గుడ్ నైట్
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ కవరేజీని ముగిస్తున్నాం.
మరిన్ని ముఖ్యమైన కథనాలు వివరంగా చదవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ కవరేజీని ముగిస్తున్నాం.
మరిన్ని ముఖ్యమైన కథనాలు వివరంగా చదవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, WhiteHouse
డెమొక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైట్‌హౌస్ స్పందించింది.
వైట్‌హౌస్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు.
అందులో ట్రంప్ తన కార్యాలయంలోని 'రెజల్యూట్ డెస్క్' వద్ద కూర్చొని ఉన్నారు.
ఆ ఫోటోపై "ప్రజల సమాచారం కోసం: ట్రంప్ ఇప్పటికీ మీ అధ్యక్షుడే" అని రాసి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అంతకుముందు రిపబ్లికన్ పార్టీ ఓటమిపై అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు. "డెమొక్రాట్లు అద్భుతంగా పని చేశారు" అని ఆయన అంగీకరించారు.
అయితే తాను కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే రిపబ్లికన్ అభ్యర్థుల ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లికన్ రాష్ట్రాలలో విజయాలు సాధించడంతో డెమొక్రాట్లు సంబరాలు చేసుకున్నారు. ఓటములు పెరిగేకొద్దీ రిపబ్లికన్లు నిరాశలో కూరుకుపోయారు.పూర్తి కథనం లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Phil Walter/Getty Images
తొలి వన్డేలో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం భారత జట్టు న్యూజీలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు 143 పరుగుల సవరించిన లక్ష్యాన్ని నిర్దేశించారు.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టిమ్ సీఫెర్ట్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 70 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.
లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 74 పరుగులు చేయగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 37 పరుగులు చేశాడు. భారత్ విజయంలో ఈ రెండు ఇన్నింగ్స్‌లు కీలక పాత్ర పోషించాయి.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఖాతా తెరవలేకపోయాడు. న్యూజీలాండ్ జట్టులో జాకబ్ డఫీ 49 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
అగ్నివీర్ పథకంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కీలక సమాచారం వెల్లడించారు.
అగ్నివీర్ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో నియమితులైన యువతకు ఇప్పుడు మరో రెండేళ్ల పాటు అదనపు సర్వీస్ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
"ఈ రోజు భారత రక్షణ దళాలకు, మన అగ్నివీర్‌లకు ఎంతో ముఖ్యమైన రోజు. కేంద్ర మంత్రివర్గం అగ్నివీర్‌లందరికీ భారత రక్షణ దళాల్లో చేరేందుకు మార్గం కల్పించింది" అని జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి అన్నారు.
2022 జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించిన సమయంలోనే అగ్నివీర్‌ల పనితీరును నిరంతరం అంచనా వేస్తామని, ఎప్పటికప్పుడు ఈ పథకాన్ని సమీక్షిస్తామని ప్రకటించినట్లు ఆయన చెప్పారు.
అగ్నివీర్‌ల తొలి బ్యాచ్ ప్రస్తుతం తమ నాలుగేళ్ల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసుకునే దశకు చేరుకుందని, ఈ నాలుగేళ్లలో వారి పనితీరుపై నిర్వహించిన అంచనాల్లో మంచి ఫలితాలు వచ్చాయని, వారి సామర్థ్యంపై సానుకూల స్పందన లభించిందని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం, అర్హత, ప్రతిభ ఆధారంగా 25 శాతం మంది అగ్నివీర్‌లను మాత్రమే రెగ్యులర్ సైనిక బలగాల్లోకి తీసుకునేవారు. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల సర్వీస్ అనంతరం క్రమశిక్షణ, నైపుణ్యాలు కలిగిన యువతగా సమాజంలోకి తిరిగి వెళ్లాల్సి ఉండేది.
అయితే సవరించిన విధానం ప్రకారం మిగిలిన 75 శాతం మంది అగ్నివీర్‌లకు మరో రెండేళ్ల పాటు అదనపు సర్వీస్ చేసే అవకాశం కల్పించనున్నట్లు జనరల్ సుబ్రమణి తెలిపారు.
ఈ రెండేళ్ల అదనపు సర్వీస్ పూర్తయిన తర్వాత సాయుధ దళాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అగ్నివీర్‌లందరినీ నిర్దేశించిన ఎంపిక ప్రమాణాల ఆధారంగా సైన్యంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.
నేను షేక్ అన్సారి. బీబీసీ ప్రతినిధిని. మధ్యాహ్నం నుంచి లైవ్ పేజీ వార్తలను మీకు అందిస్తాను.

