ఆన్‌లైన్‌ బాణసంచా అమ్మకాల పేరుతో మోసాలు, కస్టమర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

దీపావళి దగ్గర పడుతుండటంతో "శివకాశి టపాసులు తక్కువ ధరకే ఇంటి వద్ద నుంచే ఆర్డర్ చేసుకోండి" అంటూ సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా "దీపావళి గిఫ్ట్ బాక్స్ 90% తగ్గింపుతో రూ. 10 లకే శివకాశి బాణాసంచా" అంటూ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు షేర్ చేస్తున్న ప్రచార వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు "ఆన్‌లైన్‌లో టపాసులు ఆర్డర్ చేసి డబ్బులు చెల్లించాం. ఇప్పటివరకు డెలివరీ కాలేదు" అని లేదా "నాణ్యత లేని క్రాకర్స్ పంపించారు" అని ఫిర్యాదు చేస్తూ పెడుతున్న పోస్టులు కూడా కనిపిస్తున్నాయి.

"ఆన్‌లైన్‌లో టపాసులు ఆర్డర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నకిలీ టపాసుల విక్రయ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి" అని తమిళనాడు పోలీసులు గత కొన్ని రోజులుగా వివిధ సోషల్ మీడియా పోస్టుల ద్వారా హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకే టపాసులు అమ్ముతామని నమ్మించి డబ్బులు వసూలు చేసిన మోసాలపై 2024 లో 17 కేసులు నమోదయ్యాయి.

గతేడాది కూడా ఇలాంటి కేసులు కొన్ని వచ్చాయి.

ఈ ఏడాది విరుదునగర్ జిల్లా పోలీసులు ఆన్‌లైన్ టపాసుల మోసాలకు సంబంధించి 13 కేసులు నమోదు చేసినట్లు 'ది హిందూ' దినపత్రిక పేర్కొంది.

ఈ 'ఆన్‌లైన్ క్రాకర్స్' మోసాలు అసలు ఎలా జరుగుతాయి? దీనిపై టపాసుల వ్యాపారులు ఏం చెబుతున్నారు?

మోసం ఎలా చేస్తారంటే..

తమిళనాడు పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం విడుదల చేసిన ఒక అవగాహన వీడియోలో ఈ తరహా మోసాలు ఎలా జరుగుతాయో వివరించారు.

"సోషల్ మీడియాలో చౌకగా దొరికే టపాసుల ప్రకటనలను చూసి ప్రజలు 'వాట్సాప్' ద్వారా విక్రేతలను సంప్రదిస్తారు. విక్రేతలు టపాసుల వివరాలను, తక్కువ ధరలను చూపిస్తూ వారిని ఆకర్షిస్తారు. ఆర్డర్ కన్ఫర్మ్ చేయడానికి ముందస్తు డబ్బులు చెల్లించాలని కోరతారు" అని ఆ వీడియోలో వివరించారు.

"ఆ ప్రకటన నమ్మి ప్రజలు వారు అడిగిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లిస్తారు. ఆ తర్వాత రకరకాల పేర్లతో మరికొంత డబ్బు డిమాండ్ చేస్తారు. అవి చెల్లించినప్పటికీ టపాసులు ఇంటికి చేరవు. ఆ తర్వాత విక్రేతల నుండి ఎలాంటి సమాధానం ఉండదు" అని పోలీసులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో టపాసుల కొనుగోలు గురించి పోలీసులు మరో సూచన చేశారు.

"సోషల్ మీడియాలో వచ్చే చౌక టపాసుల ప్రకటనలను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దు. ఆన్‌లైన్ మోసాల వల్ల డబ్బు నష్టపోతే వెంటనే 1930 నంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి" అని కోరారు.

అలాగే "ఇలాంటి ఆన్‌లైన్ విక్రేతలకు మీ బ్యాంక్ ఖాతా వివరాలను అందించేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి" అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

'ఆన్‌లైన్‌లో టపాసుల విక్రయంపై నిషేధం'

2018 లో 'అర్జున్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

"ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో సహా ఏ ఈ-కామర్స్ సంస్థ కూడా బాణాసంచా కోసం ఆన్‌లైన్ ఆర్డర్‌లను స్వీకరించకూడదు. వాటిని ఆన్‌లైన్‌లో అమ్మకూడదు. ఆన్‌లైన్‌లో టపాసులు విక్రయించే ఈ-కామర్స్ కంపెనీలపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుంది" అని ఆ తీర్పులో పేర్కొంది.

