'నిమిషానికి 20వేల అడుగుల వేగంతో కిందికి పడిపోతున్నాం'- ఫ్లోరిడా విమాన ప్రమాదంలో పైలట్లు చివరగా ఇంకా ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, క్రెగ్ హోయల్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
(గమనిక: ఈ వార్తలో విమాన ప్రమాదం, మరణాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది.)
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ప్రైవేట్ జెట్ విమాన ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్టీఎస్బీ) దర్యాప్తు చేపట్టింది. విమానం నేలపై కూలి పేలడానికి ముందే దానిలోని కొన్ని భాగాలు విరిగిపోయాయా? అనే కోణంలోనూ సంస్థ విచారణ జరపనుంది.
టెక్సస్ నుంచి బహామాస్కు వెళ్తున్న లియర్‌జెట్ 60 విమానం.. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నివాసమైన మార్-ఎ-లాగోకు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. నవంబర్ 1న జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది మరణించారు.
మృతుల్లో ఓ వ్యాపారవేత్త, ఆయన కుటుంబ సభ్యులు, పైలట్‌తో పాటు 20 ఏళ్ల కో-పైలట్ కూడా ఉన్నారు.
వాతావరణంలో మంచు పేరుకుపోవడం, విమానం కుదుపులకు గురికావడం (టర్బులెన్స్) కూడా ప్రమాదానికి కారణమయ్యాయా? అనే విషయాలను పరిశీలిస్తున్నట్లు ఎన్టీఎస్బీ నవంబర్ 2న వెల్లడించింది.


ఫొటో సోర్స్, Reuters
టెక్సస్‌లోని ఆస్టిన్ నుంచి విమానం బయలుదేరిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు పైలట్లు సమాచారమిచ్చారు. విమానం స్వల్పంగా కుదుపులకు గురవుతోందని చెప్పారు. అలాగే విమానంపై మంచు ప్రభావం గురించి కూడా తెలియజేశారు.
"మేం మేఘాల్లో చిక్కుకున్నాం. 37 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి" అంటూ పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులను కోరారు.
అయితే ఈ సమాచారం ఇచ్చిన 30 సెకన్లలోపే విమానం కిందికి పడిపోవడం మొదలైందని ఎన్టీఎస్బీ సభ్యుడు టామ్ చాప్మన్ తెలిపారు. వెంటనే పైలట్లు మేడే కాల్ (అత్యవసర సందేశం) పంపినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత విమానానికి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోవడానికి మంచు పేరుకుపోవడం, టర్బులెన్స్ (కుదుపులు) కారణమై ఉండవచ్చని ఎన్టీఎస్బీ పేర్కొంది.
అయితే ప్రమాదానికి అసలు కారణమేంటో తెలుసుకోవడానికి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉందని వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో తుపాను వాతావరణం ఉన్నట్లు సమాచారం.

ఫొటో సోర్స్, Adam Robinson/Facebook
ప్రమాద సమయంలో విమానంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ఉందా? ఉంటే దాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవచ్చా? అనే అంశాలపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విచారణలో ఎన్టీఎస్బీతో పాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ), లియర్‌జెట్ కంపెనీ ప్రతినిధులు, వాతావరణ శాస్త్రవేత్తలు, విమానయాన నిపుణులు కలిసి పనిచేస్తున్నారు.
రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలో పడిన విమాన శకలాలను బయటకు తీయడం చాలా కష్టంగా ఉందని ఎన్టీఎస్బీ విమాన భద్రతా దర్యాప్తు అధికారి తిమోతి మోన్విల్ తెలిపారు.
ఫ్లయిట్ ట్రావెల్ అనాలిసిస్ ప్రకారం..ప్రమాదానికి ముందు విమానం ప్రతి సెకనుకు వందల అడుగుల వేగంతో కిందికి పడిపోయింది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో జరిగిన సంభాషణల రికార్డింగ్‌లో విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ప్రకటించడం వినిపించింది.
"విమానం వేగం అదుపు తప్పింది. మేం నిమిషానికి 20 వేల అడుగుల వేగంతో కిందికి పడిపోతున్నాం" అని ఓ సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత.. "మేం నేలను ఢీకొట్టబోతున్నాం" అని చెప్పారు.
మొదటి అత్యవసర సందేశం ఇచ్చిన 35 సెకన్ల తర్వాత కాక్‌పిట్ నుంచి చివరిసారిగా.. "ఇక మా దగ్గర సమయం లేదు" అనే మాటలు వినిపించాయి.
విమాన పైలట్ పేరు జెఫ్రీ గ్రెగరీ. కేవలం 17 ఏళ్ల వయసులోనే పైలట్ లైసెన్స్ పొందిన నథాలియా ఫిల్గుయిరాస్ కో-పైలట్‌గా ఉన్నట్టు మీడియా కథనాల పేర్కొన్నాయి.
విమానం రోడ్డుపై కూలిన సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి కాలికి గాయమైంది.
పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం ఆరు లేన్ల మిలిటరీ ట్రైల్ రోడ్డుపై జరిగింది. ఈ రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, రెస్టారెంట్లు ఉన్నాయి.
ప్రమాద స్థలం నుంచి వెలువడిన ఫోటోల్లో రోడ్డుకు మధ్యలో భారీ గుంత, అందులో మంటలు కనిపించాయి.
విమాన శకలాలు సమీపంలోని మైదానాలు, కార్యాలయాలు, ఇళ్లలో చెల్లాచెదురుగా పడ్డాయని అధికారులు నవంబర్ 2న జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. విమానం నేలను తాకడానికి ముందే ముక్కలై ఉండవచ్చని ఈ శకలాలు సూచిస్తున్నాయని చెప్పారు.
ఇక ప్రమాద సమయంలో తీసినట్లు చెబుతున్న డ్యాష్‌క్యామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను అధికారులు ధృవీకరించలేదు.
ప్రమాదం జరిగిన నవంబర్ 1న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగోలో ఉన్నారు. విమాన ప్రమాదానికి సుమారు గంట ముందు ఆయన సమీపంలోని విమానాశ్రయం నుంచి ఎయిర్ ఫోర్స్ వన్‌లో బయలుదేరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























