మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
లవకుశ నుంచి నేటి సినిమా దాకా: తెలుగు ప్రజలు కోరుకునే రామకథ ఏది?
- రచయిత, వాడ్రేవు చినవీరభద్రుడు
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
'సీతమ్మ చిత్రమౌ కథలు చెప్పే వేళ అడవిలో పచ్చాకులగ్నులై మండు'- వినగానే ఒళ్లు గగుర్పొడిచే ఈ కవితా వాక్యం ఏ తెలుగు మహాకావ్యంలోనూ మనకి కనిపించదు.
ఇది స్త్రీలు తమకై తాము కట్టుకుని తమకై తాము పాడుకునే రామాయణ పాటల్లోంచి వినిపించే ఒక వాక్యం.
'మరలనిదేల రామాయణంబన్నచో. ..' అని తనని తాను ఎవరన్నా ప్రశ్నిస్తారనుకుని జవాబు చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ 'శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యం' (1934) మొదలుపెట్టాడు.
కానీ, అటువంటి ప్రశ్న వెయ్యేళ్ళుగా తెలుగు గ్రామసీమల్లోని స్త్రీలకు కలగలేదు. వారు నిరంతరం రామాయణాన్ని పాటలుగా పాడుకుంటూనే ఉన్నారు.
ఆంధ్రసారస్వత పరిషత్తు వెలువరించిన 'స్త్రీల రామాయణపు పాటలు' (1955) చూస్తే మనకి వెంటనే స్ఫురించేది తెలుగులో పండిత సంప్రదాయానికి ఆవల ప్రజా సంప్రదాయంలో రామాయణం గత వెయ్యేళ్ళుగా ఒక సమాంతర సాహిత్యంగా వర్ధిల్లుతూ ఉందని.
రెండు రకాల సంప్రదాయాలు
సాహిత్యంలో రెండు రకాల సంప్రదాయాలు ఉంటాయి. ఒకటి అనుభూతి ప్రధానంగా ఉంటుంది. మరొకటి ఆలోచన ప్రధానంగా ఉంటుంది. అనుభూతి ప్రధానంగా ఉండే సంప్రదాయంలో వ్యక్తుల మధ్య సంబంధాలు, రాగద్వేషాలు, సజీవ స్పందనలు, మనిషికీ, ప్రకృతికీ, మనిషికీ, దైవానికీ మధ్య ఉండే అనుబంధాలు ప్రధానంగా ఉంటాయి.
ఆలోచన ప్రధానంగా ఉండే సంప్రదాయంలో మనుషులకన్నా కూడా వివిధ భావనల మధ్యా, భావాల మధ్యా, శక్తులమధ్యా ఉండే సంబంధాలు ప్రధానంగా ఉంటాయి.
మొదటి సంప్రదాయం సాధారణంగా ప్రజాసంప్రదాయంగా ఉంటుంది. రెండోది పండిత సంప్రదాయంగా ఉంటుంది. పండితులంటే భాషా పండితులూ, సామాజిక పండితులూ, తాత్త్వికులూ అందరూ అన్నమాట.
భారతీయ సాహిత్య చర్చల్లో మొదటిదాన్ని దేశిగానూ, రెండవదాన్ని మార్గసాహిత్యంగానూ చెప్పారు. రాబర్ట్ రెడ్ ఫీల్డ్ లాంటి యాంత్రొపాలజిస్టులు పేర్కొన్న Little tradition తో మొదటిదాన్నీ, Great Tradition తో రెండోదాన్నీ మనం పోల్చవచ్చు.
భారతదేశంలో మొదట్లో సంస్కృతంలోనూ, ఆ తర్వాత ప్రాకృతాల్లోనూ, మధ్యయుగాల్లో దేశభాషల్లోనూ, ఆధునిక యుగంలో వచనభాషల్లోనూ ఈ సంప్రదాయాల్ని భారతం, రామాయణం గాఢంగా ప్రభావితం చేసాయి. ఇందులో మధ్యయుగాల్లో హిందీ, ఒడియా, బెంగాలీ, తమిళ, మలయాళాల్లో రామాయణం ప్రజాసంప్రదాయం నుంచి సాహిత్యంలోకి ప్రవేశించింది.