అలాగే 'లైసెన్స్ పొందిన వ్యాపారులు కేవలం అనుమతించిన టపాసులను మాత్రమే అమ్మాలి' అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

"సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ చాలా మంది ఆన్‌లైన్‌లో టపాసులు అమ్ముతున్నారు. దీనివల్ల శివకాశి టపాసుల విక్రేతలతో సహా నేరుగా దుకాణాల్లో అమ్మే చాలా మంది వ్యాపారుల అమ్మకాలు దెబ్బతింటున్నాయి" అని తమిళనాడు క్రాకర్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేశన్ పంచురాజన్ అన్నారు.

"ఆన్‌లైన్‌లో అమ్ముతున్నందున వాళ్లు లైసెన్స్ చూపించాల్సిన అవసరం ఉండదు. వారికి లైసెన్స్‌లు లేవు. వాళ్లు సరైన రసాయన మిశ్రమంతో తయారు చేసిన కేవలం అనుమతించిన టపాసులను మాత్రమే అమ్ముతున్నారని చెప్పడం కూడా కష్టమే" అని ఆయన వివరించారు.

'భారతదేశ టపాసుల ఉత్పత్తిలో శివకాశి వాటా దాదాపు 90శాతం. ఇక్కడి 1,070 కి పైగా లైసెన్స్ పొందిన తయారీ యూనిట్లు ఏడాదికి సుమారు రూ. 7,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఇవి సుమారు 3 లక్షల మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తూ, టపాసులు, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా దాదాపు 5 లక్షల కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి' అని తమిళనాడు ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ నివేదిక చెబుతోంది.

"ఆకర్షణీయమైన ప్రకటనలే ఇలాంటి ఆన్‌లైన్ విక్రేతల ప్రధాన వ్యూహం. కేవలం డబ్బు నష్టపోవడమే కాకుండా నాణ్యత లేని టపాసులను కాల్చేటప్పుడు ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వాటి నుండి వచ్చే పొగ, వాయువులు పిల్లల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి" అని గణేశన్ పంచురాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

"అమ్మకాలు 30శాతం తగ్గాయి"

"ఆన్‌లైన్‌లో టపాసుల అమ్మకాల మీద నియంత్రణ లేకపోవడంతో మేము 30 శాతం నష్టపోయాం" అని చెన్నై మెట్రోపాలిటన్ క్రాకర్స్ సెల్లర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్లా తెలిపారు.

"ఆన్‌లైన్‌లో 85 లేదా 90 శాతం వరకు తగ్గింపు అంటూ ప్రకటనలు ఇస్తారు. దాన్ని ఆర్డర్ చేసి కొన్ని రోజులు ఆగాలి. పార్శిల్ ఇంటికి వచ్చి దాన్ని తెరిచిన తర్వాతే అది మంచి నాణ్యతతో ఉందో లేదో తెలుస్తుంది. కొందరు ఆన్‌లైన్ విక్రేతలు డెలివరీ కోసం కూడా కొంత మొత్తం వసూలు చేస్తారు" అని ఆయన అన్నారు.

"ఈ విషయాలన్నీ ఫిర్యాదులుగా నమోదు కావడం లేదు. 'సరేలే, ఎలాగో కొనేశాం, ఇంకేం చేస్తాం' అని ప్రజలు సరిపెట్టుకుంటున్నారు. కానీ, డబ్బులు చెల్లించి టపాసులు ఇంటికి రానప్పుడు మాత్రమే తాము మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు" అని అబ్దుల్లా చెప్పారు.

'నకిలీ వెబ్‌సైట్లున్నాయి జాగ్రత్త'

శివకాశికి చెందిన రాజ్‌కుమార్ రెండు టపాసుల కర్మాగారాలను, ఒక సొంత రిటైల్ దుకాణాన్ని నడుపుతున్నారు.

