన్నిక కాదు ఎంపిక, కంగ్రాట్స్ పోలీస్... ’ అన్న జగన్, ఈ ఫలితాలు సుపరిపాలనకు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వెలువడిన ఫలితాలలో కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.

నవంబర్‌ 1న జరిగిన ఎన్నికల్లో అధికార టీడీపీ, జనసేన బీజేపీ కూటమి అభ్యర్ధులు స్పష్టమైన ఆధిక్యంతో మెజారిటీ స్థానాలు గెలుచుకునే దిశగా ఉన్నారు.

నవంబర్‌ 3.. మంగళవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్‌ సరళిని మధ్యాహ్నం 3 గంటలవరకు పరిశీలిస్తే కూటమి మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది.

ఎన్నికలు జరిగిన మొత్తం 13 మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ మేయర్‌ పదవుల విషయంలో కూటమి అభ్యర్ధులు స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నట్టు ఫలితాలు వస్తున్నాయి. ఇక ఎన్నికలు జరిగిన 79 మున్సిపాలిటీల్లో 76 చోట్ల కూటమి. 3 చోట్ల వైసీపీ ఆధిక్యత కనబరుస్తున్నాయి.

(గమనిక: ఈ కథనం అప్‌డేట్ అవుతోంది. తాజా ఫలితాల కోసం పేజ్‌ను రిఫ్రెష్ చేయండి)

ఎన్నికలపై స్పందనలు ఏంటి?

‘‘ మేం చేస్తున్న సుపరిపాలనను మెచ్చి ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు.

గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. ఇదే నా ప్రాధాన్యత. రాజకీయమా.. ప్రజల సమస్యల పరిష్కారమా అంటే నేను సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తాను. మూడు రోజుల పాటు నేను తుపాన్ సహాయక చర్యలపైనే రాత్రింబవళ్లు పనిచేశాను. అనునిత్యం ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు పనిచేశాం.. దీన్ని చూసే ప్రజలు ఓటేశారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

‘‘లబ్దిపొందే వాళ్లు కూడా ఎగతాళి చేసే వారుంటారు.. ఇలాంటివి ఉన్నా వాటిని పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక మెసేజ్‌లో..

పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఎన్‌సీబీఎన్/ చంద్రబాబు టీమ్‌కి అభినందనలు...

ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో ఎలా ఘన విజయం సాధించాలో మీరు నిరూపించారు.

ఎన్నికల ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయి.

నామినేషన్లను అడ్డుకున్నారు. పరిశీలనలో అక్రమాలు జరిగాయి. నామినేషన్ల ఉపసంహరణను అడ్డుకున్నారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారు లేదా బయటకు పంపించారు.

పోలింగ్‌లో, ఓట్ల లెక్కింపులో అక్రమాలు చేశారు. పోలింగ్ శాతం తారుమారు చేశారు.

అభ్యర్థులను మీరే ఎన్నుకున్నారు... ప్రజలు కాదు.

ఇవి అసలు ఎన్నికలు కావు.. కేవలం ఎంపికలు మాత్రమే’’ అని వ్యాఖ్యానించారు.

పులివెందులలో ఎవరిది పై చేయి?

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం ఇస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పులివెందులలో కూటమి అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని, అప్పటివరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని వైసీపీ అభ్యర్థి వై.ఎస్.ప్రమీల, ఎంపీ అవినాశ్ రెడ్డి వేసిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇక్కడ కౌంటింగ్ కొనసాగుతోంది.

2021 ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీని వైరిపక్షం లేకుండా వైసీపీ పూర్తిగా కైవసం చేసుకోగా, ఈసారి ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలమైన ప్రభావాన్ని చూపిస్తోంది.

పులివెందుల మున్సిపాలిటీ 2005లో ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం గ్రేడ్ త్రీ మున్సిపాలిటీగా ఉన్న పులివెందుల పంచాయతీని అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడు వై.ఎస్. కుటుంబం మద్దతున్న అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. కానీ తొలిసారి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తూగుట్ల గీతా కుమారి ఆధిక్యంలో ఉన్నారు.

