రెండేళ్లపాటు రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాని సినిమా, విడుదల తరువాత ప్రేక్షకులు కన్నీళ్లతో బయటకు వస్తున్నారు

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఓ వృద్ధ దంపతుల సున్నితమైన ప్రేమ, ఒంటరితనాన్ని చూపుతూ తెరకెక్కించిన ఒక సినిమా థియేటర్లకు చేరడానికి రెండేళ్లు పట్టింది.

ఈ చిత్రం దేశవ్యాప్తంగా విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

టెలివిజన్ జర్నలిస్ట్ నుంచి చిత్రనిర్మాతగా మారిన వినోద్ కప్రి దర్శకత్వం వహించిన 111 నిమిషాల 'పైర్' చిత్రం, సుందరమైన వందలాది హిమాలయ గ్రామాలు నిర్మానుష్యంగా మారడానికి కారణమైన వలసల సమస్య తీవ్రతను ఎత్తి చూపింది.

దీంతోపాటు ఈ ప్రాంతంలోని పరిస్థితులను మరింత కఠినంగా మార్చిన వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా ఈ సినిమా తెలియజేసింది.

ప్రేక్షకులు కన్నీళ్లతో థియేటర్ల నుంచి బయటకు వస్తున్న వీడియోలను చాలా మంది భారతీయులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. చాలా కాలంగా ఏ సినిమా కూడా తమను ఇంతలా కదిలించలేదని మరికొందరు పోస్ట్ చేశారు.

ఈ చిత్రంలో ప్రధాన నటీనటు సాధారణ గ్రామస్థులు. వారెప్పుడూ కెమెరా ముందుకు రాలేదు. కానీ వీరి నటనను బాలీవుడ్‌లో ప్రముఖులైన నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్‌ లాంటివారు ప్రశంసిస్తున్నారు.

పైర్ కథానాయకులైన పదం సింగ్ (కప్రి మామ పాత్ర పోషించారు), తుల్సీ (హీరా దేవి పాత్ర పోషించారు)లను స్థానికంగా బుబు, ఆమా అని పిలుస్తారు. ఈ దంపతులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తుంటారు.

ఇక్కడ వయస్సును సంవత్సరాల్లో కాకుండా కీలక ఘట్టాలు ఆధారంగా చెబుతారు. సింగ్ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి రెండేళ్ల ముందు జన్మించారు. జపాన్‌పై అణుబాంబులు వేసిన సంవత్సరంలో తుల్సీ జన్మించారు.

అక్కడ రోడ్లు లేవు, కరెంటు కూడా లేదు. ఆ దంపతులకు సహాయం అవసరమైనప్పుడల్లా పదం సింగ్ ఒక పొడవాటి కొమ్ముతో తయారైన సంప్రదాయ వాద్యాన్ని ఉపయోగించి పొరుగువారిని పిలుస్తారు. వారు వచ్చి సాయం చేసినందుకు ప్రతిఫలంగా మేకలను ఇస్తారు.

"ఇక్కడ ఏం లేదు – కేవలం పర్వతాలు మాత్రమే ఉన్నాయి," అని ఒక పాత్ర అంటుంది. అందుకే యువకులు మెరుగైన అవకాశాల కోసం వెళ్ళిపోతారు, అందమైనదైనా, వెలవెలపోతున్న ఈ గ్రామాలను విడిచి వెళ్ళిన వారు అరుదుగా తిరిగి వస్తారు.

తమ చివరి రోజుల్లో ఉన్న వృద్ధ దంపతుల హృద్యమైన ప్రేమకథపైనే తన సినిమా దృష్టి సారిస్తుందని కప్రి చెప్పారు.

"వారు 65ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. గత 28 సంవత్సరాలుగా, పని వెతుక్కుంటూ ముంబై వెళ్లిన తమ కుమారుడు హరియా తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్నారు," అని కప్రి బీబీసీకి తెలిపారు. "ఇది సహచర్యం, ఒంటరితనం, నిరీక్షణల కథ" అని వివరించారు.

అయితే ఇన్నేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ కుమారుడు హరియా తాను ఏ తేదీన గ్రామానికి వస్తున్నది తెలియజేస్తూ ఓ లేఖ రాయడంతో వారి ఎదురుచూపు మరోస్థాయికి చేరుతుంది.

పదం సింగ్, తుల్సీ రోజులు లెక్కపెడుతుండగా, వారి చుట్టూ ఉన్న కొద్దిమంది గ్రామస్తులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు, చివరికి ఆ జంట ఆ విశాలమైన పర్వత ప్రాంతంలో ఒంటరిగా మిగిలిపోతారు.

