గుడ్ నైట్
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ కవరేజీని ముగిస్తున్నాం.
మరిన్ని ముఖ్యమైన కథనాలు వివరంగా చదవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ కవరేజీని ముగిస్తున్నాం.
మరిన్ని ముఖ్యమైన కథనాలు వివరంగా చదవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Scott Barbour/Getty Images
ఢాకాలోని నేషనల్ స్టేడియంలో సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్ 2026లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో గెలిచింది.
భారత్ తరఫున సుహైల్ అహ్మద్ భట్ రెండు గోల్స్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించినట్టు ఈఎస్‌పీఎన్ కథనం పేర్కొంది.
తర్వాత మాంగ్లెంతాంగ్ కిప్‌గెన్ మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 3-0కు చేరింది. తొలి అర్ధభాగంలో భారత జట్టు మెరుగైన ఆటతీరు కనబరిచింది.
రెండో అర్ధభాగంలో మ్యాచ్ ముగిసే ముందు అదనపు సమయంలో పాకిస్తాన్ రెండు గోల్స్ చేసింది.
నజీబుల్లా హెడర్ ద్వారా తొలి గోల్ చేయగా, ఆలంగీర్ గాజీ అద్భుతమైన షాట్‌తో రెండో గోల్ సాధించారు.
కానీ పాకిస్తాన్ చివర్లో చేసిన పోరాటం ఫలించలేదు. భారత్ 3-2తో విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Vipin Kumar/Hindustan Times via Getty Images
దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ ఏడాది జనవరిలో తన బెయిల్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు విధించిన షరతులను ఆయనీ సందర్భంగా తన పిటిషన్‌లో ప్రస్తావించారు.
సుప్రీంకోర్టు ఏడాదిపాటు మళ్లీ బెయిల్ పిటిషన్ వేయకూడదని విధించిన ఆంక్షలు త్వరలో ముగియనున్నాయని ఆయన తెలిపారు.
ఈ కేసులో ప్రభుత్వ తరఫు సాక్షుల విచారణ 2027 జనవరి 5వ తేదీలోగా పూర్తయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు.
తాను చాలా కాలంగా జైలులో ఉన్నానని, అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు.
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్‌వీ అంజారీలతో కూడిన ధర్మాసనం 2026 జనవరి 5న షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్‌లకు బెయిల్ నిరాకరించింది.
అయితే బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు రెండు షరతులు విధించింది.
ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే ఆ మేరకు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
నైకీ లోగో ఉన్న దుస్తులను ముస్లీంలు కొనడం, అమ్మడం, ధరించడాన్ని నిషేధిస్తూ లిబియా మత సంస్థ దారుల్ ఇఫ్తా పత్వా జారీ చేసింది.
అమెరికాకు చెందిన క్రీడా దుస్తుల సంస్థ నైకీకి గ్రీకు పురాణాల్లోని విజయ దేవత 'నైకీ' పేరు పెట్టారని ఫత్వాలో పేర్కొన్నారు. కంపెనీకి చెందిన ప్రసిద్ధ గుర్తు కూడా ఆ దేవత రెక్కల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారని తెలిపారని బీబీసీ న్యూస్ ఉర్దూ తెలిపింది.
నైకీ లోగో ఉన్న దుస్తులు ధరించడం అంటే ఇతర దేవతలను పూజించే భావనను ప్రోత్సహించడమేనని మత సంస్థ పేర్కొంది. ఇస్లాంలో దీన్ని 'షిర్క్' అంటారు.
లిబియాలోని పురాతన గ్రీకు నగరం సైరెన్‌లో జరిపిన తవ్వకాల్లో నైకీ అనే గ్రీకు దేవత విగ్రహం కూడా బయటపడింది.
మరోవైపు, నైకీ సంస్థ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోందని దారుల్ ఇఫ్తా ఆరోపించింది. ఇలాంటి సంస్థల ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
ఇస్లామిక్ చట్టాలకు సంబంధించిన అంశాలపై ఇచ్చే మతపరమైన అభిప్రాయాన్ని ఫత్వా అంటారు.
ఈ ఫత్వాకు లిబియా గ్రాండ్ ముఫ్తీ సాదిక్ అల్-ఘరియానీ ఆమోదం తెలిపారు.

