నిత్యా రామన్: లాస్ ఏంజెలెస్ కొత్త మేయర్‌గా ఎన్నికైన ఈ భారతీయ మహిళ ఎవరు? ఆమెను న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో ఎందుకు పోలుస్తున్నారు?

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి నిత్యా రామన్ ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌పై ఘన విజయం సాధించారు.

నిత్యా రామన్ గెలుపు కాలిఫోర్నియా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

ఎన్నికల బరిలోకి దిగిన ప్రారంభంలో నిత్యా రామన్ బలహీనమైన అభ్యర్థిగా కనిపించారు.

ఆమెకు ప్రత్యర్థిగా నిలిచిన కరెన్ బాస్ యూఎస్ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు. అంతే కాకుండా రాజకీయ జీవితంలో ఆమె ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో కూడా ఓడిపోలేదు.

నిత్యా రామన్‌ను తరచుగా న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో పోలుస్తున్నారు. వీరిద్దరూ డెమొక్రటిక్, ప్రోగ్రెసివ్ అజెండా ఉన్న నాయకులుగా గుర్తింపు పొందారు.

న్యూయార్క్ డెమొక్రాటిక్ సోషలిస్ట్ మేయర్ మమ్దానీతో తనను పోల్చడంపై రామన్ స్పందించారు.

"ప్రస్తుతం అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఆయన ఒకరు. ఆయనతో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయనకు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నాయి. అయితే ఆయనతో పోలిస్తే నేను భిన్నమైనదాన్ని. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది" అని ఆమె అన్నారు.

నిత్యా రామన్ విజయంతో అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాలకు ఇప్పుడు డెమొక్రాటిక్ సోషలిస్టులే నాయకత్వం వహించనున్నారు. మమ్దానీ, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ వంటి ప్రముఖ నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

లాస్ ఏంజెలెస్ నగరంలో డెమొక్రాట్ అభ్యర్ధి మేయర్ అవుతారని ముందుగానే అంచనాలు ఉన్నాయి. అయితే అమెరికాలో రెండో అధిక జనాభా ఉన్న ఈ నగర ఓటర్లు వామపక్ష సిద్ధాంతాల వైపు ఎంతవరకు మొగ్గు చూపుతారనేదే ఇక్కడి ప్రధాన ప్రశ్నగా మారింది.

ఓటమిని అంగీకరించిన కరెన్ బాస్

లాస్ ఏంజెలెస్ నగరంలో డెమొక్రాట్ అభ్యర్ధి మేయర్ అవుతారని ముందుగానే అంచనాలు ఉన్నాయి.

అయితే అమెరికాలో రెండో అధిక జనాభా ఉన్న ఈ నగర ఓటర్లు వామపక్ష సిద్ధాంతాల వైపు ఎంతవరకు మొగ్గు చూపుతారనేదే ఇక్కడి ప్రధాన ప్రశ్నగా మారింది.

నిత్యా రామన్‌కు ఫోన్ చేసి తన ఓటమిని అంగీకరించినట్లు డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు కరెన్ బాస్ గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

"మేము ఆశించిన ఫలితం ఇది కాకున్నా లాస్ ఏంజెలెస్ ప్రజలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నగరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాకు లాస్ ఏంజెలెస్ అంటే ఎంతో ఇష్టం. ఈ నగరంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరి మెరుగైన జీవితం కోసం నేను నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను" అని కరెన్ తన పోస్టులో రాశారు.

'మార్పు కోసం' అనే నినాదంతో నిత్యా రామన్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

నిత్యా రామన్ ఎవరు?

భారతదేశంలో జన్మించిన నిత్యా రామన్ వృత్తిరీత్యా అర్బన్ ప్లానర్. ఆమె హార్వర్డ్, ఎంఐటీ యూనివర్సిటీల్లో చదివారు.

తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే లాస్ ఏంజెలెస్‌ సిటీ కౌన్సిల్‌లో డిస్ట్రిక్ట్ 4 ప్రతినిధిగా సేవలు అందిస్తున్నారు.

2020లో సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి చరిత్రాత్మక విజయం సాధించారు.

లాస్ ఏంజెలెస్ సిటీ కౌన్సిల్‌లో చేరిన మొట్టమొదటి ఆసియా-అమెరికన్ మహిళగా మొదటి సౌత్ ఏషియన్ వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

2024 మార్చిలో భారీ మెజారిటీతో రెండోసారి కూడా ఇదే పదవికి ఎన్నికయ్యారు.

పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నిత్యా రామన్ నిరాశ్రయులకు వసతి కల్పించడం, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, నగర పర్యావరణ లక్ష్యాలను వేగవంతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆమె ప్లానింగ్ అండ్ ల్యాండ్ యూజ్ మేనేజ్‌మెంట్ కమిటీ, హోమ్‌లెస్‌నెస్ అండ్ హెల్త్ కమిటీ, పబ్లిక్ సేఫ్టీ కమిటీ, అడ్ హాక్ కమిటీ ఆన్ చార్టర్ రివ్యూలలో సభ్యురాలిగా ఉన్నారు.

నిత్యా రామన్ తన భర్త వల్లి చంద్రశేఖరన్ కవల పిల్లలైన కర్ణ, కావేరీతో కలిసి నగరంలోని సిల్వర్ లేక్ ప్రాంతంలో నివసిస్తున్నారు. చంద్రశేఖరన్ టీవీ స్క్రిప్ట్ రైటర్. నవలలు కూడా రాశారు.

2023 ఏప్రిల్‌లో నిత్యా రామన్ భర్త గురించి తన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.

"నా పిల్లల తర్వాత ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నా భర్త. ఆయన రైటర్. రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా వెస్ట్‌లో క్రియాశీల సభ్యుడు. వినోద పరిశ్రమలో వస్తున్న పెను మార్పులను, ఒడిదొడుకులను ఆయన, ఆయన సహోద్యోగులు ఎలా ఎదుర్కొంటున్నారో నేను దగ్గర నుంచి చూశాను. ఈ కాలంలో ఇండస్ట్రీ లాభాలు, ప్రొడక్షన్ బడ్జెట్లు పెరిగినప్పటికీ రైటర్స్ సంపాదన మాత్రం తగ్గుతూ వచ్చింది" అని అందులో రాశారు.

ఎన్నికల హామీలు

  • నగరంలో నిరాశ్రయుల సమస్యను తగ్గించడం
  • గృహ నిర్మాణాలను పెంచడం
  • హాలీవుడ్‌లో ఉద్యోగాల తొలగింపుల నుంచి ఉపాధిని కాపాడటం
  • ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల ద్వారా నగర ప్రజలకు రక్షణ కల్పించడం
  • నగరాన్ని అందంగా తీర్చిదిద్దడం
  • రోడ్ల మరమ్మతులు
  • నగరంలో నైట్‌లైఫ్‌ పునరుద్దరణ లాంటి హామీల గురించి ఆమె ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారు.

అయితే ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశం 2025 లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు ఘటనే.

ఈ విపత్తు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అత్యవసర సమయంలో నగర పాలన విఫలమైందని అధికారుల గైర్హాజరీపై తీవ్ర రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి.

లాస్ ఏంజెలెస్ తదుపరి మేయర్ కాబోతున్న నిత్యా రామన్‌పై 2027 సూపర్‌బౌల్ 2028 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ నిర్వహణ వంటి భారీ బాధ్యతలు ఉన్నాయి.

ప్రారంభంలో బలహీనంగా కనిపించినప్పటికీ నిత్యా రామన్ ముఖ్యంగా యువ ఓటర్ల మద్దతుతో క్రమంగా పుంజుకున్నారు.

ఈ ఏడాది మొదట్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆమె రియాలిటీ టీవీ స్టార్ స్పెన్సర్ ప్రాట్‌ను వెనక్కి నెట్టి అత్యధిక ఓట్లు సాధించారు.

కరెన్ బాస్‌పై నిత్యా రామన్ సాధించిన ఈ విజయం అమెరికాలోని ప్రస్తుత ఓటర్ల ట్రెండ్‌ను ప్రతిబింబిస్తోంది.

రిపబ్లికన్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో అలాగే దశాబ్దాలుగా మితవాద నేతలు గెలవలేని చోట్ల కూడా ప్రస్తుతం డెమొక్రాట్లు భారీ విజయాలు సాధిస్తున్నారు.

డెమొక్రాటిక్ సోషలిస్ట్ జానిస్ లూయిస్ జార్జ్ వాషింగ్టన్ డీసీ మేయర్‌గా ఎన్నికవ్వడం అమెరికాలోని మరో ప్రధాన నగరంలో ప్రగతిశీల నాయకత్వానికి బలాన్ని చేకూర్చింది.

డెమొక్రాటిక్ పార్టీకి చెందిన లెఫ్ట్ వింగ్ నేతల విజయాలపై స్పందించిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ "చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, ఇది పెద్ద విపత్తుగా మారబోతోందని స్పష్టమవుతుంది" అని అన్నారు.

ఇటువంటి అభ్యర్థులు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి ప్రధాన లక్ష్యంగా మారారు.

లాస్ ఏంజెలెస్ నగరపు మొట్టమొదటి నల్లజాతీయురాలైన మహిళా మేయర్ కరెన్ బాస్‌కు ఈ నగర చరిత్రతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)