అక్కడ తులసీదాస్, బలరామ దాస్, కంబర్, కృత్తివాసులు, ఎడుత్తచ్చన్ వంటి పండితులు దాన్ని ఒక Great Tradition గా మార్చే ప్రయత్నం చేశారు, ఒకప్పుడు వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో ఆదికావ్యంగా మార్చినట్టుగా. కానీ తెలుగు పరిస్థితి వేరు.
ఇక్కడ కవిత్రయంతో మొదలుకుని ఇరవయ్యవశతాబ్దందాకా కూడా పండిత సంప్రదాయం భారతాన్ని తలకెత్తుకుంది. రామాయణం ప్రజాసంప్రదాయంగా మిగిలిపోయింది.
సంప్రదాయ తెలుగు సాహిత్యంలో పండితులు అనుసరించిన మార్గ పద్ధతి సాహిత్య ప్రక్రియ చంపూకావ్యమే. తక్కినవన్నీ అంటే నిర్వచన కావ్యాలూ, ద్విపద కావ్యాలూ, పదాలూ, గీతాలూ, యక్షగానాలూ, కీర్తనలూ మొదలైనవన్నీ కూడా ప్రధానస్రవంతి సాహిత్య ప్రక్రియలుగా గుర్తింపుకు నోచుకోలేదు.
అందువల్లనే తిక్కన రామాయణం రాసినప్పటికీ, అది 'నిర్వచనం' కావడం, రంగనాథ రామాయణం ద్విపద కావ్యం కావడం, కృష్ణమాచార్య, అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య వంటివారు రామభక్తి కీర్తనలూ లేదా వచనాలూ రాసినప్పటికీ వాటిని కూడా ప్రజాసాహిత్యంగానే పరిగణించారు తప్ప పండితుల ప్రధాన స్రవంతి సాహిత్యంగా పరిగణనకి రాలేదు.
ఎర్రాప్రగడ రామకథ రాసినప్పటికీ అది భారతంలో భాగంగా రాసిందే. మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, కంకంటి పాపరాజు రాసిన ఉత్తరరామాయణం చంపూ కావ్యాలే అయినప్పటికీ వాటికి ప్రజాదరణ లభించిందేగాని పండితులు వాటిని మొదటిశ్రేణి కావ్యాల్లో లెక్కగట్టలేదు.
చివరికి 'పలికించెడి వాడు రామభద్రుడట' అని చెప్పుకున్న పోతన్న కూడా భాగవతం రాసాడేకాని రామాయణాన్ని చంపూ కావ్యంగా రాయలేదు. కానీ గమనించవలసింది ఏమిటంటే పండిత సంప్రదాయంతోనూ, వారి అలంకార శాస్త్రాలతోనూ సంబంధం లేకుండా ఒక ప్రజాసంప్రదాయంగా రామాయణం తెలుగునాట గత వెయ్యేళ్ళకు పైబడి ప్రచలితంగా ఉంటూ వచ్చిందన్నదే.
ఇప్పుడు మనకు లభిస్తున్న రామాయణపు పాటలు కనీసం పదిహేనో శతాబ్ది నాటినుండీ ప్రజల నాలుకల మీద నడయాడుతున్నవే.
రామాయణంపై భిన్న దృక్పథాలు
ఇరవయ్యవ శతాబ్దం మొదలయ్యాక పరిస్థితి మారింది. తక్కిన భాషల్లో ముఖ్యంగా హిందీ, ఒడియా, మరాఠీ, బెంగాలీ, మలయాళం, కన్నడం వంటి భాషల్లో ఆధునిక వచన నిర్మాతలు రామాయణాన్ని కాక భారతకథల్ని తమ ఇతివృత్తాలుగా తీసుకున్నారు.
