మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
బస్సులో ‘చిల్లర గొడవ’ గురించి కండక్టర్ ప్రవళిక తన తల్లికి ఏం చెప్పారు, ప్రవళికను బస్సులోంచి తోసేసిన నిందితురాలు ఎవరు?
''టీజీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ సురక్షిత ప్రయాణం కోసం టీజీఎస్ఆర్టీసీ ఎన్నో చర్యలు తీసుకుంది. కండక్టర్, డ్రైవర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నాం. సురక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి. ధన్యవాదాలు.''
చాలా రోజుల కిందట మణుగూరు డిపోకు చెందిన ప్రవళిక అనే యువ కండక్టర్ చేసిన ఈ రీల్ ఇప్పుడు బాగా వైరల్ అయింది.
ఆమెకు తెలిసినవారే కాకుండా, ఇతరులు కూడా ఆ వీడియోను చూసి ప్రవళికను గుర్తు చేసుకుంటున్నారు.
అక్టోబర్ 25న ఓ ప్రయాణికురాలి దాడిలో బస్సు నుంచి పడిపోయిన ప్రవళిక చికిత్స పొందుతూ నవంబర్ 3న మరణించారని ఆమె తల్లి విజయలక్ష్మి తెలిపారు.
ప్రవళిక తండ్రి కూడా ఆర్టీసీ ఉద్యోగి. దాదాపు మూడేళ్ల క్రితం ఆయన ఉద్యోగంలో ఉండగానే మరణించారు.
కారుణ్య నియామకం కింద ప్రవళికకు మణుగూరు డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ప్రవళిక కూడా మరణించడంతో ఆ తల్లి ఒంటరి అయ్యారు.
''ఆ రోజు డ్యూటీలో భద్రాచలం వెళ్తోంది. ఇంటికాడ టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయపోయావా అని ఫోన్ చేస్తే, బస్సులో జనం ఎక్కువ ఉన్నారమ్మా.. భద్రాచలం వెళ్లాక బస్టాండ్‌లో చేస్తాలే అంది’’ అని ప్రవళిక తల్లి విజయలక్ష్మి గుర్తు చేసుకున్నారు.
‘‘తర్వాత నేను చర్చికి వెళ్లాను. అక్కడ ఉండగా... పాపకు చిన్న గాయం అయింది మీరు కంగారు పడకుండా భద్రాచలం ఆసుపత్రికి రండి అని ఫోన్ వస్తే వెళ్లాను. వెళ్లాక.. పాప పరిస్థితి ఏమీ బాగోలేదంటూ హైదరాబాద్ పంపించారు. 10 రోజుల పాటు ఐసీయూలో ఉంది'' అని చెప్పారు విజయలక్ష్మి.
‘తండ్రి ఉద్యోగమని ఇష్టంగా చేరింది’
బీఈడీ చదివిన ప్రవళిక తన తండ్రి చేసిన ఉద్యోగం కావడంతో ఎంతో ఇష్టంగా చేసేదని తల్లి బీబీసీకి చెప్పారు.
''బీఈడీతో పాటు సాఫ్ట్వేర్ కోచింగూ తీసుకుంది. సరిగ్గా ఉద్యోగంలో చేరుతుందనగా, నా భర్త ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్ తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో 6 నెలలు ఉన్నారు. పాప అక్కడే ఉండిపోయింది. ఆయన కిడ్నీలు ఫెయిలైపోయి చనిపోయారు. ఆ తరువాత ఆ ఉద్యోగం పాపకు ఇచ్చారు. డాడీ ఉద్యోగం కదా అమ్మా.. నేను చేస్తాను అంది" అని వివరించారు విజయలక్ష్మి.
26 ఏళ్ల ప్రవళికకు త్వరలో పెళ్లి చేయాలని తల్లి భావించారు.
''ఉద్యోగంఇంకా పర్మినెంట్ కాలేదు కదమ్మా, అయ్యాక చేసుకుంటాననడంతో సరే అన్నాను. ఇప్పుడు ఉద్యోగం పర్మినెంట్ అయింది. కానీ వెంటనే ఇలా అయింది'' అని చెప్పారు తల్లి.
ప్రవళిక, తన తల్లి విజయలక్ష్మితో కలసి మణుగూరులో ఉండేవారు. ఇప్పుడు విజయలక్ష్మి ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకు తోడుగా ఆర్టీసీ సిబ్బందే కనిపిస్తున్నారు. దగ్గరి బంధువులు కూడా అక్కడ ఎవరూ లేరు. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు కూడా ఆర్టీసీ సిబ్బందే చేస్తున్నారు.
ఈ ఘటన తరువాత టీజీఎస్ఆర్టీసీ తమకు అన్ని విధాలా అండగా నిలబడినట్టు విజయలక్ష్మి బీబీసీకి చెప్పారు.