ఫొటో సోర్స్, Sartaj Alam
జార్ఖండ్‌లోని బొకారో జిల్లా కతారా కూలియరీలో ఓ భారీ బొగ్గు కుప్ప కూలిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనను బెర్మో ఎస్‌డీపీఓ రవీంద్ర సింగ్ ధృవీకరించారు.
ఆయన తెలిపిన వివరాల మేరకు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీఎల్‌కు చెందిన బొగ్గు నిల్వలు ఉన్నాయి. స్థానిక మహిళలు కొంతమంది ఉదయం 5గంటల ప్రాంతంలో బొగ్గు ఏరుకోవడానికి అక్కడకు వచ్చారు. బొగ్గు కుప్ప నుంచి చేతులతో బొగ్గు లాగుతుండగా, ఒక్కసారిగా బొగ్గుకుప్ప కూలిపోయింది. దీంతో దానికింద చిక్కుకున్న వారిలో ముగ్గురు మహిళలు మరణించారు. వీరితోపాటు వచ్చిన మరో నలుగురు సురక్షితంగానే ఉన్నారు. వారిని ఇళ్లకు పంపించాం’ అని రవీంద్ర సింగ్ చెప్పారు.
మృతి చెందిన ముగ్గురు మహిళలు స్థానిక బాంధ్ బస్తీకి చెందినవారని స్థానికులు తెలిపారు.

ఫొటో సోర్స్, Valter Gouveia/Sports Press Photo/Getty Images
పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
41 ఏళ్ల రొనాల్డో 2003లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టాడు. పోర్చుగల్ జట్టు తరఫున 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ చేశాడు. ఈ రెండు ప్రపంచ రికార్డులే.
గత నెలలో డెన్మార్క్‌తో జరిగే నేషన్స్ లీగ్ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కదని తెలియడంతో పోర్చుగల్ జట్టు శిబిరం నుంచి రొనాల్డో వెళ్లిపోయాడు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు క్రిస్టియానో.
"పోర్చుగల్ ప్రజలారా.. నా జాతీయ జట్టు ఏడో నంబర్ జెర్సీని తిరిగి అప్పగించే సమయం వచ్చింది.ఈ జెర్సీ నాది మాత్రమే అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ 23 ఏళ్ల పాటు ఈ జెర్సీ ధరించడం, దేశం తరఫున ఆడటం నాకు ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావించాను. ఇప్పుడు ఈ జెర్సీని తర్వాతి తరానికి అప్పగించే సమయం వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మనసుతో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 2003 ఆగస్టులో మొదలైన ఈ ప్రయాణం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఆ ప్రయాణం ముగిసింది" అని ఆ వీడియోలో వెల్లడించాడు రొనాల్డో.

ఫొటో సోర్స్, Reuters
యూరప్‌లో పలు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో వాటి రాకపోకలకు అంతరాయం కలిగింది.
రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి బెదిరింపుల కారణంగా ఏడు విమానాలపై ప్రభావం పడింది.
ఈరోజు ప్రభావితమైన విమానాల్లో ఎయిర్ లింగస్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం కూడా ఉంది. ఈ విమానం డబ్లిన్ నుంచి రోమ్‌కు వెళ్తోంది.బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. తన ప్రయాణ మార్గాన్ని మార్చుకుని ఉత్తర ఫ్రాన్స్‌లోని ఎవెరూ వైమానిక స్థావరంలో దిగింది.
మరోవైపు ఫిన్‌లాండ్‌కు చెందిన ఫిన్నైర్ విమానయాన సంస్థ కూడా గురువారం తమ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలిపింది.
హెల్సింకి నుంచి రోమ్‌కు వెళ్తున్న ఆ విమానానికి వాయుసేన యుద్ధ విమానాలు రక్షణగా వెళ్లాయి. అయితే ఆ విమానం నిర్ణయించిన సమయానికే రోమ్‌లో సురక్షితంగా దిగింది.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Image
ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగియవచ్చని లేదా ఉద్రిక్తతలు తగ్గవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం ఆసియా మార్కెట్‌లో బ్రెంట్ చమురు ధర 0.9 శాతం తగ్గి బ్యారెల్‌కు 93.74 డాలర్లకు చేరింది.
అమెరికాలో ముడి చమురు ధర 1.5 శాతం తగ్గి బ్యారెల్‌కు 86.83 డాలర్లకు పడిపోయింది.
బుధవారం కూడా చమురు ధరలు 8 శాతానికి పైగా తగ్గాయి.
ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఇరాన్‌తో యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలే కారణమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.
అయితే అంతకుముందు కూడా ముడి చమురు ధరలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ సహా తృణముల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకునేలా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
లైవ్ లా కథనం ప్రకారం... తిరుగుబాటు చేసిన టీఎంసీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే విషయంపై అసెంబ్లీ స్పీకర్ త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కలకత్తా హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది.
"హైకోర్టులో తగిన పిటిషన్ దాఖలు చేసుకునేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ, ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఈ వ్యవహారాన్ని డివిజన్ బెంచ్ ముందుకు తీసుకెళ్లాలని, వారు దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి’’ అని సుప్రీం కోర్టు పేర్కొంది.
తృణమూల్ కాంగ్రెస్ బహిష్కరించిన రిటబ్రత బెనర్జీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
నేను బీబీసీ ప్రతినిధి షేక్ అన్సారి. మధ్యాహ్నం నుంచి లైవ్ పేజీ వార్తలను మీకు అందిస్తాను.