టాగోర్ 'కుంతి-కర్ణ సంవాదం', భారతియారు 'పాంచాలీ శపథం', బుద్ధదేవ బోస్ 'మహాభారతేర్ కథా', దినకర్ 'కురుక్షేత్ర', వాసుదేవన్ నాయర్ 'రండ మూళం', ఖండేకర్ 'యయాతి', భైరప్ప 'పర్వ' ప్రతిభా రాయ్ 'యాజ్ఞసేని'- ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పవచ్చు. చివరికి ఇంగ్లీషులో అరవిందులు కూడా 'సావిత్రి' ని ప్రతీకగా తీసుకుని కావ్యం రాశారే తప్ప రామాయణ కావ్యం రాయలేదు.
కానీ, ఆశ్చర్యంగా తెలుగులో పరిస్థితి ఇందుకు వ్యత్యస్తంగా ఉంది. తెలుగు సంప్రదాయ సాహిత్యంలో భారతం ప్రధాన స్రవంతి ఇతివృత్తంగా ఉండగా, ఆధునిక తెలుగు సాహిత్యంలో పండితులు, (అంటే ఇక్కడ నా ఉద్దేశం ఆధునిక విద్యని అభ్యసించినవాళ్లూ, ఆధునిక సాహిత్యనిర్మాతలూ కూడా అని) రామాయణ ఇతివృత్తాల్తో కావ్యాలూ, నవలలూ, నాటకాలూ, నాటికలూ, వచన కవితలూ రాయడం మొదలుపెట్టారు.
ఇందులో మళ్లీ రెండు శిబిరాలు ఏర్పడ్డాయి. ఒకరు వాల్మీకి రామాయణం ప్రతిపాదిస్తున్న విలువల్ని నిలబెట్టడం కోసం రామాయణాన్ని తిరిగి రాసినవాళ్లు. ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ.
మరోవైపు రామాయణాన్ని విమర్శిస్తూ రచనలు చేసినవాళ్లు- పఠాభి, ముద్దుకృష్ణ, చలం, నార్లవేంకటేశ్వరావు, రంగనాయకమ్మ, త్రిపురనేని రామస్వామి మొదలైనవారు.
ఈ జాబితా నేటి ఫెమినిస్టు, దళిత రచయితలదాకా కూడా కొనసాగుతూనే ఉంది. రామాయణం ప్రతిపాదిస్తున్న వ్యవస్థా ధర్మం స్త్రీలనీ, సామాజిక నిశ్రేణిలో అట్టడుగున్న ఉన్నవారినీ అణచిపెట్టడానికి మాత్రమే సహకరిస్తుందనీ, అది అధికారంలో ఉన్నవాళ్లకి, పాలకశక్తులకీ మేలుచేసేదిగానే ఉంటుందన్నది వారి విమర్శ సారాంశం. కాని మనం గమనించవలసిందేమంటే, వారంతా కూడా, ప్రజల వైపు నిలబడి మాట్లాడుతున్నామని అనుకుంటున్నప్పటికీ, తాము కూడా ఒక పండిత సంప్రదాయంలో భాగంగానే ఆ చర్చ లేవనెత్తారు, కొనసాగించారు.
ఉదాహరణకి నార్ల వేంకటేశ్వరరావు రాసిన రామాయణ నాటకాలకి, ముఖ్యంగా 'సీత జోస్యం'(1979) నాటకానికి రాసుకున్న ముందుమాటలు చదివితే అవి ఆధునిక రచయితలకి కూడా అంత తేలిగ్గా అర్ధమయ్యేవి కావనిపిస్తుంది. అందులో ఆయన యాంత్రొపాలజీ ఆధారంగా, రామాయణాన్ని, ఆహారసేకరణ దశకీ, ఆహార ఉత్పత్తి దశకీ మధ్యకాలంలో జరిగిన సంఘర్షణగా అభివర్ణిస్తూ చేసిన పరిశీలన చాలా లోతైనదీ, గాఢమైనదీ కూడా.