ఎన్నికల ప్రక్రియ ఇలా సాగింది...

ఎన్నికలకు ముందే మొత్తం 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లలో 118 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఆయా డివిజన్లలో పోలింగ్‌ జరగలేదు.

అదే విధంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 17 చైర్‌ పర్సన్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో అక్కడ చైర్‌పర్సన్‌ పదవికి ఎన్నిక జరగలేదు.

అలాగే ఈ 17లో 8 చోట్ల మొత్తం వార్జులన్నీ కూడా ఏకగ్రీవం కావడంతో అక్కడ అసలు పోలింగ్‌ నిర్వహించలేదు.

ఏపీలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కార్పొరేషన్ల మేయర్ల పదవులకు, మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించారు.

రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల మొత్తం లెక్క ఇలా

  • రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టణ స్థానిక సంస్థలు 123
  • మున్సిపల్‌ కార్పొరేషన్లు(నగర పాలక సంస్థలు) : 17
  • మున్సిపాలిటీలు(పురపాలక సంస్థలు) నగర పంచాయతీలు: 106

ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలు ఏవంటే..

కోర్టు కేసులు, ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల డీలిమిటేషన్‌ ప్రక్రియలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రంలో 4 మున్సిపల్‌ కార్పొరేషన్లు,17 మున్సిపాలిటీల్లోనూ, 2 నగర పంచాయతీల్లోనూ ఎన్నికలు నిర్వహించడంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ముందుగానే ప్రకటించింది.

శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్లకు.. ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలు, చింతలపూడి, బి.కొత్తకోట నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు.

ఈ 23 స్థానిక సంస్థల్లో మరోసారి షెడ్యూల్‌ విడుదల చేసి ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ వెల్లడించింది.

ఎన్నికలు జరిగిన కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఏవంటే

పైన పేర్కొన్న 23 తప్ప మిగిలిన 100 స్థానాలు.. 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అయితే 8 పట్టణ స్థానిక సంస్థలు ఆళ్లగడ్డ, దాచేపల్లి, దర్శి, గురజాల, కమలాపురం, పిడుగురాళ్ల, ప్రొద్దుటూరు, రాయచోటిల్లో చైర్‌పర్సన్‌తో పాటు వార్డులన్నీ పూర్తిగా ఏకగ్రీవం కావడం వల్ల అసలు పోలింగ్‌ జరగలేదు.

దీంతో 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలలో నవంబర్‌ 1న పోలింగ్‌ నిర్వహించారు.

నవంబర్‌ 1న పోలింగ్‌ జరిగిన స్థానాలు

కార్పొరేషన్లు 13

మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు 79

మధ్యాహ్నం వరకు జరిగిన లెక్కింపులో ఏ కార్పొరేషన్‌లో ఏ పార్టీ ముందంజలో ఉందంటే..

ఎన్నికలు జరిగిన మొత్తం 13 కార్పొరేషన్లలోనూ కూటమి అటు మేయర్‌ అభ్యర్ధులు, ఇటు వార్డుల్లో అధిక స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు.

1. విజయవాడ

విజయవాడ మేయర్‌ పదవికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు.

ఇక్కడ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కాంగ్రెస్, వామపక్షాలు బలపరిచిన స్వతంత్య్ర అభ్యర్ధిగా రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు.

విజయవాడలో ఉన్న మొత్తం 86 డివిజన్లలోనూ 50 డివిజన్లలో కూటమి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు.

2. గ్రేటర్‌ విశాఖపట్నం

విశాఖ మేయర్‌ పదవికి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్ధిగా శ్రావణి పోటీ చేయగా, వైసీపీ నుంచి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి బరిలో నిలిచారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి శ్రావణి ముందంజలో ఉన్నారు.

ఇక్కడ మొత్తం 120 వార్డులు ఉన్నాయి.

