వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం స్టార్టప్‌ల వైపు భారతీయుల మొగ్గు

    • రచయిత, రచితా ప్రసాద్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

అరిందమ్ భట్టాచార్య జకార్తాలోని అడ్వర్‌టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. 2024లో ఆయన ఒక ఊహించని సంఘటనను ఎదుర్కొన్నారు.

కోల్‌కతా నగరంలో నివసిస్తున్న తన తల్లిదండ్రులు.. ఆయన్ను చూడటానికి వచ్చినప్పుడు తన తండ్రికి ఆరోగ్య సమస్య తలెత్తింది. ఎలాగోలా భట్టాచార్య తన తండ్రికి కావాల్సిన వైద్య సంరక్షణను అందించగలిగారు.

కానీ, తిరిగి వారు వెనక్కి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు.. స్వయంగా తాను అక్కడ లేనప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడం ఎలా అని? చాలామంది భారతీయులు ఎదుర్కొనే ప్రశ్న ఆయన మనసులో కూడా మెదిలింది.

యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ) ప్రకారం.. 2020 నుంచి 2050 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు, ఆపైబడిన వారి సంఖ్య రెట్టింపై 210 కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా.

భారత్‌లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. 2050 నాటికి, ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు 60 ఏళ్లు పైబడిన వారు ఉంటారు. ఈ సంఖ్య మొత్తం జనాభాలో దాదాపు 21 శాతానికి సమానమని అంచనా.

కొన్ని దశాబ్దాల కిందటి వరకు.. భారత్‌లో వృద్ధుల సంరక్షణపై పెద్దగా చర్చ జరిగేది కాదు. ఎందుకంటే, వారి కుటుంబాలే ఆ బాధ్యతను తీసుకుంటాయనే అంచనా ఉండేదని యూఎన్ఎఫ్‌పీఏ పేర్కొంది.

అయితే, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం తదితర కారణాల వల్ల ఈ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. యువత తమ కుటుంబాలకు దూరంగా వెళ్తుండటం, పెద్ద వారిని చూసుకోవడానికి వీలైన సామాజిక సదుపాయాలు పరిమితంగా ఉండటంతో.. ఈ అంతరం మరింత పెరుగుతుందని నిపుణులు చెప్పారు.

కొందరు దీన్నొక అవకాశంగా భావించారు.

భారత్‌లోని సీనియర్ కేర్ ఇండస్ట్రీ అంటే వృద్ధులను సంరక్షించే పరిశ్రమ విలువ సుమారు 7 బిలియన్ డాలర్లుగా (రూ.66,532 కోట్లుగా) ఉన్నట్లు ప్రభుత్వ థింక్ టాంక్ సంస్థ నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ పరిశ్రమ వేగంగా వృద్ధి చెంది, ఆరోగ్య సంరక్షణ కంపెనీలకు భారీ అవకాశాలను అందిస్తుందని అంచనాలున్నాయి.

ఇప్పటికే చాలా స్టార్టప్ కంపెనీలు ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టాయి. ఈ కంపెనీలు సీనియర్ లివింగ్ (వృద్ధుల నివాసాలు), హోమ్ కేర్ (ఇంటి వద్దే సంరక్షణ), టెక్నాలజీ ఆధారిత సేవల వంటి పలు రంగాలపై దృష్టి సారిస్తున్నాయి.

వృద్ధులు మరింత స్వతంత్రంగా జీవించడానికి, వృద్ధాప్యాన్ని గడపడానికి సహాయపడటమే వీరి లక్ష్యం అయినప్పటికీ, వీరికి అసలైన కస్టమర్లు మాత్రం తాము సాయం చేస్తున్న వృద్ధుల పిల్లలే.

తన తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు, సంరక్షణను అందించేందుకు అత్యవసరమైన సమయంలో వైద్య సాయం కోసం రెండు స్టార్టప్‌లపై తాను ఆధారపడుతున్నట్లు భట్టాచార్య చెప్పారు.

''ఈ సేవలు నాకు చాలా సాయం చేస్తున్నాయి. కానీ, ప్రతీది నేను జకార్తా నుంచి సునిశితంగా పరిశీలిస్తున్నా'' అని తెలిపారు. ఈ సేవల సప్లయి కంటే కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

మనసుమ్ సీనియర్ లివింగ్, ప్రైమస్ సీనియర్ లివింగ్,, అనంత లివింగ్, వేదాంత సీనియర్ లివింగ్ వంటి కంపెనీలు ముఖ్యంగా వృద్ధులు నివసించే వసతులను, సంరక్షణ సేవల కోసం ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. సంప్రదాయ రియల్ ఎస్టేట్ డెవలపర్ల నుంచి కూడా ఈ ప్రాజెక్టులకు ఆసక్తి బాగా పెరుగుతోంది.

