మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  2. నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

    అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.

    "ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

  3. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  4. సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర : రాహుల్ గాంధీ

    సుప్రీంకోర్టుకు సోమవారం పాదయాత్రగా వెళ్లి ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించనున్నట్టు విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

    సుప్రీంకోర్టుకు చేరుకున్న తర్వాత ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి దేశవ్యాప్త విజ్ఞప్తులతో కూడిన ఒక వినతిప్రతం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

    సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమయం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇప్పటికే సీజేఐకి లేఖలు రాశారు.

    ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే యువత, విపక్షాలు , పౌర సమాజం కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా తనతో కలిసి రావాలని రాహుల్ గాంధీ కోరారు.

    ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ డోభాల్, మోహన్ భాగవత్‌ భారత ప్రజల గొంతును నొక్కలేరని రాహుల్ అన్నారు.

  5. ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి

  6. ఎవరీ నేహా బోరా? బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చి ఉద్యమాల ముఖచిత్రంగా ఎలా మారారు?

  7. ‘పోలీసులు మా ఫోన్లు లాక్కున్నారు, న్యాయవాదితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు’

    పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు నేరుగా ప్రధాని మోదీపై విమర్శల దాడి చేశారు.

    అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ రత్నా సింగ్ విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.

    నాయనమ్మ మృతి చెందడంతో అభిజీత్ దీప్కే స్వగ్రామానికి వెళ్లడంతో ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు.

    “భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోదీ అత్యంత పిరికి ప్రధానమంత్రి” అని అశుతోష్ రాంకా అన్నారు.

    “ఇదే ప్రభుత్వం నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను విమానంలో ఎక్కించి దేశం నుంచి పంపించివేసింది. మమ్మల్ని మాత్రం విమానం నుంచి దించేసింది” అని సౌరవ్ దాస్ ఆరోపించారు.

    “మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు పోలీసులు మాకెలాంటి నోటీసులు ఇవ్వలేదు. మాఫియా డాన్లలా వచ్చి మమ్మల్ని తీసుకుపోయారు. మా ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లను మహిళా పోలీసులు తీసుకున్నారు. కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు” అని ఆయన అన్నారు.

    “నన్ను ఆర్‌కే పురంలో అశుతోష్‌ను బల్లభ్‌గఢ్‌కు, అభిజీత్‌ను కూడా ఎక్కడికో తీసుకువెళ్లారు. మమ్మల్ని తీసుకువెళ్తున్నప్పుడు, మా న్యాయవాదితో మాట్లాడటం మా ప్రాథమిక హక్కు అని అడిగా. కానీ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి హక్కులు ఉండవని మాకు చెప్పారు. నిరసనకారులతో దిల్లీ పోలీసులు ఇంకెంత క్రూరంగా వ్యవహరించారో” అని సౌరవ్ దాస్ అన్నారు.

    “మా ఫోన్‌ను ఏం చేశారోనని మాకు ఆందోళనగా ఉంది. మా ఫోన్‌ను క్లోన్ చేశారని అనుమానంగా ఉంది. రేపు మా ఫోన్‌ను క్లోన్ చేసి సాక్ష్యంగా సమర్పిస్తారు” అని సౌరవ్‌దాస్ అన్నారు.

  8. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  9. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  10. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్‌ రాంకా విడుదల

    కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేసినట్లు సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.

    శనివారం ఉదయం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.

    "అభిజిత్, అశుతోష్, సౌరవ్‌లను ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు" అని రత్నా సింగ్ తెలిపారు.

    "దిల్లీ పోలీసు అధికారి ఒకరు ఈరోజు ఉదయం నాకు ఈ సమాచారం ఇచ్చారు. సీజేపీ లీగల్ హెడ్ హోదాలో, మా తరఫున హాజరయ్యే ఇతర వకీళ్లతో కలిసి నేను పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటాను" అని చెప్పారు.

    అంతకుముందు, సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ముందస్తు నిర్బంధంలో ఉంచామని, వారిని నేడు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ముగ్గురు నాయకుల నిర్బంధంపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

    "మోదీ, షా ఎంతలా భయపడ్డారంటే నేడు వారు పిల్లలను అపహరిస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని ఎక్స్‌లో పేర్కొన్నారు

  11. దిల్లీలో నేడూ నిరసనలు కొనసాగుతాయి: నేహా బోరా

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దిల్లీలో జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగుతాయని అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ప్రకటించారు.

    సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన నేహా బోరా, శనివారం దిల్లీ హాట్ 'జంతర్-మంతర్'‌గా మారిందని, ఆదివారం వేరే ప్రదేశంలో నిరసన తెలుపుతామని చెప్పారు.

    "సామాన్యులను జైళ్లలో పెడతారా లేక జ్ఞానేశ్ కుమార్‌‌నా అనేది మీరే తేల్చుకోండి. మేం ఆదివారం కూడా వీధుల్లోకి వస్తాం, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్‌ఐఆర్ రద్దు డిమాండ్‌తో నిరసన ప్రదర్శన చేస్తాం" అని అన్నారు.

    మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత అజింక్య శిందే ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి ఆదివారం జరగనున్న నిరసన వివరాలు వెల్లడించారు.

    "జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లం" అని ఆయన పేర్కొన్నారు.

    తాము రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ జంతర్-మంతర్ వైపు కవాతు చేస్తామని అజింక్య చెప్పారు. అలాగే భారీ సంఖ్యలో జంతర్-మంతర్‌కు చేరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  12. కాంగ్రెస్, సీజేపీ: ఎంత దూరం, ఎంత దగ్గర - నిరసనల వేళ రాహుల్ దిల్లీలో ఎందుకు లేరు?

  13. నిరసన కొనసాగించండి, వెనక్కి తగ్గకండి : రాహుల్ గాంధీ

    నిరసన కొనసాగించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు యువతకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

    "నేను నరేంద్ర మోదీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు, వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా దశాబ్ద కాలంపై నుంచి పోరాడుతున్నా. నేను నా ప్రత్యర్థులను అర్థం చేసుకున్నంత బాగా మరెవరూ అర్ధం చేసుకోలేరు. వాళ్ల గురించి నాకు పూర్తిగా తెలుసు, వారి ప్రతి వ్యూహం గురించి కూడా నాకు అవగాహన ఉంది. ఈ వ్యక్తుల ప్రధాన లక్షణం పిరికితనం" అని ఆయన వీడియోలో అన్నారు.

    ‘‘ఈ కథలోని ప్రతినాయకులైన నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్, అజిత్ దోభల్ ఇప్పుడు నెమ్మదిగా ఇరుక్కుపోతున్నారు. వారి చుట్టూ ఉన్న వలయం కుంచించుకుపోతోంది’’ అన్నారు.

    పెద్దసంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంపై రాహుల్ గాంధీ స్పందించారు.

    "మీకు నచ్చింది మీరు చేయండి. మీకు కావల్సినంతమంది పోలీసులను పిలవండి – 10వేలు, 20వేలు, 50వేలమందిని...ఎంతమందినైనా పిలవండి. నాయకులందరినీ అరెస్టు చేయండి. యువత అందరినీ అరెస్టు చేయండి. మమ్మల్నందరినీ అరెస్టు చేయండి. భయపడకండి – మేము మిమ్మల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాం, మేము వెనక్కి తగ్గం"

    ‘‘నా మాటలు గుర్తుంచుకోండి. మాకు కావాల్సిన సమాచారం ఇప్పటికే మా దగ్గర ఉంది. మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. భారత ప్రజల గొంతుకను కాపాడుకుంటాం. గత 10-15 సంవత్సరాలలో భారతదేశానికి జరిగినది, ఎట్టి పరిస్థితులలోనూ మళ్ళీ జరగకుండా చూసుకుంటాం.

    "భారత యువతా... మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. మీ నిరసనను కొనసాగించండి. మీకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని, మన రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నవారు ఓడిపోయేలా చూస్తాం’’ అని రాహుల్ గాంధీ ఆ వీడియోలో తెలిపారు.

  14. దిల్లీ : 12 ఫోటోలలో సీజేపీ ఆందోళన

  15. తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

  16. సీజేపీ ప్రతినిధులను విమానంలోనే ఎలా అదుపులోకి తీసుకున్నారంటే...

