బ్యాంకులో రూ.20 కోట్లు దోచేసిన యూనివర్సిటీ విద్యార్థులు.. ఏడాదిన్నర తర్వాత ఎలా బయటపడిందంటే..

    • రచయిత, మొహమ్మద్ ఖాజిమ్
    • హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఓ బ్యాంకును దోచుకోవడానికి యూనివర్సిటీ విద్యార్థులు పక్కాప్రణాళిక వేశారు. తమను ఎవరూ కనిపెట్టలేరని భావించారు.

భద్రతా బలగాల యూనిఫాం ధరించి, తనిఖీల పేరుతో బ్యాంకులోకి ప్రవేశించిన యూనివర్సిటీ విద్యార్థులు రూ.20 కోట్లకు పైగా నగదు దోచుకు పారిపోయారని పోలీసులు చెప్పారు.

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్, లస్బెలా జిల్లాలోని ఓథల్ ప్రాంతంలోని బ్యాంకులో ఈ దోపిడీ జరిగింది.

దాదాపు ఏడాదిన్నర తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడి బ్యాంకు ఖాతా కీలక ఆధారంగా మారిందని లస్బెలా జిల్లా ఎస్ఎస్పీ నజీబుల్లా పందరానీ తెలిపారు.

"దోపిడీకి ముందు ఆయన ఖాతాలో వేల రూపాయల లావాదేవీలు మాత్రమే జరిగేవి. కానీ, ఘటన తర్వాత ఆ ఖాతాలో కోట్ల రూపాయల లావాదేవీలు నమోదయ్యాయి" అని చెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో భాగమైన ఓ అధికారి తన పేరు వెల్లడించకుండా బీబీసీ ఉర్దూకు వివరాలు తెలిపారు.

నిందితుల్లో ఒకరు గతంలో బ్యాంకులో పనిచేశారని చెప్పారు. దీంతో బ్యాంకులో నగదును ఎక్కడ ఉంచుతారు? ఎక్కువ మొత్తాన్ని ఎలా తీసుకోవచ్చు? అనే విషయాలపై నిందితుడికి అవగాహన ఉందని వెల్లడించారు.

దోపిడీ తర్వాత నిందితులను ఓథల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ యార్ మహమ్మద్ వెంబడించారు. అయితే, ఎదురుకాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు, ఒక కంటిచూపు కోల్పోయారు.

దోపిడీకి పక్కా ప్రణాళిక రూపొందించడమే కాకుండా, ఘటనకు ఉపయోగించిన కారును కూడా నిందితులు తగలబెట్టారని పోలీసులు చెప్పారు.

ఇటీవల ఓథల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో లస్బెలా ఎస్ఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతా వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఏడాదిన్నర క్రితం దోపిడీ

ఓథల్‌లోని నేషనల్ బ్యాంకులో 2025 ఫిబ్రవరి 28న ఈ దోపిడీ జరిగింది. బ్యాంకు మేనేజర్ ఫలక్ షేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. భద్రతా బలగాల యూనిఫాం ధరించిన ఆరుగురు సాయుధులు ఓ కారులో వచ్చారు. వారు బ్యాంకు ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి, మేనేజర్ ఎక్కడున్నారని అడిగారు. ఓ లావాదేవీని తనిఖీ చేయడానికి వచ్చామని ఆపరేషన్స్ మేనేజర్ జహంగీర్‌కు ఫోన్‌లో తెలిపారు.

దీంతో, బ్యాంకు మేనేజర్ ఫలక్ షేర్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బంది నవాజ్ అలీ, మహమ్మద్ దావూద్‌లపై నిందితులు రైఫిల్ బాట్‌తో దాడి చేసి గాయపరిచినట్లు ఫలక్ షేర్ గుర్తించారు.

"నిందితులు తనతో పాటు బ్యాంకు సిబ్బందిని బందీలుగా చేసుకున్నారని ఆపరేషన్స్ మేనేజర్ తెలిపారు" అని ఫలక్ షేర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్‌లోని వివరాల మేరకు బ్యాంకులో ఉన్న 20 కోట్ల 20 లక్షల రూపాయలను ఆరు బస్తాల్లో నింపిన నిందితులు వాటిని కారు డిక్కీలో పెట్టుకున్నారు. అనంతరం నగదు భద్రపరిచే గదిలో బ్యాంకు సిబ్బందిని బంధించి, పారిపోయారు.

ఆ రోజు ఓథల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా యార్ మొహమ్మద్ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల మధ్య నేషనల్ బ్యాంక్‌లో దోపిడీ జరిగిందనే సమాచారం వచ్చిందని యార్ మొహమ్మద్ బీబీసీతో చెప్పారు. పోలీసు బృందంతో కలిసి అక్కడికి చేరుకునే సమయానికి నిందితులు పారిపోయారని తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, పాత మోడల్ కారులో నిందితులు ఆర్‌సీడీ హైవే వైపు వెళ్లినట్లు తెలిసిందన్నారు. తర్వాత ఆ కారు బలూచ్ గోత్ వైపు వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. నిందితులను వెంబడించిన సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు యార్ మొహమ్మద్ తెలిపారు.

"మేం దగ్గరకు వెళ్లగానే నిందితులు కాల్పులు ప్రారంభించారు. నాకు రెండు బుల్లెట్లు తగిలాయి. ఒకటి కాలికి, మరొకటి కంటికి సమీపంలో తగిలింది" అన్నారు.