ఫొటో సోర్స్, @BCCI
ఆక్లాండ్‌లో న్యూజీలాండ్, భారత్ మద్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ వర్షం తరువాత మళ్లీ మొదలైంది.
వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో ఓవర్లను కుదించారు. దీంతో భారత్ టార్గెట్‌ను కూడా తగ్గించారు.
పది ఓవర్లు దాటిన తర్వాత భారత్ 54 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోవడం, మైదానంలో పరిస్థితులు ఆటకు అనుకూలంగా ఉండటంతో ఓవర్లు తగ్గించి మ్యాచ్‌ను కొనసాగిస్తున్నారు.
అయితే అంతరాయం తర్వాత మ్యాచ్ ప్రారంభమైనందున డక్‌వర్త్‌లూయీస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ ఓవర్లను కుదించారు. 40 ఓవర్లకే మ్యాచ్‌ను పరిమితం చేశారు. అటు లక్ష్యాన్ని కూడా 167కు తగ్గించారు.

ఫొటో సోర్స్, @BCCI
ఆక్లాండ్‌లో జరుగుతున్న తొలి వన్డేలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది.
న్యూజీలాండ్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 10.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదన ప్రారంభించిన టీమిండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. కైల్ జేమీసన్ బౌలింగ్‌లో మిచెల్ శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
అయితే ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
గిల్ 32 బంతుల్లో 17 పరుగులు చేయగా, కోహ్లీ 27 బంతుల్లో 29 పరుగులతో క్రీజ్‌లో నిలిచారు. క్లోహీ తాను ఎదుర్కొన్న బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు.
మరోవైపు భారత్ బౌలర్లు రాణించడంలో కేవలం 40.2 ఓవర్లలోనే న్యూజీలాండ్ 185 పరుగులకు ఆలౌట్ అయింది.

ఫొటో సోర్స్, ANI/BCCI
న్యూజీలాండ్‌లో నాలుగు వికెట్లు తీసిన మూడో భారతీయ పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడని ఏఎన్ఐ పేర్కొంది.
అంతకుముందు జవగళ్ శ్రీనాథ్, మహమ్మద్ షమీ మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఆక్లాండ్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో, అర్షదీప్ 10 ఓవర్లలో 70 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
న్యూజీలాండ్ గడ్డపై వన్డేల్లో ఒక భారతీయ పేసర్ నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది నాలుగో స్థానంలో ఉంది.
ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో జవగళ్ శ్రీనాథ్ (2003లో ఆక్లాండ్‌లో 4/23, 1995లో నేపియర్‌లో 4/52) ఉన్నాడు. మూడో స్థానంలో మహమ్మద్ షమీ (2014లో నేపియర్‌లో 4/55) ఉన్నాడు.
ఈ ఏడాది ఆడిన ఐదు వన్డేల్లో, అర్ష్‌దీప్ 23.08 సగటుతో, 6.08 ఎకానమీ రేటుతో మొత్తం 12 వికెట్లు తీశాడు. ఇందులో 70 పరుగులకు 6 వికెట్లు తీయడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన..
ఈ ఇన్నింగ్స్ తర్వాత అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. "ఇక్కడి వాతావరణం చాలా బాగుంది, పిచ్ కూడా బౌలర్లకు బాగా సహకరిస్తోంది. ఉపఖండం నుంచి వచ్చిన తర్వాత, ఇలాంటి పిచ్‌లపై బౌలింగ్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, గాలి కూడా బౌలింగ్‌కు అనుకూలిస్తోంది" అని పేర్కొన్నాడు.
షార్ట్ బాల్ వ్యూహం విజయవంతం కావడంపై స్పందిస్తూ, "పిచ్‌లో బౌలర్లకు ఏదో ఉందని అనిపించింది, అందుకే బంతిని సీమ్‌పై గట్టిగా వేస్తూ పిచ్ నుంచి లభించే సహకారాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించాం. బ్యాటర్లు ఆ లెంగ్త్‌లో షాట్లు ఆడటానికి ప్రయత్నించడంతో వికెట్లు దక్కాయి" అని వివరించారు.