"మీరూ, తుల్సీ కూడా వీలైనంత త్వరగా బయలుదేరండి. లేదంటే, నువ్వు కానీ, తుల్సీ కానీ చనిపోతే శవాన్ని కొండ దింపి, చితి దగ్గరకు మోసుకెళ్లే నలుగురు కూడా ఉండరు," అని ఆ ఊరు నుంచి బయల్దేరేముందు ఒక గ్రామస్థుడు పదం సింగ్‌కు సలహా ఇచ్చాడు. "లేదంటే మేం బయలుదేరేలోపే చనిపోండి" అని ఆ వ్యక్తి సరదాగా అన్నారు.

సహాయం కోసం పిలవడానికి ఎవరూ మిగలకపోవడంతో పదం సింగ్ తన ఇంటి గుమ్మం బయటే పక్కపక్కనే రెండు చితిమంటలను నిర్మించారు – ఒకటి తన భార్య కోసం, మరొకటి తన కోసం.

ఆమె ఆ నిర్ణయాన్ని ప్రశ్నించినప్పుడు, "ఒకవేళ నువ్వు చనిపోతే నిన్ను కొండ పైనుంచి ఎలా కిందకి మోసుకెళ్తాను?" అని తుల్సీతో అంటారు.

భావోద్వేగమైన కథాంశాలు ఉన్నప్పటికీ, 'పైర్' హాస్యంతో నిండి ఉంది. ఆ జంట చాలా సరదాగా ఉంటారు. అనేకమంది దంపతుల్లాగే, వారు కూడా తమలో తాము పోట్లాడుకోవడాన్ని ఒక ప్రేమ భాషగా భావిస్తున్నట్లు అనిపిస్తుంది.

ఉత్తరాఖండ్‌కు చెందిన కప్రికి, 2018లో ఆ రాష్ట్రంలోని కొండపై ఉండే సుందరమైన మున్సియారిలో 84 ఏళ్ల వృద్ధుడిని కలిసిన తర్వాత ఈ సినిమా ఆలోచన వచ్చింది.

ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఫోటో చూసి ఆ వ్యక్తిని కలిశాను. ఆయన ముఖంలోని ముడతలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన ముఖం విలక్షణంగా ఉంది.

వారికి ఉన్న అతిపెద్ద ఆందోళన ఏంటని ఆయనను, ఆయన భార్యను అడిగానని కప్రి చెప్పారు.

'నాకున్న అతి పెద్ద చింత ఏంటంటే, ఒకవేళ నేను ముందు చనిపోతే, ఆమెను ఎవరు చూసుకుంటారు?' అని ఆయన అన్నాడు. అందుకు ఆమె, 'అతనికి వంట చేయడం రాదు. కాబట్టి ఒకవేళ నేను ముందు చనిపోతే, అతనికి ఎవరు వంట చేసి పెడతారో నాకు తెలియదు' అని చెప్పారు. ఆ మాట మనసును ఎంతగానో కదిలించిందన్నారు కప్రి.

తాను మొదట 'నిజ జీవిత జంట'తో సినిమా తీయాలని ప్రయత్నించానని, అయితే అది సరిగ్గా కుదరడం లేదని తెలిసి వారం రోజుల షూటింగ్ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నానని కప్రి చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రధాన పాత్రల కోసం, నటులు నసీరుద్దీన్ షా, రత్న పాఠక్‌లను సంప్రదించారు.

షాకు స్క్రిప్ట్ బాగా నచ్చిందని కప్రి చెప్పారు, కానీ తను, పాఠక్ ఆ ప్రాంతానికి చెందినవారు కాదని, పాత్రలకు న్యాయం చేయడం కష్టమవుతుందని ఆయన భావించారు.

కప్రి చివరకు పదం సింగ్‌ను తన సొంత కుటుంబంలోనే గుర్తించారు. ఆయన నటనపై ఆసక్తి ఉన్న చిన్నాన్నే. ఆయన ఒక రిటైర్డ్ సైనికుడు. తుల్సీని మరో గ్రామంలో కనుగొన్నారు. హీరా దేవి అనే వృద్ధ వితంతువు, సంవత్సరాల తరబడి వ్యవసాయం చేస్తూ, గడ్డి కోస్తూ, గేదెలను మేపుతూ తన పిల్లలను పెంచారు.

ఉద్యోగాల కోసం పిల్లలు, పెద్దవారిని వదిలేసి గ్రామాలను విడిచిపెడుతుండటంతో, అవి కళతప్పి వెలవెలపోతున్న కథలు గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నామని పదం సింగ్, హీరా దేవి బీబీసీకి చెప్పారు. ఈ రోజు పైర్‌కు లభించిన ప్రచారం చూసి తాము ఆశ్చర్యపోయామని వారు తెలిపారు.