రియల్ ఎస్టేట్ నిర్వహణ సంస్థ అయిన కొలియర్స్ ఇంటర్నేషనల్ గ్రూప్ అంచనా ప్రకారం.. భారత్‌లో ప్రస్తుత సీనియర్ లివింగ్ డిమాండ్ సుమారు 2.2 మిలియన్ యూనిట్లు కాగా.. కేవలం 25,000 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

అమెరికాలోని తమ తోటివారితో పోలిస్తే భారత్‌లో చాలా మంది వృద్ధులు పరిమితమైన, కట్టుదిట్టమైన జీవితాన్ని గడుపుతుండటాన్ని చూసిన తర్వాత మాజీ టెక్ ఎగ్జిక్యూటివ్ అనంతరామ్ వరయూర్ 'మనసుమ్ సీనియర్ లివింగ్' సంస్థను సహ-స్థాపించారు.

2015లో, అమెరికాలోని ఒక పెద్ద భారతీయ సమాజం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మొదటిసారిగా ప్రమోషనల్ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాన్సెప్ట్‌పై అవగాహన ఉన్న యువ భారతీయుల నుంచి స్పందన లభిస్తుందని ఆయన ఆశించారు. కానీ, ఎవరూ ముందుకు వచ్చి వివరాలు అడగలేదు.

దీనికి కారణం, భారత్‌లోని సాధారణంగా పిలిచే "వృద్ధాశ్రమం"లో కుటుంబంలోని పెద్దలను ఉంచడం పట్ల సమాజంలో ఒక రకమైన "కళంకం" ఉందని ఆయన భావిస్తున్నారు.

కానీ, పరిస్థితులు మారాయి. ఆయన కంపెనీ ఇప్పటికే 900 ఆపరేషనల్ యూనిట్లను ముఖ్యంగా బెంగళూరు, గోవాలో ఏర్పాటు చేసింది. లగ్జరీ ప్రాజెక్టుతో కలిపి 2030 నాటికి 10 వేల ఆపరేషనల్ యూనిట్లకు పెంచాలని ప్రణాళికలు ఉన్నాయి.

విదేశాలలో పిల్లలు ఉన్న వృద్ధులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలున్న జంటలు, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులు, భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటున్న యువత నుంచి వారికి ఎంక్వైరీలు వస్తున్నాయి.

అయితే, తమ ఇళ్లల్లో లేదా అపార్ట్‌మెంట్లలో ఉండటానికి ఇష్టపడే, మద్దతు అవసరమైన వృద్ధులూ చాలా మంది ఉన్నారు.

అంతకుముందు, ఇంట్లో సహాయకులుగా పనిచేసేవారిని, నర్సులను కుటుంబ సంరక్షణ బాధ్యతలను చూసుకునే వారికి అదనంగా చూసేవారు. నేడు, వారినే ప్రధాన సంరక్షకులుగా చూస్తున్నారు.

ఒకప్పుడు చిన్న చిన్న లోకల్ ఏజెన్సీల చేతుల్లో, అక్కడక్కడా ఉన్న గృహ సంరక్షణ మార్కెట్.. ఇప్పుడు సరికొత్త రూపు దాల్చింది. సాంకేతికతను వాడుకుంటూ, రోగికి కావాల్సిన అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తెస్తూ పెద్ద పెద్ద కంపెనీలు ఈ రంగంలో వేగంగా దూసుకొస్తున్నాయి

ఉదాహరణకు, ఎమోహా ఎల్డర్ కేర్ సర్వీసెస్, కేర్24, కైట్స్ సీనియర్ కేర్ వంటివి ఇందులో ఉన్నాయి.

సంరక్షణ రంగం సున్నితత్వం, దాని స్వభావం కారణంగా.. సరైన వ్యక్తులను కనుగొనడం, వారిని నిలుపుకోవడం అతిపెద్ద సవాలుగా మారుతోంది.

"సిబ్బందికి తగినంత శిక్షణ ఇవ్వడంలో విఫలమైతే, డిమాండ్ పెరుగుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన వ్యక్తుల కొరత ఏర్పడుతుంది" అని రేటింగ్ సంస్థ కేర్‌ఎడ్జ్ నివేదిక హెచ్చరిస్తోంది.

ఈ సవాలు కేవలం నైపుణ్యాలకు మాత్రమే పరిమితం కాలేదు. మోసాలు, ఆర్థిక కుంభకోణాలు, ఇతర రకాల దోపిడీలకు గురయ్యే అవకాశం ఉన్న ఈ ప్రజలకు అండగా నిలవడానికి వచ్చే సంరక్షకులకు క్షుణ్ణమైన నేపథ్య పరిశీలన చేపట్టాల్సి ఉంటుంది. వారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా అవసరం.

ఈ సమస్యను నీతి ఆయోగ్ గుర్తించింది. భారత్‌లో వృత్తిపరమైన, సమ్మిళిత సంరక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ఒక జాతీయ సంరక్షణ విధానం అవసరమని నొక్కి చెప్పింది.

క్లయింట్ల భావోద్వేగ, సామాజిక అవసరాలను పరిష్కరించే మార్గాల కోసం ఎంట్రప్రెన్యూర్లు కూడా చూస్తున్నారు.

