దేశ రాజధాని దిల్లీలో ప్రతిపక్షాలు
ఆదివారం(నేడు) భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ ర్యాలీకి వేలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఈ ర్యాలీ మధ్యాహ్నం
12 గంటల సమయంలో రామ్లీలా మైదానంలో ప్రారంభం కానుంది. దీనికి పది లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటామని ప్రకటించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ'
(సీజేపీ) కూడా ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి
13 కోట్ల పేర్లను తొలగించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ర్యాలీ జరగనుంది.
మరణించినవారు,
తమ నమోదిత చిరునామాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను నవీకరించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని భారత ఎన్నికల సంఘం
(ఈసీఐ) చెబుతోంది.
అయితే,
ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంచుకున్న రోజు సరైనది కాదని భారతీయ జనతా పార్టీ
(బీజేపీ) అభిప్రాయపడింది.
"వారు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే,
నవంబర్ 1న ఈ ర్యాలీ నిర్వహించడాన్ని కూటమి నాయకులు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే
దిల్లీ చరిత్రలో నవంబర్
1 అత్యంత సున్నితమైన రోజు. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నవంబర్ 1న దిల్లీలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సిక్కు సోదరులపై దాడులు జరిగాయి. రక్తపాతం చోటుచేసుకుంది.అలాంటి రోజునే రాహుల్ గాంధీ ర్యాలీకి ఎంచుకున్నారు" అని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు.