మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
‘డూమ్స్ డే’: ఈ నవంబర్ 13న ప్రపంచం అంతరించిపోతుందా? మళ్లీ వార్తల్లోకి వచ్చిన ఆ పాత అధ్యయనంలో ఏముంది?
- రచయిత, మజ్దీ అల్-ఖస్సూస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
నవంబర్ 13, 2026, శుక్రవారం
ఈ తేదీ సమీపిస్తున్న వేళ, 'ప్రపంచం అంతమవుతుందా?' అనే చర్చ సామాజిక మాధ్యమాలతోపాటు కొన్ని మీడియా సంస్థల్లోనూ మళ్లీ విస్తృతంగా జరుగుతోంది.
66 ఏళ్ల కిందట ప్రచురితమైన ఒక శాస్త్రీయ అధ్యయనంతో ఈ తేదీకి సంబంధం ఉంది. భవిష్యత్‌లో ప్రపంచ జనాభా ఎలా పెరుగుతుందో ఆ అధ్యయనం అంచనా వేసింది.
'డూమ్స్‌డే: ఫ్రైడే, నవంబర్ 13' అనే పేరుతో ముగ్గురు పరిశోధకులు 1960 నవంబర్ 4న ఈ అధ్యయనాన్ని అమెరికాకు చెందిన సైన్స్ పత్రికలో ప్రచురించారు.
సుమారు రెండు వేల సంవత్సరాల జనాభా లెక్కల్లో కనిపించిన పెరుగుదల రేటు అదే వేగంతో కొనసాగితే, 2026 నవంబరు నాటికి ప్రపంచ జనాభా 'అనంతానికి' చేరుకుంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే, ఆ పరిశోధకులు నిజంగానే మానవజాతి అంతమవుతుందని చెప్పారా?ప్రపంచవ్యాప్తంగా విపత్తు సంభవిస్తుందని లేదా భూమిపై జీవం అంతమవుతుందని సూచించే శాస్త్రీయ ప్రాధాన్యం ఈ తేదీకి ఉందా?
ఈ కథ ఎక్కడ మొదలైంది?
ఈ అధ్యయనానికి ఆస్ట్రియన్-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త హైన్డ్ వాన్ ఫోర్‌స్టర్ నాయకత్వం వహించారు.
అమెరికాలోని ఇల్లినాయి విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన ప్యాట్రిషియా మోరా, లారెన్స్ అమియట్‌లతో కలిసి ఈ పరిశోధన చేశారు.
చరిత్రలో మానవ జనాభా ఎలా పెరిగిందో తెలుసుకోవడానికి ప్రపంచ జనాభాకు సంబంధించిన పాత అంచనాలు పరిశీలించారు. క్రీస్తుశకం ప్రారంభం నుంచి 1958 వరకు అందుబాటులో ఉన్న 24 జనాభా అంచనాలను వారు ఉపయోగించారు.
జనాభా స్థిరమైన వేగంతో పెరుగుతుందని వారు భావించలేదు. దానికి బదులుగా, జనాభాతోపాటు దాని పెరుగుదల వేగం కూడా పెరుగుతుందనే భావన ఆధారంగా ఒక నమూనా రూపొందించారు. దీన్నే 'హైపర్‌బోలిక్ గ్రోత్' అంటారు.
ఇందులో జనాభా పెరగడమే కాకుండా, కాలం గడిచేకొద్దీ జనాభా పెరుగుదల వేగం కూడా పెరుగుతుంది.
మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సహాయం చేసుకోవడం, సమూహాలు లేదా సంఘాలు ఏర్పరచుకోవడం ద్వారా కొన్ని పర్యావరణ పరిమితులను అధిగమిస్తారని ఈ నమూనా భావించింది.
దీని వల్ల మనుషులు జీవించి ఉండే, సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అంచనా వేసింది.
