ఎమర్జెన్సీ, సంజయ్ గాంధీ, బాబ్రీ మసీదు-ఆత్మకథలో వీటి గురించి సోనియా గాంధీ ఏం రాశారు?

సోనియా గాంధీ
ఫొటో క్యాప్షన్, 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకావిష్కరణకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా గాంధీ పలు అంశాలపై చర్చించారు (ఫైల్ ఫోటో).
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, 1975 ఎమర్జెన్సీ, ఇందిర, రాజీవ్ గాంధీల హత్యలు, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి పలు కీలక చారిత్రక ఘటనలపై తన ఆలోచనలను పంచుకున్నారు.

ఆమె ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకావిష్కరణకు ముందు, ఆంగ్ల పత్రిక 'ది హిందూ' , 'ది గార్డియన్'లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సోనియా గాంధీ తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయంలో ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ పోషించిన పాత్రల గురించి కూడా ఆమె చర్చించారు.

సోనియా గాంధీ పేర్కొన్నదాని ప్రకారం, ఎమర్జెన్సీ విధించడానికి సంజయ్ గాంధీ ఒక్కరే బాధ్యులు కారు. పైగా, ఇందిరా గాంధీ తన సీనియర్ సహచరులు కొందరి నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

ఎమర్జెన్సీ విషయంలో రాజీవ్ గాంధీ అభ్యంతరం, దాని ఫలితంగా కుటుంబంలో తలెత్తిన వివాదాల గురించి కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, ఎమర్జెన్సీ, ఆత్మకథ
ఫొటో క్యాప్షన్, ఎమర్జెన్సీని విధించాలనే నిర్ణయం కుటుంబంలోనే ఉద్రిక్తత పెరగడానికి దారితీసిందని సోనియా గాంధీ పేర్కొన్నారు (ఫైల్ ఫోటో)

'సంజయ్‌ని అదుపులో ఉంచి ఉంటే... '

సంజయ్ గాంధీకి, ఎమర్జెన్సీకి ఉన్న సంబంధం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, కేవలం సంజయ్ గాంధీనే దీనికి బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.

‘‘తరచుగా ఎమర్జెన్సీతో ఆయన (సంజయ్ గాంధీ) పేరును ముడిపెట్టినప్పటికీ, దానికి బాధ్యుడు ఒక్కరే కాదు . ఇందిరా గాంధీ తన సీనియర్ సహచరులలో కొందరి నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆమె అభిప్రాయాలతో విభేదించిన రాజీవ్ వంటివారు చాలా తక్కువ మంది ఆమె చుట్టూ ఉన్నారని నేను అనుకుంటున్నా. చివరికి, నా అత్తగారు సొంత విచక్షణతో పరిస్థితిని గుర్తించి, దానిని సరిదిద్దడానికి చర్యలు తీసుకున్నారని నమ్ముతున్నాను" అన్నారు సోనియా.

సోనియా గాంధీ ప్రకారం, ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయంపై కుటుంబంలో ఏకాభిప్రాయం లేదు. రాజీవ్ గాంధీ దానిని వ్యతిరేకించి, వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండాలని కోరారు. అయితే, ఆయన తమ్ముడు సంజయ్ గాంధీ ఈ చర్యకు మద్దతు ఇచ్చారు. ప్రతిపక్షం తన తల్లిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆయన వాదించారు.

‘ది గార్డియన్’ కథనం ప్రకారం, సోనియా గాంధీ తన పుస్తకంలో ఇలా రాశారు: ‘‘సంజయ్‌ను అదుపులో ఉంచి ఉంటే, ఆ తర్వాత జరిగిన నష్టంలో చాలా వరకు నివారించి ఉండవచ్చు’’

సోనియా గాంధీ
ఫొటో క్యాప్షన్, సోనియ గాంధీ

ఎమర్జెన్సీ విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తాయని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆమె చెప్పినదాని ప్రకారం, రాజీవ్ గాంధీ ఈ విషయం గురించి తన తల్లితో మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ ఇందిర ఆయన మాట వినలేదు.

"అయితే, నేను ఆ కాలానికి వెనక్కి వెళ్లి చూస్తే, ఇందిరా గాంధీ వైపు నుంచి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, వేగంగా క్షీణిస్తున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆమె చాలా కష్టపడ్డారని అనిపిస్తుంది. ఆ సమయంలో, హింసాత్మక నిరసనలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రజారవాణా వ్యవస్థలకు నిప్పుపెట్టారు. వ్యవస్థీకృతంగా పెద్ద ఎత్తున అశాంతిని రెచ్చగొట్టారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించాలని అధికారులు, సైన్యానికి కూడా పిలుపులు వెళ్లాయి" అన్నారామె.

'ది హిందూ'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘‘ఇందిరా గాంధీ చివరికి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని 1977 మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు’’ అని సోనియా పేర్కొన్నారు.

ఆ తర్వాత, ఎమర్జెన్సీ సమయంలో జరిగిన దురాగతాలపై ఇందిరా గాంధీ బహిరంగంగా విచారం వ్యక్తం చేసి, క్షమాపణ చెప్పారని ఆమె తెలిపారు.

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, ఎమర్జెన్సీ, ఆత్మకథ
ఫొటో క్యాప్షన్, సోనియా గాంధీ

ఇందిరా గాంధీ తన మరణం గురించి ఊహించారా?

1984లో ఇందిరా గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల గురించి సోనియా గాంధీ ప్రస్తావించారు. అంతకు ముందు సాయుధ ఉగ్రవాదులు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్నారు. వారు ప్రత్యేక సిక్కు రాజ్యాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

దీనికి ప్రతిస్పందనగా, సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటైన స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య చేపట్టేందుకు ఇందిరా గాంధీ అనుమతి ఇచ్చారు.