3. విజయనగరం

ఇక్కడ మొత్తం 62 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

మేయర్‌ అభ్యర్ధిగా కూటమి తరపున అవనాపు భార్గవి, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోలగట్ల శ్రావణి బరిలో నిలవగా భార్గవి లీడ్‌లో ఉన్నారు.

4. ఏలూరు

మొత్తం 62 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున మేయర్‌ అభ్యర్ధిగా జనసేన నేత రెడ్డి అప్పల నాయుడు వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున గంటా మోహన్‌దాసు బరిలో నిలిచారు.

అప్పల నాయుడు లీడ్‌లో ఉన్నారు.

5.మచిలీపట్నం

మొత్తం 60 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున మేయర్‌ పదవికి టీడీపీ అభ్యర్ధిగా షేక్‌ అబ్దుల్‌ అబీదా వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున లంకా జ్యోతి బరిలో నిలిచారు.

ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు.

6. గుంటూరు

మొత్తం 76 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున టీడీపీ అభ్యర్ధి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున తాడికొండ శ్రీదేవి బరిలో నిలిచారు.

టీడీపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.

7.ఒంగోలు

మొత్తం 62 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున టీడీపీ అభ్యర్ధి నల్లమల్లి శ్రీ శిల్ప వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కుప్పం ప్రసాద్‌ బరిలో నిలవగా టీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు.

8. నెల్లూరు

మొత్తం 72 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున టీడీపీ అభ్యర్ధి రూప్‌కుమార్‌ యాదవ్, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు.

టీడీపీ అభ్యర్ధి లీడ్‌లో ఉన్నారు.

9 .తిరుపతి

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 66 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున టీడీపీ అభ్యర్ధి జేబీ శ్రీనివాస్‌ ప్రసాద్‌ వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున వాసూ యాదవ్‌ బరిలో నిలిచారు.

టీడీపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.

10. చిత్తూరు

మొత్తం 60 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున టీడీపీ అభ్యర్ధి కఠారి హేమలత వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున చంద్రశేఖర్‌ బరిలో నిలిచారు.

టీడీపీ అభ్యర్ధి లీడ్‌లో ఉన్నారు.

11. కడప

మొత్తం 66 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున టీడీపీ అభ్యర్ధి డాక్టర్‌ సువర్ణ, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున బండి దీప్తి రెడ్డి బరిలో నిలిచారు.

టీడీపీ అభ్యర్ధి లీడ్‌లో ఉన్నారు.

12. కర్నూలు

మొత్తం 68 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున టీడీపీ అభ్యర్ధి విజయ ప్రత్యూష, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ తరఫున సుశీల బరిలో నిలిచారు.

టీడీపీ అభ్యర్ధి లీడ్‌లో ఉన్నారు.

13.అనంతపురం

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 62 వార్డులు (డివిజన్లు) ఉన్నాయి.

కూటమి తరపున బీజేపీ అభ్యర్ధిగా కోట్ల అజేష్‌ బాబు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రమేశ్‌ గౌడ్‌ బరిలో నిలిచారు.

టీడీపీ అభ్యర్ధి లీడ్‌లో ఉన్నారు.

ఎన్నికలు జరిగిన 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఏ పార్టీ ముందంజలో ఉందంటే..

మొత్తం 72 చోట్ల కూటమి అభ్యర్ధులు లీడ్‌లో ఉంటే 5 మున్పిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది.

డ్రోన్‌ ,ఉయ్యూరు, నందికొట్కూరు, నగరి, తుని మున్సిపాసిటీల్లో వైసీపీ అభ్యర్ఢులు లీడ్‌లో ఉన్నారు.

(నగరి చైర్‌పర్సన్‌ స్థానం ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలోకి వెళ్లినప్పటికీ, వార్డుల వారీగా లెక్కింపులో వైసీపీ కొన్ని స్థానాల్లో ముందంజలో నిలిచింది).

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)