మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
రామాయణం మూవీ రివ్యూ : రావణుడి కోణం నుంచి చెప్పిన ఈ సినిమా మెప్పించిందా?
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
వాల్మీకి రామాయణం మహాకావ్యం. మనిషి ఎలా బతకాలో చెప్పే గొప్ప గాథ. ఇప్పటికే ఈ ఇతిహాసాన్ని సినిమాలుగా, బుల్లితెర సీరియల్స్‌గా ఎన్నోసార్లు చూశాం. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే గొప్పదనం రామకథలో ఉంది.
ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని రామకథను మరింత గ్రాండియర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు నితీష్ తివారీ. మరి రామకథలోని ఘట్టాలు ప్రేక్షకులను ఎంతలా కదిలించాయి? ఎలాంటి దృశ్యానుభూతిని ఇచ్చాయి?
వాల్మీకి రామాయణంలోని బాలకాండ నుంచి లీనియర్ స్క్రీన్‌ప్లేలో రాముని జననం, విద్య, వివాహం, అరణ్యవాసం.. ఇలా సాగుతుంది కథ. కాకపోతే దర్శకుడు స్క్రీన్‌ప్లే విషయంలో కొంత స్వేచ్ఛ తీసుకున్నారు.
మొదట విలన్ చేసే అకృత్యాలను చూపించి, ఆ తర్వాత హీరోను పరిచయం చేసే కమర్షియల్ సినిమా ఫార్ములాను గుర్తు చేస్తూ రావణుడి కోణంలో కథను మొదలుపెట్టారు.
రావణుడు (యష్) వరం పొందడం, భీకర యుద్ధం, లంకను స్వాధీనం చేసుకోవడం.. వంటి సన్నివేశాలతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాముడి (రణ్‌బీర్ కపూర్) జననం, యోధుడిగా ఎదగడం, సీత (సాయిపల్లవి) స్వయంవరం ఘట్టాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
వనవాసం కన్నీళ్లు తెప్పించిందా?
రామకథ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకపోవడానికి కారణం.. అందులోని ఎమోషన్. తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలి అరణ్యాల బాట పట్టిన రాముడి కథలో ఆ ఘట్టం భావోద్వేగంగా ఉంటుంది . దర్శకుడు ఆ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు మనసును హత్తుకుంటుంది.
రాముడు సీతా సమేతంగా రాజమహల్ నుంచి నడిచి వెళ్తున్నప్పుడు దశరథుడు, కౌసల్యతో పాటు రాజ్య ప్రజలందరి కళ్లల్లో కనిపించిన కన్నీళ్లు.. ఆ దృశ్యాలు చూస్తున్న ప్రేక్షకుడి కళ్లల్లో కూడా కనిపిస్తాయి.
రామాయణం కోసం దర్శకుడు జనాల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న కొన్ని ఘట్టాలను కూడా తీసుకున్నారు. ముఖ్యంగా శూర్పణఖ నేపథ్యంపై దృష్టి పెట్టారు. శూర్పణఖ భర్తను రావణుడే అంతం చేస్తాడు. ఈ ఎపిసోడ్‌ను ఇందులో భారీగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత శూర్పణఖ రాముడిపై మోహం పెంచుకోవడానికి గల కారణాన్ని లాజికల్‌గా, ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు.
శూర్పణఖ సైన్యంతో రాముడు చేసే యుద్ధం కూడా భీకరంగా ఉంటుంది. ఆ తర్వాత సీతాపహరణం, జటాయువు పోరాటంతో తొలి భాగం ముగుస్తుంది. జటాయువు రావణుడితో పోరాడే ఎపిసోడ్‌ను విజువల్‌గా చాలా అందంగా తీర్చిదిద్దారు.
రాముడి పాత్రకు రణ్‌బీర్ న్యాయం చేశాడా?
వెండితెరపై రాముడి పాత్ర ధరించడం అంటే ఒక సవాల్. హిందీలో అరుణ్ గోవిల్, తెలుగులో ఎన్టీఆర్ లాంటి లెజెండ్స్ ఈ పాత్రలో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ కూడా తన శక్తిమేరకు ఆ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు.
తన మాట, నడవడికలో మర్యాదాపురుషోత్తముడిలానే కనిపించారు. వనవాసం ఘట్టంలో ఆయన నటన మెప్పించింది. రావణుడిగా యష్ శక్తివంతంగా కనిపించారు. అహంకారాన్ని చూపించే సన్నివేశాల్లో ఆ పాత్రలో ఇమిడిపోయారు. దశరథుడి పాత్రధారి నటన గుర్తుండిపోతుంది. అలాగే లక్ష్మణుడి పాత్ర కూడా ఎంతో హుందాగా ఉంది.
రామకథలో గొప్పదనం స్త్రీ పాత్రల్లోనే ఉంది. ఆ కథను ఆద్యంతం మలుపులు తిప్పేది స్త్రీమూర్తులే. దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట కారణంగా రాముడు అడవికి వెళ్తాడు. శివధనుస్సును విరిచిన కారణంగా సీతను వివాహం చేసుకున్న రాముడికి, పరశురాముడు దివ్య ఆయుధాన్ని బహూకరిస్తాడు.