ఈ సైనిక చర్యలో ఉగ్రవాదులతో పాటు భక్తులు కూడా మరణించారు. ట్యాంకులు, భారీ ఆయుధాలను ఉపయోగించడం వల్ల దేవాలయానికి కూడా నష్టం జరిగింది.

ఈ విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను చూసినప్పుడు తన అత్తగారు (ఇందిరా గాంధీ) కన్నీటి పర్యంతమయ్యారని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు.

ఆ తర్వాత ఇందిరా గాంధీకి బెదిరింపులు రావడం మొదలయ్యాయని ఆమె చెప్పారు. "తను చనిపోతే మేం ఎలా వ్యవహరించాలో ఆమె ముందే చెప్పారు. అంటే, తన మరణాన్ని ఆమె ఊహించారని అర్థమవుతోంది’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.

'ది గార్డియన్' కథనం ప్రకారం, ధైర్యంగా ఉండాలని, ఏడవకూడదని ఇందిరా గాంధీ తన మనవడు రాహుల్‌తో చెప్పారు.

అదే వేసవిలో, ఇందిరా గాంధీ తన మనవళ్లను కశ్మీర్‌లోని వారి పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లారు. అలా చేయడం ద్వారా ఆమె వారికి ‘చివరి వీడ్కోలు’ పలికారని సోనియా గాంధీ భావిస్తున్నారు.

అంతేకాకుండా, తన భద్రతా సిబ్బందిలో ఉన్న సిక్కులను తొలగించాలన్న సూచనను ఇందిరా గాంధీ పట్టించుకోలేదు. ఈ నిర్ణయమే చివరికి ఆమె మరణానికి దారితీసింది.

1984 అక్టోబర్ 31న సోనియా గాంధీ ఇంట్లో ఉన్నప్పుడు బాణసంచా కాలుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. ఆమె వెంటనే పక్కనే ఉన్న కార్యాలయంవైపు పరిగెత్తారు.

అక్కడ, తన అత్తగారు ఇందిరా గాంధీ రక్తపు మడుగులో నేలపై పడి ఉండటాన్ని చూశారు. ఆమె శరీరంపై అనేక బుల్లెట్ గాయాలు ఉన్నాయి. స్వర్ణ దేవాలయంలో జరిగిన సైనిక చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఆమె అంగరక్షకులే ఆమెను కాల్చి చంపారు.

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, ఎమర్జెన్సీ, ఆత్మకథ
ఫొటో క్యాప్షన్, ఇందిరా గాంధీని ఆమె సొంత సిక్కు భద్రతా సిబ్బందే కాల్చి చంపారు (చిత్రం: ఇందిరా గాంధీ అంత్యక్రియలు)

ఇందిరా గాంధీని కారు ఎక్కించినప్పుడు సోనియా రక్తంతో తడిసిన ఆమె శరీరాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు.

ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి సోనియా ప్రయత్నించారు. కారు వేగంగా ఆసుపత్రి వైపు దూసుకెళ్తోంది.

సోనియా ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ, "అంతటా రక్తమే ఉంది. ఆమె నా మాటలకు స్పందించడం లేదని అర్థమైంది. అప్పటికే ఆమె ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారేమో అనిపించింది" అని చెప్పారు.

"ఇంటి నుంచి ఆసుపత్రికి సాగిన ఆ ప్రయాణం ఎంతో వేదనతో కూడుకున్నది. రోడ్డుపై ట్రాఫిక్ పెద్దగా లేకపోయినా, ఆ ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించింది. ఆమె ఏమీ మాట్లాడకపోవడాన్నిబట్టి, అన్నీ ముగిసిపోయాయని అప్పుడే అర్థమైపోయింది" అని పేర్కొన్నారు సోనియా.

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, ఎమర్జెన్సీ, ఆత్మకథ
ఫొటో క్యాప్షన్, మసీదు కూల్చివేత ఘటన గురించి కూడా సోనియా గాంధీ తన పుస్తకంలో రాశారు. (ఫైల్ ఫోటో)

మసీదు కూల్చివేతపై సోనియా ఏం చెప్పారు?

రాజీవ్ గాంధీ మరణం గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు సోనియా. ఆయన హత్యకు సంబంధించిన నిజం ఇంకా బయటకు రాలేదని ఆమె భావిస్తున్నారు.

రాజీవ్ గాంధీ హత్యపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన చివరి కమిషన్‌ను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఇక నిజం ఎప్పటికీ బయటకు రాదేమోననిపిస్తోంది’’ అని ఆమె అన్నారు.

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో సోనియా గాంధీ మాట్లాడారు. మసీదు కూల్చివేత దృశ్యాలను టీవీలో చూసి తాను కన్నీరు పెట్టుకున్నానని ఆమె గుర్తుచేసుకున్నారు.

"మహాత్మా గాంధీ, నెహ్రూ, వారి సహచరులు నిర్మించాలని ఆశించిన లౌకిక దేశం" కోసం తాను సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని ఆ క్షణంలోనే తనకు అర్థమైందని ఆమె చెప్పారు.

బీజేపీ ఎదుగుదలకు, ఆ పార్టీ అనుసరించే కఠినమైన హిందుత్వ రాజకీయాలకు తమ సొంత పార్టీ చేసిన పొరపాట్లు కూడా కారణమని ఆమె అంగీకరించారు.

"చాలా విషయాల్లో మేం నిర్లక్ష్యంగా వ్యవహరించామని నాకనిపిస్తుంది" అని సోనియా అన్నారు. "అప్పట్లో మా వైఖరి ఎలా ఉండేదంటే ఏది ఎలా జరగాలంటే అలా జరగనిద్దాంలే అన్నట్లుగా సాగింది" అని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)