''మేమిద్దరం ఆడవాళ్లమే. ఆస్పత్రిలో మాకంటూ ఎవ్వరూ లేరు అంటే.. మీకు సాయంగా నలుగురిని పంపుతాం.. అని ఆన్ డ్యూటీలో నలుగురు సిబ్బందిని పంపారు. మీరు పాప దగ్గరే ఉండండి. బయట పనులు వారు చూసుకుంటారని చెప్పారు. ఆర్టీసీ అధికారులంతా చాలా బాగా చూసుకున్నారు'' అని బీబీసీకి చెప్పారు విజయలక్ష్మి.
‘బస్సులో చిల్లర అంటూ ఒకటే గొడవ’
బస్సులో ఏం జరిగిందో తన కుమార్తె చెప్పిన వివరాలను విజయలక్ష్మి బీబీసీకి చెప్పారు.
''చిల్లర కోసం అలా తోసేయడం ఏంటండి? మణుగూరు బస్ స్టాండ్‌లో ఎక్కిన దగ్గర నుంచి చిల్లర చిల్లర అంటోంది. క్యాష్ బ్యాగ్ కూడా చూపించా.. చిల్లర లేదు. మీరు 10 రూపాయల టికెట్‌కు వంద రూపాయలు ఇచ్చారు. చిల్లర లేదు. ఇప్పుడు మిగిలినవారికి టికెట్లు కొడుతున్నా కదా, మీరు దిగేటప్పుడు ఇస్తాను అని చెప్పిందట మా అమ్మాయి. కానీ ఆ మహిళ ఎక్కినప్పటి నుంచి ఒకటే గొడవ, తిట్లు, శాపనార్థాలు పెట్టిందమ్మా.పోనిలే దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను అమ్మా ’’ అని మా అమ్మయి చెప్పింది అని వివరించారు విజయలక్ష్మి.
‘‘చిల్లర తరువాత ఇస్తాను అంటే ఇప్పుడే ఇవ్వు, లేకపోతే రన్నింగ్ బస్సు నుంచి దిగిపోతా అని బెదిరించింది. దిగిపోతానంటే నేను చెయ్యి అడ్డం పెట్టానమ్మా. దిగొద్దు, నువ్వు ఇలా దిగి నీకేమైనా అయితే నా ఉద్యోగం పోతుందని చెయ్యి అడ్డం పెడితే, నన్ను ఆపడానికి నువ్వెవరవు అని రెండు చేతులతో నెట్టిందమ్మా, ఒక చేతితో టిమ్ (టికెట్లు ఇచ్చే మెషీన్) ఇంకో చేతిలో రాడ్డు ఉందిగా.. పడిపోయాను మమ్మీ అని ఏడిచింది’’ అని విజయలక్ష్మి తన కమార్తె పడిన బాధను తెలిపారు.
‘‘నువ్వు దిగే స్టాప్ దగ్గర నేను చిల్లర ఇస్తా అని మా అమ్మాయి చెప్పినా సరే ఆ పిల్ల వినకుండా తోసేసిందంటండి. ఆ అమ్మాయికి కఠినంగా శిక్ష ఇయాలి. నేను అంతకన్నా నేను ఏం కోరుకోవట్లే'' అన్నారు విజయలక్ష్మి.
రూ.10 టికెట్‌కు 100 రూపాయలు.. వివాదం అక్కడే
తోటి సిబ్బందికి ప్రవళిక చెప్పిన వివరాల ప్రకారం, అక్టోబర్ 25వతేదీ ఉదయం బస్సు ఎక్కిన మహిళ మిట్టగూడెం దగ్గర దిగాలి అని చెప్పి తన బాబుకు టికెట్ తీసుకున్నారు. ఆమెకు ఉచితం కాబట్టి తీసుకోలేదు.
అయితే 10 రూపాయల టికెట్‌కి వంద రూపాయలు ఇవ్వగా చిల్లర లేదని కండక్టర్ చెప్పారు. అక్కడ వివాదం రేగింది. మిగతా టికెట్లు కొట్టాక డబ్బులు వస్తాయి కాబట్టి కాసేపు ఆగి చిల్లర ఇస్తాను అంటే ఆమె వినలేదు. అప్పటికప్పుడే చిల్లర కావాలని పట్టుబట్టారు. తోటి ప్రయాణికులు సర్దిచెప్పినా ఆమె వినకుండా తీవ్రమైన భాష వాడారు.
పోనీ తననే చిల్లర ఇవ్వమంటే ఆవిడ ఇవ్వలేదు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులను కూడా తిట్టారు. గొడవ పెరగడంతో బస్సును పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లమని కండక్టర్ చెప్పడంతో కంగారు పడిన ఆ మహిళ రన్నింగ్ బస్సు దిగుతాను అని తలుపు దగ్గరికి వెళ్లారు.
రన్నింగ్ బస్సు నుంచి ఆమె దూకుతుందేమోనని భయంతో కండక్టర్ ఆమె దగ్గరకు వెళ్లి అడ్డుకుంది. తనను అడ్డుకుంటోందనే భయంతో ఆ మహిళ రన్నింగ్ బస్సు నుంచి కండక్టర్‌ను తోసేసింది. దీంతో కింద పడిన కండక్టర్ కాళ్ల మీద నుంచి బస్సు చక్రాలు వెళ్లాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం స్టేషన్ పరిధిలోని మిట్టగూడెం దగ్గర ఈ ఘటన జరిగింది. అశ్వాపురం పోలీసులు కేసు నమోదు చేసి ప్రయాణికురాలు మౌనికను అరెస్ట్ చేశారు.