ఈ చర్చలతో సామాన్య ప్రజానీకానికి ఎటువంటి సంబంధమూ లేదు. విశ్వనాథ తన కల్పవృక్షాన్ని తన కావ్యాన్ని పూర్వకాలపు ప్రబంధాల్లాగా 'ప్రకృష్ట బంధం'గా కాకుండా, సాధారణ పాఠకుడు కూడా సమీపించగలిగే సౌలభ్యంతో రాయడానికి ప్రయత్నించినప్పటికీ, శ్రీ శ్రీ చమత్కరించినట్టుగా, అది ఆయన రాసిన నవలలన్నింటిలోనూ 'పెద్ద నవల' అయినప్పటికీ కూడా ఆ మహాకావ్యాన్ని విద్యావంతులైన తెలుగు పాఠకుల్లో ఎంతమంది చదివి ఉంటారో అనుమానమే.
రామాయణానికి (అంటే వాల్మీకి రామాయణానికి) అనుకూలంగానూ, ప్రతికూలంగానూ నడుస్తున్న ఈ సృజన, ఈ చర్చలు పండితులకి మాత్రమే పరిమితమైపోయాయనే సత్యం వినడానికి కటువుగా ఉన్నా ఒప్పుకోక తప్పదు. కానీ మరోవైపు ప్రజాసంప్రదాయంగా రామాయణ గానం కొనసాగుతూనే ఉంది. అది కూడా రెండు మార్గాల్లో కొనసాగుతూ వచ్చింది.
ఒకటి ఆధ్యాత్మిక అవసరాల కోసం, యోగులూ, భక్తులూ, ముముక్షువులూ రాసుకుంటూ వచ్చిన అనేక రామాయణాలు. పరశురామపంతుల లింగమూర్తి రాసిన 'సీతారామాంజనేయ సంవాదము', వావిలకొలను సుబ్బారావు రాసిన 'మందరము'(1902-08) లతో పాటు ఎందరో సంకీర్తనకారులు రాసుకున్న రామకీర్తనలు కూడా అపారంగా వర్ధిల్లుతూనే ఉన్నాయి. (ఈ మధ్య పూర్వపు నిజామాబాదు జిల్లాలో ఒక సూఫీ సంప్రదాయ యోగిని నేను కలుసుకున్నాను. ఆయన ఒక మహ్మదీయ గురువునుంచి మంత్రోపదేశం పొంది రామసంకీర్తనలు రాస్తున్నారు. నేను ఆయన్ని సూఫీ రామదాసు అని పిలవకుండా ఉండలేకపోయాను.)
ఇక ప్రజాసంప్రదాయంలో రెండవ విభాగం కర్తలెవరో తెలిసినవీ, తెలియనివీ కూడా వందలాదిగా వికసించిన రామాయణ గాథలు. వాటిలో గేయరామాయణాల్నే వందకు పైగా డా.బిరుదురాజు రామరాజు గారు సేకరించారు.
ఆచార్య ఎస్వీ జోగారావుగారు మరెన్నో యక్షగానాల గురించి రాసుకొచ్చారు. ఆ వైనమంతా కూడా 'ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం'(1965) మూడవ సంపుటం (పే.389-403) లో చూడవచ్చు.
'లవకుశ'
కాబట్టి వాల్మీకిని సమర్థిస్తూనో, విమర్శిస్తూనో తెలుగులో ఆధునిక పండిత సంప్రదాయం రామాయణం మీద చేస్తున్న చర్చలతో నిమిత్తం లేకుండానే రామాయణ కథనం తెలుగునాట ఊరూరా సంభవిస్తూనే ఉంది.
ఆ గేయకారుల్లో, ఆ యక్షగాన కర్తల్లో నిజంగా ఎంతమంది వాల్మీకి రామాయణం చదివి ఉంటారో మనం చెప్పలేం. కానీ, రామాయణపు పాటలు పుస్తకానికి 'కృష్ణశ్రీ' పేరిట ముందుమాట రాస్తూ, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి చెప్పినట్టుగా ఆ గేయకర్తలది 'అనుశ్రుత రామాయణం'. అది సజీవ రామాయణం.