పాత జనాభా లెక్కలకు ఈ ఫార్ములాను అప్లై చేసినప్పుడు, ఈ నమూనా 2026లో 'సింగ్యులారిటీ' అనే స్థితికి చేరుతుందని పరిశోధకులు తేల్చారు. 2026 నవంబరు మధ్యలో ఈ పరిస్థితి వస్తుందని సూచించారు.
అవే పరిస్థితులు మారకుండా కొనసాగుతాయనే అంచనా ఆధారంగా, ఆ రోజున ప్రపంచ జనాభా అనంతానికి చేరుతుందని భావనతో 2026 నవంబర్ 13ను అధ్యయనం శీర్షికలో చేర్చారు.
‘డూమ్స్‌డే’ అంటే ప్రపంచం అంతమవుతుందా?
ఈ అధ్యయనం పేరు చూస్తే మాత్రం ప్రపంచం అంతమవుతుందని చేసిన జోస్యంలా కనిపించవచ్చు. కానీ దాని అసలు అర్థం వేరు.
భూమిని గ్రహశకలం ఢీకొంటుందని, సూర్యుడిలో భారీ పేలుడు జరుగుతుందని, భయంకరమైన భూకంపం వస్తుందని లేదా అగ్నిపర్వతం బద్దలవుతుందని పరిశోధకులు అంచనా వేయలేదు.
ప్రకృతి విపత్తు కారణంగా మానవజాతి అంతరించిపోతుందనే తేదీని వారు నిర్ణయించలేదు.
నిజానికి, తమ అంచనాల ప్రకారం జనాభా ఊహించని రీతిలో పెరుగుతుందని చెప్పేందుకు మాత్రమే ‘డూమ్స్‌డే’ అనే పదాన్ని ఉపయోగించారు. వాస్తవ ప్రపంచంలో జనాభా అనంతానికి చేరడం అసాధ్యం.
మరో మాటలో చెప్పాలంటే, ఇక్కడ అనంతం అంటే భూమిపై నిజంగానే అంతులేని సంఖ్యలో ప్రజలు ఉంటారని అర్థం కాదు. ఒక గణిత ఫార్ములాను సుదూర భవిష్యత్తు వరకు వర్తింపజేసి, అందులోని పరిస్థితులు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయని భావించినప్పుడు వచ్చే సైద్ధాంతిక గణిత ఫలితం మాత్రమే ఈ అధ్యయనం.
పర్యావరణం, అందుబాటులో ఉన్న వనరులు, జనాభాను ప్రభావితం చేసే పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ ఫార్ములాను వర్తింపజేయలేమని పరిశోధకులకు తెలుసని అసలు అధ్యయనాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.
ఈ అంశాలు జనన, మరణాల రేట్లపై ప్రభావం చూపి, జనాభా పెరుగుదల దిశను మార్చగలవు.
1964లో ప్రచురితమైన మిషెల్ టెక్లా వ్యాసానికి సంబంధం ఏంటి?
ఈజిప్టుకు చెందిన 'వతానీ' వార్తాపత్రిక.. 1964 నవంబర్ 29న ప్రచురించిన ఒక పాత కథనం ప్రతిని ఇటీవల బయటపెట్టింది.
ఆ కథనాన్ని మిషెల్ టెక్లా రాశారు. దాని శీర్షికలో 2026 నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందని పేర్కొన్నారు.
దీంతో అనేక ఈజిప్టు మీడియా సంస్థలు ఆ పాత కథనం చిత్రాన్ని తిరిగి ప్రచురించాయి. ఫలితంగా ఆరు దశాబ్దాలకుపైగా గడిచిన తర్వాత ఈ కథనం మళ్లీ చర్చకు వచ్చింది.
అయితే ఒక పత్రికలో ప్రచురితమైన వ్యాసానికి, అసలు శాస్త్రీయ అధ్యయనానికి మధ్య తేడా గుర్తించాలి.