2022లో టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, గుడ్ ఫెలోస్ అనే స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టడం పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని ఆకర్షించింది. ''ఎవ్రీథింగ్ గ్రాండ్‌కిడ్స్ డూ!'' అనే ట్యాగ్‌లైన్ ఈ కంపెనీ చేసే పనిని వివరిస్తుంది.

కుటుంబ స్థానాన్ని భర్తీ చేయాలని తాము కోరుకోవడం లేదని, క్లయింట్లతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి లేదా వారికి టెక్నాలజీ పరంగా సహాయం చేయడానికి ఉత్సాహంగా, సానుభూతితో ఉండే యువ సహచరులను అందించడం ద్వారా ఆ లోటును పూరించడమే మా లక్ష్యమని వ్యవస్థాపకుడు శాంతను నాయుడు చెప్పారు.

నిజ జీవితంలోని సవాళ్లను పరిష్కరించేందుకు కొందరు వ్యాపారవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా వాడుతున్నరు.

బెంగళూరులో కుబో కేర్, నోబ్లింక్.ఏఐ వంటి కంపెనీలు.. ప్రజల కదలికలను పర్యవేక్షించడానికి, వారు స్పృహ కోల్పోయినా లేదా కిందపడినా అత్యవసర సేవలను అప్రమత్తం చేయడానికి.. ఏఐ-ఆధారిత పర్యవేక్షణ సేవలను ఇళ్లలో గోడకు అమర్చిన రాడార్ పరికరాలతో అనుసంధానిస్తున్నాయి.

"దీనిని తక్కువ ఖర్చుతో, అందుబాటు ధరలో అందించేలా పెద్ద ఎత్తున నిర్మించడమే మా లక్ష్యం" అని నోబ్లింక్.ఏఐ సహ-వ్యవస్థాపకుడు ప్రజిత్ నాయర్ చెప్పారు.

విదేశాల్లోని కొన్ని ఇలాంటి ఉత్పత్తుల ధరలో పదో వంతు ధరకు, అంటే ఒక్కో పరికరం 13,500 రూపాయలకు, ప్రతి గదికి నెలకు 50 రూపాయల నుంచి ప్రారంభమయ్యే నెలవారీ పర్యవేక్షణ రుసుముతో ఈ సిస్టమ్‌లను ప్రస్తుతం సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్‌లకు విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అయితే, అనేక స్టార్టప్‌లు ధరలను పోటీగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అందుబాటు ధర ఒక పెద్ద సమస్యగా మారింది.

సీనియర్ లివింగ్ ప్రాజెక్టులో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్ యూనిట్‌ను కొనుగోలు చేయడం 60 లక్షల ఖర్చుతో కూడుకున్నదని వరయూర్ చెప్పారు. దీనికి నిర్వహణ, ఆహార ఖర్చులు అదనం. వారు ఎంపిక చేసుకునే సౌకర్యాలను బట్టి ఖర్చులు మారుతూ ఉంటాయి.

డిమాండ్ ఎక్కువగా ఉంది. చాలామంది పెద్ద వారికి వీటి సేవలు అందుబాటు ధరల్లో లేవు.

భారత్‌లో వృద్ధ జనాభాలో 78 శాతం మంది ఎలాంటి పెన్షన్ లేకుండా జీవిస్తున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఇది ఈ సేవలను పొందే వారి సామర్థ్యాన్ని పరిమితం చేయవచ్చు. ఇంట్లో ఎవరూ వృద్ధులు లేని కుటుంబాల తలసరి నెలవారీ ఆదాయం 4,098 రూపాయలతో పోలిస్తే, కనీసం ఒక వృద్ధ వ్యక్తి ఉన్న కుటుంబాల తలసరి నెలవారీ ఆదాయం దాదాపు 3,568 రూపాయలుగా ఉంది.

అందుకే, స్టార్టప్‌లు మాత్రమే ఏకైక పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు.

పెరుగుతున్న వృద్ధ జనాభా సమస్యలను పరిష్కరించేందుకు జపాన్ దీర్ఘకాలిక సంరక్షణ బీమా, పబ్లిక్ నర్సింగ్ ఫెసిలిటీలు, సోషల్ ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్‌లు, కమ్యూనిటీ ఆధారిత మద్దతు వ్యవస్థలను ప్రవేశపెట్టింది.

భారత పొరుగు దేశమైన చైనా, వృద్ధాప్య జనాభాతో సంవత్సరాలుగా పోరాడుతోంది. తన వర్క్‌ఫోర్స్ తగ్గిపోతున్న తరుణంలో, యువకులు పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడానికి, జననాల రేటును పెంచడానికి ఆ దేశం అనేక చర్యలను అమలు చేస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో, సరసమైన సంరక్షణ, న్యాయ సహాయం, డిజిటల్ ఇంక్లూజన్, సురక్షితమైన ప్రజా ప్రదేశాల హక్కులను కేంద్రంగా చేసుకుని వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదించిన తొలి భారతీయ రాష్ట్రంగా కేరళ నిలిచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)