2024 నుంచి, ఈ చిత్రం ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద చిత్రోత్సవాలలో ప్రదర్శించారు. ఇది 18 అవార్డులను గెలుచుకుందని, వాటిలో ఉత్తమ ఫీచర్ చిత్రం అవార్డులు మూడు, ప్రేక్షకుల ఎంపికలో 12 ఉత్తమ చిత్ర పురస్కారాలు ఉన్నాయని కప్రి చెప్పారు.

ఫెస్టివల్స్‌లో విజయం సాధించినప్పటికీ, 'పైర్' సినిమాకు రెండేళ్లపాటు పంపిణీదారుడు దొరకలేదని కప్రి తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఈ చిత్రాన్ని తిరస్కరించాయి. చివరకు, తన నిర్మాత స్నేహితుడు ఒకరు థియేట్రికల్ విడుదలకు నిధులు సమకూర్చారు.

అయితే, అక్టోబర్ 30న కేవలం 70 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం, మౌత్ టాక్‌తోనే అనుకూలమైన సమీక్షలను అందుకుందని, టిక్కెట్ల కోసం డిమాండ్ పెరగడంతో మొత్తం ప్రదర్శనల సంఖ్య కూడా పెరిగిందని ఆయన అంటున్నారు.

ఇదిలా ఉండగా, కెమెరా ముందుకు రావడానికి, తమ డైలాగులు మర్చిపోతామేమోనని మొదట్లో తమకు ఉన్న భయాలు ఇప్పుడు పోయాయని పదం సింగ్, హీరా దేవి ఇద్దరూ చెబుతున్నారు.

తన పిల్లలు ఏమనుకుంటారో, సమాజం ఏమంటుందోనని కూడా తాను ఆందోళన చెందానని హీరా దేవి చెప్పారు.

ఈ రోజు ఆమె, పదం సింగ్ సినీ విమర్శకుల సానుకూల సమీక్షలు, ప్రేక్షకుల అభిమానాన్ని ఆస్వాదిస్తున్నారు.

సినిమా ప్రదర్శితమవుతున్న చోట కన్నీళ్లు నిండిన ప్రజలను హీరాదేవి, పదం సింగ్ కలుసుకుంటున్నారు. కొంతమంది ప్రేక్షకులు వారి పాదాలను తాకి, కౌగిలించుకోవాలని కోరుకున్నారు. మరికొందరు, తాము పుట్టి పెరిగిన గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో తమ కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులను, తాతామామ్మలను ఈ సినిమా గుర్తు చేసిందని చెప్పారు.

"మేం అపారమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందాం. ఎన్నడూ ఊహించని విధంగా ఎంతో ప్రేమను, స్ఫూర్తిని అందుకున్నాం," అని పదం సింగ్ అన్నారు.

అయితే, ముంబైలో నసీరుద్దీన్ షాను కలిసినప్పుడు అత్యంత గొప్ప క్షణం ఎదురైంది. "సినిమా మొత్తం చూసిన ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. నన్ను కౌగిలించుకున్నారు. 'బుబు, నువ్వు పోషించిన పాత్రను నేను చేయలేను' అన్నారు.

"నిజానికి మా గ్రామం అచ్చం ఇలాగే ఉంటుంది" కాబట్టే ఈ సినిమాకు అంత ఆదరణ లభించిందని హీరా దేవి అంటారు.

దేశంలోని గ్రామాల్లో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఎవరి పిల్లలూ ఇంట్లో ఉండటం లేదు, తల్లిదండ్రులందరి పరిస్థితి కూడా ఇదే. తమ మనవళ్లు, మనవరాళ్లు వచ్చి తమతో కొన్ని రోజులు గడుపుతారనే ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు. ఆ ఒంటరితనం భరించరానిది.

ఉత్తరాఖండ్‌లోని, అలాగే దేశంలోని యువ తరానికి తనదొక సందేశం ఉందని పదం సింగ్ అంటున్నారు.

"వారు తమ మాతృభూమిని, తాము పుట్టిన నేలను విడిచిపెట్టకూడదని చెప్పాలనుకుంటున్నా" అని ఆయన అంటారు. "ప్రజలు వలస పోకుండా వారి గ్రామాలలోనే విద్య, ఉపాధి కల్పించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను - తద్వారా వారు దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలా జరిగినప్పుడు, తల్లిదండ్రులకి కూడా సంరక్షణ లభిస్తుంది" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)