2026 నవంబర్ 13వ తేదీని ప్రస్తావించిన శాస్త్రీయ అధ్యయనాన్ని వాన్ ఫోర్‌స్టర్, ఆయన సహచరులు 1960లో ప్రచురించారు. దీన్ని మిషెల్ టెక్లా ప్రచురించలేదు.
టెక్లా రాసిన కథనం గురించి ఇటీవలి మీడియా కథనాలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని కథనాలు జనాభా పెరుగుదలకు సంబంధించిన అధ్యయనాలను ప్రస్తావిస్తుండగా, మరికొన్ని సోలార్ యాక్టివిటీ, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులకు సంబంధించిన ఊహాగానాలను గురించి చెబుతున్నాయి.
అందువల్ల మిషెల్ టెక్లా రాసిన అసలు కథనాన్ని పూర్తిగా చదివి, అందులోని అంశాలను శాస్త్రీయ అధ్యయనంతో పోల్చకుండా ఈ వాదనలన్నింటినీ ఒకేలా చూడటం సరైంది కాదు. వాటిని వాన్ ఫోర్‌స్టర్ అధ్యయన ఫలితాలుగా చెప్పడం సరికాదు.
'సోలార్ యాక్టివిటీ'
మిషెల్ టెక్లా వ్యాసాన్ని ఉటంకిస్తూ కొన్ని మీడియాలు రకరకాల కథనాలు ప్రచురించాయి. 2026 నవంబర్ 13న అసాధారణ సోలార్ యాక్టివిటీస్ ఉంటాయని అందులో పేర్కొన్నాయి. వీటి కారణంగా భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు, ప్రకృతి విపత్తులు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అయితే, నిజంగా సంభవించే సౌర తుపానుకు, ఒక నిర్దిష్ట తేదీన సౌర విపత్తు వస్తుందనే వాదనకు మధ్య తేడా ఉంది.
సోలార్ యాక్టివిటీస్ సహజంగా జరిగే పరిణామాలు, సూర్యుడి కార్యకలాపాలు నిర్దిష్ట కాలంలో తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి.
ఈ సమయంలో కొన్నిసార్లు సూర్యుడి నుంచి భారీ స్థాయిలో ప్లాస్మా, అయస్కాంత శక్తి వెలువడతాయి. సౌర జ్వాలలు ఎగసిపడతాయి. ఇవి భూమి అయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపగలవు.
సమాచార వ్యవస్థలను, ఉపగ్రహాలను, నావిగేషన్ వ్యవస్థలకు పనితీరుకు తీవ్రమైన సౌర తుపానులు అంతరాయం కలిగించవచ్చు. విద్యుత్ సరఫరా వ్యవస్థలపైనా ప్రభావం చూపవచ్చు.
అయితే, ఈ ప్రమాదాలు ఒక నిర్దిష్ట తేదీన భూమిని సూర్యుడు నాశనం చేస్తాడని చెప్పడానికి ఆధారం కావు.
సౌర కార్యకలాపాలకు లేదా భౌగోళిక, వాతావరణ విపత్తులకు, 2026 నవంబర్ 13వ తేదీకి సంబంధం ఉందని చెప్పే ఆధారాలేవీ 1960 నాటి సైన్స్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనంలో లేవు.
‘‘నవంబర్ 13న అసాధారణంగా ఏదైనా జరుగుతుందనే సూచనలు లేవు’’
భూమికి ముప్పు 2026 నవంబర్ 13న ఉందనే వాదనలను ఖగోళ శాస్త్రవేత్త ఇమాద్ ముజాహిద్ పరిశీలించారు.
ఈ ఏడాది సోలార్ యాక్టివిటీస్ గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయని ఆయన చెప్పారు. అయితే, ఈ పరిణామం గురించి శాస్త్రవేత్తలకు దశాబ్దాలుగా తెలుసునని, ఇది ఆకస్మికంగా లేదా ఊహించని విధంగా వస్తున్న మార్పు కాదని తెలిపారు.