ఫొటో సోర్స్, ANI
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు.
శ్వాసకోశ, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు.
ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్ సమ్దానీ తెలిపారు.
డాక్టర్ ప్రతీత్ సమ్దానీ మాట్లాడుతూ .. "శ్వాసకోశ, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా శరద్ పవార్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది మరియు చికిత్స పొందుతున్నారు" అని చెప్పారు.
శరద్ పవార్ కుమార్తె, పార్టీ ఎంపీ అయిన సుప్రియా సూలే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు.
ఛాతీ నొప్పి రావడంతో పవార్‌ను తొలుత పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో చేర్చారు. ఆయన రెండు రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉండి, గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు.

ఫొటో సోర్స్, gettyimages
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల ఆధిక్యం తరువాత స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. మరోవైపు చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. చమురు ధరలు బ్యారల్‌కు 100 డాలర్ల కంటే తగ్గాయి.
బుధవారం బ్రెంట్ క్రూడ్ ధరలు 8 శాతం తగ్గి బ్యారల్ 95 డాలర్లకు చేరింది. గత రెండు నెలల కాలంలో ఇదే అంత్యంత కనిష్ఠం.
మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్‌తో యుద్ధం కారణమని వాన్స్ వ్యాఖ్యానించారు.
యుద్ధాన్ని ముగించాలని, కాస్ట్ ఆఫ్ లివింగ్‌పై దృష్టి పెట్టాలని, ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలను పునరాలోచించాలని వాన్స్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లు సానుకూలంగా స్వీకరించాయి.
ఎన్నికల తర్వాతి రాజకీయ పరిస్థితులు ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగకుండా ఆపుతాయనే అంచనాలు పెరిగాయి.
దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో కీలకమైన యుఎస్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.
డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 3 శాతం పెరిగింది. ఎస్ అండ్ పి 500 సూచీ 1.6 శాతం లాభపడగా, టెక్ ఆధారిత నాస్‌డాక్ 1.4% పెరిగింది.

ఫొటో సోర్స్, UGC
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు ప్రమాదానికి గురైన ఘటనలో అయిదుగురు తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్ఎఫ్) సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్ 'బీబీసీ'కి ధ్రువీకరించారు.
మొత్తం పదిమంది ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానికుడు ఒకరు గల్లంతు కాగా, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అయిదుగురు సురక్షితంగా బయటపడినట్లు సబ్ కలెక్టర్ బీబీసీతో చెప్పారు.
గల్లంతైనవారిలో మరో ఆరుగురు కూడా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం అందినట్లు ఆయన చెప్పారు.
కాగా, గల్లంతైన సిబ్బందిని చెరువు నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికారులు గాలింపు చర్యలు కొనసాగించారు. నిరంతరాయంగా సహాయక చర్యలు చేపడుతున్నామని, అందరూ సురక్షితంగానే ఉన్నారని అజయ్ కుమార్ యాదవ్ బీబీసీకి తెలిపారు.