ఈ సింహం మిగతా సింహాల నుంచి జింకపిల్లను కాపాడిందా?

గుజరాత్‌, సాసన్ గిర్‌లో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, జింకను కాపాడిన సింహం
ఫొటో క్యాప్షన్, జింక పిల్లను తీసుకెళ్తున్న సింహం.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

జంతు ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో.. అన్ని రహస్యాలతో కూడా నిండి ఉంటుంది. అలాంటి ఓ అరుదైన ఘటన కెమెరాలో చిక్కింది. అదే 'ఓ సింహం నోటిలో జింక పిల్ల భద్రంగా కనిపించడం'.

గుజరాత్‌లోని సాసన్ గిర్‌లో వన్యప్రాణుల ఫోటోలు తీస్తున్న సమయంలో మిహిర్ పటేల్ తన కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించారు. ఇది అత్యంత అరుదైన దృశ్యమని ఆయన చెప్పారు. ఏడెనిమిదేళ్లుగా వన్యప్రాణుల ఫొటోలు తీస్తున్నా.. ఇలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూడలేదన్నారు.

ఆ సింహం దానిని వేటాడి తినలేదు. పైగా ఆ జింక పిల్ల ప్రాణాలను కాపాడింది.

సాధారణంగా వేటాడే స్వభావం కలిగిన జంతువు ఇలా ప్రవర్తించడం చూసి మిహిర్ పటేల్ ఆశ్చర్యపోయారు.

"ఆ సింహంలో బహుశా మాతృత్వం మేల్కొని ఉండొచ్చు. అందుకే జింక పిల్లను వేటాడకుండా, ఇతర సింహాల బారి నుంచి కూడా కాపాడినట్లు అనిపించింది" అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుజరాత్‌, సాసన్ గిర్‌లో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, జింకను కాపాడిన సింహం
ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 27న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మిహిర్ పటేల్ కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది.

ఆ రోజు అసలు ఏం జరిగింది?

వృత్తిరీత్యా బయోమెడికల్ ఇంజినీర్ అయిన మిహిర్ పటేల్‌కు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి.

"వన్యప్రాణుల ఫొటోలు తీయడానికి ఏడాదిలో మూడు, నాలుగు సార్లు సాసన్ గిర్‌తో పాటు గుజరాత్‌లోని ఇతర అడవులకు వెళ్తుంటాను. అక్టోబర్ 27న సాసన్ గిర్‌లోని సఫారీకి వెళ్లాను. ఆ రోజు నాకు 13వ నంబర్ సఫారీ మార్గం కేటాయించారు.

అడవిలో ఫొటోలు తీస్తూ ఉండగా.. పొదల్లోంచి బయటకు వస్తున్న ఓ సింహం నా దృష్టిని ఆకర్షించింది. దాని నోటిలో ఓ పిల్ల జంతువు ఉంది. మొదట అది తన పిల్లను తీసుకెళ్తోందనుకున్నా. కానీ, కెమెరా లెన్స్‌ను జూమ్ చేసి చూసినప్పుడు.. దాని నోటిలో ఉన్నది జింక పిల్ల అని అర్థమైంది. ఆ సింహం ఆ జింక పిల్లను వేటాడలేదు, అది ప్రాణాలతోనే ఉంది. ఆ జింక పిల్ల కళ్లు ఆర్పుతూ, శబ్దాలు కూడా చేస్తోంది. ఈ దృశ్యం చూసి నాకు ఆశ్చర్యమేసింది" అని మిహిర్ చెప్పారు.

"ఆ సమయంలో ఆ సింహం నేరుగా నా వైపు నడుచుకుంటూ వచ్చింది. దాని వెంట మరో సింహం కూడా ఉంది. కానీ ఆ సింహాన్నితన సమీపానికి కూడా రానివ్వలేదు. ఆ సింహంతో పాటు సింహాల గుంపు ఉంది. అందులో నాలుగు పెద్ద ఆడ సింహాలు, వాటిలో ఆరు నుంచి ఏడు నెలల పిల్లలు కూడా ఉన్నాయి. కానీ, జింక పిల్లను నోటితో పట్టుకున్న సింహం మాత్రం గుంపు నుంచి దూరంగా వెళ్తోంది.

మిగతా సింహాలు, ఆడ సింహాలు సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లి, నీళ్లు తాగాయి. కానీ, ఈ సింహం మాత్రం వాటితో వెళ్లలేదు. జింక పిల్లను తీసుకొని సురక్షితమైన ప్రదేశం కోసం తిరుగుతోంది" అన్నారు.

గుజరాత్‌, సాసన్ గిర్‌లో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, జింకను కాపాడిన సింహం
ఫొటో క్యాప్షన్, జింకపిల్లను సింహం చాలా సున్నితంగా పట్టుకుందని మిహిర్ తెలిపారు.

జింక పిల్లను కిందకు వదిలేస్తే మిగతా ఆడ సింహాలు లేదా వాటి పిల్లలు క్షణాల్లో దానిని చంపి తినేస్తాయని ఆ సింహం గుర్తించి ఉంటుందని మిహిర్ అభిప్రాయపడ్డారు. అందుకే దానిని నోటితో జాగ్రత్తగా పట్టుకుని గుంపుకు దూరంగా వెళ్లిపోయి ఉంటుందని చెప్పారు.

"ఆ సింహం జింక పిల్లను నోటితో పట్టుకునే అడవిలో కూర్చుని ఉండటం చూశాను. అయితే కొద్దిసేపటికే అది దట్టమైన అడవిలోకి వెళ్లింది. దీంతో ఆ తర్వాత జరిగిన దృశ్యాలను కెమెరాలో బంధించలేకపోయాను. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఆ సింహం జింక పిల్లను వేటాడలేదు. దాని ప్రాణాలను కాపాడింది.

సాధారణంగా వేటాడే జంతువులు తమ ఆహారాన్ని నోటితో గట్టిగా పట్టుకుంటాయి. కానీ, ఈ ఘటనలో ఆ సింహం ప్రవర్తన చూస్తే జింక పిల్లను వేటాడినట్లు ఏమాత్రం కనిపించలేదు. ఎందుకంటే, అది జింకను చాలా సున్నితంగా పట్టుకుంది. ఓ సందర్భంలో కేవలం ఒక సెకను పాటు దానిని నేలపై ఉంచింది. ఆ తర్వాత మళ్లీ జాగ్రత్తగా నోటితో పట్టుకుని అడవి వైపు నడుచుకుంటూ వెళ్లింది" అని మిహిర్ వివరించారు.

"ఏడెనిమిదేళ్లుగా అడవుల్లో వన్యప్రాణుల ఫోటోలు తీస్తున్నా. కానీ, నా జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదు" అని మిహిర్ పటేల్ అన్నారు.

" ఆ సింహం ప్రవర్తన చూస్తుంటే దానిలో మాతృత్వం మేల్కొన్నట్లు అనిపించింది. బహుశా అందుకే జింక పిల్లను వేటాడకుండా, అడవిలోని ఓ సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లి ఉంటుందని భావిస్తున్నా" అని మిహిర్ పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)