సోలార్ యాక్టివిటీస్ సహజంగా జరుగుతాయని ముజాహిద్ బీబీసీ న్యూస్ అరబిక్‌తో చెప్పారు. విశ్వం ఆవిర్భవించినప్పటి నుంచి సౌర తుపానులు వస్తూనే ఉన్నాయని వివరించారు.
‘‘శాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చిన పురోగతి కారణంగా శాస్త్రవేత్తలు సౌర తుపానులను మెరుగ్గా పర్యవేక్షించి, అధ్యయనం చేసి, ముందుగా అంచనా వేయగలుగుతున్నారు’’ అని పేర్కొన్నారు.
భూమి భద్రతకు ముప్పు కలిగించే లేదా ప్రజలు భయపడాల్సిన ఖగోళ సంఘటన ఏదీ నవంబర్ 13న జరగదని ఆయన చెప్పారు.
ప్రపంచం అంతం సమీపించిందని సూచించే ఆధారాలు ఖగోళ శాస్త్రంలో లేదా విశ్వోద్భవ శాస్త్రంలో లేవని ముజాహిద్ స్పష్టం చేశారు.
ఈ తేదీ గురించి ప్రచారమవుతున్న వాదనలు ఖగోళ శాస్త్ర నిపుణుల ప్రకటనలు లేదా హెచ్చరికల ఆధారంగా వచ్చినవి కావని ఆయన పేర్కొన్నారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా కొన్ని సంస్థలు, వ్యక్తులు వివిధ మాధ్యమాల ద్వారా వీటిని ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
1960 నాటి లెక్కలు ఎందుకు నిజం కాలేదు?
పాత గణిత సమీకరణాన్ని 2026 నాటి వాస్తవ పరిస్థితులకు వర్తింపజేయడంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, గతంలో కనిపించిన జనాభా పెరుగుదల ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతుందని భావించడం.
అయితే, గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచంలో భారీ జనాభా, సామాజిక ఆర్థిక మార్పులు జరిగాయి. ఈ మార్పులు సంతానోత్పత్తి, మరణాలు, జనాభా పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావం చూపాయి.
ప్రపంచ జనాభా పెరుగుదల రేటు 1960లలో అత్యధిక స్థాయికి చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అంటే, 1960లో పరిశోధకులు ఉపయోగించిన నమూనా ప్రకారం జనాభా పెరుగుదల కొనసాగలేదు.
ఈ అధ్యయనం ప్రచురితమైన సమయంలో ప్రపంచ జనాభా దాదాపు 300 కోట్లు. ఇప్పుడు 800 కోట్లు దాటింది. అయినప్పటికీ, వారి సమీకరణం సూచించిన 'అనంతం' అనే మార్క్‌కు ఏ మాత్రం చేరువలో లేదు.
మరోవైపు, ఐక్యరాజ్యసమితి తాజా అంచనాలు ఈ పాత అధ్యయనంలో వివరించిన పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.
ప్రపంచ జనాభా 2024లో సుమారు 820 కోట్ల నుంచి 2080ల మధ్యకాలానికి దాదాపు 1,030 కోట్లకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక అంచనా వేసింది.
ఆ తర్వాత జనాభా క్రమంగా తగ్గి, 2100 నాటికి సుమారు 1,020 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
అత్యధిక జనాభా ఉన్న అనేక దేశాల్లో సంతానోత్పత్తి రేటు ఊహించిన దానికంటే వేగంగా తగ్గుతోంది. అందువల్ల ప్రపంచ జనాభా ఈ శతాబ్దంలోనే గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఎక్కువగా ఉందని ఐక్యరాజ్యసమితి అంచనాలు సూచిస్తున్నాయి.
అనేక దేశాల్లో ఇప్పుడు జనాభా పెరుగుదల ఒక్కటే ఆందోళన కలిగించే అంశం కాదు. తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, పెరుగుతున్న సగటు వయస్సు, వృద్ధుల సంఖ్య పెరగడం కూడా సమస్యలే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)