తాను గాయపడిన తర్వాత నిందితులు కొండ ప్రాంతాల వైపు పారిపోయారని, తమ కారుకు నిప్పంటించారని తెలిపారు.

కారును ఎందుకు తగలబెట్టారు?

దర్యాప్తు బృందంలోని ఓ అధికారి తన పేరు వెల్లడించకుండా ఈ ఘటనను వివరించారు. నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకు దోపిడీకి ఉపయోగించిన కారు సహాయపడుతుందని భావించినట్లు చెప్పారు. ఆ కారు నుంచి వేలిముద్రలు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలు లభించే అవకాశం ఉందని, కొండ ప్రాంతాల్లోకి ఆ కారును తీసుకెళ్లడం కూడా సాధ్యం కాదని వివరించారు.

"కారును అక్కడే వదిలేస్తే పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకునేవారు. అందుకే ఆధారాలను చెరిపేసేందుకు దానికి నిప్పంటించారు" అని అధికారి వెల్లడించారు.

దోపిడీలో ఉపయోగించిన రెండు ఆయుధాలను కూడా కారుతో పాటు తగలబెట్టినట్లు తెలిపారు.

"సాధారణ దోపిడీగా కనిపించకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేలా నిందితులు మొదటి నుంచే ప్రణాళిక రూపొందించారు" అని వివరించారు.

యూనివర్సిటీ విద్యార్థులే నిందితులు

ఈ దోపిడీలో పాల్గొన్న ఐదుగురు లస్బెలా యూనివర్సిటీ ఆఫ్ మెరైన్ సైన్సెస్‌లో చదువుతున్న లేదా గతంలో చదివిన విద్యార్థులేనని ఎస్ఎస్పీ నజీబుల్లా పందరానీ తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్నాడని, ఆయన్ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు చెప్పారు.

మిగతా నిందితుల్లో కొందరు ఇంకా యూనివర్సిటీలో చదువుతుండగా, మరికొందరు చదువు పూర్తి చేశారని పోలీసులు వెల్లడించారు. వీరి వయసు 25 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు.

దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం.. నిందితుల్లో ఒకరు గతంలో తుర్బత్‌లోని ఓ బ్యాంకులో పనిచేశారు. దీంతో బ్యాంకు కార్యకలాపాలు, నగదును ఎక్కడ భద్రపరుస్తారనే విషయాలపై ఆయనకు అవగాహన ఏర్పడింది. ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని ముందుగానే ప్రణాళిక రూపొందించారు. బ్యాంకులో భారీ మొత్తంలో నగదును దోచుకోగలిగారు.

ఎలా దొరికారు?

బ్యాంకులో ఎలాంటి ప్రతిఘటన లేకుండా లోపలికి ప్రవేశించాలన్నది నిందితుల ప్రణాళిక. అందుకోసం భద్రతా బలగాల యూనిఫాంను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు.

పోలీసుల ప్రకారం, ఈ యూనిఫాంలను 2024 డిసెంబర్‌లో ఆర్డర్ చేశారు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు.

ఈ కేసు దర్యాప్తు పోలీసులకు పెద్ద సవాలుగా మారిందని ఎస్ఎస్పీ నజీబుల్లా పందరానీ తెలిపారు. మొదట పలువురి ద్వారా వివరాలు సేకరించామని, ఆ తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని చెప్పారు.

ప్రధాన నిందితుడి బ్యాంకు ఖాతా ఈ కేసులో కీలకంగా మారిందన్నారు. దోపిడీకి ముందు ఆ ఖాతాలో చిన్న మొత్తాల్లో లావాదేవీలు జరిగేవని, ఘటన తర్వాత కోట్ల రూపాయల లావాదేవీలు నమోదవడం గుర్తించామని తెలిపారు.

గత ఏడాదిన్నర కాలంలో ఆయన ఖాతా ద్వారా రూ.17 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఎస్ఎస్పీ వెల్లడించారు. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో లావాదేవీలు జరగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

మిగతా నిందితుల మొబైల్ ఫోన్లను కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. తదుపరి దర్యాప్తు కోసం వాటిని పంజాబ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దోపిడీ సొమ్ములో దాదాపు రూ.2.75 కోట్ల మేర ఓ స్థానిక వ్యాపారి బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఎస్ఎస్పీ వెల్లడించారు. ఆ వ్యాపారి కూడా ఈ విషయాన్ని అంగీకరించారని, మెజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలం నమోదు చేసినట్లు చెప్పారు.

దోపిడీ సొమ్ములో కొంత భాగాన్ని వ్యాపార కార్యకలాపాల్లో పెట్టుబడిగా ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులకు తెలిసింది.

ఈ డబ్బుతో రూ. 4 కోట్లకు పైగా విలువైన కార్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. వీటిలో కొన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నగదు, ఆస్తులను రికవరీ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

నిందితులను 14 రోజుల పాటు పోలీసు కస్టడీలోకి తీసుకున్నట్లు ఎస్ఎస్పీ నజీబుల్లా పందరానీ తెలిపారు. అనంతరం వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించి, జైలుకు పంపినట్లు వెల్లడించారు.

నిందితులను సంప్రదించడం సాధ్యం కాకపోవడంతో వారిపై వచ్చిన ఆరోపణలపై వారి స్పందనను బీబీసీ తెలియజేయలేకపోతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)