మాయలేడిని చూసి మోసపోయిన సీత, యుద్ధానికి బీజం వేస్తుంది. శూర్పణఖ రాముడిపై మోహం పెంచుకుంటుంది. అది కాస్తా రామరావణ యుద్ధానికి దారితీస్తుంది. ఇలా అడుగడుగునా స్త్రీ పాత్రలే రామకథను నడిపిస్తాయి. వాల్మీకి రచనలో ఉన్న మహత్తు ఇదే.
దర్శకుడు ఈ పాత్రలను గొప్ప నేర్పుతో చిత్రీకరించారు. సీతగా సాయి పల్లవి అభినయం గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. సీతమ్మ కత్తియుద్ధ విద్యల్లో ఆరితేరింది. దర్శకుడు తన చిత్రీకరణలో ఆ యుద్ధాలను కూడా చూపించారు. వనవాసంలో రాక్షసులతో సీతమ్మ కూడా పోరాటాలు చేస్తుంది. శూర్పణఖ పాత్రలో రకుల్ ఒదిగిన తీరు బాగుంది.
వక్రీకరణలు ఉన్నాయా?
సహజంగా రామాయణం మీద సినిమా అంటే ప్రామాణికత ఉందా లేదా, పుక్కిటి పురాణాలు జోడించారా? అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకొని పండితులు వాదిస్తుంటారు.
దర్శకుడు రామాయణాన్ని సినిమాగా మార్చే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు ప్రశ్నలు రేకెత్తించేలా ఉన్నాయి.
రావణుడికి శ్రీమహావిష్ణువును అంతం చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఇందులో చూపించారు. అలాగే రాముడి జననం తర్వాత తనకు శత్రువు పుట్టాడని రావణుడు భావించినట్లు కూడా చూపారు.
రావణుడి పరివారమంతా రాముడు శ్రీమహావిష్ణువు అవతారమని భావిస్తారు. అలాగే సీతపై రావణుడికి ఎలాంటి కోరిక, వ్యామోహం లేదనే కోణంలో చూపించారు.
కేవలం రాముడిపై ప్రతీకారం అనే కోణంలో చిత్రీకరించారు. ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణానికి విరుద్ధమైన భాష్యాలే.
టెక్నాలజీ అదనపు సొబగు అయిందా?
వాల్మీకి రామాయణం చదువుతుంటే ఆ విజన్‌ను స్క్రీన్‌పై తీసుకురావడం ఎలా అనిపిస్తుంది. ఆయన చేసిన వర్ణనలను విజువలైజ్ చేయడం మాటలు కాదు. కాకపోతే ఇప్పటి టెక్నాలజీ ఈ విజన్‌ను తెరపైకి తీసుకురావడంలో ఇంకాస్త సహాయపడుతుంది.
దర్శకుడు సృష్టించిన అయోధ్య, లంక, అరణ్యాలు.. ఇవన్నీ కూడా విజువల్‌గా బాగున్నాయి. యుద్ధ సన్నివేశాల్లో గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకుంటుంది.
రావణుడి పది తలలు చూపించే సన్నివేశాలు దర్శకుడి విజువల్ సెన్స్‌కు అద్దం పడతాయి
కెమెరా పనితనం అసాధారణంగా ఉంది. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి అందించిన నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంది.
ఇందులో హాన్స్ జిమ్మర్ మార్క్ స్పష్టంగా వినిపించింది. ముఖ్యంగా స్ట్రింగ్ వాయిద్యాలను ఉపయోగించిన తీరు హాలీవుడ్ స్థాయిలో ఉంది.
ల్యాగ్ ఎందుకు?
సినిమా చూసే ఆడియన్స్‌కు ప్రతి పది నిమిషాలకు ఏదో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరుగుతుండాలి. స్క్రీన్‌ప్లే రైటర్స్ ఆ కొలతల్లోనే సన్నివేశాలు రాస్తుంటారు. కాకపోతే ఇది రామకథ. తరతరాలుగా వస్తున్న కథ. సినిమాగా తీసినప్పుడు కచ్చితంగా కొంత నెమ్మది ఉండొచ్చు.
సీతాపహరణం దగ్గర ఫస్ట్ పార్ట్‌ను ముగించారు. దీన్ని ఇంటర్వెల్‌గా చేసి, యుద్ధాన్ని సెకండ్ హాఫ్‌లో చూపించవచ్చు కదా అనే కామెంట్లు సహజంగానే వినిపిస్తాయి. కాకపోతే దర్శకుడు ఈ కథను ఇంత వివరంగా చెప్పాలని అనుకున్నారు.
మరి సెకండ్ పార్ట్‌పై ఆసక్తిని పెంచారా? అనే ప్రశ్న ఉండొచ్చు. అసలు సిసలైన హనుమంతుడి పాత్ర వచ్చేది సెకండ్ పార్ట్‌లోనే. 'హనుమాన్' అనే పేరు వినిపిస్తేనే కాసుల వర్షం కురుస్తున్న కాలమిది. ఇప్పుడు చూపించిన విజన్‌తో హనుమంతుడి పాత్రను, ఆ యుద్ధాలు రామాయణం-2కి సరిపడా దినుసులే.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)