ఫొటో సోర్స్, ANI/BCCI
ఆక్లాండ్‌లో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో భారత్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని న్యూజీలాండ్ ఉంచింది.
భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో న్యూజీలాండ్ కేవలం 40.2 ఓవర్లలోనే 185 పరుగులకు ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్‌పై మొదటి బంతి నుంచే టీమిండియా పట్టుసాధించింది. భారత బౌలర్ల ఒత్తిడికి కివీస్ బ్యాటర్లు పెద్ద పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు.
ఓపెనర్ విల్ యంగ్ 9 పరుగులకే అవుట్ కాగా, హెన్రీ నికోల్స్ కూడా 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టిమ్ సీఫర్డ్ 38 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. డారిల్ మిచెల్ 28 పరుగులు చేసినా జట్టును ఆదుకోలేకపోయాడు.
మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్ 30 పరుగులతో పోరాడగా, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో బ్లెయిర్ టిక్నర్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి కొంత మెరుగైన స్కోరు అందించాడు. జాకబ్ డఫీ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ 3వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఒక దశలో 73/2గా నిలిచిన న్యూజీలాండ్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 146/9 స్థితికి చేరింది. చివర్లో టిక్నర్ కొంత ప్రతిఘటన చూపినప్పటికీ జట్టు స్కోరును 200 పరుగులు దాటించలేకపోయాడు.

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలుగా ఉండే కొన్ని నియోజకవర్గాలలో డెమోక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడారు.
న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో.. మధ్యంతర ఎన్నికల ఫలితాలను పూర్తిగా అంగీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పారు.
ప్రతిపక్షంతో కలిసి పనిచేయడం గురించి కూడా మాట్లాడారు.
"అవును, ఈ ఫలితాలను అంగీకరించడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను" అని ట్రంప్ అన్నారు.
" వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం," అని చెప్పారు.
" కలిసి బహుశా ఒక మార్గాన్ని కనుగొనగలం," అని ట్రంప్ అన్నారు.
అయితే, కొంతసేపటి క్రితం ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ట్రూత్ సోషల్'లో 'వీటో' అని రాసి ఉన్న ఒక టోపీ ఫోటోను షేర్ చేశారు. .
సెనేట్, హౌస్‌లో తన మెజారిటీని కోల్పోయిన తర్వాత కూడా ట్రంప్ తన అధ్యక్ష అధికారాలన్నింటినీ వినియోగిస్తానని సూచిస్తూ, ఆయన గతంలో బీబీసీ యూఎస్ వార్తా భాగస్వామి అయిన సీబీఎస్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, @BCCI
ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు, ఆ దేశపు రగ్బీ దిగ్గజం కెవెన్ మీలాముతో సమావేశమైందని బీసీసీఐ పేర్కొంది.
ఈ సమావేశంలో, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి మీలాము రగ్బీ జెర్సీలను బహుకరించారు.
"ఆట ప్రారంభానికి ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు న్యూజిలాండ్ రగ్బీ దిగ్గజం కెవెన్ మీలామును కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి ప్రత్యేకంగా రూపొందించిన రగ్బీ జెర్సీలు అందించారు" అని బీసీసీఐ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొంది.
ఆక్లాండ్‌లో జరిగిన ఈ మొదటి వన్డేలో, టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. 38 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసింది. అర్షదీప్ నాలుగు వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
2027 వన్డే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న భారత్, ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఈడెన్ పార్క్‌లో ప్రారంభించింది.
ఈ సిరీస్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లో వన్డేల్లో భారత్ చివరిసారిగా ఫిబ్రవరి 2019లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు సిరీస్‌లలో భారత్ వరుసగా 3-0, 1-0 తేడాతో ఓటమిని చవిచూసింది (రెండవ పర్యటనలో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి).

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లికన్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్న వేళ డోనల్ట్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పందించారు.
"నేను ఎన్నికల బరిలో లేను. ఒకవేళ నేను ఉండి ఉంటే, మనం భారీ మెజారిటీతో గెలిచేవాళ్లం" అని ట్రంప్ రాసుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో తాను అభ్యర్థిని కాదని, ఒకవేళ బరిలో ఉండి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవని.. తన పార్టీ భారీ మెజారిటీతో గెలిచి ఉండేదని ఆ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థుల ఓటమికి వారే కారణమని, తనకు సంబంధం లేదని అర్థం వచ్చేలా ట్రంప్ చేసిన ప్రకటన ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.