‘మౌనిక గతంలోనూ దురుసుగా ప్రవర్తించారు’
మౌనికకు కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఆమె తరచూ బస్సు ప్రయాణం చేస్తుండడం వల్ల స్థానిక బస్ కండక్టర్లకు ఆమె తెలుసనీ, ఆమె మరికొందరు కండక్టర్లతో దురుసుగా ప్రవర్తించారని ప్రవళిక తోటి సిబ్బంది బీబీసీ వద్ద ఆరోపించారు.
అయితే ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె వాదన తెలుసుకోడానికి సాధ్యపడలేదు. ఆమె తండ్రి, ఇద్దరు కుటుంబ సభ్యులను బీబీసీ సంప్రదించినా, వారు మాట్లాడేందుకు ఇష్టపడలేదు.
మౌనికపై పెట్టిన హత్యాయత్నం కేసును ప్రవళిక మరణించడంతో హత్య కేసుగా మార్చారు పోలీసులు.
‘ఏ డ్యూటీ వేసినా శ్రద్ధగా చేసేది’
''డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండేది. ఏ డ్యూటీ, ఎలాంటి హార్డ్ డ్యూటీ వేసినా చేసేది తప్ప, నాకీ డ్యూటీ వద్దు అని ఫిర్యాదు చేసేది కాదు. అన్నీ చేయాలి కదా అనేది. వంద శాతం ఎఫర్ట్ పెట్టి పనిచేసేది'' అని ప్రవళిక గురించి బీబీసీకి చెప్పారు మణుగూరు డిపో ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి, తోటి కండక్టర్ పవన్ కుమార్.
''వాస్తవానికి ప్రవళిక కాళ్లకు తప్ప ఇంకెక్కడా గాయాలు కాలేదు. కానీ కాళ్లపై టైర్లు వెళ్లడంతో అత్యంత దారుణమైన గాయాలు అయ్యాయి. చికిత్సకు ఆమె శరీరం సహకరించలేదు. లో బీపీ వలన శస్త్ర చికిత్స సాధ్యపడలేదు. ఆపరేషన్‌కి చాలా హైరిస్క్ ఉంటుందని వైద్యులు చెప్పారు. ట్రీట్మెంటుకు శరీరం సహకరించకపోవడంతో మరణించింది'' అని బీబీసీకి చెప్పారు పవన్ కుమార్.
ప్రవళిక మరణానికి సంతాపంగా మణుగూరు డిపోలో ఒక రోజు బంద్ చేశారు సిబ్బంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పలు డిపోల వద్ద నిరసనలు చేపట్టారు, బస్సులు నిలిపివేశారు.
క్షేత్ర స్థాయిలో కండక్టర్లు, అందునా మహిళా కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల వారు.
''45 - 50 మంది ఎక్కాల్సిన బస్సులో 100 మంది ఎక్కినప్పుడు చాలా సమస్య ఉంటుంది. ఒక టికెట్ మిస్ అయినా ఉద్యోగానికి ముప్పు. జనాన్ని తప్పించుకుంటూ కదలడం ఒక సమస్య. ఆడవారికి అదనపు సమస్య. మగవారికి కూడా ఆడవారి మధ్యలో నుంచి వెళ్లడం సమస్యే’’ అన్నారు పవన్ కుమార్
‘‘కండక్టర్లుగా పనిచేసేవారు మీ ఇంట్లో వారైతే మీరెలా ప్రవర్తిస్తారు అని ప్రయాణికులు ఆలోచించుకోవాలి. చిల్లర కావాలంటే ఏదో షాపులో మార్చి ఇస్తానని చెప్పవచ్చు. లేదా ఇచ్చే వరకూ ఆగవచ్చు. గొడవపడితే ఏమొస్తుంది?'' అన్నారు పవన్ కుమార్.
తల్లీకూతుళ్లు తప్ప ఆ కుటుంబానికి ఎవరూ లేకపోవడంతో, ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడూ, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల కోసం నలుగురు కండక్టర్లను ఆన్ డ్యూటీగా ఆ కుటుంబానికి కేటాయించింది ఆర్టీసీ యాజమాన్యం.
ఆ నలుగురు సిబ్బందీ, ఆసుపత్రిలోనూ, తరువాత కుటుంబంతోనే ఉన్నారు.
ఇక ప్రవళిక కుటుంబానికి పరిహారంగా తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ప్రకటించగా, ఉద్యోగ ఇన్సూరెన్స్ కోటి రూపాయలు అందుతుందని, అలానే ఆమె తల్లికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
''భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకూడదు. ఒకవేళ మా సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి. చర్యలు తీసుకుంటాం. కానీ ఘర్షణలకు దిగడం వల్ల ఇవాళ ఒక కుటుంబం రోడ్డున పడ్డది. ఆ కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుంది. ప్రమాదం జరగగానే మంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నాం’’ అని మీడియాతో చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)