"మాకు కూడా వెబ్‌సైట్ ఉంది. కానీ మేము అందులో టపాసులు అమ్మము. మేము ఎలాంటి టపాసులు తయారు చేస్తాం? వాటి ధర ఎంత అనే విషయాలను మాత్రమే చూపిస్తాము. అలాగే, మీరు మా వెబ్‌సైట్ ద్వారా టపాసులను ఆర్డర్ చేయలేరు. మీరు ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించడం ద్వారా లేదా ఆఫీస్/స్టోర్‌ను నేరుగా సందర్శించడం ద్వారా మాత్రమే టపాసులను కొనవచ్చు" అని రాజ్‌కుమార్ చెప్పారు.

"కస్టమర్లు ఒకసారి వ్యక్తిగతంగా వచ్చి వస్తువులను కొనుగోలు చేసి సంతృప్తి చెందిన తర్వాత ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించి ఆర్డర్లు ఇస్తారు" అని ఆయన అన్నారు.

తమ కుటుంబం చాలా ఏళ్లుగా టపాసుల తయారీలో ఉందని చెప్పిన రాజ్‌కుమార్ "ఈ రోజుల్లో చాలా మంది టపాసుల తయారీదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి వెబ్‌సైట్లను ప్రారంభిస్తున్నారు. కానీ ప్రముఖ టపాసుల బ్రాండ్ల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు లేదా నకిలీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇది మా బ్రాండ్ పేరును చెడగొడుతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆన్‌లైన్‌లో నా టపాసుల కంపెనీ పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్ ఉంది. మేము దీనిపై ఫిర్యాదు కూడా చేసాము. కానీ వారు కొత్త వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను తెరిచి ప్రకటనలు ఇస్తున్నారు. దీనివల్ల మోసపోయిన ప్రజలు మా అసలైన సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి" అని రాజ్‌కుమార్ బీబీసీతో చెప్పారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

"ఆకర్షణీయ ప్రకటనలు, చౌకగా దొరికే టపాసులు, 90 శాతం డిస్కౌంట్లు వంటి వాటిని గుడ్డిగా నమ్మకండి. మొదట సెల్లర్‌కు లైసెన్స్ ఉందో లేదో నిర్ధరించుకోండి" అని రాజ్‌కుమార్ చెప్పారు.

టపాసుల కొనుగోలు విషయంలో ఆయన కొన్ని సూచనలు చేశారు.

  • విక్రేత దుకాణం శివకాశిలోనే ఉందో లేదో చూసుకోండి.
  • వారి ఫోన్ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, లైసెన్స్, జీఎస్టీ నంబర్‌తో సహా అన్ని వివరాలను అడగండి. కేవలం 'వాట్సాప్' ద్వారా మాత్రమే సంభాషణలు, లావాదేవీలు జరపకండి.
  • "వారి ఆన్‌లైన్ స్టోర్ చిరునామా, వారి సోషల్ మీడియా ఖాతా లేదా వెబ్‌సైట్‌లో ఇచ్చిన చిరునామా ఒకటేనా అని సరిచూసుకోండి.
  • అలాగే ఆన్‌లైన్‌లో వారికి వచ్చిన 'రివ్యూలు' కూడా పరిశీలించండి.

'భారీ తగ్గింపుల' గురించి చెబుతూ "ఆన్‌లైన్‌లో నమ్మశక్యం కాని ధరలకు టపాసులు ఇస్తుంటే అనుమానించండి. ప్రముఖ టపాసుల కంపెనీల ధరలతో వాటిని పోల్చి చూస్తే స్పష్టత వస్తుంది. మీ ఇళ్లకు దగ్గరగా ఉండే టపాసుల దుకాణాలకు నేరుగా వెళ్లి కొనడం అన్నింటికంటే ఉత్తమం" అని గణేశన్ పంచురాజన్ సూచించారు.

"కొందరు చేసే మోసాల వల్ల శివకాశి టపాసుల విక్రేతలందరికీ చెడ్డ పేరు వస్తోంది. ఆన్‌లైన్‌లో అమ్మే 'నాణ్యత లేని టపాసులు' లేదా 'ఆన్‌లైన్ మోసాలు' అనే ముద్ర శివకాశికి పడకూడదనేదే మా తాపత్రయం" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)