ఎందుకంటే ఆ రామాయణం వాల్మీకి చెప్పుకున్నట్టే (బాలకాండ.4.7), ఇంకా చెప్పాలంటే అంతకన్నా కూడా ఎక్కువగా, 'సీతాయాః చరితం మహత్'. స్త్రీల రామాయణపు పాటలు స్త్రీలే రాసుకున్నవి కాబట్టే, అక్కడ సీతమ్మకి సంబంధించిన ప్రతి ఒక్కటీ-ఆమె సమర్త, వేవిళ్ళు, అలక, ఆనవాలు, అగ్నిప్రవేశం- ప్రతి ఒక్కటీ వారికి కావ్యవస్తువే.
ఆ గేయకర్తల దృష్టిలో రామాయణ పాత్రలు కేవల భావనలు కావు-ధర్మాన్ని నిలబెట్టేవీ కావు, కూలదోసేవీ కావు- అవి ప్రధానంగా కుటుంబపాత్రలు- ఒక భర్త, ఒక భార్య, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక స్వామి, ఒక భృత్యుడు, ఒక మాయలాడి, ఒక మాయలేడి- వాళ్ల రామాయణం సజీవ పాత్రల రామాయణం. వారి దృష్టిలో కైక ఒక సవతి తల్లి మాత్రమే.
దేవతలు పూనుకుని ధర్మపరిరక్షణకోసం రాముణ్ణి అడవులకు పంపడానికి కైకతో అలా చేయించి ఉంటారనేటంత ఆలోచన ఆ గేయకారులకి రాదు. వాళ్ల దృష్టిలో ఒక సవతి తల్లి ఎలా ప్రవర్తిస్తుందో కైక అట్లానే ప్రవర్తించింది. ఒక చాడీకోరు ఎలా ప్రవర్తిస్తుందో మందర అలానే ప్రవర్తించింది.
అందుకని ఇరవయ్యవ శతాబ్దంలో చలనచిత్ర మాధ్యమం నిలదొక్కుకోగానే రామాయణ ఇతివృత్తాల్తో సినిమాలు రావడం మొదలుపెట్టగానే, ప్రజాసంప్రదాయానికి చెందిన రామకథ ప్రధానస్రవంతి రామకథగా మారిపోయింది.
సినిమాల్లో కనిపించే సీతారాములు గేయరామాయణాల్లో, స్త్రీలపాటల్లో కనవచ్చే సీతారాములకి దగ్గరా కనిపించడం మొదలుపెట్టారు. సినిమా రామాయణాల్లో పద్యాలూ, శ్లోకాలూ కూడా ఉండి ఉండవచ్చుగాక, అయినా కూడా ఈ సరికొత్త ప్రక్రియలో చెప్తున్న రామకథని ప్రజలు సొంతం చేసుకున్నారు.
దీన్ని తెలుగులో మనం ఒక విస్పష్టమైన కొండగుర్తుతో గుర్తుపట్టాలి అంటే 1963 లో విడుదలైన 'లవకుశ' సినిమాని చెప్పవచ్చు.
చాలామంది పండితుల దృష్టిలో ఉత్తర రామాయణం అవాల్మీకం. కానీ ప్రజలదృష్టిలో అది వాళ్ళ హృదయాలకు చాలా దగ్గరగా వచ్చిన రామకథ. ఒక అపవాదుని నమ్మి రాముడు సీతని అడవికి పంపించి ఉంటాడనే ప్రజల నమ్మకం. దానిలోని రాజనీతి సూక్ష్మాలకన్నా కూడా అది ప్రధానంగా దురదృష్టవంతురాలైన ఒక స్త్రీకథగానే వాళ్ళకి ఎక్కువ సన్నిహితం.
ఆమెని ఒక ఋషి ఆదరించడం, ఆమెకి ఇద్దరు కవల పిల్లలు పుట్టడం, వారు మళ్లీ రామకథ గానం చెయ్యడం- అది ప్రజల దృష్టిలో ఒక మతానికో, ఒక వ్యవస్థకో సంబంధించిన విషయం కాదు. అది వాళ్లు తమకి బాగా తెలిసిన ఒక కుటుంబ కథ అనే అనుకుంటారు. ఆ కుశలవులు రాముడి యాగాశ్వాన్ని బంధిస్తే, వారు కూడా ఆ రాజుకి లేదా ఆ తండ్రికి తగినశాస్తి జరిగిందనే అనుకుంటారు.