  17. దిల్లీలో సీజేపీ నిరసనల నడుమ చెన్నైకి రాహుల్ గాంధీ

    చెన్నైలో ‘ఛాత్రోంకి గూంజ్( విద్యార్థుల గొంతుక) కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, యువతతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంభాషించనున్నారు. ఈ క్యాంపెయిన్‌లో ఇది ఆరో కార్యక్రమం.

    మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఈరోజే దిల్లీలో నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో పాల్గొనాలని సీజేపీ అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపింది. నిరసనలో లెఫ్ట్ పార్టీలైన సీపీఎం, సీపీఐ, సీపీఐ-ఎంఎల్, ఆర్‌ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనే అవకాశం ఉంది.

    ఇక, ‘ఛాత్రోంకి గూంజ్’ క్యాంపెయిన్‌లో భాగంగా చెన్నైలో రాహుల్ గాంధీ నిర్వహించే ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో మొదటిది.

    దీనికి ముందు కోటా, దెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్, పుణె, ఇందౌర్‌లో ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

  18. ముకేశ్ అంబానీని 'ప్రధానమంత్రి' అంటూ కామెంట్ చేసిన ఎలాన్ మస్క్, వీరి మధ్య వివాదం ఏంటి?

  19. జంతర్ మంతర్‌కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

    దిల్లీలోని జంతర్-మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు.

    సీజేపీ నిరసనను దృష్టిలో ఉంచుకుని దిల్లీ రైల్వే స్టేషన్లు, హోటళ్లు, ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్న ప్రయాణికులను, హోటళ్లలో బస చేస్తున్నవారిని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా నిరసనలో పాల్గొనడానికి దిల్లీకి చేరుకుంటున్న వారిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

    జంతర్-మంతర్ వద్ద తలపెట్టిన నిరసనకు ముందే ఫిరోజ్ షా రోడ్డు, మండి హౌస్‌ల వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను మోహరించారు. అలాగే దిల్లీ-నోయిడా సరిహద్దులో కూడా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

    నిరసన పిలుపు నేపథ్యంలో దక్షిణ జిల్లాతో పాటు మొత్తం దిల్లీలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశామని దక్షిణ దిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. అనధికార వ్యక్తులు దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు తనిఖీల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.

    డీసీపీ అనంత్ మిట్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిరసన సమయంలో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యం. ఇందుకోసం వివిధ సరిహద్దుల్లో దాదాపు 12 పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లా అంతటా అనేక చోట్ల పోలీసు పికెట్లను ఏర్పాటుచేశారు.

  20. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    సీజేపీ నిరసన నేపథ్యంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

    బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు, అలాగే గురుగ్రామ్ పోలీసులు ధ్రువీకరించారు. గురుగ్రామ్ సెక్టార్-56 నుంచి ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన సన్నిహితుడు తెలిపారు. పీటీఐ వార్తా సంస్థ కూడా రాఠీ అరెస్టు గురించి సమాచారం ఇచ్చింది.

    అంతకుముందు, ధ్రువ్ రాఠీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇండియా గేట్ ఎదురుగా తిరుగుతూ కనిపించారు.

    “నేను దిల్లీకి వచ్చాను. ప్రధానమంత్రి 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, అనేక రైళ్లు, బస్సులను రద్దు చేశారని విన్నాను. నిరసన కారణంగా దిల్లీని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు” అని ఆ వీడియోలో ధ్రువ్ రాఠీ అన్నారు.

    “మోదీజీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా నిరసనలో జనసంచారం ఉండదని ఒకవైపు మీ ఐటీ సెల్ చెబుతోంది. ఒకవేళ జనం రాకపోతే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడ్డారని భావిస్తున్నాను. నిజానికి ప్రజలందరూ మేల్కొన్నారు” అన్నారు.

    ఈ నిరసనలో పాల్గొనడానికి జంతర్ మంతర్ చేరుకుంటున్న పలువురు ఆందోళనకారులను కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా ఈరోజు మధ్యాహ్నం ముంబయిలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో నిరసన ప్రదర్శన ఉండటంతో, సామాజిక కార్యకర్తలు తుషార్ గాంధీ, ఫిరోజ్ మిథిబోర్వాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు 'హం భారత్ కే లోగ్' సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.