రామాయణ మేళాలు చేయమన్న లోహియా
తెలుగులో మరొక చిత్రమైన విషయం ఉంది. పండిత సంప్రదాయానికి చెంది రామకథావిమర్శక శిబిరంలో భాగం పంచుకున్నవాళ్లే, సినిమా రామాయణాల కోసం అద్భుతమైన రామకథాగీతాలు రాయడం. ఆరుద్ర రాసిన 'అందాల రాముడు ఇందీవర శ్యాముడు' (1965) దీనికి మంచి ఉదాహరణ.
ఇక వాగ్దానం సినిమా కోసం శ్రీ శ్రీ రాసిన సీతాకల్యాణ హరికథ (1961) మరింత విచిత్రం. అందులో ఆయన సీతాకల్యాణ కథని 'సత్కథ' అని వ్యవహరిస్తాడు.
(శ్రీ శ్రీ అంటే మరో మాట గుర్తొస్తోంది. ఒకప్పుడు సంస్కృతంలో రామకథ ఇతివృత్తంగా నాటకం రాయని కవి ఉండేవాడు కాడని ప్రతీతి. శ్రీ శ్రీ కూడా ఒక రామాయణ నాటకం రాసాడనిపిస్తుంది నాకు. ఏమిటనుకుంటున్నారా? గాంధీ హత్య సందర్భంగా ఆయన రాసిన రేడియో నాటిక 'సుప్తాస్థికలు' (1948) చదివి చూడండి.)
సినిమా ద్వారా, తర్వాత రోజుల్లో టెలివిజన్ ద్వారా, ఇప్పుడు మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రామకథ ప్రతి ఒక్కసారీ తెరమీద విడుదల అవుతున్నప్పుడల్లా అది కేవలం రామకథా పునశ్చరణతో ఆగిపోకుండా ఒక రాజకీయ శక్తిగా కూడా మారుతుండటం గమనించాలి.
ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం వెనక ఆయన సినిమా చరిష్మా ఉందనడం చాలా స్థూలంగా చెప్పడమే. కానీ ఆయన వేసిన పురాణ పాత్రలన్నిటికన్నా కూడా రామపాత్రపోషణ వల్లనే ఆ చరిష్మా సిద్ధించిందనిపిస్తుంది. ఇక ఉత్తరాది గురించి చెప్పనవసరం లేదు.
రామాయణాన్నీ, రాముణ్ణీ ఒక రాజకీయ ప్రతీకగా మార్చుకుంటున్న రాజకీయ శక్తుల్ని విమర్శించేవాళ్ళు ముందు గమనించవలసిందేమంటే, ఈ దేశంలో, ప్రజల హృదయాల్లో, ప్రజాస్మృతిలో రామకథ ఒక నిత్యస్రోతస్వినిగా ఉంటూ వస్తున్నదనే. దాన్ని రాజకీయ శక్తులు వాడుకుని ఒక సంకుచిత, క్రూర మతదృష్టికి కుదించకుండా అడ్డుకోవాలంటే, ముందు, మనం ప్రజాసంప్రదాయంలో రామకథ బలంగా ఉందన్న విషయాన్ని అంగీకరించాలి.
అందుకనే ఒకప్పుడు రామ్ మనోహర్ లోహియా చిత్రకూట్ కేంద్రంగా రామాయణ మేళాలు జరపమని సూచించాడు. కాని అప్పటి ప్రభుత్వాలు ఆ సూచనని పట్టించుకోలేదు. అప్పుడు రామాయణ మేళాలు జరిగి ఉంటే ఈనాడు రాముడి పేరుమీద దుష్పరిణామాలు జరుగుతున్నాయన్నఆందోళనలు కలిగేవి కావేమో.
(వాడ్రేవు చినవీరభద్రుడు ప్రముఖ రచయిత, రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)